పిడమర్తి పోటీ ఖాయం.. సత్తుపల్లి నుంచా, కంటోన్మెంట్ నుంచా?
posted on Jul 24, 2023 @ 3:56PM
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేయడంతో రాష్ట్రంలో పార్టీలన్నీ టికెట్ల కేటాయింపు పై దృష్టి సారించాయి. గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు కసరత్తులు మొదలు పెట్టేశాయి. రాష్ట్రంలో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు పార్టీలోకి వచ్చి చేరుతుండటంతో ఆ పార్టీ టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల జాబితా రూపొందించే విషయంలో భారీ కసరత్తే చేయాల్సి వస్తుంది. ఇక అధికార బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది.
బీజేపీ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నంతగా జోష్ మీద ఉన్న పార్టీ.. ఇటీవల డీలా పడింది. పార్టీ తరఫున నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకని నియోజకవర్గాలే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. ఏ పార్టీ సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ఎంపిక చేయాలన్న గట్టి పట్టుదలతో ఉంది. కర్నాటకలో ఇలాగే చేసి సక్సెస్ సాధించడంతో ఆధిష్ఠానం తెలంగాణలో కూడా అదే ఫార్ములాను ఉపయోగించాలని భావిస్తోంది. అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే.. ఇటీవలే పార్టీలోకి వచ్చి చేరిన నేతలు, తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతల మధ్య పార్టీ టికెట్ కోసం పోటీ పడుతుండటమే.
అది పక్కన పెడితే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన పిడమర్తి రవికి వచ్చే ఎన్నికలలో పోటీ నిమిత్తం టికెట్ ఖాయమన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఆయనను పార్టీ ఎక్కడ నుంచి అభ్యర్థిగా రంగంలోకి దింపుతుంది అన్న విషయంలో మాత్రం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కంటోన్మెంట్ లేదా.. లేదా గత రెండు ఎన్నికలలో పోటీ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఆయన పోటీలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పిడమర్తి రవి టికెట్ హామీతోనే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన కోరుతున్నట్లుగా కంటోన్మెంట్ టికెట్ దక్కి అవకాశాలైతే అంతంత మాత్రంగానే ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పిడమర్తి ఇష్టం ఉన్నా లేకున్నా సత్తుపల్లి నుంచే రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు.
అయితే సత్తుపల్లి నుంచి పిడమర్తికి టికెట్ ఇస్తే పొంగులేటి మద్దతు ఎంత వరకూ ఉంటుందన్నది పార్టీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సత్తుపల్లి నుంచి పొంగులేటి మట్టా ఆనంద్ కు పార్టీ టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కోరి ఉన్నారు. దీంతో పిడమర్తి ఒక వేళ సత్తుపల్లి నుంచే పోటీ చేయాల్సి వస్తే మట్టా ఆనంద్ ను పొంగులేని ఎలా సముదాయిస్తారన్నది ఆసక్తికరం.