టీటీడీ కర్రపెత్తనం!

తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది మన తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచ నలుమూలల నుండి కలియుగ   దైవం వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తజన కోటిని ఉలికిపాటుకు గురిచేసింది. దీంతో టీటీడీ నిర్లక్ష్యాన్ని, నిష్క్రియాపరత్వాన్ని అంతా దుమ్మెత్తి పోశారు. విపక్షాలైతే.. అసలు తిరుపతి అడవిలో ఏం జరుగుతుంది.. ప్రశాంతంగా అడవిలో బతికే మృగాలు తిరుమల భక్తులపైకి ఎందుకొస్తున్నాయని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో టీటీడీ ఏదో ఒకటి చేసి విమర్శల నుంచి, ప్రశ్నల నుంచి బయటపడాలని భావించింది. చిరుతలను బంధించాలని ఆదేశించింది. దాడి చేసిన చిరుతను దృష్టిలో పెట్టుకొని ఇందుకోసం ఆపరేషన్ చిరుత స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ చిరుతల వేటలో వంద మంది అటవీ సిబ్బంది పాల్గొనగా.. తిరుమలలో ఆపరేషన్ చిరుత ముమ్మరంగా సాగుతోంది. గురువారం బోనులో మరో చిరుత చిక్కగా ఇంకా 3 నుంచి 4 చిరుతలు నడక మార్గంలో తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదిలా ఉండగానే టీటీడీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ముందుగా చిన్నారిపై చిరుత దాడి ఘటన వెలుగులోకి రాగానే టీటీడీ ఆఘమేఘాల మీద ఏవేవో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. అవన్నీ కఠిన నిర్ణయాలని చెప్పుకొచ్చింది. వాటిని శరవేగంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఏదేదో కఠిన నిర్ణయాలని చెప్పి నడక మార్గంలో తిరుమలకి వెళ్లే భక్తులకు ఊత కర్రలను సిద్ధం చేసింది. కాలినడక మార్గంలో వన్యప్రాణుల సంచారం అధికమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు కాలినడక వెళ్లే భక్తులకు చేతి కర్రల పంపిణీ ప్రారంభమైంది. ఒక్కో భక్తుడికి ఒక్కో చేతి కర్రను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ వాలంటీర్లు, సిబ్బంది ద్వారా వీటిని సరఫరా చేస్తున్నారు.  చిరుత దాడితో టీటీడీ కఠిన నిర్ణయాలు అంటే వెంకన్న భక్తులు ఏదేదో ఊహించుకున్నారు. కానీ చివరికి చేతికి ఊత కర్ర ఇవ్వడంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. టీటీడీ నిర్ణయంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కర్రలతో పులులు, సింహాలను వేటాడాలా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భద్రత అంటే కర్రలు ఇవ్వడం కాదు.. రక్షణ గోడలు బలోపేతం చేయాలని   కోరుతున్నారు. ఇంకా చెప్పాలంటే టీటీడీ ప్రకటించిన ఊత కర్ర సోషల్ మీడియాలో అతి పెద్ద ట్రోలింగ్ గా మారింది. నిత్యం వెంకన్న కోసం లక్షల మంది భక్తులు వస్తుంటారు. అలాంటిది ఒక మనిషికి ఓ కర్ర సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ఈ కర్ర సిద్ధాంతం అమలు చేయాలంటే కొన్ని వేల కర్రలు కావాలి. అది కూడా కొండపైకి పంపించే కర్రలను కొండమీద కలెక్ట్ చేసుకోని మళ్ళీ తిరిగి కొండ దిగువకి తేవాలి. కనీసం ఇలా చేయాలన్నా కొన్ని ఎకరాల్లో అడవిని నాశనం చేయాలి. ఇందు కోసం మరింత సిబ్బంది కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కర్ర మీద సామే.  అందుకే సోషల్ మీడియాలో ఈ నిర్ణయం పై రకరకాల సెటైర్లు పడుతున్నాయి. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ పాలకవర్గం, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భక్తులకు కర్రలు కాకుండా తుపాకులు ఇవ్వాలా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాయి. మొత్తానికైతే టీటీడీ ఊతకర్రల నిర్ణయం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తిరుమల అంటే హిందువులకు ఒక నమ్మకం. కొండ ఎక్కితే ఆయనే తన మోర ఆలకించి ఆదుకుంటాడని ఒక ధీమా. కానీ ఇప్పుడు తిరుమలలో అదే కొరవడింది. ఏడుకొండలవాడి కోసం నడకమార్గంలో వచ్చే భక్తులకు భద్రంగా తిరుమల చేరుకుని వెంకన్న దేవుడి దర్శనం చేసుకుంటామా అన్న నమ్మకం   లేకుండా పోయింది. ఎప్పుడు ఏమవుతుందో, ఏ మృగం తమపై దాడి చేస్తుందోనని కొండెక్కే ప్రతి భక్తుడు భయం భయంగా అడుగులేసే పరిస్థితి వచ్చింది.  దీంతో భక్తులు ఏడుకొండలవాడా వెంకటేశ.. అయ్యో ఇదేం దుస్థితయ్యా నీ భక్తులకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యుద్ధం ప్రకటించిన విపక్షం.. వైసీపీ హ్యాండ్సప్?!

ఏపీలో ప్రతిపక్ష నేతలు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇక్కడా అక్కడా అని లేకుండా వరసపెట్టి యాత్రలు చేపడుతూ దూసుకెళ్తున్నారు.  ఇంకా చెప్పాలంటే ఏపీలో ఉన్న జిల్లాలను అన్నీ ఒకటికి పదిమార్లు కలియతిరిగే పని పెట్టుకొని ఇప్పటికే కొన్ని జిల్లాలను పూర్తి చేశారు. వెళ్ళిన ప్రతీ చోటా జనాల స్పందన కూడా విపక్ష నేతలకు బ్రహ్మరథం పడుతున్నట్లుగానే ఉంది. ఎక్కడిక్కడ ఘన స్వాగతాలు లభిస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా గత కొన్ని నెలలుగా ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎన్నికల వరకూ కూడా లోకేష్ ప్రజలలోనే ఉంటారు. చంద్రబాబు కూడా రాయలసీమ నుండి గోదావరి జిల్లాల వరకూ ఒక రౌండ్ వేసి.. ఈ మధ్యనే విశాఖలో కూడా కదలిక తెచ్చి వెళ్లారు.   చంద్రబాబు కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలలోనే మమేకమౌతూ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.  మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విడతల వారీగా వారాహి యాత్రతో జనంలో తిరుగుతున్నారు.  పవన్ కూడా ఎన్నికల వరకూ ఇలాగే ఏదో ఒక పేరుతో రాష్ట్ర నలుమూలలను టచ్ చేయనున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది. అయితే, జనసేనతో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ ఆ పొత్తును ఎన్నికల వరకూ కొనసాగిస్తుందా? టీడీపీతో  కూడా కలుస్తుందా అన్న సస్పెన్స్ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.  ఈ ఒక్కటీ క్లారిటీ వస్తే ఏపీలో ఎటు చూసినా ప్రతిపక్ష నేతల సందడే కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇంకా  స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నది దండయాత్రగా భావిస్తే.. పొత్తులు క్లారిటీ అనంతరం ఇక యుద్ధమే అని చెప్పక తప్పదు.  పొత్తులు ఉన్నా లేక విడివిడిగా పోటీకి దిగినా ప్రచారం మాత్రం ఓ స్థాయిలో హోరెత్తుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.  ఎన్నికలకు ఎనిమిది తొమ్మిది నెలలే ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దండయాత్ర మొదలు పెట్టాయి. తలా ఒకవైపు ప్రతిపక్ష నేతలు ఇంతగా విమర్శలకు దిగినా.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నా, సీఎంగా జగన్ చేతగాని తనాన్ని ఎత్తి చూపుతున్నా అధికార పార్టీ నుండి ఉలుకూ పలుకూ ఉండడం లేదు. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా మొదటి నాలుగేళ్ళూ ఎలా ఉన్నా చివరి ఏడాది మాత్రం ఏదో ఒకటి చేసి   ప్రజలను ఆకర్షించి ఓట్లు తెచ్చుకోవాలని చూస్తుంది. ఇందుకోసం ఉరుకులు పరుగులు పెడుతుంది. ఎక్కడ లేని దూకుడూ ప్రదర్శిస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు.. ఆ కార్యక్రమాల పేరుతో సభలు, సమావేశాలతో నిత్యం ప్రజలతో అక్కడి అధికార పార్టీ నేతలు మమేకమౌతున్నారు. ఎప్పుడో కానీ ఫామ్ హౌస్ దాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జనంలోనే తిరుగుతున్నారు. కానీ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీలో అటువంటి హడావుడి ఇసుమంతైనా కనిపించడం లేదు.   అడపాదడపా సీఎం జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలకు వెళ్లి అక్కడే ఎవరో రాసిచ్చిన నాలుగు ముక్కలు మాట్లాడేసి వస్తున్నారు. అయితే, ముందు బటన్ నొక్కిన కార్యక్రమాలకే డబ్బులు లేక కొత్త పథకాలు ప్రకటించే అవకాశం లేదు. కనుక సీఎం బయటకి రావడం అంటే ఏదో అమావాస్యకి పౌర్ణమికి మాత్రమే సాధ్యం. ఇక మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంతే. మొన్నటి వరకూ పార్టీని, సీఎంను ఎవరు ఏమన్నా నోరేసుకొని పడిపోయే నేతలంతా ఇప్పుడు మైకుల ముందుకు రావడం మానేశారు. ప్రతిపక్షం ఒక్కో అంశాన్ని గుచ్చి గుచి ప్రశ్నించినా కనీసం ఆ శాఖల మంత్రి కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పడం లేదు. గతంలో కూడా మంత్రులు తమ శాఖల గురించి మాట్లాడిన సందర్భాలు అతి స్వల్పమే. అన్నిటికీ ఒకటే మందు జింతా తిలిస్మాత్ అన్నట్లు అన్ని శాఖలకూ ఒకే మంత్రి అన్న చందంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లడతారు. ఆయన కూడా ఇటీవలి కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి, వివిధ శాఖలలో సాధించిన ప్రగతి గురించి కాకుండా.. విపక్షాలపై విమర్శలు, విసుర్లు, అనధికారికంగా అభ్యర్థుల ప్రకటనలకు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. విపక్షాలు నిలదీసిన అంశాలపై మాట్లాడాల్సిన అవసరమే లేదన్నట్లు వైసీపీ నేతలు, మంత్రులు, చివరాఖరికి సీఎం జగన్ కూడా వ్యవహరిస్తున్నారు.  దీంతో సహజంగానే వైసీపీ ఎందుకిలా అనే చర్చమొదలైంది. నిజానికి ఎప్పుడో రెండేళ్ల కిందటే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకతపై సీఎం జగన్ వద్ద ప్రస్తావించే సాహసం చేశారు. అయితే ఆయన వినడం మానేసి  నాకన్నీ తెలుసు మీరు పనిచేసుకుంటూ వెళ్ళండి ఓట్లు అవే వస్తాయని ఆదేశించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ప్రజా వ్యతిరేకత గురించి సొంత పార్టీ నేతల మాటలను కూడా పెడచెవిన పెట్టిన ఫలితం ఇప్పుడు పార్టీ అనుభవించాల్సి వస్తోందని వైసీపీ నేతలు అంతర్గత సమావేశాలలో  ఒకరికొకరు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఇప్పుడు  పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత గొంతు చించుకుంటే ప్రజలలో ఇంకా చులకన అవడం తప్ప ప్రయోజనం లేదని, పార్టీ అధిష్టానం కూడా ఈ విషయాన్ని గ్రహించే ప్రతిపక్షాలను ఎదుర్కోవాలనే ఆదేశాలివ్వడం లేదని పార్టీ నేతల మధ్య  సంభాషణ సాగుతోంది. మొత్తంగా  ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో వైసీపీ హ్యాండ్సప్ చెప్పినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు!?

అన్ని విధాలుగా అప్రదిష్ట మూటకట్టుకున్న జగన్ రెడ్డి మద్యం పాలసీ ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ మారబోతున్నదా? ఇప్పటి వరకూ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని జగన్ సర్కారే నిర్వహిస్తూ వస్తున్నది. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లను విక్రయిస్తూ.. దేశంలో ఎక్కడా లేనంత అధిక ధరలకు విక్రయిస్తూ ఏపీ మద్యం పాలసీ రాష్ట్రంలో మందుబాబుల జేబులను, ఆరోగ్యాన్నీ గుల్ల చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  ఇక ఇప్పుడు మరింతగా మందుబాబులను పీల్చి పిప్పి చేసి వారి నుంచి మరింత దండుకునే విధంగా ఏపీ సర్కార్ మద్యం పాలసీని మర్చేందుకు సమాయత్తమౌతున్నదని ప్రభుత్వ వర్గాల ద్వారానే తెలుస్తున్నది. ఎందుకంటే సర్కార్ నుంచి వస్తున్న సమాధానం  నిధుల సమస్య. నిధుల లభ్యత కోసం మందుబాబుల్ని మరింత పిండుకోవడం కోసం మద్యం దుకాణాల వేలానికి జగన్ సర్కార్ రెడీ అయ్యిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుతం మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వమే నడుపుతోంది. దశల వారీగా మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ వచ్చే ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేసి ఓట్లు అడుగుతామన్నారు.   కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం సంగతి అటుంచి.. మద్య నిషేధం మా వల్ల కాదంటూ జగన్ చేతులెత్తేశారు.   ప్రస్తుత మద్యం పాలసీ మరో నెలన్నరలో, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అక్టోబర్ 1తో ముగుస్తుంది. దీంతో మద్యం దుకాణాల వేలం ద్వారా నిధుల కోసం జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  తద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలకు తోడు ప్రైవేటు మద్యం దుకాణాలు కూడా వెలుస్తాయి.   భారీగా నిధులు సమకూరాలంటే మద్యం దుకాణాల వేలం వినా మరో మార్గం లేదని జగన్ సర్కార్ నిర్ణయానికి వచ్చేసింది.   మద్యం పాలసీని మార్చాలంటే అందుకు అసెంబ్లీ ఆమోదం అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీలో జగన్ ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదం అన్నది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సభలో జగన్ పార్టీకి ఉన్న మంద బలం అటువంటిది మరి. అయితే అసెంబ్లీ ఆమోదం పొందాలంటే వచ్చే నెల వరకూ ఆగక తప్పదు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. అంటే కొత్త మద్యం పాలసీని సంబంధించి ఆమోదం కోసం ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.   కొత్త విధానం వల్ల ఏపీలో మద్యం పేర మరింత దోపిడీకి తెరలేవడం ఖాయమని అంటున్నారు. 

బీసీలే టార్గెట్.. అన్ని పార్టీల వ్యూహాలు ఆ దిశగానే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ఓటు బ్యాంకులపై దృష్టి సారించాయి. బీసీల ఓట్లను గంపగుత్తగా సాధించడమే లక్ష్యంగా  వ్యూహాలకు పదును పెడుతున్నాయి.   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ పార్టీలో పెరిగిన జోష్ ఆ పార్టీ  మరింత పదునుగా, పకడ్బందీగా అమలు చేయడానికి  వ్యూహాలను రూపొందిస్తోంది.  అదే కర్నాటక ఎన్నికల ఫలితం బీజేపీని దిగాలు పడేలా చేసింది. తెలంగాణలో పాగా వేయడం ఖాయమన్న స్థాయి నుంచి.. ఉన్న బలాన్ని, పరపతిని నిలుపుకుంటే చాలన్నట్లుగా ఆ పార్టీ రాష్ట్ర శ్రేణులు చతికల బడ్డాయి. దీంతో అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర నాయకులలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  కర్నాటకలో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా తెలంగాణలో మరింత పకడ్బందీగా అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల బీసీ ఓట్లపై గురి పెట్టింది.  ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకుని.. బీసీలను దరి చేర్చుకుంటే విజయం నల్లేరుమీద బండినడకే నని భావిస్తూ ఆ దిశగా పావులు కదుపుతోంది.  అయితే 2018 ఎన్నికలకు 2023 ఎన్నికలకు మధ్య పోలిక పొంతన ఉండే అవకాశం లేదని, ఈ రెండు ఎన్నికల నడుమ టీఆర్ఎస్ – బీఆర్ఎస్ లకు మధ్య ఉన్నంత  వ్యత్యాసం ఉందని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)  రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికలలో కీలకంగా నిలిచిన తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ పార్టీ పేరు మార్చడంతో ఉనికిలోనే లేకుండా పోయింది.  కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆకాంక్ష తెలంగాణ సెంటిమెంట్ ఏ పార్టీకి దక్కకుండా చేసింది. స్వయంగా ఆయన పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను ప్రస్తావిస్తే నవ్వుల పాలయ్యే పరిస్థితి ఉంది.  తెలంగాణ తెచ్చాం అని చెప్పుకునే అవకాశం బీఆర్ఎస్ కు, తెలంగాణ ఇచ్చాం అని క్లెయిమ్ చేసుకునే చాన్స్ కాంగ్రెస్ కు లేకుండా పోయింది. ఇక  సోనియమ్మనే కాదు.. ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి అంటూ పర్లమెంటు వేదికగా దివంగత సుష్మా స్వరాజ్ సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు అప్పట్లో తన శాయశక్తులా ప్రయత్నించారు. అయితే.. ఇప్పుడు బీజేపీకి తెలంగాణ ఆవిర్భావానికి తామూ సహకరించాం అని చెప్పుకునే  అవకాశం కూడా లేదు.  అందుకనే రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా తెలంగాణ నినాదం లేకుండా జరుగుతున్నాయని చెప్పవచ్చు.  ముఖ్యంగా సెంటిమెంట్ ను ఉపయోగించుకుని ఇంతవరకు గరిష్ట ప్రయోజనం పొందిన బీఆర్ఎస్( టీఆర్ఎస్) రానున్న ఎన్నికలలో ఆ కారణంగానే గరిష్టంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలన్న ఆకాంక్షతో రూటు మార్చిన కేసీఆర్.. చేజేతులా తెలంగాణ తెచ్చిన పార్టీగా, నేతగా బీఆర్ఎస్ కు ఉన్న గుర్తింపును తుడిచేశారు.   ఈ నేపథ్యంలో 2023 ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వరవడికి, కొత్త అధ్యాయానికి తెర తీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు కులం కార్డును తెరమీదకు తీసుకువచ్చాయి.  ముఖ్యంగా బీసీ కార్డు తురఫు ముక్కగా మార్చుకుని విజయసోపానాలు అందుకోవాలని చూస్తున్నాయి.    బీజేపీ తెలంగాణలో  ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట, బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేయడంతో పాటు పల్లెపల్లెకూ బీసీ- ఇంటింటికీ బీజేపీ’ పేరుతో  పెద్ద ఎత్తున ప్రచారమూ ఆరంభించింది.  బీజేపీ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. రాజకీయ చాణుక్యుడిగా పేరుపొందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అధికార బీఆర్ఎస్ మరోలా ముందుకెళ్తోంది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా బీసీలలో వెనకబడిన కులాలకు లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా బీసీ నినాదంతో రాబోతుంది. తెలంగాణలో బీసీ పాలసీ తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన సభ పెడతామని ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో బీసీ  జనాభా అధికంగా ఉండడంతో సహజంగానే అన్ని పార్టీలు బీసీ ఓటు మీద కన్నేసి, బీసీలను తమవైపు తిప్పుకునేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. నిజానికి, తెలంగాణలో ఇంతవరకు బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ వరాలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయా సామాజికవర్గాలు   మరీ ముఖ్యంగా బీసీలు ఎటు మొగ్గుచుపుతారు, అనేది గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ సర్కార్ ను ఇన్వెస్టర్లు నమ్మట్లే!

జగన్ సర్కార్ పరువు గంగలో కలిసింది. ఏపీ ప్రతిష్ఠ మంట కలిసింది. రుణగొణ ధ్వని తప్ప రాష్ట్ర ప్రగతి, పురోగతి పట్టని జగన్ సర్కార్ కు ఇన్వెస్టర్లు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. కేంద్రం అండతో  పరిమితులు, నిబంధనలు తుంగలో తొక్కినా ఎటువంటి ఆంక్షలూ విధించకుండా అడిగినంత అప్పు ఇట్టే వచ్చేస్తుంటే జగన్ సర్కార్ ఇక ఆర్థిక అరాచకత్వంపై విపక్షాలు, ఆర్థిక రంగ నిపుణుల విమర్శలను పట్టించుకోవలసిన అవసరం ఏముంది అన్న నిర్ణయానికి వచ్చేసింది. కేంద్రమే తన ఆర్థిక అవకతవకలను పట్టించుకోనప్పుడు ఇంక ఎవరు మాత్రం ఏం చేయగలరన్న ధీమాతో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా భారీ రుణానికి టెండర్ వేసింది. అంటే ఆ కార్పొరేషన్ ద్వారా బాండ్లు విడుదల చేసి 11వేల 600 కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేసుకోవాలని ఎత్తువేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా బీఎస్ఈలో బాండు విడుదల చేసింది. అయితే ఈ బాండ్ల వైపు ఇన్వెస్టర్లు కన్నెత్తి చూడలేదు. సాధారణంగా ప్రభుత్వ బాండ్లను ఇన్వెస్టర్లు హాట్ కేకుల్లా తన్నుకుపోతారు. కానీ ఆ బాండ్లు విడుదల చేసింది జగన్ సర్కార్ కదా! జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణపై  ఒక్క రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన గుర్తింపు ఉంది.    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడాపెడా అడ్డగోలుగా చేస్తున్న అప్పులను ఆదాయం పెంపునకు ఉపయోగించడం లేదు. అంటే ప్రాజెక్టులు నిర్మించడం లేదు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలేదు. వచ్చే ఎన్నికలలో ఓట్లు తెచ్చిపెడతాయని భ్రమిస్తున్న సంక్షేమ పథకాల పేరిట బటన్ లు నొక్కి సొమ్ము పందేరానికి మాత్రమే ఉపయోగిస్తున్నది.  ఆ కారణంగానే జగన్ సర్కార్ విడుదల చేసిన బాండ్లకు ఇన్వెస్టర్లు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వలేదు.  గత మే 15న కూడా ఏపీ సర్కార్ బాండ్లు విడుదల చేసింది. అయితే వాటిని లిస్ట్ చేయలేదు. ఆ కారణంగా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టలేదని భావించి, ఈ సారి పక్క ప్రణాళికతో వ్యూహాత్మకంగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లను బీఎస్ఈలో లిస్టు చేసింది. ఇందు కోైసం  ఓ  సంస్థ ద్వారా  ఏఏ+   రేటింగ్‌ ఇప్పించుకుంది. అ యినా బాండ్లను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోవడానికి ఇన్వెస్టర్లు సుముఖత చూపలేదు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీసీఆర్‌డీఏ, ఏపీసీపీడీసీఎల్‌, పీఎ్‌ఫసీ 'హా  ఇతర ఎనర్జీ సంస్థల బాండ్లన్నీ బీఎస్ఈలో  బీ రేటింగ్‌తో ట్రేడ్‌ అవుతుండగా, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్లకు ఏఏ+ రేటింగ్‌ ఎలా అని ఇన్వెస్టర్లు సందేహం వ్యక్తం చేశారు.   

ఆ ఐదూ ఇస్తే... విలీనం!?

తన పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సెగ్మెంట్లు ఇవ్వాలన్న డిమాండును  వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల ఆ పార్టీ హైకమాండ్ ముందుంచిందా.. అలా అయితేనే విలీన ప్రక్రియకు సై చెతానని షర్మిల షరతు పెట్టిందా.. అంటే అవుననే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కన్న కలలను నిజం చేయాలన్న ఉద్దేశంతో షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటు న్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమె సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న షర్మిల మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ షర్మిలతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భర్త అనిల్, పార్టీ ముఖ్యలతో సుదీర్ఘ మంతనాల అనంతరం షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు పలు దఫాలు ఢిల్లీ వెళ్లిన బ్రదర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పెద్దలతోనూ వరుస భేటీలు నిర్వహించి విలీన ప్రక్రియ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పాత్రపై చర్చినట్టు వార్తలొచ్చాయి. నాలుగు రోజుల క్రితం షర్మిల, అనిల్ హస్తిన వెళ్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సమావేశమై విలీన ప్రక్రియ ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారని ప్రచారం జరిగింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన షర్మిల అంతకుముందు డీకే శివకుమార్ తో ప్రత్యేకంగా సమావేశమై సమాలోచనలు జరిపినట్టు సమాచారం. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న విషయాన్ని షర్మిల పార్టీ సీనియర్లతో సమావేశమై చెప్పి వారి అభిప్రాయాలను సేకరించినట్టు తెలుస్తోంది. వరుసగా రెండు రోజులపాటు ఆమె ఇక్కడి లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో నేతలను కలుస్తూ వారితో చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరో దఫా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లతో సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ విలీనం తర్వాత జరగనున్న పరిణామాలను అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఇచ్చే సీట్ల విషయంలో స్పష్టతకు రావాలని భావిస్తున్నట్టు సమాచారం. మరో నాలుగైదు నెలల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఐదు అసెంబ్లీ స్థానాలను కోరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో ఎటూ తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో తెలంగాణ కొట్టు మిట్టాడుతోంది. తాజాగా షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నట్టు సమాచారం. ఒక వైపు డీకే శివకుమార్ పట్టుబట్టి షర్మిల పార్టీని విలీనం చేసే దిశగా చర్యలు చెపట్టారని, ఇప్పుడు ఈ విషయంలో వెనక్కు తగ్గినా ప్రక్రియను వ్యతిరేకించినా వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఉండదన్న ఆందోళన పీసీసీ నేతల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం. కాగా షర్మిల కోరుతున్నట్టు ఐదు అసెంబ్లీ స్థానాలివ్వడానికి రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధంగా లేదన్న సంకేతాలను పార్టీ ముఖ్యనేతలు డీకే శివకుమార్ కు పంపించినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా పాలేరు, ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్, ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి లేదా నకిరేకల్, సికింద్రాబాద్ స్థానాలను షర్మిల కోరుతున్నట్టు చెబుతున్నారు. పాలేరు నుంచి తాను పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించడంతో పాటు అక్కడ పార్టీ కార్యాలయాన్ని, నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. షర్మిల అనుచరుడు ఏపూరు సోమన్న తుంగతుర్తి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మహబూబాబాద్ అసెంబ్లీ నుంచి సుజాతను బరిలో నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఐదు సీట్లు కోరుతున్న షర్మిలకు నచ్చజెప్పి రెండు స్థానాలను ఇవ్వాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్టు చెబుతున్నారు. అప్పటికీ ఆమె మరో సీటు కోసం పట్టుబడితే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు వినికిడి. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న షర్మిల అక్కడే పార్టీ పెద్దలను కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోవాలని ప్రతిపాదించారని ఆమె సన్నిహిత నేతలు వివరించారు. ఏది ఏమైనా.. షర్మిలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం మాత్రం ఖాయం.

తెలంగాణపై ఫోకస్ తో ఆ పార్టీకి ఫలితం ఉందా..?

మరి కొద్ది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది.  ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం. అభ్యర్థుల ఎంపికకు పరిగణనలోనికి తీసుకోవాలసిన అంశాలపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటిని నిర్వహించింది. ప్రధాని మోడీ, అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం కమిటీ సమావేశ మైంది. ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికలు జరగనున్న తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై అగ్రనేతలు తీశారు. రాష్ట్రాల్లో పరిస్థితులపై వచ్చిన సమాచారం ఆధారం గా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రావడంతో  ఎన్నికలను బీజేపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార బాధ్యత లను ఎక్కువగా జాతీయ నాయకత్వమే తీసుకుని వ్యూహత్మకంగా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క మధ్యప్రదేశ్ వినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న  రాష్ట్రాలలో.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్ లో అధికారం నిలుపుకోవడంతోపాటు గతంలో అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్,  రాజస్థాన్ లో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లలో హోరాహోరీగా ప్రత్యర్థి పార్టీలతో తలపడాల్సి రావొచ్చని సమావేశంలో నేతలు అన్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగినట్లు తెలిసింది. ఎన్నికల బరిలో దింపాల్సిన అభ్యర్థులను ముందే గుర్తించి ప్రకటిస్తే తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం తోపాటు వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి తగినంత సమయం ఉంటుందని అన్నట్టు సమాచారం. సమయం దొరుకుతుం దని సమావేశం అభిప్రా య  పడితే ప్రత్యర్థి పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై కమిటీ ఆరా తీసినట్లు తెలిసింది.  తెలంగాణ లో పాతుకు పోయిన బీఆర్ ఎస్.. జోష్ తెచ్చుకుని..పరుగులు పెడుతున్న  కాంగ్రెస్.. ల నడుమ.. బీజేపీ ..అధికార పీఠం ఎక్కుతోందా.. ప్రత్యర్థులను ఢీ కొట్టే దమ్ము ఉందా..? కాలమే సమాధానం చెబుతోంది.

తెలంగాణలో మళ్లీ బీఆరెస్సేనా? టైమ్స్ నౌ సర్వే ఏం చెబుతోంది?

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా ఎకఛత్రాధిపత్యంగా కొనసాగారు. మరో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర మైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతోందన్న పరిశీలకుల విశ్లేషణ.  పార్టీలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, అదే సమయంలో కాంగ్రెస్ గట్టిగా పుంజుకోవడం.. ఇక అధికారమే తరువాయి అన్నట్లుగా ఆ పార్టీలో గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఐక్యత..ఇవన్నీ వెరసి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాకుండా బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా వెలువడిన ఓ సర్వే.. బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ అది.. ప్రభుత్వాన్నికూలదోసే స్థాయిలో లేదని పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమైనప్పటికీ.. అది బీజేపీ స్థాయిని  గణనీయంగా తగ్గించగలిగిందే కానీ..  బీఆర్ఎస్ ను అధిగమించే స్థాయికి చేరుకోలేకపోయిందని సర్వే పేర్కొంది.  తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మరో సారి అధికారం చేపట్టడం ఖాయమని టైమ్స్ నౌ వెల్లడించింది.     అధికార బీఆరెస్స్ కు 38.4 శాతం మంది ప్రజల మద్దతు ఉందని.. ఆ తరువాత  కాంగ్రెస్ కు  29.9 శాతం, బీజేపీకి  24.3 శాతం,ఇతరులకు 7.4 శాతం ప్రజా మద్దతు ఉందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. అంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో  కూడా తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీఆరెస్స్ కు మద్దతుగా నిలుస్తారని సర్వే వెల్లడించింది.   వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో వెలువడిన టైమ్స్ నౌ సర్వే కాంగ్రెస్ తెలంగాణలో బలంగా పుంజుకుందనీ, అయితే అధికారం చేజిక్కించుకునేందుకు ఆ బలం సరిపోదనీ పేర్కొంది. అయితే.. రానున్న రోజులలో ప్రజా వ్యతిరేకత మరింత పేరిగే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక, అసమ్మతి, అసంతృప్తి వంటికి ఈ సారి కంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం చేకూర్చే అవకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

లోకేష్ పాదయాత్రలో విధ్వంసానికి కుట్ర.. సజ్జల వ్యూహం ఇదేనా?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. మంగళగిరిలో అయితే ఆయన పాదయాత్ర జన సంద్రాన్ని తలపించింది. నియోజకవర్గ ప్రజలంతా లోకేష్ వెంట నడిచారా అన్నట్లుగా ఆయన పాదయాత్ర సాగింది. దీంతో అధికార వైసీపీలో ఖంగారు మొదలైంది. ఆయన పాదయాత్ర విజయవాడలో అడుగుపెట్టడానికి ముందే ప్రభుత్వ సలహాదారు విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ మీదే.. ఇక లోకేష్ పాదయాత్రకు ఎలా అడ్డంకులు సృష్టిస్తారో మీ ఇష్టం అన్నట్లుగా సజ్జల అభ్యర్థుల ప్రకటన ఉంది.  విజయవాడ ఈస్ట్ అభ్యర్థిగా దేవినేని అవినాష్,  సెంట్రల్ అభ్యర్థిగా మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లిని ఖరారు చేశారు. వీరిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. నిన్న మొన్నటి వరకూ ఈ ఇద్దరికీ టిక్కెట్లు అనుమానమే అంటూ పార్టీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే.. లోకేష్ పాదయాత్ర బెజవాడలోకి ప్రవేశించే సమయానికి వైసీపీ వ్యూహం మార్చేసింది. ఎనిమిది తొమ్మిది నెలల తరువాత జరిగే ఎన్నికలలో విజయం కంటే..   లోకేష్ పాదయాత్రకు విజయవాడ లో  అవరోధాలు కల్పించడమే ముఖ్యమని భావించింది. అందుకే అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు ప్రకటించే సంప్రదాయాన్ని కాదని మరీ   సజ్జల చేతే అభ్యర్థులను ప్రకటించేశారు. పార్టీ టికెట్ ఖరారైంది కనుక దేవినేని అవినాష్, మల్లాది, వెల్లంపల్లిలకు లోకేష్ పాదయాత్రలో అవరోధాలు కల్పించడమనే బాధ్యతను అప్పగించినట్లు చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు సజ్జల ప్రకటన శంఖంలో పోసిన చందంగా జగన్ కూడా ఆమోదం తెలపాలంటే.. ఈ ముగ్గురూ లోకేష్ పాదయాత్రను సక్సెస్ ఫుల్ గా అడ్డుకుని తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవలసి ఉంటుందన్నమాట. ఒక వేళ ఆ విషయంలో వారు విఫలమైతే జగన్ రేపు మీరు అభ్యర్థులు కాదని తన గొంతుతో ప్రకటించే అవకాశాలున్నాయి.. అలాగే ఒక వేళ సక్సెస్ ఫుల్ గా లోకేష్ పాదయాత్రకు వారు ఆటంకాలు కల్పించి, దాడులకు పూనుకున్నా..పార్టీ టికెట్లు వారికే ఖరారౌతాయన్న నమ్మకం లేదని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే టికెట్లు ప్రకటించేందుకు సజ్జలకు ఎటువంటి అధికారమూ లేదు. ఆ ప్రకటనే జగన్ నుంచి రావాల్సి ఉంటుంది. వాడుకుని వదిలేయడమన్నది వైసీపీ డీఎన్ఏ లో ఉందనీ, అందుకే ఇప్పుడు సజ్జల ప్రకటనతో బెజవాడ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజవకర్గాల అభ్యర్థుల ప్రకటన సజ్జలతో చేయించడమే ఇందుకు నిదర్శనమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ అభ్యర్థుల ప్రకటన ద్వారా లోకేష్ పాదయాత్ర సజావుగా సాగకుండా అవరోధాలు కల్పించడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని భావించాల్సి ఉంటుందని అంటున్నారు.  మరో రెండు రోజుల్లో  లోకేష్ పాదయాత్ర విజయవాడలో ప్రవేశిస్తుంది. అక్కడ మూడు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. సజ్జల హడావుడిగా విజయవాడలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం వెనుక లోకేష్ పాదయాత్రకు అవరోధాలు కల్పించే కుట్ర, వ్యూహం ఉన్నాయని తెలుగుదేశం నాయకులు, శ్రేణులు కూడా అంటున్నాయి. ఇప్పుడు సజ్జల ప్రకటించిన  విజయవాడ వెస్ట్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు జగన్ తొలి క్యాబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు ఎంత యథేచ్ఛగా జరిగాయో తెలిసిందే. అన్ని విధాలుగా ఆమాత్యుడిగా విఫలమయ్యారన్న కారణంతోనే ఆయనను జగన్ మంత్రి పదవి నుంచి తప్పించారని అప్పట్లో వైసీపీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక బెజవాడ సెంట్రల్ నియోజవకర్గ అభ్యర్థిగా ఇప్పుడు సజ్జల ప్రకటించిన మల్లాది విష్ణు గత ఎన్నికలలో విజయం సాధించారు. ప్రస్తుతం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తరువాత బెజవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ ను సజ్జల ప్రకటించారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నిలిచిన బొప్పన భవకుమార్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ నుంచి దేవినేని అవినాష్ ను రంగంలోకి దించుతున్నట్లు సజ్జల ప్రకటించారు. మొత్తం మీద విజయవాడ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులను ఇంత హడావుడిగా ప్రకటించడం వెనుక లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి వారికి లైసెన్స్ ఇవ్వాలన్న లక్ష్యమే కారణమని పరిశీలకులు, తెలుగుదేశం శ్రేణులే కాదు.. బెజవాడ వాసులు కూడా అంటున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా విజయవాడలో వైసీపీ శ్రేణులు ఈ ముగ్గురి నాయకత్వంలో విధ్వంసానికి, దాడులకు తెగబడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

వంగవీటి రాధ వివాహం..జనసేన నేత కుమార్తెతో

వంగ‌వీటి రాధా కృష్ణ‌ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. దివంగ‌త వంగ‌వీటి  రంగా కుమారుడిగా ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసి వంగవీటి రాధాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాతికేళ్ల పిన్న వయస్సులోనే  (2004 ) ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైయ్యారు.  విజ‌యవాడ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా ఎదిగారు. ఇంత కరిష్మా గ‌ల రంగకు అభిమానుల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువే. వంగవీటి రాధ రాజకీయ వారసుడిగా ఆయన నిత్యం తన అనుచరులకు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. అటువంగటి నేత  పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ముగింపునకు వచ్చేశాయి. వంగవీటి రాధా పెళ్లికి ముహూర్తం కుదిరింది. నిశ్చితార్ధం ఈ నెల19, వివాహం వచ్చేనెల 6న జరుగుతుంది. ఇంతకీ ఆయన వివాహమాడబోయేది   ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా  నరసాపురం మున్సిపల్మాజీ  ఛైర్ పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జి ల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీని.  ప్రస్తుతం వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో   ఆయ‌న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో సహజంగానే ఆయన వియ్యమొందబోయే కుటుంబ రాజకీయ నేపథ్యం ఏమిటన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇంతకీ వంగవీటి రాధ వివాహమాడబోయే పుష్పవల్లి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందా? అంటే ఉంది. ఆమె తల్లి నరసాపురం మాజీ చైర్ పర్సన్. ప్రస్తుతం పుష్పవల్లి కుటుంబం జనసేనలో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నది. ఇటీవల వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్ వారి ఇంట్లోనే బస చేశారు. దీంతో కొంత కాలం కిందటి వరకూ ఏపీ రాజకీయాలలో వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీని వీడతారంటూ జరిగిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. జనసేన పార్టీకి చెందిన కుటుంబంలోని అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనుండటంతో వంగవీటి రాధ జగసేన గూటికి చేరే అవకాశాలున్నాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే పరిశీలకులు మాత్రం వంగవీటి రాధ వివాహానికి, ఆయన రాజకీయాలకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జనసేన తెలుగుదేశంతో పొత్తు వార్తల నేపథ్యంలో కూడా వంగవీటి రాథ, పుష్పవల్లిల వివాహం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.  

ఈ ఐదు వ్యూహాలు చాలు దేశం నంబర్ వన్.. చంద్రబాబు విజన్ 2047

 వర్తమాన రాజకీయాలలో దార్శనికుడు అనగానే ఎవరికైనా వెంటనే స్ఫురించే పేరు నారాచంద్రబాబు నాయుడు.   తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది  ఐటీ.. విజన్. మన దేశంలో ఇప్పుడున్న సీనియర్ నేతలలో ముందు చూపు కలిగిన నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. దేశ విదేశాల కంపెనీల ప్రతినిధుల నుండి అమెరికా అధ్యక్షుల వరకూ ఈ మాట ఎప్పుడో చెప్పారు. అందుకు తగ్గట్లే చంద్రబాబు అనునిత్యం దేశ భవిష్యత్ బాగుండాలనీ, పేదరికం పోవాలని పరితపిస్తుంటారు. అందుకే అందరూ ఈ రోజు గురించి ఆలోచిస్తే చంద్రబాబు రేపటి గురించి ఆలోచిస్తారని రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. రానున్న దశాబ్దంలో మన సమాజాన్ని నడిపించేది ఏంటో ఆయన శోధించి ఆ దిశగా సమాజాన్ని నడిపించాలన్నది ఆయన తపన. గతంలో అలా ఆయన వేసిన బీజమే నేడు హైదరాబాద్ నగరానికి దీటుగా ఎదిగిన సైబరాబాద్. గతంలో ఆ  ఆ దిశగా పనిచేసి తన  దార్శనికత ఏంటో చాటారు. ఇప్పుడు మరోసారి విజన్ డాక్యుమెంట్-2047తో ప్రజల ముందుకొచ్చారు.  చంద్రబాబు మంగళవారం విశాఖ సభలో విజన్ డాక్యుమెంట్-2047ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంట్ లో భారత్ నెంబర్ 1 అయ్యేందుకు ఏం చేయాలో సూచించారు. ఇందుకోసం చంద్రబాబు నాయకత్వంలోని జీఎఫ్ఎస్టీ బృందం 5 వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది. ఇండియా 2047 నాటికి స్వాతంత్య్రం సాధించి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి భారత్ ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా @ 100 అనే కాన్సెప్ట్‌తో విజన్ డాక్యుమెంట్-2047 తయారైంది. ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు సభ్యులుగా  చంద్రబాబు చైర్మన్ గా వ్యవహరిస్తున్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్   గత కొన్నినెలలుగా తీవ్ర కసరత్తులు చేసి ఈ  ఈ విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేసింది.  ఈ విజన్ డాక్యుమెంట్-2047 విషయానికి వస్తే.. ఇందులో మొత్తం 5 వ్యూహాలను సూచించారు. ఈ ఐదింటిలో 1. సోలార్ ఎనర్జీ, విండ్, పంప్డ్ ఎనర్జీ, హైబ్రిడ్ మోడల్ డెమోక్రటైజేషన్, డీకార్బనైజేషన్ అండ్ డిజిటలైజేషన్, 2. వాటర్ సెక్యూర్ ఇండియా 3. డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లీడర్స్ ఆఫ్ ఫ్యూచర్ 4. డెమొగ్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ పీ4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్ 5. ఇండియన్ సిటిజెన్ టు సర్వ్ గ్లోబల్ ఎకానమీ. సోలార్, విండ్, హైడల్ మూడింటినీ కలిపి హైబ్రిడ్ మోడల్ తయారుచేసి సరికొత్త పవర్ చేంజర్ తో ముందుకెళ్లాలని.. అప్పుడే అన్ని రంగాలకు విద్యుత్ అందుతుందని చంద్రబాబు చెప్పారు. దీంతో కాలుష్యం కూడా ఉండదని.. డిజిటలైజేషన్ వల్ల విద్యుత్ గ్రిడ్ మేనేజ్ చేసుకోవచ్చని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో సోలార్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించిన విధానాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.  ఇక, మిగతా విషయాలకు వస్తే విజన్ డాక్యుమెంట్ -2047లో రెండో ప్రాధాన్యత నీటికి ఇచ్చారు. ఇటు హైడల్ ఎనర్జీలో నీళ్లే కీలకం.. అటు వ్యవసాయానికి కూడా నీళ్లు కావాలి. అందుకే భారత్ నీటి పరంగా పూర్తి భరోసాతో ఉండాలనే వాటర్ సెక్యూర్ ఇండియా సిద్ధాంతం తీసుకువచ్చినట్లు చెప్పారు. మూడవ అంశం డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. టెక్నాలజీతో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయని..ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నవ్వారు. సెల్ ఫోన్ ఏమైనా తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు. కానీ ఆ రోజు ఒకటే చెప్పాను... సెల్ ఫోన్ ను అందరూ గుర్తించే రోజు వస్తుంది అని స్పష్టం చేశాను. ఇవాళ సెల్ ఫోన్ తిండిపెట్టడమే కాదు, లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తోంది.   ఈ విజన్ 2047లో చివరి రెండు అంశాలు డెమొగ్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ పీ4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్, ఇండియన్ సిటిజెన్ టు సర్వ్ గ్లోబల్ ఎకానమీ. 2047 తర్వాత దేశంలో ముసలివాళ్ల సంఖ్య పెరిగి, యువత సంఖ్య తగ్గిపోతుంది, పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ జనాభా నిర్వహణ సిద్ధాంతం ఆ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఇప్పటివరకు దేశంలో జనాభా తగ్గించే ఉద్దేశంతో నియంత్రణకు వెళ్లగా.. ఇప్పుడు అధిక జనాభానే అనుకూలత అయ్యే పరిస్థితులు వస్తాయని అందుకు మనం ముందే సిద్ధంగా ఉండాలని సూచించారు. చివరిగా ప్రతి ఒక్కరూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోవడం కాదు.. ఈ స్వతంత్ర భారతదేశంలో పేదరికం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందని.. ప్రతి వ్యక్తి తన సేవలను, తన ఉత్పాదనలను ప్రపంచానికి అందించే దిశగా ఆలోచిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా, చంద్రబాబు విజన్ డాక్యుమెంటరీ 2047పై ఇప్పటికే ఎందరో నిపుణులు స్పందించి ఈ ఐదు సూత్రాలు చిత్తశుద్ధితో అమలు చేసే భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని పేర్కొంటున్నారు.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల.. ముహూర్తం ఎప్పుడంటే?

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారా అంటే నిన్న మొన్నటి వరకూ ఏవేవో ఊహాగానాలు వినిపించాయి. షర్మిల పార్టీ విలీనానికి సిద్దమే కానీ ఆమె రాజకీయాలు తెలంగాణలోనే ఉండాలని పట్టుబడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను ఏపీకి వెళ్లాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు వైఎస్ఆర్టీపీ, కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లే షర్మిల తన పార్టీని విలీనం చేయడంతో పాటు ఇకపై ఏపీ నుండే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టేందుకు సిద్దమైనట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా పూర్తి కాగా.. ఇప్పుడు షర్మిల గ్రీన్ సిగ్నల్ తో ఈ విలీనం కథ సుఖాంతం కాబోతుందట.  అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వారం లేదా ఈ నెలాఖరున ఈ విలీనం కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు లోటస్ పాండ్ వర్గాల సమాచారం. నిజానికి ముందుగా ఆగ‌స్టు 12న దీనికి ముహూర్తం పెట్టుకున్నా.. షర్మిల నిర్ణయం ఆలస్యం కావడంతో ఆ ముహూర్తానికి ఇది అమలు కాలేదు. అయితే, ఇప్పుడు ఈ స్థానంలో మరో ముహూర్తం కోసం చూస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి అన్ని చ‌ర్చ‌లు పూర్తి కాగా, విలీనం వలన ఆమెకి చేకూరే ప్రయోజనాలపై కూడా చర్చలు పూర్తి అయ్యాయట. షర్మిలను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపడంతో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపికైన అనంతరం ఇద్దరు పాత కాంగ్రెస్ నేతలను మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి షర్మిల మైలేజీ పెంచే ప్రణాళిక కూడా ఒకటి కాంగ్రెస్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం రావాల‌నే ఉద్దేశంతో 2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ష‌ర్మిల స్థాపించారు. తానే అధ్య‌క్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో ప‌రుగులు పెట్టించారు. ఫండింగ్ ఎంత ఖర్చు చేశారు.. ప్రణాళికలు ఎవరు రచించారన్నది తెలియదు కానీ వైఎస్ఆర్టీపీ ఆరంభంలో దూకుడుగానే ఉంటూ వచ్చింది. నాయ‌కుల చేరిక‌లు, పాద‌యాత్ర‌, ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు.. ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది. కానీ ఆ త‌ర్వాతే తేడా కొట్టింది. ఎంత చేసినా ప్ర‌జ‌ల్లోకి పార్టీ వెళ్ల‌లేక‌పోయింది. మ‌రోవైపు కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు. ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పుంజుకోవడంతో షర్మిల సుతారం వెనకబడిపోయారు. ఒకవైపు ఎంత చేసినా మైలేజీ రాకపోవడం, మరోవైపు ముంచుకొస్తున్న ఎన్నికల నేపథ్యంలో ఆమె కాస్త నిరాశలో ఉంటూ వచ్చారు. ఈ తరుణంలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఈ విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఈ ప్రక్రియను ఆయనే దగ్గరుండి పూర్తి చేయనున్నారు. కాగా, షర్మిల పార్టీ విలీనం.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటిస్తే ఆమెకి మొదటి శత్రువు అన్న జగనే. ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించింది జగన్ వైఎస్ఆర్సీపీనే. టీడీపీ క్యాడర్ టీడీపీకి ఉండగా.. జనసేనకి ఉన్న కొద్దిపాటి సైన్యం అంతా యువతే కనిపిస్తున్నారు. ఇక ఎటొచ్చీ వైసీపీలో కనిపిస్తున్న నేతలు, కార్యకర్తలు అందరూ పాత కాంగ్రెస్ నేతలే. కనుక షర్మిల ఇప్పుడు రాజకీయం అంటూ ఏపీలో మొదలు పెడితే మొదట టార్గెట్ చేయాల్సింది వైసీపీనే. యుద్ధం చేయాల్సింది అన్న జగన్మోహన్ రెడ్డితోనే. నిన్న మొన్నటి వరకూ ఈ విషయంపై తర్జన భర్జన పడిన షర్మిల.. ఇప్పుడు భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ ప్రోత్సాహంతో అన్నపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏపీలో అడుగుపెట్టనున్న సంగతి కూడా వైసీపీ ముఖ్యనేతలందరికీ తెలుసనీ, ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చలలో షర్మిల రాగానే ప్రధానమైన అంశంగా ఉందని తెలుస్తుంది.

వైసీపీలో పాతవారు కొత్తవారు అందరిదీ పక్క చూపేనా?

 ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతల పరిస్థితి అయోమయంగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీలో ఉండాలా.. వీడి వెళ్లాలా.. వెళ్తే ఏ పార్టీలోకి వెళ్ళాలి? ఇలా ఎన్నో చర్చలు వైసీపీ నేతల మధ్య సాగుతున్నాయి. వైసీపీపై వ్యతిరేకత ప్రజలలో స్ఫష్టంగా కనిపిస్తున్నది. గడప గడపకి కార్యక్రమం పుణ్యమా అని ఎమ్మెల్యేలే ప్రజల వ్యతిరేకతను కళ్ళతో చూశారు. టీడీపీ నేతల కార్యక్రమాలకు ప్రజల స్పందన కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉండడం శ్రేయస్కరం కాదని ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఒక అంచనాకి వచ్చేశారు. మరికొందరు అసలు వైసీపీ అధిష్టానమే టికెట్లు ఇవ్వదనే ఆలోచనతో కొత్త దారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు వైసీపీకి వెళ్ళినవారు, ఎన్నికల తర్వాత టీడీపీని వీడి వైసీపీతో కలిసిన వారు మరికొందరు కూడా పునరాలోచన చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఇద్దరు ముగ్గురు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. ఇలా మొత్తం మీద ఇప్పుడు వైసీపీలో పాత వారు, కొత్త వారు అందరూ పక్క చూపులు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. ఉత్తరాంధ్ర లో అయితే వైసీపీలో ఇలాంటి నేతలు అరడజను మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ వైసీపీకి గుడ్ బై చెప్పేయగా.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వైసీపీలో ఇమడలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు తెలుగుదేశంలో చేరిపోగా గణేష్ కూడా త్వరలోనే పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నది. గణేష్ టీడీపీకి పాత నాయకుడే, టీడీపీ నుండి గెలిచి వైసీపీలో చేరగా ఇప్పుడు మళ్ళీ సొంత గూటికి చేరనున్నట్లు కనిపిస్తుంది. ఇక, ఉత్తరాంధ్రలో వైసీపీకి వెన్ను దన్నుగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుండి ముగ్గురు నేతలు టీడీపీలో చేరబోతున్నట్లు విస్తృతంగా ప్రచారంలో ఉంది.న ఇప్పటికే ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఆ వార్తలకు ఇటు వైసీపీ నుంచి కానీ, అటు బొత్స కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరూ ఖండించలేదు.  దీంతో బొత్స కుటుంబ సభ్యులు పార్టీ మారడం ఖాయమేనని అనుకోవాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.  వీరితో పాటు ఉత్తరాంధ్ర నుండి శ్రీవాణి, అప్పల నాయుడు, అప్పల నరసయ్య, వీరభద్రస్వామి, గొల్ల బాబురావు, ఉమా శంకర్ గణేష్ పేర్లు కూడా వైసీపీని వీడుతారన్న వార్తలు వినవస్తున్నాయి.   ఇక కోస్తా జిల్లాలకు వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన గన్నవరం నుండి యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరడం దాదాపు ఖరారైంది. లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించే సమయానికి యార్లగడ్డ చేరిక పూర్తి కానుంది. వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టీడీపీకి టచ్ లో ఉన్నారు. వీరు కాకుండా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారితో సహా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే మరో ఏడెనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే.. ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ నుండి గెలిచి వైసీపీకి సానుభూతి పరుడిగా మారిపోయారు. ఇప్పటికే ఆయన కుమారుడిని వైసీపీలోకి పంపగా.. ఇప్పుడు కరణం బలరాం పునరాలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం ఉంది. మరోవైపు చీరాల నుండి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీ నుండి జారుకోవాలని చూస్తున్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుండి బహిష్కృతులయ్యారు. వీరు ముగ్గురూ కూడా ఇప్పటికే  తెలుగుదేశంకు జై కొట్టేశారు. వీరితో పాటు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నట్లు ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికలలో ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడలేని కష్టాలు వచ్చి పడ్డాయి. పోర్టులు, పరిశ్రమలు, విమానాశ్రయాలని ఆశపెట్టి ఒక్కటీ పూర్తి చేయలేకపోవడం, అభివృద్ధి అనే మాట వినిపించక ప్రజలు నేతలపై తిరగబడే పరిస్థితి కనిపిస్తుండడంతో అవకాశం ఉన్న వరకు వీలైనంత త్వరగా గుడ్ బై చెప్పేందుకు చాలామంది ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తాడికొండ శ్రీదేవి వ్యాఖ్యలపై వైసీపీ సైలెన్స్.. కారణమేంటి?

అమరావతి ఆవేదన పేరిట.. తాడికొండ నియోజకవర్గం రావెలలో రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. అయితే ఈ సభలో తాడికొండ ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత  ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. యాంకరింగ్ చేయడం.. ఈ సందర్బంగా ఆమె.. జగన్‌ ప్రభుత్వంపై విసిరిన పంచ్‌లు.. బ్రహ్మండంగా పేలాయి. అంతే కాదు గత ఎన్నికల ప్రచారంలో తాను.. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పానని... ఆ క్రమంలోనే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని.. కానీ జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల మూడు రాజధానుల ప్రకటన వెలువడిందని.. ఈ నేపథ్యంలో తనను క్షమించాలంటూ ఈ కార్యక్రమ వేదికపై నుంచి అమరావతి రైతులను ఆమె క్షమాపణలు కొరారు. అంతవరకు ఓకే కానీ.. అధికార జగన్ పార్టీ  బహిష్కృత ఎమ్మెల్యే, అదీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కూత వేటు దూరం నుంచే ఈ వ్యాఖ్యలు చేసినా.. వైసీపీ అగ్రనేతలు ఎవరూ ప్రెస్ మీట్ పెట్టడం కానీ.. ట్విట్టర్ వేదికగా స్పందించడం కానీ చేయక పోవడంపై పోలిటికల్ సర్కిల్స్ లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఇక జూలై 28న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ సారథ్యంలో జయహో బీసీ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ యాంకర్ ఉదయభాను అనుసంధాన కర్తగా వ్యవహరించారు. ఈ జయహో బీసీ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అంతే.. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా వెంటనే రంగంలోకి దిగి.. ట్రోలింగ్ చేయడం ప్రారంభించింది. అలాగే ఫ్యాన్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే  ట్విట్టర్‌ వేదికగా   ఈవెంట్ మేనేజమెంట్‌లో టీడీపీ అధినేతను మించిన వారెవరూ ఉండరు. ప్రతి ప్రోగ్రాంకు ఏదోఒక ‘అట్రాక్షన్’ జతచేసి జనాన్ని మొబిలైజ్ చేయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటే. చినబాబు యువగళం యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్‌ను హైదరాబాద్ నుంచి రప్పించడం చూశాం. ఇక నుంచి సినీ నటుల సందడి మొదలవుతుందని అర్థమవుతోంది అంటే పేర్కొన్నారు. అయితే ఒంగోలు సభలో ఉదయభాను యాంకరింగ్‌కి వెంటనే స్పందించిన విజయసాయి అండ్ కో.. రావెలలో నిర్వహించిన అమరావతి ఆవేదన సభపై  స్పందించకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయనే ఓ సందేహం  పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది. అయినా స్పందన జీవ లక్షణం.. ప్రతిస్పందన మనిషి లక్షణం. అలాంటి ప్రతీ స్పందన పుష్కలంగా ఉన్న.. జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు, కానీ జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు కానీ.. అంటే నాని బ్రదర్స్, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్‌, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ వగైరా వగైరాలు.. సొంత పార్టీ నుంచి బహిష్కృతురాలైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై మౌనం వహించడం,  అమెను  పల్లెత్తు మాట అనడానికి సాహసించకపోవడం వెనుక కారణం ఏమిటన్నదానిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.   మరోవైపు ఉండవల్లి శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు వేస్తే.. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి  కొన్ని నిజాలు వెల్లడించారు. పలు ఆరోపణలు చేశారు. ఆ తరువాత  నాలుగు నెలల అనంతరం మళ్లీ ఇప్పుడు లోకేష్ సభలో యాంకరింగ్ చేసి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తే   తమ పార్టీలోని పలువురు  నేతల బండారం బయటపడే అవకాశాలు ఉన్నాయని.. అదే జరిగితే ఆయా నేతల ఫ్యూజూలు ఎగిరిపోయే పరిస్థితి ఉందనే ఓ ప్రచారం  పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.  అయినా చెట్టుకు పువ్వు పూసినా.. కాయ కాసినా.. ఆ కాసిన కాయ నేల రాలినా..  ట్విట్టర్ వేదికగా ఆగమేఘాల మీద స్పందించే విజయసాయిరెడ్డి సైతం .. తాడికొండ శ్రీదేవి విషయంలో స్పందించకపోవడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో ఆశ్చర్యం   వ్యక్తమవుతోంది.  అయినా ప్రస్తుతం ఎన్నికల సీజన్..  ఏం మాట్లాడినా  ఆచి తూచి మాట్లాడాలి.. అలాగే అడుగులు వేయాలి.. అదే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై ఒంటి కాలిపై లెచే  సోకాల్డ్ ఈ వీరులంతా..  తాడికొండ శ్రీదేవి విషయంలో స్పందిస్తే.. వచ్చే ఎన్నికల్లో దళిత ఓట్లు హుళక్కి అయ్యే అవకాశాలు ఉన్నాయనే  భయంతోనే నోరు మెదపడం లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇంకోవైపు.. సీఎం జగన్ నివాసానికి కూత వేటు దూరంలో అమరావతి ఆవేదన కార్యక్రమం ఏర్పాటు చేసి.. ఆయన పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి చేత యాంకరింగ్ చేయించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సాహసాన్ని, ఎత్తుగడలను, వ్యూహాలను పలువురు అభినందిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

మంగళగిరిలో లోకేష్ కు అపూర్వ ఆదరణ

మంగళగిరిలో లోకేష్ ఎంట్రీయే అదిరిపోయింది. తొలి సారిగా అసెంబ్లీకి ఆయన పోటీ చేసింది మంగళగిరి నుంచే.. తొలి ప్రయత్నంలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి నుంచి ఆయన ఓ అజేయ శక్తిగా ఎదిగారనడానికి యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు ఆయనకు జనం నీరాజనాలు పలికిన తీరు కళ్లకు కట్టింది. లోకేష్ ను నియోజకవర్గానికి దూరం చేయడానికి జగన్ సర్కార్, ఆయన పార్టీ చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహం లేదు.  ఒటమి పెంచిన కసితో, పట్టుదలతో  ఆయన నియోజకవర్గంలో ప్రణాళికాబద్దంగా పని చేసుకుంటూ వచ్చారు. నిత్యం అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. ఆ ఎఫెక్ట్   పాదయాత్రలో  అడుగడుగునా కనిపించింది. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని, లోకేష్ ను బలహీనం చేసేందుకు  అధికార బలంతో నియోజకవర్గ స్థాయినేతల్ని జగన్ రెడ్డి  వైసీపీలో చేర్చుకున్నారు. నిత్యం వేధింపులతో తెలుగుదేశం శ్రేణులను నిర్వీర్యం చేయడానికి శతథా ప్రయత్నించారు. అయితే ఎంత బలంగా అణచివేయడానికి ప్రయత్నిస్తే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో లోకేష్ నాయకత్వంలోని తెలుగుదేశం శ్రేణులు నియోజకవర్గంలో బలం పుంజుకున్నాయి. దానికి తోడు లోకేష్ పని తీరు, పరిపక్వతతో కూడిన రాజకీయాలు ప్రజలలో ఆయన పట్ల అభిమానం పెరిగేలా చేశాయి. దీంతో లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టే సరికి మొత్తం నియోజకవర్గం అంతా ఆయన వెంట నడిచిందా అన్నట్లుగా జనం పోటెత్తారు.  వీరికితోడు గుంటూరు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన వారు కూడా ఉత్సాహంగా లోకేష్ పాదయాత్రలో ఆయనతో అడుగుకలిపి నడిచారు. ఆయన పాదయాత్రకు పోటెత్తిన జనం అసంఖ్యాకం అనడానికి మూడు నాలుగు కిలోమీటర్ల నడకకే ఆరున్నర గంటలకు పైగా సమయం పట్టడాన్ని తెలుస్తున్నది.  పాదయాత్ర ప్రారంభానికి ముందు వరకూ లోకేష్ మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగానే తన కార్యకలాపాలన్నీ సాగించారు. 2019 ఎన్నికలలో ఎక్కడ వైసీపీ పై చేయి సాధించిందో అక్కడే తనపై అభిమానం వెల్లువెత్తేలా వ్యూహాత్మకంగా పని చేశారు. క్షేత్ర స్థాయిలో నియోజకవర్గ సమస్యలను గుర్తించి, అడ్రస్ చేసి వాటి పరిష్కారం కోసం పని చేశారు. అదే సమయంలో గత ఎన్నికలలో  మంగళగిరి నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నిష్క్రియాపరత్వం వల్ల ప్రజలకు దూరం అయ్యారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకున్నది లేదు. దీంతో ప్రజలలో ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దానికి తోడు జగన్ సర్కార్ విధానాల పట్ల సహజంగానే పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు వెరసి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పట్ల అభిమానం, ఆయన తమకు అండగా ఉంటాడన్న విశ్వాసం అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది.  మంగళగిరిలో లోకేష్ జోరు కు.. ఎలా అడ్డుకట్ట వేయాలో ఐ ప్యాక్ టీమ్‌కూ అర్థం కావడం లేదు.   మంచి చేసి.. ప్రజల అభిమానాన్ని గెలుచుకోవాలన్న ధ్యేయంతో లోకేష్ వేసిన అడుగులు ఇప్పడు ఆయనకు జనం బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తెలంగాణలో ప్రియాంక.. మెదక్ నుంచేనా పోటీ

 హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ, ఈ  ఏడాది చివరిలో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్  అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు  వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రణాళికా బద్ధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ లో వర్గ విభేదాలు సహజమే అయినా.. వీటి ధాటి, ప్రభావం ఏ ఇతర రాష్ట్రంలో కంటే తెలంగాణలో అధికం. ఈ రాష్ట్రంలో నేతలంతా తాము ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న స్థాయిలో బిల్డప్ ఇచ్చుకుంటుంటారు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ  ప్రచార బాధ్యతలు పార్టీ  ప్రధాన కార్యదర్శి  ప్రియాంక వాద్రా గాంధీకి   అప్పగించింది. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలన్నీ ప్రియాంకగాంధీకే అప్పగించారని కూడా పార్టీలో గట్టిగా ప్రచారం అవుతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రియాంక రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీచేస్తారని, పార్టీలో చర్చ జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతుంటే.. పరిశీలకులు కూడా ఆ అవకాశాలే అధికంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. గతంలో మెదక్ లోక్ సభ స్థానం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మెదక్ లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. అది సెంటిమెంట్ పరంగా కూడా కాంగ్రెస్ కు బాగా కలిసివస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ప్రియాంకా గాంధీ చాలా కాలంగా..  తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక  దృష్టి పెట్టారు. ఒక దశలో,  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్య మాటల యుద్ధం గీతలు దాటి న సమయంలో ప్రియాంక జోక్యంతోనే వారి మధ్య విభేదాలు, వివాదాలు సర్దుమణిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  మునుగోడు ఉప ఎన్నికల సమయంలో, కోమటి రెడ్డి వెంకట రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్  చేసిన  వ్యాఖ్యలు ...ఆపై అటు నుంచి ఇటు నుంచి అటు పేలిన మాటల తూటాల నేపధ్యంలో, తమ్ముడు రాజగోపాల రెడ్డి బాటలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు.  అయితే,  ప్రియాంక  గాంధీ జోక్యం చేసుకుని కోమటి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతనే ఆయన మెత్తబడి, ఎన్నికల సమయంలో వివాదాలకు దూరంగా   విదేశాలకు వెళ్ళారని అంటారు. దీనిలో నిజానిజాలేమిటన్నది పక్కన పెడితే.. కోమటి రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రియాంకతో ప్రత్యేకంగా భేటీ  కావడం నిజం. ప్రియాంక గాంధీతో భేటీ తరువాతనే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు పూర్తి అబద్ధాలనీ, తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాడినేనని విస్పష్టంగా చెప్పారు. అదీ వాస్తవమే.  అందుకే  కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీలో కొనసాగడానికి ప్రియాంక  గాంధీచూపిన చొరవే కారణమని పార్టీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.   అలాగే  రేవంత్ రెడ్డికి అనుకూలం అనే ముద్ర పడిన  మాణిక్యం ఠాగూర్‌ ను పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించి, మాణిక్‌రావ్‌ ఠాక్రే కు బాధ్యతలు అప్పగించడంలోనూ ప్రియాంకా గాంధీ ప్రమేయమే ఎక్కువగా ఉందని చెబుతారు. ఇవన్నీ ఒకెత్తైతే..  ప్రియాంక వాద్రాకు ఎన్నికల బరిలో దిగి  పార్లమెంట్ లో అడుగుపెట్టాలనే కోరిక బలంగా ఉంది.  2019 ఎన్నికల్లోనే ఆమె యూపీలో వారాణాసి నుంచి ప్రధాని మోడీకి ప్రత్యర్థిగా రంగంలోకి దిగేందుకు సై అన్నారు. అయితే అప్పట్లో కారణాలేమైనా ఆమె పోటీ చేయలేదు. ఇందుకు రాహుల్ గాంధీ ఆమె మోడీకి ప్రత్యర్థిగా బరిలోకి దిగడం పట్ల సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీకి ప్రత్యర్థిగా దిగితే ప్రియాంక ఓటమిని ఎదుర్కొనే అవకాశాలే  ఎక్కువ ఉన్నాయని అప్పట్లో రాహుల్ భావించడమే అందుకు కారణమని అంటారు.   ఆ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రియాంక ప్రచార బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ  చిత్తుగా ఓడిపోయిన నేపధ్యంలో  ప్రియాంక యూపీ మీద ఆశలు వదులుకున్నారని, అప్పటి నుంచే ఆమె పార్లమెంట్ ఎంట్రీకి తెలంగాణ అయితే సరైన వేదిక అవుతుందని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అందుకే స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా, ఉభయ తారకంగా ప్రియాంకకు తెలంగాణ బాధ్యతలను పార్టీ హైకమాండ్ అప్పగించిందని చెబుతున్నారు. గతంలో ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్  ప్రియాంక పోటీకి దిగి విజయం సాధించేందుకు సరైన వేదిక అని పార్టీ హైకమాండ్ భావిస్తోందంటున్నారు.   అందుకే ఇటీవల కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడ నుంచి నేరుగా ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించారు. త్వరలో మరోసారి కూడా రాష్ట్ర పర్యటనకు రానున్నారు.   మే నెల 9న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని, నేరుగా  హైదరాబాద్‌లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో ఆమె పాల్గొని కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.  జూన్ చివరివారం లేదా జులై మొదటివారంలో ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు అప్పట్లో షెడ్యూల్ ఖరారైనా.. అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది.  అమె త్వరలో తెలంగాణలో పర్యటించి మెదక్ జిల్లాలో భారీ బహిరంగ లో పాల్గొంటారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ఆ సభలోనే ప్రియాంక బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.  

అంబటి బ్రో.. వ్యూహం కనిపించడం లేదా?

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన గతం వైభవమే కానీ ఇప్పుడు ఆయన సినిమాల కంటే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ రేటుకు అమ్ముడుపోతున్నాయి. అప్పుడప్పుడు పోర్న్ స్టార్స్ ను తీసుకోచ్చి బూతు బొమ్మలు తీసినా ఆయన మొహం చూసేందుకు కూడా ప్రేక్షకులు ఇష్టపడం లేదు.  అయితే ఆయన ఒకప్పటి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు మీడియా చానెళ్లు తరచూ ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంటాయి. ఆ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పే చొప్పదండు కబుర్లు వ్యూస్ ను తెచ్చిపెడుతుంటాయంతే. అంతకు మించి సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉనికి కానీ ప్రమేయం కానీ అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో  ఆయనకి ఓ సినీ  బేరం తగిలింది. అదే ‘వ్యూహం’. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీ కోసం రెండు సినిమాలు చేసి పెట్టిన వర్మ ఈసారి కూడా అదే ప్రణాళికలో ‘వ్యూహం’ అనే సినిమా తీసిపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్  రిలీజ్ అయ్యింది. యధావిధిగా ఈ టీజర్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబును నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు.  ఆ తరువాత  ఇప్పుడు ఇదే ‘వ్యూహం’ నుండి రెండో  టీజర్ కూడా విడుదల అయ్యింది. ఇందులో కూడా అంతే. జగన్ కు అనుకూలంగానే ఈ టీజర్ కూడా కట్ చేశారు. మొదటి టీజర్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం నుండి మొదలు పెడితే.. రెండో టీజర్ లో ప్రజారాజ్యం విలీనం, రాష్ట్ర విభజన అంశాలను చూపించారు. ఇందులో కూడా చంద్రబాబు పాత్రను నెగటివ్ గానే చూపించగా.. సోనియా గాంధీ పాత్రను, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రలను కూడా చూపించారు. రాష్ట్రాన్ని సోనియా గాంధీ చపాతీని రెండు ముక్కలు చేసినట్లు విడదీసినట్లు చూపించగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా అందరి పాత్రలను చూపించారు. ఈ టీజర్ లో సోనియా గాంధీ, రోశయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, చంద్రబాబు నాయుడు ఇలా అందరినీ బ్లేమ్ చేసి.. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉత్తముడు అన్నట్లు చూపించనున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.  మరో పది నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్ జగన్ కి పొలిటికల్  మైలేజ్  కోసమే, మిగతా అందరినీ తప్పుడు వ్యక్తులుగా చూపించేందుకు  ‘వ్యూహం’ తెరకెక్కింది. ఈ సినిమా తెరకెక్కించడానికి ముందే వర్మ తాడేపల్లి వెళ్లి మరీ సీఎం జగన్ ను కలవగా.. ఈ సినిమా షూటింగ్ కోసమే ఏపీ ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మొన్నీమధ్య ఒక రోజు విజయవాడ బ్యారేజీపై ఈ సినిమా షూటింగ్ కోసం కొన్ని గంటలపాటు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఏది ఏమైతేనేం సినిమా అయితే జగన్ కోసమే తెరకెక్కిస్తున్నారన్నది స్పష్టంగా తెలిసిందే. ఇక, ఈ సినిమా విడుదల అవుతుందా? విడుదలైతే ఫలితం ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక పోతే ఈ రెండో టీజర్ పై కూడా సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తున్నది. వర్మ ఈ స్థాయికి దిగజారి అమ్ముడుపోతాడని ఊహించలేదని ఆయన అభిమానులే కామెంట్లు చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కార్యకర్తలైతే చెప్పాల్సిన పనిలేదు. పే టీమ్ కూలీలూ.. వర్మ రెండూ ఒక్కటేనని విమర్శలతో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక  ఈ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమా బ్రో లో మంత్రి అంబటి రాంబాబును పేరడీ చేశారని తెగ గగ్గోలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ అంశాన్ని అంబటి వదలడం లేదు. ప్రజా సమస్యలను కూడా గాలికి వదిలేసిన అంబటి బ్రో సినిమాపై గంటలు తరబడి మీడియా సమావేశాలు నిర్వహించారు. ఎప్పుడో ఆయన సంక్రాంతి సంబరాల్లో చేసిన డాన్స్ మాదిరి సినిమాలో పృథ్వీ వేసాడని గగ్గోలు పెడుతున్న అంబటికి ఇప్పుడు వ్యూహం సినిమా టీజర్లు కనబడడం లేదా అని నెటిజన్లు  ఏకిపారేస్తున్నారు.  నీదో కాదో తెలియని డాన్సుకు అన్ని రోజులు మాట్లాడిన అంబటికి ఇంత నీచంగా పాత్రలు, కల్పిత కథతో కించపరిచే విధంగా తెరకెక్కిన సినిమాలు కంటికి కనిపించడం లేదా అని  ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ఉన్నా మంత్రి అంబటి రాంబాబు ఇప్పుడు మీడియాను పిలిచి వ్యూహం టీజర్ పై మాట్లాడాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.

తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా రెడీ?

చూస్తూ ఉండగానే ఈ ఏడాది కాలంలో రెండు భాగాలు పూర్తయి మరో భాగమే మిగిలి ఉంది. ఆగస్టు కూడా పూర్తవుతుండగా.. ఇక ఏడాదిలో మిగిలింది మరో నాలుగు నెలలే. ఈ నాలుగు నెలలు దాటితే ఏ క్షణమైనా ఏపీలో ఎన్నికల నగారా మోగడం ఖాయం. ఏడాది మారిందంటే ఎన్నికల కౌండ్ డౌన్ మొదలైనట్లే భావించాలి. అందుకే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు అభ్యర్థుల పనితీరు, సర్వేల ఫలితాల మీద దృష్టి పెట్టాయి. అధికార వైసీపీని తీసుకుంటే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం, మరోవైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలతో రహస్య సర్వే, మరో రెండు ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వేల ఫలితాల ఆధారంగా లెక్కలేసుకుంటుంది. ఇప్పటికే వచ్చిన రెండు విడతల ఫలితాల ఆధారంగా కొందరికి క్లాసులు కూడా పీకిన జగన్.. త్వరలో రాబోతున్న తుది ఫలితాల ఆధారంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.    అభ్యర్థుల ఎంపిక  విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం   దూకుడుగా కనిపిస్తున్నది. ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ నేతలలో బయటపడుతున్న అసంతృప్తి, టీడీపీ నేతలు ఎక్కడకి వెళ్లినా లభిస్తున్న ప్రజాదరణ.     తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలకు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు జనం పెద్ద సంఖ్యలో హాజరౌతుండటం, వారి ప్రసంగాలకు విశేష స్పందన లభిస్తుండటం తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. నో డౌట్ గెలుపు మనదే అన్నట్లు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలు మెచ్చే అభ్యర్థులు,  విజయం సాధించే అభ్యర్థుల కోసం ముమ్మర వేట ప్రారంభించారు. టీడీపీ కూడా రెండు మూడు రకాల సర్వేలు చేయిస్తున్నది. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం చేపట్టిన సర్వేతో పాటు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన వారితో మరో సర్వే చేయించుకుంటున్నారు. ఇవి రెండూ కాకుండా మరో ప్రైవేట్ సంస్థ కూడా టీడీపీ కోసం సర్వే చేపడుతున్నది. తాజాగా తొలి విడత సర్వే నివేదికలు చంద్రబాబు చేతికి అందాయి. ఆ సర్వే ఫలితాల ఆధారంగా మొదటి విడత జాబితా సిద్ధం అవుతున్నది.  ఈ తొలి జాబితాలో ఎలాంటి వివాదాస్పద వ్యవహారాలు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వారి పని తీరుపై సర్వేల ఫలితాల ఆధారంగా ఈ జాబితా ఉంటుందంటున్నారు.  ఇక సిట్టింగులలో కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్న నేతలకు క్లాస్ పీకనున్న చంద్రబాబు, రెండో జాబితా సమయానికి కూడా మార్పు లేకపోతే టికెట్లు కష్టమేనని వారికి తెగేసి చెప్పనున్నారని అంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొత్తం 50 మందితో టీడీపీ తొలి జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. అది కూడా దసరా నాటికే ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. ముందుగా తొలి జాబితా  ప్రకటించి వైసీపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో తెలుగుదేశం   ఉన్నట్లు తెలుస్తున్నది.  అయితే, టీడీపీ అభ్యర్థుల జాబితా అనగానే ముందుగా గుర్తొచ్చేది పొత్తుల పరిస్థితి ఏంటి అన్నదే. అన్నీ కుదిరితే టీడీపీ-జనసేన-బీజేపీ.. లేకపోతే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతానికి అయితే, రెండు వైపుల నుండి పొత్తుల వ్యవహారంపై సస్పెన్సే కొనసాగుతోంది. అయితే ఎన్నికల సమయానికి పొత్తులు పొడిచే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈక్రమంలోనే తెలుగుదేశం తొలి జాబితా విడుదల సమయానికి ఈ పొత్తుల వ్యవహారం తేలుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  మరోవైపు పొత్తులు ఖరారు కాకుండానే తాను తప్పక పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతోనే తెలుగుదేశం తొలి జాబితా విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జనసేనతో పొత్తు అంటే కొన్ని స్థానాలను తెలుగుదేశం  వదులుకోవాలి. ఇప్పటికే జనసేన కొన్ని స్థానాలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించగా.. మరికొన్నింటికిపై ఖర్చీఫ్ వేసి ఉంది. ఈ క్రమంలో ఇవి కాకుండా సేఫ్ సైడ్ ఉన్న స్థానాలను   ప్రకటించి.. ఇటు వైసీపీ, అటు జనసేనలపై ఒత్తిడి పెంచే అవకాశాన్ని కూడా తెలుగుదేశం పరిశీలిస్తున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం తొలి జాబితాలో ఉండే పేర్లేవి, పొత్తుల పరిస్థితి ఏమిటి?  అన్న ఆసక్తి రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. చూడాలి మరి తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన తరువాతైనా పొత్తులపై క్లారిటీ వస్తుందేమో.