వైసీపీలో ఐ-ప్యాక్ సర్వే లీక్ టెన్షన్!

వైసీపీ ప్రభుత్వంపై ఏపీలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని   రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రతిపక్ష నేతల సభలు, యాత్రలకు జనం భారీగా తరలి వస్తుంటే.. జగన్ సహా వైసీపీ నేతలు ఎక్కడా జనంలో తిరిగు పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే సభలు కూడా వెలవెలబోతున్నాయి. వచ్చిన ఆ కొద్ది మందీ కూడా ముఖ్యమంత్రి ప్రసంగం మొదలెట్టగానే లేచి వెళ్లి పోతున్నారు. ఇక గడపగడపకూ అంటూనో, ఏదో కార్యక్రమంలో భాగంగానో ప్రజలలోకి వెళ్లిన అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై  ఎక్కడిక్కడ  జనం తిరగడడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఇది ఏపీలో జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు దర్పణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా  వైసీపీ కూడా ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేలు.. ఎంపీలపై ప్రజల అభిప్రాయంపై విస్తృతంగా సర్వేలు నిర్వహించుకుంటోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ తో పాటు మరో రెండు ప్రైవేట్ సంస్థలతో కూడా వైసీపీ సర్వేలు నిర్వహిస్తోందిది. ఈ సర్వే రిపోర్టుల తొలి విడత ఫలితాల ఆధారంగా గతంలో తాడేపల్లిలోని తన వివాసంలో  సీఎం జగన్   పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక త్వరలోనే ఈ సర్వేల పూర్తిస్థాయి ఫలితాలు జగన్ చేతికి అందనున్నాయని, ఆ ఫలితాల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ లోగా టైమ్స్ నౌ సర్వే ఒకటి బయటకు వచ్చింది. అయితే ఆ సర్వే ఫలితం వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉండటంతో వైసీపీ నాయకులే ఆ సర్వేను నమ్మడం లేదు. పరిగణనలోనికి తీసుకోవడం లేదు. అయితే,  తాజాగా  ఐ -ప్యాక్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన చార్ట్ ను బట్టి చూస్తే వైసీపీ నేతల్లో విజయావకాశాలు తగ్గిపోతున్నాయని ఐ ప్యాక్ తేల్చేసినట్లే కనిపిస్తోంది. కేవలం ఎంపీల పనితీరుపై ఐప్యాక్ ఈ రిపోర్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సర్వే ఫలితాలు నిజమా అబద్దమా అన్నది తేల్చలేని పరిస్థితి కానీ.. ఇప్పుడు ఈ రిపోర్టు ఫలితాలు మాత్రం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. గత ఎన్నికలలో వైసీపీ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు గాను 22 ఎంపీ స్థానాలను దక్కించుకోగా.. ఇందులో ఐదారుగురు ఈసారి పార్లమెంటుకు పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఐ-ప్యాక్ సర్వే రిపోర్టు ప్రకారం గత ఎన్నికలలో గెలిచిన 22 మందిలో 16 మందికి తిరిగి గెలిచే అవకాశం లేదని తెలుస్తున్నది. అమలాపురం, అనంతపూర్, అనకాపల్లి, బాపట్ల, ఏలూరు, చిత్తూరు, గుంటూరు, హిందూపురం, కాకినాడ, మచిలీపట్టణం, నరసాపురం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం స్థానాలలో వైసీపీకి గెలిచే అవకాశాలు లేవని ఐప్యాక్ సర్వే తేల్చేసింది. ఈ 16 పార్లమెంట్ స్థానాలలో కేవలం 2 నుండి మూడు స్థానాలలో ఏదైనా అవకాశం ఉంటే పుంజుకునే అవకాశం ఉందని.. అదే సమయంలో ఇవి కాకుండా మరో 6 స్థానాలలో తీవ్ర పోటీ ఉంటుందని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. కర్నూల్, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి స్థానాలలో పోటా పోటీ ఉండే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితం చెబుతున్నది. కడప, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాలలో మాత్రమే వైసీపీకి ఒకింత మొగ్గు ఉందన్నది ఈ సర్వే ఫలితం. ఇక, వైసీపీ గెలుస్తుందని భావించిన మూడు స్థానాలలో కూడా నాలుగు శాతం లీడ్ మాత్రమే కనిపిస్తుండగా.. పోటా పోటీ ఉంటుందని చెప్తున్న స్థానాలలో ఎక్కువ శాతం టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు కూడా చూపించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయా స్థానాలలో పది నుండి 15 శాతం ఓట్లను తన వైపుకు తిప్పుకోనున్నట్లు సర్వేలో చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా 25 పార్లమెంట్ స్థానాలలో కూడా 40 నుండి 53 శాతం ఓటింగ్ దక్కించుకోనున్నట్లు పేర్కొనగా.. 45 శాతంపైన ఓట్లు దక్కించుకున్న ప్రతి స్థానంలో విజయకేతనం ఎగరేయనున్నట్లు చూపించారు. కాగా, ఈ సర్వే ఫలితం నిజమా అబద్దమా అన్నది పక్కన పెడితే.. ఈ సర్వే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం మాత్రం ఖాయం. ఒకవేళ ఈ సర్వే నిజమైతే.. దీనిని బట్టి తిప్పి తిప్పి కొట్టినా 35 నుండి 50 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కుతాయి. ఒకవేళ ఈ సర్వే ఫేక్ అని కొట్టిపారేసినా అసలే అసంతృప్తితో ఉన్న ప్రజలపై ఈ ఫలితాలు మరింత ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో ఎటు తిరిగి ఈ ఫలితాలతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైనట్లే కనిపిస్తుంది.

బెజవాడలోకి లోకేష్ గ్రాండ్ ఎంట్రీ.. సెగలు రేపుతున్న రాజకీయం!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లోకి ప్రవేశించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడలోకి ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజీ మధ్యలో నారా లోకేష్‌కి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటు ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలతో లోకేష్‌ని సత్కరించారు. ఆశేష జనవాహిని మధ్య లోకేష్ విజయవాడలో అడుగుపెట్టారు. ప్రకాశం బ్యారేజీ రోడ్లన్నీ పసుపు సముద్రంలా మారిపోయాయి. బంతి పూల జనవనం కళ్లకు కట్టింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఎక్కడ జూసినా జనం.   యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు. బాణాసంచా మోతలు, నినాదాలతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు హోరెత్తాయి. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేతను అభిమానులు ముంచెత్తారు. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న దగ్గరుండి ఈ ఏర్పాట్లు చేశారు. విజయవాడలో లోకేశ్ పాదయాత్రను గ్రాండ్ సక్సెస్‌ చేసే బాధ్యతను చంద్రబాబు ప్రత్యేకంగా కేశినేని చిన్నికి అప్పగించగా చిన్ని తన స్టామినాను నిరూపించుకొనేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, యువగళం పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో లోకేష్ పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే, ఏం చేస్తుందనే హామీలతో ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించగా.. అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తానని హామీ ఇస్తూ నారా లోకేష్ శిలాఫలకం ఏర్పాటు చేశారు. అంతే కాదు, ఇళ్లు లేని నిరుపేదలకు 20 వేల ఇళ్లు నిర్మిస్తాననే హామీతో లోకేశ్‌ శిలాఫలకం ఏర్పాటు చేశారు. మొత్తంగా గుంటూరు జిల్లాను వీడి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన లొకేషన్ కు అపూర్వ స్వాగతం లభించింది.  కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర మొత్తం ఆరు రోజుల పాటు జరగనుంది. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలను లోకేష్ కవర్ చేయనున్నారు. విజయవాడ సిటీలో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర చేయనుండగా.. 22వ తేదీన గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు కృత నిశ్చయంతో ఉన్నారు. కాగా  ఇదే సమయంలో ప్రత్యర్థి వైసీపీ నుండి వ్యతిరేకతలపై కూడా ఓ కన్నేసినట్లు కనిపిస్తుంది. యువగళానికి వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని, లోకేశ్ పాదయాత్రలో అలజడికి వైసీపీ ప్లాన్ చేసిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇప్పటికే ఆరోపించారు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా దేవినేని అవినాశ్ ఇంటికి వెళ్లి చర్చించడం ఇందులో భాగమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గన్నవరం సభలో అల్లర్లు సృష్టించడానికే జగన్ అవినాష్ ఇంటికి వెళ్లారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. మరోవైపు గన్నవరంలో  తెలుగుదేశం సభ నిర్వహిస్తున్న క్రమంలో ఇక్కడ  రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే యార్లగడ్డ వెంకటరావు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తాను తెలుగుదేశంలో చేరనున్నట్లు ప్రకటించారు.   22న గన్నవరంలో లోకేశ్‌ బహిరంగ సభ జరిగే రోజునే యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇంకోవైపు వైసీపీ ఇప్పటికే ఇక్కడ ముగ్గురికి టికెట్లను ఖరారు చేసింది. విజయవాడలోని విజయవాడ తూర్పు దేవినేని అవినాశ్‌కు, విజయవాడ వెస్ట్‌ వెల్లంపల్లి శ్రీనివాస్‌కు, విజయవాడ సెంట్రల్‌ మల్లాది విష్ణుకు ఫిక్స్ చేసింది అధిష్టానం. ఇదే క్రమంలో ఇన్నాళ్లు లేనిది ఇప్పటికిప్పుడు   ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే సలహాదారు సజ్జల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టారు. లోకేష్ యాత్ర జిల్లాలోకి ప్రవేశించకముందే ఇలా ఉంటే.. ఈ యాత్ర ఎలా సాగనుంది.. యాత్ర తర్వాత ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏవిధంగా మారనున్నాయన్నది ఆసక్తిగా కనిపిస్తుంది.

పంచాయతీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం

వైనాట్ 175 అని ముఖ్యమంత్రి జగన్ అంటుంటే.. వైనాట్ డిఫీట్ అని జనం అంటున్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అందులోనూ స్థానిక ఉప ఎన్నికలలో అధికార పార్టీ విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుంది. కానీ ఏపీలో జనం జగన్ సర్కార్ పై ఎంత ఆగ్రహంతో ఉన్నారో తాజాగా జరిగిన పంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూపాయి. ఇప్పటి వరకూ విశ్లేషకులు, పరిశీలకులు, రాజకీయ పండితులు కూడా పట్టణ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం వైసీపీ పట్టు ఒకింత బలంగా ఉందని చెబుతూ వచ్చారు. అయితే వారి అంచనా తప్పని శనివారం (ఆగస్టు 18)న జరిగిన పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నిక తేల్చి చెప్పేసింది. జగన్ సర్కార్ పై జనాగ్రహం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా ఒకేలా ఉందని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి.   స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తర్వాత చనిపోయిన వారి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ కోల్పోయిన సర్పంచ్, వార్డు స భ్యుల స్థానాలన్నీ గతంలో వైసీపీ అభ్యర్థులు గెలిచిన స్థానాలే.  కానీ వాటిలో సగానికి పైగా స్థానాలలో వైసీపీ పరాజయం పాలైంది.   రాష్ట్రంలో 59 పంచాయతీల సర్పంచ్ లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ 28 పంచాయతీలను గెల్చుకుంది. వైఎస్ఆర్‌సీపీ 17 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 12 చోట్ల విజయం సాధించారు. జనసేన రెండు గ్రామాల్లో తమ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిచారు. ఇక పంచాయతీ వార్డుల్లో 485 వార్డులకు  ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకగ్రీవాలతో సహా తెలుగుదశం మొత్తం 189 వార్డుల్లో విజయం సాధించింది. వైసీపీ 177 స్థానాల్లో ఇండిపెండెంట్లు 100 స్థానాల్లో.. జనసేన, బీజేపీ అభ్యర్థులు 19 స్థానాల్లో విజయం సాధించారు. వైసీపీకి కంచుకోటల్లాంటి   గ్రామాల్లో సైతం  టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారంటే ఆ పార్టీ కోటలు ఎలా కూలిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.  స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న అముదాల వలసలో బొప్పడం గ్రామ పంచాయతీని వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అది వైసీపీ సిట్టింగ్ స్థానమే. కానీ ఇప్పుడు అక్కడ టీడీపీ విజయం సాధించింది. గత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 80శాతానికిపైగా సీట్లను కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక బయటపడేలా పంచాయితీ సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాలు వచ్చాయి.   ఇవి ఉపఎన్నికలు కాబట్టి అనివార్యంగా నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటికే కాకినాడ కార్పొరేషన్ తో పాటు చాలా మున్సిపాలిటీల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి.ప్రభుత్వం వాటి జోలికి వెళ్లడం లేదు. టైమ్స్ నౌ వంటి సర్వేలను చూపి  తమకు ప్రజాదరణ తగ్గలేదంటూ చంకలు గుద్దుకుంటున్న వైసీపీకి ఈ పంచాయతీ ఉప ఎన్నికలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టణ ఓటర్లు జగన్ సర్కార్ ను ఛీ కొట్టారని తేలిపోయింది. పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలలో తెలుగుదేశం విజయ కేతనం ఎగురవేసింది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కూడా తమ పార్టీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం నిర్ద్వంద్వంగా రుజువు చేసింది. ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే పల్లెలు కూడా ఫ్యాన్ గాలిని వద్దు పొమ్మంటున్నాయని తేలిపోయిది.  ఈ ఉప ఎన్నికలలో వైసీపీ ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో.. పోలీసులు ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో ఏలూరు జిల్లా వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి జరిగిన పోలింగ్ కళ్లకు కట్టింది. తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వీరమ్మకుంటకు రానివ్వలేదు. రౌడీషీటర్ వి నీకు ఇక్కడ ప్రవేశం లేదంటూ వెనక్కు పంపారు. అదే సమయంలో వైసీపీ మూకలు యథేచ్ఛగా వీరమ్మకుంట పోలింగ్ స్టేషన్ వద్ద వీరంగం చేశారు. ఇక పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలిలా ఉన్నాయి.  మొత్తం 485 వార్డు సభ్యుల ఎ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే వాటిలో   తెలుగుదేశం 189 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. వైసీపీ విజయం సాధించిన స్థానాలు 177 కాగా స్వతంత్రులు 100 వార్డులలో గెలుపొందారు. జనసేన, బీజేపీ కూటమి 19 వార్డులను కైవశం చేసుకుంది. 59 పంచాయతీలుకు ఎన్నికలు జరిగితే వాటిలో తెలుగుదేశం 28 స్థానాలలో గెలుపొందింది. వైసీపీ 17 స్థానాలలో, జనసేన, బీజేపీ కూటమి 2 స్థానాలలో విజయం సాధించగా ఇతరులు 12 స్థానాలను గులుచుకున్నారు.   

జయప్రద  మహా ఎంట్రీ.. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ ?

 అలనాటి హీరోయిన్ జయప్రద బిఆర్ఎస్ పార్టీలో చేరనుందా?  ముఖ్యమంత్రి కెసీఆర్ ఆహ్వానం మేరకు త్వరలో ఆమె బిఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆమెను తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేయించకుండా మహరాష్ట్ర నుంచి పోటీ చేయించాలని కెసీఆర్ యోచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించే ఉద్దేశ్యంతో ఉన్న కెసీఆర్ మహరాష్ట్ర రాజకీయాల్లో ఫోకస్ పెట్టారు. సినీ గ్లామర్ ఉన్న నటీ నటులు ఇప్పటి వరకు బిఆర్ఎస్ లో లేరు. జయప్రద చేరికతో ఆ లోటును కొంత వరకు  ఆ పార్టీ పూడ్చవచ్చు.  జయ ప్రద 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొంత కాలం ఆమె టీడీపీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా, తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొనసాగారు. తర్వాత ఆమె సమాజ్ వాది పార్టీలో చేరారు. 2004,2009 ఎన్నికల్లో ఆమె సమాజ్ వాది పార్టీ తరపున రాంపూర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అమర్ సింగ్, జయప్రదలను సమాజ్ వాది పార్టీ బహిష్కరించింది. తన రాజకీయ గురువుగా భావించే అమర్ సింగ్ వెంటే  జయప్రద  ఉన్నారు. వీరిద్దరూ కలిసి 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీ ఏర్పాటు చేసి యుపిలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 360 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేకపోయారు. 2014లో బిజ్నోర్ లోకసభ స్థానం నుంచి  జయప్రద పోటీ చేసి పరాజయం చెందారు. తర్వాత ఆమె భారతీయ జనతాపార్టీలో చేరారు. జయ ప్రద నటించిన 75 బాలివుడ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలే ఆమెను బాలివుడ్ లో నిలబెట్టేలా చేసాయి. బాలివుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డును కూడా  ఆమె కైవసం చేసుకున్నారు. 

ఎవరీ గెడ్డం ఉమ?.. ఏమా కథ?

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు, వైసీపీ నాయకురాలు గెడ్డం ఉమ పేరు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  గెడ్డం ఉమ లగ్జరీ సామ్రాజ్యం పేరుతో కొన్ని చిత్ర రాజాలు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆమె ఎవరు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటనే ఓ చర్చ జోరుగా సాగుతోంది. జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత   గెడ్డం ఉమ హోదా అమాంతంగా పెరగిపోవడమే కాకుండా.. ఆమె పేరు సైతం మంచి ఫేమస్ అయిపోయిందనే ఓ ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది  జగన్ పార్టీ అధికారంలోకి రాక ముందు.. ఓ సాధారణ మహిళగా ఆమె వస్త్ర దుకాణాన్ని నిర్వహించేవారనీ,  జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆమె ఆస్తులు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయాయని, ప్రస్తుతం గడ్డం ఉమ కోట్లకు పడగలెత్తారన్న ప్రచారం  సామాజిక మాధ్యమంలో మరో  లెవల్ లో సాగుతోంది. మరోవైపు గతంలో ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌ఛార్జీగా పని చేసిన, జగన్ పార్టీ తొలి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి   గెడ్డం ఉమ  అత్యంత సన్నిహితురాలనే ఓ ప్రచారం సైతం ఉంది. అలాగే విజయసాయిరెడ్డి సహాయ సహాకారాలతోనే గెడ్డం ఉమ మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవిని దక్కించుకున్నారని కూడా అంటున్నారు.   ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పరవాడలో సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన గెడ్డం ఉమ ప్రస్తుతం డూప్లెక్స్ ఇంటితో పాటు రెండు లగ్జరీ కార్లు  ఉన్నాయని.. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇంకోవైపు ఉత్తరాంధ్ర నుంచి గంజాయి అక్రమ రవాణాలో ఈ గెడ్డం ఉమ హస్తం ఉందని.. ఇందులో ఆమెకు వైసీపీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. విశాఖ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటే.. అందుకు  మహిళ కమిషన్  పదవిని అడ్డం పెట్టుకొని.. గడ్డం ఉమ చేస్తున్న దందాయే కారణమన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.  అదీకాక ఉత్తరాంధ్ర ఇన్‌చార్జీగా ఉన్న విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకొని..  సెటిల్‌మెంట్ల దందాతో   గెడ్డం ఉమా బాగా సెటిల్ అయ్యారనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది. అయినా సీఎం  జగన్ గురించి కానీ.. ఆ పార్టీలో ఉత్తరాంధ్రలో మొన్నటి వరకు కీలక చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి గురించి కానీ.. ఈ గెడ్డం ఉమా మాటాల్లో వింటే.. ముఖ్యంగా విజయసాయిరెడ్డి  సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లండంలో  ఆమె గారు నూటికి నూరు శాతం సఫలీకృతులయ్యారనే ఓ ప్రచారం సైతం ఉత్తరాంద్ర జిల్లాలో కొనసాగుతోంది. అంతేకాదు.. విజయసాయికి ఉత్తరాంద్ర ఇన్‌చార్జీ పదవి గోల్ మాల్ గోవిందం అయిందంటే.. ఆ వెనుక గెడ్డం ఉమా గారి హస్తం ఉందనే ఓ ప్రచారం సైతం నేటికి వాడి వేడిగా నడుస్తోంది. అంతే కాదు.. ఈ గెడ్డం ఉమ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉంటారని.. ఆ క్రమంలో టీవీ డిబెట్లు, చర్చ కార్యక్రమాల్లో సైతం పాల్గొని.. జగన్ పార్టీపై ఈగ వాలనివ్వకుండా ఉంటారనే ఓ ప్రచారం సైతం కొన.. సాగుతోంది.

అప్పు దొరికితేనే కాపు నేస్తం!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తామని చెప్పి పెండింగ్ ఉన్న పథకాలు చాలా చాలా  ఉన్నాయి. కొన్ని పథకాల   అమలు యోచన ఇప్పటికీ జగన్ సర్కార్ చేయడం లేదు.  మరికొన్ని పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా బటన్ నొక్కినా నిధులు లేక  అవి మరుగున పడిపోతున్నాయి.   ఇలా పెండింగ్ లో ఉన్న పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని మాత్రం రానున్న ఎన్నికలలో కీలకం కానున్నాయి. దీంతో  వాటిని ఎలాగైనా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నది. కానీ తీవ్ర నిధుల కొరత, ఎంత ప్రయత్నించినా అప్పులు పుట్టని పరిస్థితిలో ఏం చేయలో తోచక జుట్టు పీక్కుంటోంది.   అలాంటి పథకాలలో  అత్యంత ముఖ్యమైనది  కాపు నేస్తం. ఈ పథకం అమలు చేయడం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి చావో రేవోగా మారింది. ఈ నాలుగేళ్ళలో జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసింది నిండు సున్నా. గత ప్రభుత్వంలో ప్రతిపాదించి, దాదాపు అనుమతి వచ్చిన కాపు రిజర్వేషన్లకు కూడా జగన్  గుండుసున్నా కొట్టేశారు.  ఇప్పుడు ఎన్నికల ముంగిట   పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటే..  ఆ ప్రయత్నాలు ఫలించకుండా చేసేందుకు  కొట్టే వైసీపీ ఎలాగైనా కాపు నేస్తం తీసుకురావాలని చూస్తున్నది. ఇందు కోసం జగన్ సర్కార్ ఇప్పటికే ఈ నెలలో ముహూర్తం ఖరారు చేసేసింది కూడా. అయితే   గత నెలలో వచ్చిన ఆదాయం, చేసిన అప్పు కూడా  జీతాలు, పెన్షన్లకే సరిపోని పరిస్థితి. ఇప్పటికీ ప్రభుత్వోద్యోగులందరికీ జీతాలు అందలేదు. దీంతో   కాపు నేస్తం అమలు చేయడానికి  నిధులు లేకుండా పోయాయి. దీంతో  అల్పపీడనం, భారీ వర్షాల నెపంతో  కాపు నేస్తం వాయిదా వేశారు.  అయితే  ఎక్కడా భారీ వర్షాల ఆనవాలు లేదు. అది పక్కన పెడితే బటన్ నొక్కి ఖాతాలలో సొమ్ము జమ చేయడానికి వాతావరణంతో సంబంధం ఏమిటన్న ప్రశ్నకు వైసీపీ నుంచి సమాధానమే లేదు.  కాపు నేస్తం పథకం అమలుకు ఈ నెలలోనే మరో ముహూర్తం ఖరారు చేస్తామని ప్రకటించి  చేతులు దులిపేసుకున్నారు. అయితే ఈ నెలలో మరో ముహూర్తం ఖరారు చేసి జగన్ బటన్ నొక్కాలన్నా ఆదాయం ఎక్కడ నుంచి సమకూరుతుంది? అప్పు ఎక్కడ పుడుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.   నిజానికి ఇప్పటికే ఏపీ చేయాల్సిన అప్పు కంటే రెట్టింపు చేసేసింది. కనుక ఒక్క రూపాయి అప్పు కూడా పుట్టే అవకాశం లేదు.  కేంద్రం కూడా ఈ విషయాన్ని ఏపీ పెద్దలకు క్లియర్ గా చెప్పేసింది.   కానీ, ఏపీ నుండి  కేంద్రానికి విన్నపాలు మాత్రం ఆగడం లేదు. గతంలో కూడా కేంద్రం ఇలాగే  ఇక అప్పు కుదరదని ఖరాకండీగా చెప్పినా.. తిమాలాడుకొని, బామాలుకుని, కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని ఎలాగోలా తిప్పలు పడి అప్పులు తెచ్చింది. ప్రభుత్వం రాయతీలు తగ్గించినట్లుగా చూపించి మసిపూసి మారేడుకాయ చేసి మరీ కొత్త అప్పులు తెచ్చింది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు కూడా అందులో భాగమే. ఇప్పుడు కూడా అలాగే అనధికారికంగా అప్పుల కోసం కేంద్రం వద్ద చేతులు చాచి అడుక్కుంటోంది. ఏపీ లిక్కర్ బాండ్లను అమ్మి తమకు అప్పు ఇప్పించాలని కేంద్ర పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇక, తమకి ఏది కావాలంటే అది చేసి పెడుతున్న క్రమంలో కేంద్రం కూడా మాయ చేసో మతలబు చేసో కొత్త అప్పు ఇచ్చేసే అవకాశాలు  లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.  అదలా ఉంటే.. కేవలం కొత్త అప్పుల కోసమే వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో ఒక హైలెవల్  లోన్ కమిటీని కూడా నియమించుకుంది. ఔను నిజం  అనధికారికంగా ఈ అప్పుల పనులను చక్కబెట్టేందుకు ఈ కమిటీ పనిచేస్తున్నదని అంటున్నారు. అసలు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో  ఏపీ ప్రజలకు తెలియదు. అయితే హస్తినలో ఉన్న ఈ హై లెవల్ లోన్ కమిటీగా చెప్పుకుంటున్న ఈ కమిటీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్నదని, ఎప్పుడు ఎంత కావాలో అంత అప్పు  ఎలా సంపాదించాలో, అందుకోసం ఏం చేయాలో ఈ కమిటీ చూసుకుంటున్నదని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ ఈ కాపు నేస్తంకు కావాల్సిన నిధుల సేకరణ పనిలోనే ఉందని అంటున్నారు. ఏపీ లిక్కర్ బాండ్ల విక్రయం ద్వారా ఈ అప్పు సంపాదించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ బివరేజర్స్ బాండ్లను సబ్ స్క్రైబ్ చేయడానికి ఇన్వెస్టర్లు ముఖం చాటేశారు.  మరి ఈ కమిటీ కొత్త అప్పు తెస్తుందా? జగన్ సర్కార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తుందా  అంటే.. పరిశీలకుల నుంచి ఏమో చూడాలి అన్న సమాధానమే వస్తోంది. 

బీఆర్ఎస్ లో భగభగలు.. కాక రేపుతున్న అసమ్మతి సెగ

అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ లో ఒక్క సారిగా అసమ్మతి కాకరేగింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్గీయులు, స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరికి వ్యతిరేకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా స్థానిక నెహ్రూ పార్క్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.  పల్లా దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ముత్తిరెడ్డి వర్గీయులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.  జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. కేసీఆర్ ఆశీస్సులు కూడా ఆయనకే ఉన్నాయన్న వార్తలు వినవస్తున్ననేపథ్యంలో ముత్తిరెడ్డి వర్గీయులు ఆందోళణ బాట పట్టారు. పల్లా గో బ్యాక్.. ముత్తిరెడ్డికే టికెట్ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే విధంగా స్టేషన్ ఘనపూర్ లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గీయులు ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి కడియం శ్రీహరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వలస నాయకుడు, దళిత దొర కడియం శ్రీహరి వద్దు.. స్థానిక నాయకుడు రాజయ్య ముద్దు అంటూ నినాదాలు చేసిన తాటికొండ వర్గీయులు ఒక దశలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలా ఉండగా సిట్టింగులందరికీ టికెట్లు అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన నాటి నుంచి బీఆర్ఎస్ లో అసమ్మతి అగ్గికి అంకురార్పణ జరిగిందనే చెప్పాలి. సిట్టింగులందరికీ టికెట్ అన్న మాట కేసీఆర్ నోట వచ్చిన క్షణం నుంచీ పలు నియోజకవర్గాలలో అసమ్మతి భగ్గు మంది. దీంతో కేసీఆర్ వెనక్కు తగ్గారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ద్వారా సిట్టింగులందరికీ కాదు.. కొందరికే అన్న సవరణ ప్రకటన చేయించారు. అయితే ఆ తరువాతి పరిణామాలలో చాలా నియోజకవర్గాలలో సిట్టింగులు, ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకుల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్ అధిష్ఠానం బుజ్జగింపుల పర్వానికి తెరతీసినా, టికెట్ల ప్రకటన సమయం దగ్గరకొచ్చేసరికి అధిష్ఠానాన్ని కూడా లెక్క చేయని స్థాయికి అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజులలో ఈ అసమ్మతి జ్వాలలు మరిన్ని నియోజకవర్గాలకు విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.  

కొండలపై కొలువైతే దేవుడైపోయినట్లేనా? రిషికొండ బాగోతం అందుకేనా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  హిందూ ధర్మ వ్యతిరేకి  అవునా కాదా తెలియదు కానీ ఆయన హిందువు అయితే కాదు.  ఇది జగన ఒక్కరే కాదు జగమెరిగిన సత్యం. భారత దేశం కుల మతాలకు అతీతమైన లౌకిక రాజ్యం అందులో ఎటువంటి సందేహం లేదు. సర్వ మత సామరస్యం, సౌభ్రాతృత్వం భారత డీఎన్ఏలోనే ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు దేశం నిలువెత్తు నిదర్శనం.  అయితే ఏపీ విషయంలో  మాత్రం జగన్ హయాంలో ఒక కొత్తా దేముడు అవతరించాడు.  ఈ విషయాన్ని ఆయన కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ముక్తకంఠంతో చెబుతున్నారు.   విశాఖ రిషికొండపై నిర్మాణాల విషయంలో వెల్లువెత్తుతున్న విమర్శలపై స్పందిస్తూ.. మంత్రి రోజా, మాజీ మంత్రులు  తిరుమల కొండపై వెంకన్న దేవుడు కొలువై ఉండలేదా?  శ్రీశైలం కొండపై బ్రమరాంబికా సమేత మల్లికార్జునుడు కొలువుదీరలేదా? అంటూ కొత్త వాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. అలాగే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్  వంటి కొండలపై నివాసాలు వెలిశాయి కదా అని  ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని నివాసాలు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మితమై ఉంటే.. ఆ విషయాన్ని కోర్టుల్లో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిషికొండపై నిర్మాణాలు కూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని జాతీయ హరిత ట్రైబ్యునల్ కుండ బద్దలు కొట్టింది. అయినా వాటిని వేటినీ పట్టించుకోకుండా రిషికొండకు గుండు కొట్టి మరీ జగన్ సర్కార్ నిర్మాణాలను కొనసాగిస్తోంది? అదేమిటంటే.. దేవుళ్ల ఆవాసాలను ప్రస్తావిస్తున్నారు వైసీపీ నేతలు. ఎవరి నాయకుడు వారికి దేవుడితో సమానమైతే అవ్వోచ్చు కానీ, తామనుకుంటున్నదే సర్వ జనులూ అనుకుని తారాలంటూ మాట్లాడటమే అతిగా అనిపిస్తోంది. అయినా జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హిందూ ఆలయాలు, దేవుళ్లే లక్ష్యంగా జరిగిన దాడులను కాకతాళీయంగా భావించలేని పరిస్థితిని ఆయన, ఆయన పార్టీ నేతలే స్వయంగా కల్పిస్తున్నారు. హిందువులంతా కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా సాగుతున్న చర్యలపై హిందూ సమాజం వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని జగన్ సర్కార్ అసలు కన్సిడర్ చేయడం లేదు. ఒకటనేమిటి.. సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకలు, జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో తెలియంది కాదు.  వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం,  టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న  నిర్ణయాల హిందూ మత విశ్వాసాలకు విరుద్ధంగానే ఉన్నాయి.  హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తిరుమలను టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులలో వ్యక్తమౌతోంది. అన్నిటికీ మించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వెంకన్న దేవుడిని నల్ల రాయిగా అభివర్ణించిన కరుణాకరరెడ్డిని నియమించడంతో రాష్ట్రంలో కొత్తా దేముడవతరించాని వైసీపీ ప్రచారం చేసుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

మీడియా ఎదుట సజ్జల తడబాటు.. యార్లగడ్డకు హిత వాచకాలు!

ఏపీ ప్రభుత్వ సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి యార్లగడ్డ సెగ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. పార్టీలో , ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న సజ్జలపై గతంలో కూడా ఎమ్మెల్యేలు, మాజిలైన మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పుడెప్పుడూ లేని విధంగా యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరుకున పడేశాయి.  దీంతో ఆయన అనివార్యంగా మీడియా ముందుకు వచ్చి తనను తాను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లు ఆయనను ఓ ఆట ఆడుకోవడానికి  మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అదే సమయంలో ఆయన ఇచ్చిన వివరణ.. వైసీపీ ఎవరినైనా సరే యూజ్ అండ్ త్రో విధానంలోనే వాడుకుంటుందన్న విషయాన్ని మరో సారి తేటతెల్లం చేసేశాయి. ఇంతకీ వైసీపీని వీడుతూ యార్ల గడ్డ ఏమన్నారంటే..  అమెరికా నుంచి తీసుకొచ్చి జగన్ రెడ్డి తనను నడి సముద్రంలో వదిలేశారని ఆరోపించారు.   తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు.  చంద్రబాబు అవకాశం ఇస్తే గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతాననీ, గెలుస్తాననీ ధీమా వ్యక్తం చేశారు. అలా గెలిచిన తరువాతే.. ఒక వేళ పులివెందుల నుంచి జగన్ విజయం సాధిస్తే.. అప్పుడే అసెంబ్లీలో ఆయనను కలుస్తానన్నారు.  తాను పార్టీకి ఎంతో సేవ చేశాననీ, అయినా సజ్జల తనను కూరలో కరివేపాకులా తీసి పారేశారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం అప్పాయింట్ మెంట్  కోరితే సజ్జల పడనివ్వలేదనీ, గట్టిగా అడిగితే  ఉంటే పార్టీలో ఉండు.. పోతే పో అన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.  మూడేళ్లుగా సజ్జల తనను అవమానిస్తూనే ఉన్నారనీ, పంటి బిగువన భరించాననీ, కానీ ఇప్పుడు ఉంటే ఉండు పోతే పో అనడాన్ని మాత్రం సహించలేకపోయాననీ వెల్లడించారు.  ఈ విషయాలన్నీ యార్లగడ్డ బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో సజ్జల మీడియా ముందుకు వచ్చారు. తానలా అనలేదని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సందర్భంగా ఆయన అన్న మరో  మాట ఆయన యార్లగడ్డను ఉంటే ఉండు, పోతే పో అన్నారనే అందరూ నమ్మడానికి దోహదం చేశాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే.. ఎవరైనా ఇలాంటి విషయాలు బహిరంగంగా చెబుతారా? అలా చెప్పడం సమజసం కాదని అనడంతో  అంతా సజ్జల యార్లగడ్డకు పొగపెట్టారని నమ్మే పరిస్థితి ఏర్పడింది.  తాను యార్లగడ్డకు టికెట్ విషయంలో హామీ అయితే ఇవ్వలేదనీ, అలాగని వచ్చే ఎన్నికలలో పోటీకి చాన్స్ లేదని కూడా చెప్పలేదని వివరణ ఇచ్చారు.  గన్నవరంలో వంశీ, యార్లగడ్డలలో ఒకరిటే టికెట్ లభిస్తుందన్న కోణంలో మాత్రమే తాను ఆయనతో మాట్లాడానని చెప్పుకున్నారు.  అయినా ఇటువంటి చర్చలు పార్టీలో అంతర్గతంగా జరుగుతాయనీ, వాటిని ఇలా బహిర్గతం చేయడం మంచిది కాదంటూ యార్లగడ్డకు హితవు పలికారు. నాలుగు గోడల మధ్య తానేం అన్నా భరించాలి అన్న చందంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని నెటిజన్లు విమర్శలు  గుప్పిస్తున్నారు. సజ్జల తీరు చూస్తుంటే.. వల్లభనేని వంశీ కోసం యార్లగడ్డకు పొగబెట్టారనీ, ఆయన ఎదురు తిరగడంతో కంగారు పడుతున్నారనీ అర్ధమౌతోందని పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అనుమానంతోనే నలుగురు ఎమ్మెల్యేలను బహిష్కరించిన వైసీపీ.. మాజీ ఎమ్మెల్యే మాటలకు ఎందుకు అంత ఉలిక్కి పడుతోంది. గన్నవరంలో వంశీకి అనుకూలంగా సజ్జల వ్యవహరించిన తీరు బూమరాంగ్ అవుతోందన్న భయం వెంటాడుతోందా? అన్న అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.  అలాంటి భయమే లేకపోతే ఎన్నడూ లేనిది మీడియా ముందుకు వచ్చి.. నేనేం అనలేదు మహప్రభో అని వేడుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో బాలినేని వంటి వారు తనపై విమర్శలు గుప్పించినా స్పందిచని సజ్జల ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవడానికి తహతహలాడారు అని నిలదీస్తున్నారు. 

పొత్తు పొడుపుల చర్చకు ఫుల్ స్టాప్ ఎప్పుడు?.. పవన్ మాటల ఆంతర్యం ఏంటి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పొడుపుల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారా? పొత్తులు ఖాయం.. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరుగుతున్నాయన్న హింట్ ఇచ్చారా? తెలుగుదేశంలో జనసేన ఒక్కటే కలిసి నడుస్తుందా? బీజేపీని కూడా కలుపుకుని వస్తుందా? అన్న విషయం ఒక్కటే తేలాల్సి ఉందని ఆయన చెబుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వారాహి మూడో విడత యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడి.. వచ్చే ఎన్నికలలో పొత్తులతోనే ముందుకు వెళతాం అని నిక్కచ్చిగా చెప్పేశారు. పొత్తుల విధి విధానాలపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. దీంతో మరో సారి ఏపీలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరు కలిసి ఎన్నికల బరిలో దిగుతారు. సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది అన్న చర్చలు జోరందుకున్నాయి.  తెలుగుదేశం, జనసేన,బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతాయా? 2014 నాటి పరిస్థితిని పునరావృతం చేస్తాయా? లేకపోతే.. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీలు కలిసి రంగంలోకి దిగుతాయా, తెలుగుదేశం ఒంటరిగానే ఎన్నికల రణరంగంలో తన సత్తా చాటుతుందా? లేక బీజేపీని వదుల్చుకుని జనసేన తెలుగుదేశంతో చేతులు కలుపుతుందా? అన్న విషయంలో సర్వత్రా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పైన అనుకున్న మూడు ఆప్షన్లకే అవకాశం ఉందని, మరి జనసేన వాటిలో ఏ ఆప్షన్ ను ఎంచుకుంటుందో తెలియాల్సి ఉందనీ పరిశీలకులు అంటున్నారు.  రాష్ట్రంలో పొత్తల విషయంలో మొట్టమొదటిగా మాట్లాడింది జనసేనానే కావడంతో ఇప్పుడు బంతి కూడా ఆయన కోర్టులోనే ఉంది. పొత్తులు లేకుండా పోటీ చేస్తే 2019 ఫలితమే పునరావృతమౌతుందా అన్న అనుమానాలు జనసేనానిలో బలంగా ఉన్నాయనీ, వారాహి యాత్రలో ఆయన చేస్తున్న ప్రసంగాలను బట్టి అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. అధికారంలోకి రావాలని తాను అనుకుంటే చాలదనీ, ప్రజలు కూడా అనుకోవాలి అంటూ ఆయన చెబుతున్న మాటలు.. జనసేనాని ఉద్దేశాన్ని చాటి చెబుతున్నాయి.   ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారైనా సరే బీజేపీ పొత్త వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉంటుందని భావించరు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ఆ పార్టీతో పొత్తు ఉంటే బెటర్ అన్న భావనతో ఉంటారు. జనసేనాని మాటలను బట్టి చూస్తుంటే.. ఆయన ఉద్దేశం కూడా అదే అన్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఇక తెలుగుదేశంను కలుపుకుని పోకుండా ఒక్క బీజేపీని నమ్ముకుని జనసేన ముందుకు సాగితే.. ఆ పార్టీతో పాటుగా మునక తప్పదని  పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.  సాధ్యమైనంత వరకూ జనసేన తన మిత్రపక్షం బీజేపీని కూడా తెలుగుదేశంతో పొత్తులోకి తీసుకువద్దామన్న ఉద్దేశంతో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది కుదరకపోతే కమలానికి బైబై చెప్పేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలన్నది పవన్ కల్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో పొత్తుల విషయంలో ఒకింత బెట్టుగా వ్యవహరించి సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను పొందాలన్న వ్యూహంతో జనసేనాని ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూడా  పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందనీ, తొందరపాటు అవసరం లేదనీ, అవసరమైతే ఒంటరిగానే సత్తా చాటాలన్న ఉద్దేశాన్ని చాటుతోందని అంటున్నారు.  ఇక బీజేపీ విషయంలో తెలుగుదేశం ఒక స్పష్టతతో ఉందనీ, కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీ లోని జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ.. పొత్తుకు వస్తామంటూ తెలుగుదేశం పార్టీకి స్నేహహస్తాన్ని చాటితే ఆ చేయి అందుకోవడానికి తాము సిద్ధంగా లేవని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ సర్కార్ అక్రమాలు, తనపై జరిగిన దాడుల వివరాలతో రాసిన  లేఖకు అటువైపు నుంచి వచ్చే సమాధానాన్ని బట్టే కమలం పార్టీలో పొత్తు విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని తెలుగుదేశం చెప్పకనే చెబుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని నోట పొత్తలు ఖాయం.. చర్చలు జరుగుతున్నాయన్న మాట రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

అన్నా చెళ్లెళ్ల పోరు.. ఇంటిగుట్టు బయటపడేనా?

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో అసలేం జరుగుతుంది? ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఎందుకు దూరమయ్యారు? జగన్, ఆయన భార్య భారతిలను మినహాయించి మిగతా కుటుంబ సభ్యులంతా ఎందుకు ఒక్కటయ్యారు? కేవలం ఆస్తి తగాదాల వలనే వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చిందా? లేక పదవుల దగ్గర తేడా వచ్చిందా? అసలెందుకు ఈ పరిస్థితి వచ్చింది. ఇదే ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారితో పాటు రాజకీయ వర్గాలలో కూడా జరుగుతున్న చర్చ. తెలంగాణలో పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాలకు దూరమైన వైఎస్ షర్మిల ఇప్పుడు తిరిగి ఏపీ రాజకీయాలలోకి వెళ్లడం దాదాపు ఖాయమైపోయింది. ఆ మాటకొస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి అలనాడు తన తండ్రి బాధ్యతలు నిర్వహించిన పీసీసీ పదవిలో ఆమర కుమార్తె షర్మిల క్రీయాశీలక రాజకీయాలు నడపనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి తెరవెనుక సన్నాహాలన్నీ పూర్తి కాగా, ఇక అధికారిక విలీనమే తరువాయిగా రాజకీయ వర్గాలు   చెబుతున్నాయి.  దీంతో సహజంగానే వైఎస్ కుటుంబంలో విబేధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక షర్మిలను రాజ్యసభకు పంపించాలని ప్రతిపాదన వచ్చింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని తన భుజస్కంధాలపై మోసిన షర్మిల తనను రాజ్యసభ సభ్యురాలిగా  చేయాలని కోరడం తప్పేమీ కాదు. కానీ, అన్న జగన్ ఈ విషయాన్ని దాటవేస్తుండడంతో తల్లి విజయమ్మ నుండి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో జగన్ మరింత మొండిగా మారిపోయారు. అసలే అప్పటికే ఆస్తి పంపకాలలో కినుక వహించి ఉన్న జగన్-భారతి దంపతులు షర్మిలను రాజ్యసభకు పంపేందుకు అసలు ఇష్టపడ లేదు. దీంతో షర్మిల మరో పార్టీతో ప్రజలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తల్లి విజయమ్మ మాత్రం ఈ వ్యవహారాన్ని సామరస్యంగానే చక్కదిద్దుకోవాలని, అన్నా చెళ్లెళ్ల మధ్య సయోధ్య కుదర్చాలనీ అప్పట్లో ప్రయత్నించారు. కానీ, జగన్ అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడమే కాకుండా..  షర్మిల ఏపీ రాజకీయాల జోలికి రాకూడదని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారితో తీవ్ర హెచ్చరికలు పంపారని అప్పట్లో ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వారు చెబుతున్నారు. ఆ కారణంగానే షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్నాటు చేశారని అంటున్నారు. కాగా, షర్మిల తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో  ఇప్పుడు ఎలాగైనా తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో   ఏపీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అయితే  కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం ప్రతిపాదన బయటకి రాగానే జగన్ మరోసారి షర్మిల, తల్లి విజయమ్మకు హెచ్చరికలు పంపారట. గతంలో తెలంగాణకి వెళ్ళిపోతామంటేనే ప్రాణభిక్ష పెట్టానని, ఇప్పుడు మళ్ళీ ఇలా ఏపీ రాజకీయల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారని వైఎస్ కుటుంబంతో సన్నిహిత పరిచయాలున్న వారి ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్నది. అంతే కాకుండా ఏపీ ప్రభుత్వం తరపు నుండి  షర్మిలకు భద్రత కోసం ఇచ్చిన ఇద్దరు గన్ మెన్ లను ఉపసంహరించుకున్నారు. దీంతో  విజయమ్మ తనకు కేటాయించిన   గన్మెన్లను కూడా వెనక్కు వెళ్లిపోవాలని స్వచ్ఛందంగా కోరడంతో జగన్ వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అయితే, ఏ క్షణమైనా నలుగురు గన్ మెన్ లను జగన్ సర్కార్ ఉపసంహరించుకున్నా  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనమై  షర్మిల ఏపీ రాజకీయాలలోకి అడుగుపెడితే ఈ ఆదేశాలు రావడం గ్యారంటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైఎస్ వివేకా హత్యకేసులో సునీతకు షర్మిల మద్దతు ఇవ్వడం వెనక కూడా అన్న చెల్లెళ్ళ మధ్య విబేధాలే కారణంగా చెబుతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా.. అన్న విజయం కోసం తన శక్తికి మించి సాయం చేసినా.. తనకు పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వకుండా పక్కకు పెట్టడం.. కనీసం సోదరి అనే మమకారం కూడా లేకుండా బెదిరింపులకు దిగడం సహించలేకనే షర్మిల.. వివేకా హత్యకేసులో స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఇక అన్న జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే షర్మిల ఏపీ రాజకీయాలలో క్రియాశీలం కానున్నట్లు  తెలుస్తున్నది. అదే జరిగితే వైఎస్ కుటుంబంలో కలహాల దగ్గర నుండి.. వైఎస్ వివేకా దోషుల వరకూ అన్ని అంశాలు బయట పడడం ఖాయంగా కనిపిస్తున్నది!

ఇచ్చిందెంత.. దోచిందెంత? నిగ్గదీసి అడుగుతున్న జనం!

 ఏదేశమైనా,  ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల కల్పన చాలా ముఖ్యం. రాష్ట్రంలో అన్ని వసతులు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితేనే ప్రజలకు సంక్షేమం అందుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. ఇదంతా ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్న ప్రక్రియ. ఈ ప్రక్రియను అవలంబిస్తేనే ఏ ప్రభుత్వమైనా నిలబడేది. మాది భిన్నమైన పాలన.. కేవలం సంక్షేమమే మా నినాదం అంటే ఆ ప్రభుత్వం బొక్కబోర్లా పడడం ఖాయం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా  ఉంటేనే ఆ రాష్ట్రం సుభీక్షంగా ఉంటుంది. ఇందులో ఏది వదిలేసినా ఆ రాష్ట్రంలో   ప్రజల ఆర్ధిక స్థితి దిగజారడం, వలసలు పెరగడం వంటివి తప్పదు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది అదే.  రాష్ట్రానికి ఇతర దేశాల పెట్టుబడులు చాలా అవసరం. అందుకే ప్రతి రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేసుకొని.. రాష్ట్రానికి వస్తే రాయితీలు ఇస్తామంటూ ఆకర్షిస్తుంటారు. టీడీపీ హయంలో కూడా గన్నవరం విమానాశ్రయానికి కొన్ని మెరుగు దిద్ది అంతర్జాతీయ విమానాల రాక కోసం ప్రభుత్వం విమానయాన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. కొన్ని నెలల పాటు ప్రభుత్వమే కొన్ని టికెట్ల ధరను చెల్లించేలా ఒప్పందాలు కూడా చేసుకుంది. దీంతో అంతర్జాతీయ   రూట్లలో సర్వీసులు మొదలు అయ్యాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రాయతీలు ఆపేశారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఒక మాట చెప్పారు. విమాన సర్వీసుల కంటే తల్లీ బిడ్డల ఆరోగ్యం ముఖ్యమని, ఆ రాయితీలు ఆపేసి ఆ డబ్బును గర్భిణీ, బాలింతల పౌష్టికాహారం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.  ఆనాడు బుగ్గన చెప్పిన ఆ మాటలు ఆహా ఓహో అనిపించి ఉండొచ్చు. జగన్ సర్కార్ పేదల కోసమే ఆలోచిస్తుందని, సంక్షేమ ఫలాలు తమకు అందుతాయని ప్రజలు భావించి ఉండొచ్చు. కానీ, వాస్తవంలో  వైసీపీ పంచేందుకు ఇప్పుడు తగిన ఆదాయం లేదు. కొండలా పేరుకుపోయిన అప్పులతో కొత్త అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరం జరిగిన వైసీపీ ప్రభుత్వం.. కేవలం బటన్ నొక్కి పప్పు బెల్లాలు పంచడానికే పరిమితమైంది. పరిశ్రమలు రాక.. పెట్టుబడి దారులు రాష్ట్రం వైపు చూడక నిరుద్యోగులంతా పక్క రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం దిగజారిపోయింది. ఆదాయం సరిపోక ప్రభుత్వం రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రోత్సాహక రాయతీలు వంటి వాటికి మంగళం పాడేసింది. కేవలం ఏ నెలకి ఆనెల వచ్చే ఆదాయానికి తోడు మరికొంత అప్పుచేసి పెన్షన్లు, జీతాలు, సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడానికే పాలన పరిమితమైపోయింది.  దీంతో ఏపీ ప్రజలలో వైసీపీ ప్రభుత్వంపై ఒకరకమైన ఏహ్య భావన కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కొత్తగా సంక్షేమాన్ని అమలు చేయడం లేదు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువే సంక్షేమాన్ని అందించారు. జగన్ వాటికి పేర్లు మార్చి నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తున్నారు. దానికి కూడా భారీగా ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. రేషన్ డోర్ డెలివరీ లాంటి పథకాలు హంబక్ కావడం.. ప్రకటించే ప్రతి పథకానికి వంద కొర్రీలు పెడుతూ కోతలు విధించడంతో.. ఆ ఫలాలు అందినా ప్రజలలో సంతృప్తి కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు వైసీపీలో అంతర్మధనం మొదలైంది. తాము ఇంత చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదేంటి అని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పీపుల్ సర్వేలు తీసుకుంటున్నారట. అయితే, కొందరు లబ్ధిదారులు లెక్కలేసి మరీ మీరిచ్చింది ఏంటో చెప్పాలని అడుగుతున్నారు. ఇదిగో మేము కుటుంబానికి రూ.2 లక్షల వరకూ ఇచ్చామని వైసీపీ నేతలు చెప్తుంటే.. ప్రజలు తిరిగి నేతలకు దిమ్మతిరిగే సమాధానమిస్తున్నారు. మీరిచ్చే దానిలో పెన్షనే  అధిక భాగం పెన్షనే ఉందనీ.. పైగా ఉందని.. అది గత ప్రభుత్వంలోనే పెంచారని, మిగతా మొత్తం గత ప్రభుత్వంలో కూడా అందిందని.. ఇప్పుడు వాటి పేర్లు మార్చి మాయ చేసారని లెక్కలు చెప్పడంతో నేతల ఏం చెప్పాలో.. ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో పడ్డారు. ప్రజల ముందుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. అంతేకాదు, మీరిచ్చిన దాని కంటే వందరెట్లు ఎక్కువగా రేట్లు పెంచి మా దగ్గర నుండి లాగేసుకున్నారని  గణాంకాలతో సహా చెబుతున్నారు.ఈ ప్రజా చైతన్యం వైసీపీకి కాళ్ల కింద భూమిని కదిలించేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సంగతి అటుంచి.. అసలు ప్రచారం కోసం జనం ముందుకు వెళ్లడం ఎలా అన్న గుబులు వారిలో మొదలైందంటున్నారు.  

బైజూస్ పోయె.. ఎడెక్స్ వచ్చే ఢాం..ఢాం.. ఢాం

ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థతో  చేస్తున్న ప్రయోగాలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి దోహదపడటం సంగతి అటుంచి.. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసికంగా, ఆర్థికంగా నానా అగచాట్లకు గురి చేస్తున్నది. జగన్ ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెట్టి.. విద్యావ్యవస్థతో చేస్తున్న ప్రయోగాలతో రాష్ట్రంలో విద్య కుంటుపడింది. అమ్మ ఒడి వంటి పథకాలలో కోతల వల్ల అనేకమంది అర్ధంతరంగా చదువు మానేసి డ్రాప్ ఔట్ లుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో విద్యాసంస్కరణల పేరిట ఆన్ లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో జగన్ సర్కార్  ఒప్పందం చేసుకుంది. దీంతో హార్వర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు అందించేందుకు వీలు కలగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. ఏపీ ఉన్నత విద్యారంగంలో ఇదొక  గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం జగన్  తన భుజాలను తానే చరుచుకుంటున్నారు. దాదాపుగా ఇలాంటి ఘనమైన మాటలతోనే  బైజూస్ అనే సంస్థతో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది.   భారత్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ లో పిల్లలకు చదువులు చెప్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగ ముచ్చట పడింది. వెనుకా ముందూ చూడకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి  పిల్లలకు ట్యాబ్ లు కూడా అందజేసింది.  ట్యాబ్ లలో చదువు చెప్పేదుకు బైజూస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  అయితే ఆ చదువులు పిల్లలకు ఒంటబట్టలేదు. ప్రతి సంవత్సరం 8వ తరగతికి వచ్చేసుమారుఐదు లక్షల మందికి ట్యాబ్ లుఇచ్చి వారికి బైజూస్  సిలబస్ ను అందించింది. బైజూస్ ను నమ్ముకుని పిల్లలకు ట్యాబ్ లను అందించిన ప్రభుత్వం  బైజూస్ పీకల్లోతు ఆక్రమాలలో మునిగి పోయి చేతులెత్తేసింది. బైజూస్ సంస్థ 28వేల కోట్ల  అవినీతికి  పాల్పడిందని సీబీఐ, ఈడీలు చెబుతున్నాయి.   28 వేల కోట్ల రూపాయల మేర విదేశీ పెట్టుబడులు రాబట్టి వాటిని లెక్కల్లో చూపలేదని సీబీఐ, ఈడీలు పేర్కొన్నాయి. సరే బైజూస్ అవినీతి సంస్థ కావడం వల్లనే జగన్ సర్కార్ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్ ను ఫణంగా పెట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరే బైజూస్ తో  జగన్ సర్కార్  ఒప్పందం  మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అందు కోసం ప్రభుత్వం వ్యయం చేసిన కోట్లాది రూపాయలు గంగలో కలిపోయాయి. ఇక ఆ తరువాతైనా విద్యావ్యవస్థతో అడ్డగోలు ప్రయోగాలకు జగన్ సర్కార్ స్వస్తి చెబుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు   ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా అంతర్జాతీయ కోర్సులు అందించడమే లక్ష్యం అంటూ జగన్ సర్కార్   పేరిట ఆన్ లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో   ఒప్పందం కుదుర్చచుకుంది. మరి ఈ ఒప్పందం భవిష్యత్ లో ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలని పరిశీలకులు అంటున్నారు.  

తెలుగుదేశం గూటికే యార్లగడ్డ!

యార్లగడ్డ దారెటు అన్న విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమైంది. శుక్రవారం (ఆగస్టు 18)  యార్లగడ్డ తన ముఖ్య అనుచరులతో శుక్రవారం (ఆగస్టు 18)న సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోరినట్లు తెలిపారు. అంతే కాకుండా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయనను కోరనున్నట్లు చెప్పారు. తన విజ్ణప్తిని చంద్రబాబు పరిగణనలోనికి తీసుకుని పార్టీ టికెట్ ఇస్తే.. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా యార్లగడ్డ దారెటు అన్న చర్చకు తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్ల క్లారిటీ ఇచ్చేసి తెర దించారు. మొత్తం మీద రానున్న రోజులలో వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తడం ఖాయమంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం వాస్తవమేననడానికి యార్లగడ్డ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని  పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేలూ తాము తెలుగుదేశంకు దగ్గరౌతున్నామని విస్పష్టంగా చెప్పేశారు. అంతే కాకుండా రానున్న రోజులలో జగన్ పార్టీలో ఉండేవారెవరు, పార్టీని వీడి పోయే వారెవరు అన్న ప్రశ్నకు వైసీపీ అగ్రనాయకత్వమే కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితులలో ఉంది. రానున్న రోజులలో పార్టీ నుంచి వలసలు భారీగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.  మొన్నటికి మొన్న  విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా  నుండి మరో నాయకుడు యార్లగడ్డ పార్టీ వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే రాజధాని అమరావతికి అటు కృష్ణా, ఇటు గుంటూరు ఉమ్మడి జిల్లాలు ఈసారి ఎన్నికలలో విజేతలను నిర్ణయించడంలో అత్యంత కీలకం అన్న సంగతి తెలిసిందే.  జగన్ మూడు రాజధానుల  జపం పుణ్యమా అని ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో ఈసారి వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది  పరిశీలకుల విశ్లేషణ. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాలో చాలా మంది నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ   గన్నవరం వైసీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరడం ద్వారా  ఒక దారి చూపారని కూడా విశ్లేషకులు అంటున్నారు.   వాస్తవానికి   చాలా కాలంగా యార్లగడ్డ వైసీపీని వీడడం ఖాయమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతూనే ఉంది. అయితే ఈ రోజు వరకూ వరకూ ఆయన  స్వయంగా  పార్టీ మార్పు విషయం కానీ, ఏ పార్టీలో చేరతాను అన్న విషయాన్ని కానీ చెప్పలేదు.    వైసీపీ అధిష్టానం దిగివచ్చి తన అసమ్మతిని, అసంతృప్తిని అడ్రస్ చేసి.. ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తుందా అని ఇన్ని రోజులూ వేచి చూశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే రోజులు గడిచిపోతున్నా వైసీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో..   ఆయన తెలుగుదేశంలో చేరనున్నట్లు ప్రకటించేశారు.  బహుశా  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో  సాగుతున్న సమయంలో యార్లగడ్డ టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుగుదేశం వర్గీయులు చెబుతున్నారు.  గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేసి తన సత్తా చాటుకోవాలని యార్లగడ్డ ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నారనీ అంటున్నారు. ఇటీవల యార్లగడ్డ తన అనుచరులతో  ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఆ సందర్భంగా చేసిన ప్రసంగం కూడా ఆయన తెలుగుదేశం గూటికి చేరనున్నారని అంతా భావించడానికి కారణమైంది.  ఎక్కడో అమెరికాలో వ్యాపారాలు చేసుకునే యార్లగడ్డను  వైసీపీ   2019 ఎన్నికల సమయంలో  అతి కష్టమ్మీద పార్టీలో చేర్చుకుంది. అప్పుడు తెలుగుదేశం నుండి గన్నవరం బరిలో ఉన్న వల్లభనేని వంశీని ఓడించడమే లక్ష్యంగా యార్లగడ్డని గన్నవరం బరిలో నిలబెట్టింది. తన రాజకీయ అరంగేట్రం విజయంతో ఆరంభం కావాలన్న ఉద్దేశంతో నాటి ఎన్నికలలో యార్లగడ్డ భారీగానే ఖర్చు చేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే ఆ ఎన్నికలలో రాష్ట్రం అంతటా వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వీచినా తెలుగుదేశంకు గట్టి పట్టు ఉన్న గన్నవరంలో మాత్రం ఓటమి చవిచూసింది. దీంతో వైసీపీ యార్లగడ్డను పక్కన పెట్టేసి తెలుగుదేశం తరఫున విజయం సాధించిన వల్లభనేని వంశీని పార్టీ పంచన చేరుకుంది. వంశీ కూడా అధికారికంగా వైసీపీ తీర్ధం కప్పుకోకపోయినా.. ఆయన వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు.  వచ్చే ఎన్నికలలో గన్నవరం వైసీపీ టికెట్ వల్లభనేని వంశీకే దక్కుతుందనీ, ఈ మేరకు ఇప్పటికే వంశీకి జగన్ స్పష్టత ఇచ్చారనీ అంటున్నారు. దీంతో సహజంగానే యార్లగడ్డ వైపీపీతో చాలా కాలంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా వంశీపై బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన ఎప్పుడో వైసీపీతో అనుబంధం తెంచుకున్నారనీ, ఇక ఇప్పుడు పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ఆయన చేసిన ప్రకటన లాంఛనమేని అంటున్నారు.    

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్‌ సాయన్నఅనారోగ్యంతో మరణించారు.అయితే ఆయన  మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి.  మల్లారెడ్డి కొద్దిరోజుల క్రితం వరకూ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో  కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో  ఆయన మావోయిస్టు కార్యకలాపాలలో చురుకుగా వ్యవహరించారు. . ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. 

జగనన్న వదిలిన బాణం రివర్స్

ఏపీలో జగన్ పాలన మొత్తం రివర్స్ లో సాగుతోంది. ప్రత్యర్థులపైకి విపక్షంలో ఉండగా ఆయన వదిలిన బాణం సోదరి షర్మిల కూడా ఇప్పుడు రివర్స్ అయ్యారు.  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారా అంటే నిన్న మొన్నటి వరకూ  ఏమో చెప్పలేం అన్న సమాధానమే వినిపించింది. కానీ  ఇప్పుడు  స్పష్టత వచ్చేసింది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. అలాగే విలీనం కోసం కాంగ్రెస్ విధించిన షరతులు, చేసిన ప్రతిపాదనలకు కూడా ఒకే చెప్పేశారు.  ఇప్పుడు షర్మిల పార్టీ విలీనమే   తెలంగాణ, ఏపీ రాజకీయాలలో హాట్ టాపిగ్ గా మారిపోయింది. త్వరలోనే ఈ విలీనం ప్రక్రియ పూర్తి కానుందనీ, ఆ తర్వాత షర్మిల ఏపీ రాజకీయాలలో కీలకం కానున్నారని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్యా ఈ మేరకు అంగీకరం కుదిరిందనీ, షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకారం తెలిపారనీ, ఇక మిగిలింది అధికారిక విలీనం ప్రక్రియ మాత్రమేనని, అది కూడా ఈ నెలలోనే పూర్తి అవుతుందని ఇరు పార్టీలలోని కీలక నేతలూ బాహాటంగానే చెబుతున్నారు.  తానే అధ్య‌క్షురాలిగా మొదలైన వైఎస్ఆర్టీపీ పార్టీ మొదట్లో కాస్త దుడుకుగా కనిపించినా అది పాలపొంగులా చల్లారిపోయింది. తెలంగాణ సమాజం షర్మిలను సీరియస్ గా పట్టించుకోలేదు. అందుకే ఆ పార్టీ ప్ర‌జ‌ల్లోకి  వెళ్ల‌లేక‌పోయింది. దీంతో కీల‌క నాయ‌కులు ఒక్కొక్క‌రిగా పార్టీని వ‌దిలేసి వెళ్లిపోయారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ మైలేజి బాగా పెరిగింది.   సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక  ఉపముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ రంగంలోకి దిగి షర్మిల ముందు విలీనం ప్రతిపాదన ఉంచారు.  అక్కడ నుంచి ఎన్నో చర్చలు, సందేహాలు, మలుపుల తరువాత ఆ ప్రతిపాదనకు షర్మిల అంగీకరించారు.  కాగా, షర్మిల పార్టీ విలీనం అధికారికంగా ప్రకటించిన తరువాత ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపడితే.. ఆమె తన విమర్శల వాగ్బాణానలు సంధించాల్సింది మొట్టమొదట తన  అన్న జగన్ పైనే.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేకులపై విమర్శలతో చెలరేగిపోయిన షర్మిల ఇప్పుడు తనను వదిలిన జగనన్ననే టార్గెట్ చేసుకుని పని చేయాల్సి ఉంటుంది. అదీకాక ఇప్పుడు  వైసీపీలో కనిపిస్తున్న నేతలు, కార్యకర్తలు అందరూ పాత కాంగ్రెస్ నేతలే. కనుక షర్మిల ఇప్పుడు ఏపీలో క్రియాశీలంగా మారగానే  మొదట టార్గెట్ చేయాల్సింది వైసీపీనే. యుద్ధం చేయాల్సింది అన్న జగన్మోహన్ రెడ్డితోనే.  దీంతో షర్మిల ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే చర్చ సహజంగానే మొదలైంది. ఏపీకి వెళ్లాలా వద్దా అని నిన్న మొన్నటి వరకూ తర్జన భర్జన పడిన షర్మిల.. ఇప్పుడు ఎందుకు ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల.. జగన్ జైల్లో ఉండగా వైసీపీ పార్టీకి అన్నీ తానై నడిపించారు. ఇప్పుడు ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి అదే వైసీపీ మీద పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అన్నదే ఇప్పుడు ఇక్కడ ప్రధానాంశంగా మారింది. తన అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న షర్మిల ఇప్పుడు అదే అన్న ముఖ్యమంత్రిగా ఉండగానే  ఆయన ప్రభుత్వంపైనే దండయాత్రకు రెడీ అయిపోయారు.  నిజానికి ఏపీకి వెళ్లడం ఇష్టం లేకనే షర్మిల కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు సాగదీశారు. కానీ, అదే సమయంలో ఏపీ ప్రభుత్వ పెద్దల నుండి, సొంత అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోటరీ నుండి వేధింపులు ఎక్కువ కావడం.. తిరిగి ఏపీ రాజకీయాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని బెదిరింపులు రావడం వంటి పరిణామాలే షర్మిలను అన్నపై పోరాటానికి సిద్దపడేలా చేశాయని వైఎస్ కుటుంబం సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో షర్మిల భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ షర్మిలకు అండగా నిలుస్తామని, అన్ని విధాలుగా సహకారం అందిస్తామనీ హామీ ఇచ్చారనీ రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే షర్మిల అన్నపై పోరాటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే ఒకప్పుడు జగనన్న వదలిన బాణాన్నీ అని జగన్ కోసం ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు అదే అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ పెద్దలు ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారని.. ఇప్పటికే నాయనా భయానా షర్మిల, విజయమ్మలను ఏపీ రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ చేసిన రాయబారాలు విఫలమయ్యాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.