కుమ్ములాటలతో దిగజారు..వైసీపీ ప్రతిష్ట రోడ్డు పాలు!
posted on Jul 25, 2023 @ 1:48PM
ఏపీలో మరోసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని వైసీపీ రకరకాల ప్రణాళికలు రచిస్తుంది. కేవలం అధికారమే లక్ష్యంగా అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరం జరిగిన వైసీపీ కేవలం సంక్షేమ తాయిలాలపైనే ఆధార పడి ఆశలు పెచుకుంటుంది. ఆ సంక్షేమమే తనను ఈసారి గట్టెక్కిస్తుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు సామజిక తరగతుల వారీగా లెక్కలేసి పప్పు బెల్లాల ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటుంది. అయితే, ఈ నాలుగేళ్ళలో జగన్ సర్కార్ చేసిన కక్ష్యపూరిత రాజకీయాలు, ముందు చూపులేని జీవోలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఇప్పుడు ఫోకస్ పెట్టిన ప్రతిపక్షాలు గుక్కతిప్పుకోకుండా విమర్శల దాడి చేస్తున్నాయి. ఈ విమర్శలకు సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్ష నేతలపై బూతుల పంచాంగం అందుకోవడం కూడా తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఇది చాలందన్నట్లు సొంత పార్టీ నేతలలో కోరవైన సఖ్యత ఇప్పుడు వైసీపీని రోడ్డు పాలు చేస్తుంది.
అంతకు ముందే నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఇప్పుడు ఎన్నికల సమయానికి క్షత్రస్థాయిలో రాజకీయం వేడెక్కడంతో సొంత పార్టీ నేతల మధ్యనే నువ్వా నేనా అన్నట్లు యుద్ధం సాగుతుంది. ఇది ఇక్కడా అక్కడా అని లేకుండా.. రాష్ట్ర నలుమూలన నుండి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల ముందు నుండి స్థానిక నేతల ఆధిపత్యాలు, ఎన్నికల సమయంలో చేసిన ప్రయోగాలు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి ఆందోళనలు కలిసి వైసీపీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా దిగజారి పోయినట్లే కనిపిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఇబ్బందుల్లోనే ఉందని ఏపీ రాజకీయాలను దగ్గర నుండి చూసిన వారికి అర్ధమవుతుండగా.. ఇది ఇప్పటికే శృతి మించి తారస్థాయికి చేరినట్లుగా కనిపిస్తుందని.. ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత దిగజారి పార్టీకి తీరని నష్టం చేకూర్చనుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రం మొత్తం మీద గత ఎన్నికలలో వైసీపీ గెలిచిన నియోజక వర్గాలతో పాటు గత ఎన్నికలలో వైసీపీ ఓటమి చెందిన నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి కనిపించడం వైసీపీలో మరింత ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద సగానికి సగం నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి కనిపిస్తుండగా.. వాటిలో కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే చేయి జారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో నంద్యాల జిల్లా నందికొట్కూరు, సత్యసాయి జిల్లా హిందూపురం, గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, కోనసీమ జిల్లా రామచంద్రపురం, రాజమండ్రి రూరల్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, టెక్కలి, అన్నమయ్య జిల్లా రాజంపేట, కృష్ణా జిల్లాలోని కోడూరు, ప్రకాశం జిల్లా గిద్దలూరు, బాపట్ల జిల్లా అద్దంకి, పరుచూరు నియోజకవర్గాలలో వైసీపీ నేతల మధ్య పంచాయతీ ఇప్పటికే రచ్చ కెక్కింది. ఇవి కాకుండా మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలున్న మరికొన్ని నియోజకవర్గాలలో కూడా ఇప్పటికే అంతర్గత పోరు రోడ్డున పడింది.
రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ వేసిన అడుగులు ఇప్పుడు సమస్యలు సృష్టిస్తున్నాయి. ఎక్కడికక్కడ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. పార్టీని రోడ్డున పడేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యేల చేస్తున్న విమర్శలు ఒకెత్తయితే.. సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు మరో ఎత్తు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పట్టుమని మరో ఆరు నెలలు మాత్రమే ఎన్నికలకి సమయం ఉంది. ఒక్కసారి ఎన్నికల మూడ్ మొదలైతే ఈ అసంతృప్తిని చల్లార్చడం ఎవరి వలన కాదు. ఇప్పుడే ఈ వివాదాలను ముగించేయాలి. ఇప్పటికే వైసీపీ పెద్దలు ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. కానీ, నేతలు మాత్రం అదేమీ పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. పెద్దల మాటలు కూడా పెడ చెవిన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. మరి ఈ సమస్యని వైసీపీ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి.