జగన్ చిన్నారికి పెట్టిన పేరు దేవుడు.. పిచ్చి పీక్స్ అంటూ సెటైర్లు
posted on Aug 10, 2023 @ 3:40PM
అదేంటో పాపం సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఏం చేసినా తెగ వైరవల్ అయిపోతోంది. జగన్ కు ఇప్పుడు బహుశా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. అందుకే అనుకోకుండా వెళ్లి అడ్డంగా దొరికిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలలో అనుభవం లేమితో ఎక్కడకి వెళ్లినా తెగ ట్రోల్ అయిపోతున్నారు. స్క్రిప్ట్ ప్రకారం జరిగే కార్యక్రమాలను ఎలాగోలా కిందా మీద పడి మేనేజ్ చేస్తున్న జగన్.. స్క్రిప్ట్ లేని కార్యక్రమాలంటే తెగ సతమతమైపోతున్నారు. దీంతో ఏదో చేయబోయి ఇంకేదో చేయడం.. ఏదో మాట్లాడాలని వెళ్తే తనకేమీ తెలియదని దొరికిపోవడంతో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సందర్భం కూడా అలాంటిదే. సీఎం వస్తున్నాడని ఆనందపడిన ఆ దంపతులు ఆయనతో చిన్నారికి పేరు పెట్టాలని నిర్ణయించుకుని.. చిన్నారిని ఆయన చేతుల్లో పెడితే.. ఏం చేయాలో అర్ధం కాని జగన్ తనకి దేవుడు అని పేరు పెట్టి ఒక ముద్దు పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇంత ట్రెండీ కాలంలో దేవుడు పేరు ఎలా వచ్చిందయ్యా సామీ నీకు అంటూ ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా సీఎం జగన్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. వరదలన్నీ ఉభయగోదావరి జిల్లాలలో కొన్ని ప్రాంతాలను ముంచేసి అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అంతా అయిపోయాక వరదలు తగ్గాక మన సీఎం సాబ్ అక్కడకు వెళ్లారు. యధావిధిగా ఆయన ఓదార్పు యాత్ర ఆయన చేసుకున్నారు. ఇక్కడే ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జంట తమ పసికందును సీఎం జగన్ చేతుల్లో పెట్టి, తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరారు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని సీఎం మీకు నచ్చిన పేరు ఏంటని తిరిగి ఆ దంపతులను అడిగారు. దానికి ఆంగ్లంలో డీ అనే అక్షరంతో ఆ పేరు మొదలయ్యేలా మీకు ఇష్టమైన పేరు పెట్టండని ఆ దంపతులు తెలిపారు. కాస్త ఆలోచించిన సీఎం జగన్ 'దేవుడు' అంటూ ఆ బిడ్డకు నామకరణం చేశారు. బిడ్డను ముద్దాడి, తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో పిల్లల పేర్లు ఎంత ట్రెండీగా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. మారు మూల పల్లెల్లో కూడా తమ పిల్లలకు కొత్త కొత్త పేరు వెతికి మరీ పెడుతున్నారు. పుట్టినరాశి, నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టాలనుకునే వారు కూడా ఇంటర్నెట్ మొత్తం వెతికి మరీ ట్రెండ్ కి తగ్గట్లు పేర్లు పెట్టుకుంటున్నారు. గతంలో మాదిరి తమ తాతల పేర్లని సుబ్బయ్య, వెంకయ్య అని పెట్టడం పక్కన పెట్టేసి రేపు భవిష్యత్ లో తమ వారసులు ఎగతాళి కాకుండా కొత్తదనం ఉండేలా పేర్లు వెతుకుతున్నారు. మరోవైపు ఈ పాతకాలపు పేర్లపై సినిమాలలో కూడా కామెడీ సీన్లు, సెటైర్లు ఉండడం తెలిసిందే. తమకి పాతతరం పేర్లు పెట్టిన తమ తాతనో, నాన్నానో సినిమాలో పాత్రలు హేళన చేయడం కూడా ప్రజలు చూసిందే. కానీ, ఇలాంటి సందర్భంలో కూడా సీఎం జగన్ ఆ చిన్నారికి దేవుడు అని పెట్టడం విశేషం.
చిన్నారికి దేవుడు అని పేరు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. సీఎం జగన్ మరీ ఇంత వెనకబడి ఉన్నాడా అని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతే కాదు, ఖలేజా సినిమాలో నువ్వు దేవుడివి స్వామీ అంటూ మహేష్ బాబుకి గ్రామ ప్రజలు చెప్పే క్లిప్పులను కట్ చేసి పెడుతూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. అదే ఖలేజా సినిమాలో సేమ్ ఇప్పుడు జగన్ పేరు పెట్టిన సీన్ కూడా ఒకటి ఉంటుంది. చిన్నారిని చిచూ అని మహేష్ బాబు లాలించే ప్రయత్నం చేస్తే అదే పేరని.. ఆ ఊరి ప్రజలు చిచూ పేరు భలే ఉందని వెళ్ళిపోతారు. ఆ సమయంలో మహేష్ ఓర్నియబ్బ పెద్దయ్యాక వాడు నన్ను తిట్టుకుంటాడని ఫన్నీగా తిడతాడు. ఈ సీన్ క్లిప్ తో కూడా జగన్ పేరు పెట్టిన వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి దేవుడు అనేది జగన్ ఊతపదం. ఎక్కడ ఎలాంటి సభలు, సందర్భం అయినా దేవుడు అనే మాట ఆయన నోట కనీసం ఒక్కసారైనా వస్తుంది. దేవుని దీవెనలు, ఆ దేవుడు చల్లగా చూస్తే, ఆ దేవుని దీవెనలతో ఇలా ఆయన ప్రసంగంలో రెగ్యులర్ గా వినిపిస్తుంటుంది. పాపం ఆ సమయానికి ఆ పదమే గుర్తు వచ్చినట్లుంది.. ఆ చిన్నారికి అదే పేరుగా పెట్టేశారు. కాగా, జగన్ కు పిచ్చి పట్టిందని.. ఎక్కడో విదేశాలలో ఈ పిచ్చికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆ మధ్య కొందరు నేతలు విమర్శించగా.. సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ దేవుడు పేరుతో ఆ పిచ్చి పరాకాష్టకు చేరిందని సోషల్ మీడియాలో మరింత ప్రచారం జరుగుతున్నది.