నివురు గప్పిన నిప్పులా పుంగనూరు.. అసలేం జరుగుతోంది?
posted on Aug 10, 2023 @ 1:31PM
ఉన్నట్లుండి ఇక్కడ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మాయమవుతున్నారు. రాత్రికి రాత్రి టీడీపీ నేతల జాడ కనిపించకుండా పోతున్నది. వారి కుటుంబ సభ్యులేమో పోలీసులమంటూ వచ్చిన వారు మా వాళ్ళని తీసుకెళ్లారని చెప్తున్నారు. పోలీసులేమో వారిని అదుపులోకి తీసుకున్నట్లు, అరెస్ట్ చేసినట్లు ఎక్కడా పేర్కొనడం లేదు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్థానిక వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా తెలుగుదేశం నేతలు, వారి అనుచరులు, కార్యకర్తలు కనిపించకుండా పోతున్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయనను అడ్డుకొనేందుకు వైసీపీ వర్గం ప్రయత్నించడంతో తెలుగుదేశం శ్రేణులుతిరగబడ్డాయి. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటికే తెలుగు అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులతో పాటు ఏడుగురిపై కేసులు నమోదు చేయగా.. స్థానిక తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మొత్తం 74 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, పుంగనూరులో దాదాపు 150 మందికి పైగా తెలుగుదేశం సానుభూతిపరుల ఆచూకీ కనిపించడం లేదట. ఇందులో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, పలమనేరు ఇంచార్జ్ చల్లా బాబు లాంటి బడా నేతలు కూడా ఉన్నారు. వీరంతా అరెస్టుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండగా.. వీరి కుటుంబ సభ్యులు మాత్రం తమ వాళ్ళని పోలీసులే తీసుకెళ్లి రహస్య ప్రాంతంలో ఉంచి చిత్రహింసలు పెడుతూ విచారిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పలమనేరు ఇన్ చార్జ్ చల్లా బాబులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని.. అప్పటి వరకూ వారిని రహస్య ప్రాంతాలలోనే ఉంచనున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.
నిజానికి పుంగనూరు అల్లర్ల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు. దీంతో ఆ రాత్రికే ఇక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. కానీ మరుసటి రోజు నుండి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తుండడంతో మళ్ళీ ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సుమారు 200 మంది పోలీసులు ఇంటింటినీ జల్లెడ పడుతూ తెలుగుదేశం సానుభూతి పరులను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఘర్షణ సమయంలో పోలీసులు గాయపడడం, పోలీసు వాహనాలు ధ్వంసం కావడంతో పోలీసులు కక్షకట్టి తెలుగుదేశం కార్యకర్తలను ఈడ్చుకెళ్తున్నారని ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే అరెస్ట్ చేసిన 74 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయగా.. మరో వంద మందికి పైగా కార్యకర్తలు, నేతలను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు అక్రమ అరెస్టులు, మరోవైపు వందల మంది పోలీసులు ఇళ్లపై సోదాలు చేస్తుండడంతో పుంగనూరు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. తమ వారిని పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో.. ఏం చేస్తున్నారో కూడా అర్ధంకాని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలు ఆవేదన చేస్తుండగా.. అసలు తమ వాళ్ళని ఎక్కడకి తీసుకెళ్లారో చెప్పాలని తెలుగుదేశం నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల వైఖరి ఇలాగే కొనసాగితే మరోమారు ఇక్కడ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవాలని వైసీపీ సానుభూతి పరులు ప్రయత్నించినా, చంద్రబాబుపై రాళ్ల దాడికి దిగినా వైసీపీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమపై పోలీసులు జులుం చూపడాన్ని పుంగనూరు తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ క్రమంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం లేదని, పోలీసుల చర్యలతోనే మరోమారు ఇక్కడ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది.