వనమా తరువాత వంతు మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేనా?
posted on Jul 25, 2023 @ 1:59PM
కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన రోజే అటువంటిదే మరో పిటిషన్ ను కొట్టి వేయాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాల్సిందిగా శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టివేసింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధృవపత్రాలు ధాఖలు చేశారంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాసగౌడ్ కు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని రాఘవేంద్రరాజు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా ఆ పిటిషన్ ను కొట్టివేయాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హై కోర్టు ఇరు పక్షాల వాదనలూ విన్న తరువాత శ్రీనివా గౌడ్ పిటిషన్ ను కొట్టివేసింది.
పిటిషనర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది. రాఘవేంద్రరాజు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. దీంతో వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ పలువురు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై రాఘవేంద్రరాజు ధాఖలు చేసిన పిటిషన్ తీర్పు ఎలా ఉండబోతోందన్న చర్చకు తెరలేపారు. ఏది ఏమైనా మంత్రి శ్రీనివాసగౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించడం బీఆర్ఎస్ కు, మంత్రికీ కూడా ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.