కాంగ్రెస్‌లో 119 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా కలకలం!
posted on Jul 25, 2023 @ 9:52AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్ లో ఎన్నడూ లేనంతగా జోష్ కనిపిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీలో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన పార్టీ అయినా కూడా తెలంగాణలో తీవ్రంగా దెబ్బతిన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తోడు కేసీఆర్ మార్క్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు వలసెళ్లిపోయారు. తనకు రాష్ట్రంలో పోటీనే లేకుండా చేసుకొనే క్రమంలో కేసీఆర్ కాంగ్రెస్ ను దెబ్బతీశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వ లోపం కూడా తోడై తెలంగాణలో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన రెండు అసెంబ్లీ, రెండు పార్లమెంటు ఎన్నికల్లోనూ పేలవమైన ఫలితాలతో కాంగ్రెస్ చతికిల పడింది. ఆ పార్టీ నేతలు కూడా చప్పబడ్డారు.
కానీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో పూర్వ వైభవం కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోకి వచ్చే నేతలు, సమావేశాలు, సంప్రదింపులతో హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ బిజీబిజీగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అన్ని మూలల నుండి కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకి చొచ్చుకుపోతుంది. రేపు ఎన్నికలలో విజయం కోసం ఇప్పుడు నేతలంతా ఒకే తాటిపైకి చేరి కేసీఆర్ పై సమరశంఖం పూరిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలలో టికెట్లు దక్కేది ఎవరికి? నేతల ఎంపిక హైకమాండ్ ఆదేశిస్తుందా? లోకల్ లీడర్లు తమ వర్గం నేతలను సిఫార్సులు చేస్తారా? సర్వేల ఫలితంగానే టికెట్లు దక్కనున్నాయా? ఇలా రాజకీయ వర్గాలలో పలు చర్చలు కూడా జరిగిపోతున్నాయి.
అదలా ఉండగానే ఇదిగో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అంటూ కాంగ్రెస్ లీడర్ల వాట్సాప్ లలో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల ప్రాబబల్స్ అన్న పేరుతో ఈ జాబితా వైరల్ అవుతుంది. దీంతో ఈ జాబితా ఇప్పుడు కాంగ్రెస్ నేతలలో కలకలం రేపుతోంది. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ తరపున తమకే టికెట్ దక్కుతుందని ఇప్పటికే ప్రజలలో ప్రచారం మొదలు పెట్టిన నేతలు ఈ జాబితాలో పేరు ఉండడంతో ఆనందంగా ఉంటే.. జాబితాలో లేని నేతలు తమ వర్గం నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. కాగా, ఈ జాబితా కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరుతో ఉండడం విశేషం. సునీల్ టీం సర్వేలు చేసి ఫలితాల ఆధారంగా ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లుగా ప్రచారం జరుగుతుండగా.. కాంగ్రెస్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ రాలేదు.
వాస్తవానికి సునీల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే లేరు. కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి సలహదారుగా ఈ మధ్యనే వెళ్లారు. అయితే సునీల్ టీం మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుంది. ఒక రాష్ట్ర అభ్యర్థుల ఎంపిక లాంటి ముఖ్యమైన విషయం అంటే సునీల్ కూడా తెలంగాణకు వచ్చే ఖరారు చేస్తారు. కానీ, ఆయన ఇక్కడ లేకుండానే సునీల్ పేరిట ఈ జాబితా ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందనే విషయం అర్ధంకావటం లేదు. జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీకి ఇలా అభ్యర్థుల జాబితా పేరిట బ్రేకులు వేయాలనే ప్రత్యర్థి నేతల పన్నాగం కూడా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా జాబితా విడుదల చేస్తే టికెట్ దక్కని అసంతృప్త నేతలు రెబల్స్ గా మారితే ప్రత్యర్థులకు బలం చేకూరుతుంది. మరి నిజంగానే ఈ జాబితా సునీల్ కాంగ్రెస్ అధిష్టానికి పంపారా? సునీల్ పేరు మీద మరెవరైనా జాబితా తయారుచేసి ప్రచారంలో పెట్టారా అన్నది తేలాల్సి ఉంది.