సీమలో బాబు, ఉత్తరాంధ్రలో పవన్.. అవే ఆంక్షలు, అదే టెన్షన్!
posted on Aug 10, 2023 @ 5:45PM
ఏపీలో వైసీపీ పరిస్థితి చూస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రతిపక్షాలు గుక్క తిప్పుకోకుండా మూకుమ్మడిగా దాడి చేస్తుంటే ఎదుర్కోవడం ఎలాగో తెలియక ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకొని వారిని ఎదుర్కొనే ఎత్తులు వేస్తున్నది. ప్రతిపక్షాలు లేవనెత్తే ఒక్కో అంశం ప్రభుత్వానికి ఊహించని రీతిలో డ్యామేజ్ చేస్తుంటే సమాధానమే లేక మీరే మాకు దిక్కని పోలీసులను ఉసిగొల్పుతున్నట్లు అర్ధం అవుతున్నది. నిన్నటి వరకూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన జరిగింది. సీమలో మొదలైన ఈ యాత్ర గోదావరి జిల్లాలలో ముగిసింది. అయితే మొత్తం చంద్రబాబు యాత్రలో అడుగడుగునా ఆంక్షలే కనిపించాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఏ స్థాయిలో ఘర్షణలు జరిగాయో తెలిసిందే. ఒకవైపు పోలీసులు ఆంక్షలు విధించడం.. మరోవైపు వైసీపీ కార్యకర్తలను దాడులకు దిగడం షరా మామూలుగా మారిపోయింది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రాయలసీమ జిల్లాలో పర్యటిస్తుండగా పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఎక్కడిక్కడ టీడీపీ కార్యకర్తలను రాకుండా ఎన్ని చేయాలో అన్నీ చేశారు. కానీ, పోలీసులు, వైసీపీ చర్యలేవీ ఫలించలేదు. సునామీలా దూసుకొచ్చిన తెలుగుదేశంకార్యకర్తల ముందు ఆ పప్పులేవీ ఉడకలేదు. దీంతో ఎలాగైనా ఈ యాత్రను భగ్నం చేయాలని పుంగనూరులో రౌడీయిజానికి దిగారు. అయినా వెనుదిరగని టీడీపీ కార్యకర్తలు దీటుగా తిప్పికొట్టారు. మొత్తంగా పుంగనూరు ఘర్షణ అనంతరం నెల్లూరు, ప్రకాశం మీదుగా వెళ్లి గోదావరి జిల్లాలలో ఈ యాత్ర ముగిసింది. చివరికి పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం కనిపించింది. చంద్రబాబు వెళ్లే గంట ముందు వరకూ కూడా ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు. ఏది ఏమైనా పోలవరం వెళ్లాల్సిందేనని చంద్రబాబు తెగింపుతో ఉండడంతో చివరికి అనుమతి ఇవ్వక తప్పలేదు.
కాగా, చంద్రబాబు సీమ యాత్రలాగానే ఇప్పుడు ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా పోలీసులు సవాలక్ష కొర్రీలు పెట్టారు. పవన్ మూడవ విడత వారాహీ యాత్ర గురువారం (ఆగస్టు 10) విశాఖలో మొదలైంది. ఈ యాత్రకు కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పవన్ ఈ యాత్రలో భాగంగా ఎక్కడా రోడ్ షో చేయడానికి వీల్లేదని పోలీసులు పేర్కొన్నారు. అదే విధంగా అభిమానులతో కరచాలనాలు, వాహనం (ఓపెన్ టాప్) పైకి ఎక్కి అభివాదాలు లాంటివి కూడా చేయడానికి వీల్లేదని, చివరికి విశాఖ విమానాశ్రయంలోనూ ఎవరినీ కలిసేందుకు కానీ, అభివాదాలు, నినాదాలు చేసేందుకు కూడా అనుమతి లేదని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే విమానాశ్రయంలో దిగి కారు ఎక్కి సభ స్థలం వద్ద కారు దిగడం వరకే అనుమతి ఇచ్చారు.
అంతేకాదు, అది కూడా విశాఖ విమానాశ్రయం నుంచి కేవలం పోర్టు రోడ్డు ద్వారా మాత్రమే పవన్ కాన్వాయ్ వెళ్లాలని, కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఈ రోడ్డులో ఎక్కడా ఎలాంటి ఆర్భాటాలు, నినాదాలు, జెండా ఎగరవేతలు వంటివి చేయడానికి వీల్లేదని, పవన్ కారు దిగడం కానీ, అభివాదం చేయడానికి కానీ వీలు లేదని.. ఒకవేళ పోలీసుల ఉత్తర్వులను కాదని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫైనల్ గా పవన్ విమానాశ్రయం నుంచి నేరుగా జగదాంబ సెంటర్‌కు చేరుకుని, అక్కడ సభ నిర్వహించుకుని, అక్కడ నుండి నేరుగా బస చేసే ప్రాంతానికి వెళ్లిపోవాలని, ఇందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు విశాఖపట్నం పోలీసు కమిషనర్ కార్యాలయం విస్పష్టంగా పేర్కొంది.
అలాగే పవన్ సభకు వచ్చేవారికి పాస్‌లు మంజూరు చేయాలని ఒక్కో పాస్‌పై కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తామని, ఆకస్మిక తనిఖీలు చేసి.. పాస్‌లేని వారిని అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందని ఆదేశాల్లో పేర్కొంది. వైసీపీ ఏ స్థాయిలో ప్రతిపక్షాలకు భయపడుతున్నదో ఆ ఉత్తర్వులను చూస్తేనే అర్ధమవుతున్నది. కాదనలేక ఉత్తర్వులు ఇవ్వడం..వైసీపీ నేతల మెప్పు కోసం సవాలక్ష ఆంక్షలు పెట్టడం చూస్తుంటే ఏపీ పోలీసులు ఏ స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారో తెలిసిపోతుంది.