పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబు ఏ1.. ఎఫ్ఐఆర్ నమోదు
టీటీడీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. పుంగనూరులో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల ఘర్షణలు, చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ వర్గం రాళ్లు రువ్విన ఘటనలలో తిరిగి తెలుగుదేశం నేతలపైనే కేసులు పెట్టారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పీఎస్‌లో ఈ మేరకు కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, A3గా అమర్నాథ్‌రెడ్డితో పాటు FIRలో మరో 20 మంది తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో చంద్రబాబు పోలీసులను హెచ్చరిస్తూ.. కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నది ఈ కేసులో ప్రధాన అభియోగం.
కురబలకోట మండలం, దాదం వారిపల్లికి చెందిన ఉమాపతిరెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేశారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదుచేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. క్రైమ్ నెంబర్ 79/2023 120బి 147, 145, 153, 307, 115, 109, 323, 324, 506 R/w149 ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయగా విచారణ చేపడతామని ముదివేడు ఎస్సై షేక్ మొబిన్ తాజ్ తెలిపారు. మరోవైపు పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై వరస కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ ఘర్షణలకు సంబంధించి 74 మందిని అరెస్ట్ చేయగా.. వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి చల్లా బాబు పరారీలో ఉండగా.. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని చల్లాబాబు పీఏ గోవర్ధన్‌రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టు సిద్ధం చేశారు.
అంగళ్ళు, పుంగనూరులో జరిగిన దాడుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా మంత్రులు ఆరోపిస్తూ వచ్చారు. విధ్వంసం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని, ఆయన కనుసన్నల్లోనే జరిగిందని ఇప్పటికే హోం మంత్రి తానేటి వనిత చెప్పుకొచ్చారు. మిగతా మంత్రులు కూడా తెలుగుదేశం నేతలే అల్లర్లకు కారణమని ఆరోపిస్తున్నారు. పుంగనూరు ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకే ఇప్పుడు ఇలా కేసులు కూడా నమోదు చేశారు. అయితే, వైసీపీ సానుభూతి పరులు దాడులు చేయడం, చంద్రబాబుపై రాళ్లు రువ్విన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా వైసీపీకి చెందిన ఒక్కరిపైన కూడా కేసులు పెట్టకపోవడం, ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం ప్రభుత్వ తెంపరితనానికి, విశృంఖలతకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
కాగా, గతంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేసి ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేసి ఆఫీసు అద్దాలు పగలగొట్టి రణరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటనలపై చంద్రబాబు కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశారు. తమకు దేవాలయంతో సమానమైన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసులకు కూడా చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకూ చట్టపరమైన చర్యల్లేవు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. చంద్రబాబు డీజీపీకి ఫోన్ చేసినా సమాధానం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆ ఘర్షణలు రెండు పార్టీల అంతర్గత విషయమని, తాము జోక్యం చేసుకోలేమని పోలీసులు అప్పుడు చేతులెత్తేశారు.
నిజానికి అప్పుడు టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి వైసీపీ గుండాలు చేసిందేనని అందరికీ తెలుసు. ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ దాడిని ఖండించాయి. కానీ, పోలీసులకు మాత్రం అది రెండు పార్టీల మధ్య ఘర్షణగా కనిపించింది. అదే ఇప్పుడు ప్రతిపక్ష నేతను ఉద్దేశ్య పూర్వకంగా వైసీపీ సానుభూతిపరులు అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగితే పూర్తిగా టీడీపీ నేతలు, కార్యకర్తలదే తప్పని, చంద్రబాబు కుట్రపన్ని ఈ ఘర్షణలు రేకెత్తేలా చేశారని పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు టీడీపీ ఆఫీసులు, పట్టాభి ఇంటిపై వైసీపీ వర్గం చేసిన దాడులు.. ఇప్పుడు పుంగనూరు ఘర్షణలను పోల్చి చూస్తే ఏపీ పోలీసులు ఎంత బయాస్డ్ గా ఉన్నారో స్పష్టంగా తెలిసిపోతుంది.