తిరుపతి కొండపైనా.. కొండ కిందా పెత్తనం ఎవరిదంటే?

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో కీలక పదవులు, ఉన్నతాధికారులు, నామినేటెడ్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల సలహాదారులు ఇలా ఎక్కడ చూసినా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారి పేర్లే వినిపిస్తున్నాయి. పలు సందర్భాలలో ఏదైనా ఒక పదవి ఖాళీ కాగానే ఎన్నో పేర్లు వినిపించినా చివరికి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే ఆ పదవి దక్కుతుంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు కొన్ని వందలసార్లు ఆరోపణలు చేయగా.. సోషల్ మీడియాలో నెటిజన్లు  ఏకిపారేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే ఈ తరహా ఆరోపణలు వచ్చినా ఈ నాలుగేళ్ళలో ఇవి మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా ఏ మాత్రం పట్టించుకోని జగన్ రెడ్డి సామజిక వర్గానికే పదవులలో పెద్ద పీఠ వేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణే తిరుపతి. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల దేవస్థానం నుండి కొండ కింద తిరుపతి పట్టణం, తిరుపతి రూరల్ ఇలా ఎక్కడ చూసినా అంతా రెడ్డి సామాజికవర్గం వారికే పదవులు కట్టబెట్టారు.  సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియగానే టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్ళగా వైవీ సుబ్బారెడ్డే చైర్మన్ కాగా మరో రెండేళ్లు కరుణాకర్ రెడ్డికి అప్పగించారు. అదలా ఉండగానే తాజాగా తిరుపతి నగరాభివృద్థి సంస్థ తుడా ఛైర్మన్ గా మోహిత్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరుపతి గ్రామీణ నియోజకవర్గమైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడే మోహిత్ రెడ్డి. జగన్ సీఎం అయిన నాటి నుంచి ఇప్పటివరకు తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవిలో ఉండగా.. ఇప్పుడు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి ఆ పదవి అప్పగించారు. తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం రానున్న మూడేళ్ల పాటు తుడా ఛైర్మన్ గా మోహిత్ రెడ్డి వ్యవహరించనున్నారు. మరోవైపు మోహిత్ ఇప్పటికే తిరుపతి గ్రామీణ మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు అదనంగా తుడా చైర్మన్ పదవిని చేపట్టాడు. అంతేకాదు, చంద్రగిరికి నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జిగా కూడా ఆయనే.  వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా మొహిత్ రెడ్డి బరిలోకి దిగడం లాంఛనమే.  మరోవైపు ఈ మధ్యనే మరోసారి టీటీడీకి చైర్మన్ గా ఎంపికైన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూడా తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం ఉంది. దీనిని బట్టి చూస్తే.. ఇటు చెవిరెడ్డి, అటు భూమన ఈ రెండు కుటుంబాలలో పదికి పైగా పదవులు ఉన్నాయి. అంతే కాదు, తిరుమల కొండపైన చైర్మన్ తర్వాత కీలక పదవులైన.. ఈవో, జేఈవోలు కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. కొండ కిందకి వస్తే తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీలు, తిరుపతి ఆర్డీవో, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఇలా ఎక్కడ చూసినా కీలక ఉన్నత పదవులలో వారే ఉన్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవులలో ఉన్న   రెడ్డి సామాజికవర్గ నేతల లిస్టు ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో సలహాదారుల నియామకంలో కూడా సీఎం జగన్ ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులన్నీ కట్టబెడుతున్నారని.. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామజిక వర్గాలలో ఎవరూ సమర్థులైన వారు సీఎం కంటికి కనిపించడం లేదా అని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ పదవుల పందేరంలో రెడ్డి సామాజికవర్గమే సీఎం జగన్ కు కనిపించడం శోచనీయం.

జగన్ కొత్త నినాదం మూడు రాజధానులు మూడు ప్రాంతాల హక్కు!

దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నాం. సింపుల్ గా సూటిగా చెప్పాలంటే ఇదీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ 2019 లో చేసిన ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డే ఈ విషయాన్ని ముందు బయటపెట్టగా.. ఆ తర్వాత మిగతా వైసీపీ నేతలు ప్రజల చెవులలో ఊదరగొట్టారు. అయితే ప్రభుత్వం ఇది ప్రకటించి నాలుగేళ్లు కాబోతుంది. మరి మూడు రాజధానులు ఎక్కడ అంటే చేస్తాం.. చూస్తాం అంటున్నారు. అసలు ఇంతకీ ఇది సాధ్యమేనా అని అడిగితే తప్పకుండా చేస్తాం.. మా నాయకుడిపై మాకు నమ్మకం ఉందని వైసీపీ నేతలు చెప్తారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదు. మరి నాలుగేళ్ళలో చేయలేనిది.. ఈ 8,9 నెలలలో చేస్తారా?. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి ఏపీ ప్రభుత్వానికే లేదు. ఎందుకంటే ఈ విషయం  ప్రస్తుతం కోర్టు ఉంది. సో మూడు రాజధానులు అంటూ మాట్లాడేందుకు అవకాశమే లేదు.  ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు చేత చాలాసార్లు మొట్టికాయలు తిన్నది. అక్షింతలు వేయించుకున్నది. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందం.. సీఆర్డీయే చట్టం ప్రకారం హైకోర్టు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం తీర్పు వచ్చే వరకూ మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై మాట్లాడినా.. మూడు రాజధానుల ఏర్పాటుకు సాహసించినా అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. అయితే, ఇందులో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని జగన్ సర్కార్ కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తున్నది. అమరావతిలో పేదలకు పట్టాలిచ్చి ఇళ్లు కట్టించాలని చూడడం కూడా అలాంటిదే. అందులో మరోసారి హైకోర్టు కలుగజేసుకొని చివాట్లు పెట్టడంతో దానికి కూడా బ్రేక్ పడింది. మరోవైపు విశాఖ రుషికొండపై సెక్రటేరియట్ కడుతున్నది. ఈ విషయాన్ని బయటకి చెప్తే కోర్టు సమస్యలొస్తాయని దొంగతనంగా నిర్మాణాలు చేపడుతున్నది. ఇక, కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడకూడదని తెలిసే ఈ మధ్య కాలంలో సీఎం జగన్ ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. అంతకు ముందు సీఎం ఎక్కడ అడుగుపెట్టినా ఈ రాజధానుల అంశంపై ఏదో ఒక ప్రకటన చేయడం.. ప్రజలలో అది చర్చకు రావడం జరిగేది. కానీ, ఈ మధ్య అది తగ్గింది. అయితే, ఉన్నట్లుండి ఇప్పుడు మరోసారి   రాజధానుల అంశంలో సీఎం జగన్ మరో కొత్త నినాదం అందుకున్నారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుగుతుండగా జగన్ మరోసారి మూడు రాజధానుల కుంపటిని రగిలించారు.  విజ‌య‌వాడ‌లో జ‌రిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం మ‌రోసారి మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా అమలు చేయబోతున్నామన్నారు. యధావిధిగా ప్రతి సభలో జగన్ మాట్లాడినట్లే ఇక్కడ కూడా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తడబడుతూనే చదివి వినిపించారు. ఇందులో  ఆనాడు భార‌తంలో సైంధ‌వుడు ఉండేవాడ‌ట‌. అయినా జ‌ర‌గాల్సిన న్యాయం జ‌రిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది సైంధ‌వులు ఉన్నారు. మూడు ప్రాంతాల‌కు మంచి జ‌ర‌గ‌కూడ‌ద‌నివారు కోరుకుంటున్నారు. అయినా.. న్యాయ‌మే గెలుస్తుంది. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల హ‌క్కుగా అమ‌లు చేయ‌బోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే, సైంధ‌వులు అని జగన్ ఎవరిని అన్నారో చెప్పాల్సింది. ఎందుకంటే ఇక్కడ జగన్ మూడు రాజధానులను అడ్డుకుంటుంది చట్టం, అమరావతికి కోట్ల విలువ చేసే భూములను రూపాయి తీసుకోకుండా ఇచ్చిన ఆ ప్రాంత రైతులు. మరి జగన్ వారినే సైంధ‌వులు అన్నారా?   నిజానికి ముందు నుండి మూడు రాజధానులకు బ్రేక్ పడుతున్నది గత ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందం.. సీఆర్డీఏ చట్టం వలనే. ఈ చట్టాన్ని కాదని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే ఏపీ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను అమరావతి రైతులకు చెల్లించాలి. అయితే, జగన్ అలా కాకుండా అమరావతి రైతులను మోసం చేస్తూ రాజధానిని తరలించాలని చూస్తున్నారు. అందుకే కోర్టులలో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. కానీ, ప్రజలకు మాత్రం ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఇదే చేస్తున్న సీఎం.. ఇప్పుడు ఇలా మూడు రాజధానులు మూడు ప్రాంతాల హక్కు అంటూ కొత్త నినాదంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఉగ్రవాదం కాదు.. ప్రజాస్వామ్యమే.. రయీద్ మట్టు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ఉగ్రవాది సోదరుడు జాతీయ జెండా ఎగుర వేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు జావేద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టు జమ్మూ కాశ్మీర్ లోని సోసోర్ లో తన నివాసం వద్ద  మువ్వన్నెల జెండా ఎదురవేసి తన దేశ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. రయీస్ మట్టూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెంటనే అవి వైరల్ అవ్వడమే కాకుండా రయీస్ మట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోసోర్ లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన మట్టూ..  భారత పౌరులుగా తాము ఎంతో గర్వపడతామని, ఎప్పటికీ భారతీయులుగా ఉంటామన్నారు. ఆయన ప్రసంగానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. మట్లుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడైన   జావెద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి శకం మొదలైందనీ, దేశంలోని ఇతర ప్రాంతాలకు దీటుగా పురోగమిస్తోందనీ చెప్పారు. కశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తన సోదరుడు కూడా ఉగ్రమార్గాన్ని వదిలి వెనక్కు రావాలని కోరారు. దేశ ప్రగతిలో కాశ్మీర్ భాగస్వామ్యం కొనసాగుతుందనీ, రాష్ట్రంలో ఉగ్రవాదం సమసిపోయి సౌభ్రాతృత్వం పరిఢవిల్లుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  2009లో తన సోదరుడు ఉగ్రవాదిగా దారి తప్పాడనీ, అప్పటి నుంచీ అతడిని చూసింది లేదనీ చెప్పిన రయీస్ మట్టు, ఒక వేళ తన సోదరుడు  బతికుంటే తిరిగి ఉగ్రమార్గాన్ని విడిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.  తాము నిజమైన భారతీయులుగా తమ మాతృభూమిలోనే నివసిస్తామని విస్పష్టంగా చెప్పారు. 

పిండైపోతున్న రుషికొండ.. ముప్పు ముంగిట విశాఖ?

అందమైన బీచ్.. సముద్ర అలల చప్పుడుకు తోడు నీటిపై నుండి వీచే చల్లని గాలి. బీచ్ ను ఆనుకొనే ఆకుపచ్చని రంగులో ఆహ్లాదాన్ని విరజిమ్మే రుషికొండ. అటు రుషికొండ.. ఇటు బీచ్ కలిసి ప్రకృతి ప్రేమికులను, కాస్త సేదదీరాలని ఆరాటపడే విశాఖ నగర వాసులను రా రమ్మని పిలుస్తుంటాయి. పర్యాటకుల తాకిడికి తగ్గట్లే ఇక్కడ రెస్టారెంట్లు, రిసార్టులు వెలిశాయి. ఇంకాస్త ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తే విశాఖ నగరానికి మరింత ఆదాయం తెచ్చి పెట్టే బంగారు   అవుతుంది. అయితే, అభివృద్ధి ఏమో కానీ ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారు ఏపీ సీఎం జగన్. నాలుగేళ్ల వైసీపీ హయాంలో రుషికొండను పిండి చేశారు. ఇప్పటికే సగం బోడి గుండు చేసిన ఈ కొండను ఇప్పుడు నిర్మాణాల పేరుతో పూర్తిగా తవ్వేస్తున్నారు.  రుషికొండ అంటే రాతితో కూడిన ఎర్రమట్టి దిబ్బ. గత నాలుగేళ్లలో ఈ కొండను అక్రమార్కులు తవ్వేశారు. భారీ పరదాలు కట్టి లోలోపల ఈ మట్టి తవ్వకాలు జరిపించేశారు. సగం కొండ కరిగిపోయే వరకూ ఈ అంశం వెలుగులోకి రాకుండా మేనేజ్ చేశారు. అంతకు ముందు పచ్చగా కనిపించే కొండ సగం ఎర్రగా మారిపోవడంతో ఈ మట్టి తవ్వకాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. ఇక, అంతకు ముందు ఈ కొండలపై చెట్లు చేమలు ఉండడంతో ఎంతటి వర్షాలు పడినా ఈ ఎర్రమట్టి కరిగేది కాదు. కానీ, అక్రమ తవ్వకాలతో ఇప్పుడు వర్షాలకు మట్టి కరిగి కారిపోతున్నది.   వర్షం పడితే చాలు కొండపై నుండి ఎర్రమట్టి వర్షపు నీటితో కలిసి బీచ్ రోడ్డుపై పేరుకుపోతున్నది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఈ కొండపై నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర సచివాలయమే ఇక్కడ కడుతున్నారని వైసీపీ అధికారికంగా ప్రకటించి మళ్ళీ తూచ్ ఇక్కడ కట్టేది పర్యాటక భవనాలు అంటూ కవర్ చేసుకుంది.  అనధికారికంగా అయినా విశాఖ నుండి పాలన సాగించాలని ఆరాటపడుతున్న సీఎం జగన్ కోసమే రుషికొండను తవ్వేసి భవనాలు కడుతున్నారని అందరికీ స్పష్టంగా అర్ధమౌతోంది. వైసీపీ ప్రభుత్వం చెప్పుకోలేకపోయినా రుషికొండ ఇప్పుడు వైసీపీ నేతల కొండగా మారిపోయింది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇక రుషికొండ కాలగర్భంలో కలిసిపోయినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. మరి అదే జరిగితే విశాఖ నగరాన్ని కాపాడేదెవరు అన్నదే ఇప్పుడు పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికుల ప్రశ్న. ఇప్పటి వరకూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఈ రుషికొండనే వైజాగ్ నగరాన్ని కాపాడుతూ వచ్చింది. గతంలో హుద్ హుద్ తుఫాన్ సమయంలో రుషికొండ లేకపోతే వైజాగ్ నగరాన్ని మర్చిపోవాల్సి వచ్చేదని అప్పట్లో పర్యావరణ శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెప్పారు. సముద్ర ఆక్రోశం నగరాన్ని తాకకుండా రుషికొండ అడ్డుగా నిలిచింది. అప్పటికే ఆ తుఫాన్ సమయంలో పెను గాలులకు విశాఖ చిగురుటాకులా వణికింది. అదే రుషికొండ లేకపోతే ఏం జరిగేదో ఊహిస్తేనే వణుకు పుడుతుంది.   సముద్రంలో ఏర్పడే ఉపద్రవాల నుండి విశాఖ నగరాన్ని కాపాడేందుకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందే రుషికొండ. అందుకే ఈ ప్రాంతాన్ని తీర ప్రాంత నిబంధనలు సీఆర్‌జెడ్ ప్రాంత పరిధిలోకి తీసుకొచ్చారు. తీరాన్ని కాపడటానికి, భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాల నుంచి వచ్చే ప్రమాదాల్ని కాపాడుకోవడానికి రుషికొండ లాంటి ప్రకృతి సిద్ధ నిర్మాణాలు ఉండాలని, వాటికి ఇబ్బంది కలగకూడదనే సీఆర్‌జెడ్ నిబంధనలు తెచ్చారు. కానీ, నిబంధనలను తుంగలోతొక్కి ఇప్పుడు మొత్తం నాశనం చేశారు. దీంతో భవిష్యత్తులో విశాఖ నగరాన్ని కాపాడే వారెవరన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక వ్యక్తి పంతం భవిష్యత్తులో ఎందరిని బలి తీసుకుంటుందోనని విశాఖ నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తన పంతమే నెగ్గాలనుకున్నా నగరంలో ఇన్ని అవకాశాలు ఉండగా వారి చూపు రుషికొండపై పడడం విశాఖ వాసుల దౌర్భాగ్యంగా భావించాలి. తాను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని ఆశపడుతున్న సీఎం జగన్.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి   కొండపై కొలువుదీరాలనుకోవడం ఏ విధంగా చూసినా సమంజసం కాదని అంటున్నారు.  

జగన్ ఒవైసీ భేటీ.. మర్మమేంటి?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి కలవనున్నట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల  పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్నది. అది కూడా హైదరాబాద్ నుండి తాడేపల్లి వెళ్లి మరీ   అసదుద్దీన్ సీఎం నివాసంలోనే భేటీ అవుతారంటున్నారు. మధ్యాహ్నం లంచ్ మీటింగ్ గా ఇది ఉండబోతుందని కూడా వైసీపీ వర్గాల సమాచారం. సీఎం జగనే స్వయంగా అసదుద్దీన్ ను తాడేపల్లి ఆహ్వానించారనీ, ఈ భేటీ త్వరలోనే ఈ భేటీ జరగనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.  దీంతో అసలు ఈ ఇద్దరు నేతల భేటీ వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది. అసలు ఈ నేతల మధ్య గతంలో ఎలాంటి అనుబంధం లేదు. ఇప్పుడు రాజకీయంగా కూడా ఎక్కడా వీరికి సంబంధాలు లేవు. జగన్   వైసీపీ  తెలంగాణతో తెగదెంపులు చేసుకోగా.. ఓవైసీ హైదరాబాద్ పునాదిగా రాజకీయాలు చేసుకుంటున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎంఐఎం పోటీ చేసినా ఇప్పటి వరకూ ఏపీలో మాత్రం పోటీ చేయనేలేదు. మరి ఇలాంటి సమయంలో ఈ భేటీ ఏమిటి? ఎందుకు? అన్న ఆసక్తి సర్వత్రా కలుగుతోంది. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరూ హైదరాబాద్ లేదా విజయవాడలో ఎక్కడా కలసిన దాఖలాలు అయితే లేవు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు   అసదుద్దీన్ వెళ్లి కలిసి వచ్చారు. అలాగే  గతంలో ఒకసారి రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నిలబెట్టిన రాష్టప్రతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని గెలిపించేందుకు చంచల్‌గూడ జెైల్లో ఉన్న వెైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవెైసీ కలిశారు. అప్పుడు యూపీఏ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలిగిన నేపథ్యంలో ఆ స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ కు మద్దతివ్వాలని.. కాంగ్రెస్‌ రాయబారిగా ఒవెైసీ జగన్‌తో మాట్లాడి రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని కోరారు. ఆ సమయంలో జగన్ తల్లి విజయమ్మతో కూడా అసదుద్దీన్   చర్చించారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా ఈ రెండు పార్టీల నేతలు కలిసిన దాఖలాలు లేవు.  అయితే, ఇప్పుడు ఒక్కసారి లంచ్ మీటింగ్ లో ఇరువురు నేతలూ కలవనున్నారన్న సమాచారంతో ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైందిప.  ఎంఐఎం ఒక్కో రాష్ట్రంలో తమ ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏపీలో కూడా ఇలాంటి ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టే ఉద్దేశ్యంతోనే జగన్ మోహన్ రెడ్డిని కలిసి మద్దతు కావాలని కోరుతుందా అనే చర్చ ఒకటి జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో ఏపీలో ముస్లిం మైనార్టీలు వైసీపీకి ఎక్కువగా మద్దతుగా ఉన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ తో ఉన్న ఈ వర్గం ఆ తర్వాత వైసీపీ వైపు మళ్లింది. అదే సమయంలో టీడీపీ 2014లో బీజేపీతో పొత్తుకు వెళ్లడం కూడా ఈ వర్గం జగన్మోహన్ రెడ్డి వైపు చూసేలా చేసింది. కానీ  వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ వర్గాన్ని అసలు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రత్యేకించి వీరి కోసం నాలుగేళ్ళలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవడంతో ఈ వర్గం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.  ఈ నేపథ్యంలో ఓవైసీను ఇక్కడ రంగంలోకి దింపి ప్రచారం చేయించడం.. కావాలంటే ఎంఐఎం పార్టీ కూడా ఏపీలో పోటీ చేసేలా పొత్తుకు దిగి ఎక్కడో చోట కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా పోటీ చేయించి మైనార్టీల ఓట్లను గంపగుత్తగా తన వైపుకు తిప్పుకొనే ప్రణాళిక ఏమైనా జగన్ మదిలో ఉందా అన్న చర్చ కూడా మొదలైంది.  ఈసారి మళ్ళీ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న   వైసీపీ అందులో భాగంగానే ఓవైసీ రాకకు ఆహ్వానం పలికిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అసలు ఈ భేటీ వెనక మూల కారణం ఏంటన్నది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందేనని పరిశీలకులు భావిస్తున్నారు.

చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ 2047

విజనరీ నారాచంద్రబాబునాయుడు విజన్ 2047 పేరిట ఒక డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఈ డాక్యుమెంట్ ని మంగళవారం (ఆగస్టు 15) విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు.   గ్లోబల్ లీడర్ గా భారత్ ఆవిర్భవించేందుకు ఐదు వ్యాహాలు  పేరుతో విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న చంద్రబాబు నాయుడు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం కొన్ని నెలలుగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్ఫర్మేషన్  (జీఎఫ్ఎస్టీ) బృందం పని చేస్తున్నది. జీఎఫ్ఎస్టీ చైర్మన్ అయిన చంద్రబాబునాయుడు  మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు, పలు రంగాల నిపుణుల సమక్షం లో  విశాఖలో ఈ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తారు. ఈ డాక్యుమెంట్ 2947 ను మేధావులు, వివిధ రంగాల నిపుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థుల సమక్షంలో విడుదల చేస్తారు.  గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఈ సంస్థ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటైనది. ఈ సంస్థకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైర్మన్‌గా ఉన్నారు. దీనిలో ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు ఉన్నారు. విధానాల రూపకల్పన, పరిశోధన, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలకు జిఎఫ్ఎస్టి వేదికగా పనిచేస్తోంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమల, ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, టెక్నాలజీ, ఎనర్జీ, స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్, వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్యం వంటి అంశాలపై జిఎఫ్ఎస్‌టి పని చేస్తుంది.   2047లో దేశం స్వాతంత్ర్యం సాధించి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ నాటికి  ఇండియా  ప్రపంచ లోనే నంబర్   1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా@100 అనే కాన్సెప్ట్‌పై జిఎఫ్ఎస్టి పనిచేస్తుంది. ఆయా రంగాల నిపుణులు, విద్యావేత్తలు, సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో  జీఎఫ్ఎస్టీ నివేదికలు సిద్దం చేస్తుంది.   77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  తెలుగుజాతి భవితవ్యాన్ని తీర్చిదిద్ధేందుకు... 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్ గా మలిచే వ్యూహాలపై చర్చించేందుకు... తనతో కలిసి రావాలని యువతను , మేధావులను  చంద్రబాబు పిలుపునిచ్చారు.   తనతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు ఆగస్టు 15 మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం  వద్దకు చేరుకోవాల్సిందిగా  పిలుపునిచ్చారు.  అదే రోజు   సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్స్ లో యువతతో ముఖాముఖి సదస్సులో ఆయన పాల్గొంటారు.

వివేకా హత్య.. ఏం జరిగిందో విజయసాయి చెప్పకనే చెప్పేశారా?

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగస్ట్ 10వ తేదీన ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు... రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏమిటంటే.. ఆంధ్రాపై పెత్తనం కోసం హైదరాబాద్‌లో ఉండే కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారు. హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్రపన్నుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విన్నవించుకుంటున్నా! .అంతే.. ఆ ట్వీట్ పై ఆంధ్రప్రదేశ్‌ పోలిటికల్ సర్కిల్‌లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ట్విట్ వెనుక ఉన్న అర్థం.. పరమార్థం ఏమిటన్నది అంతుపట్టడం లేదని ఆ సర్కిల్‌లో ఓ చర్చ జరుగుతోంది.  ఆంధ్రాపై పెత్తనం కోసం హైదరాబాద్‌లో ఉండి కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారని.. హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్రపన్నుతున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజయసాయిరెడ్డి చేసిన ఈ తాజా ట్విట్  2019 ఎన్నికలకు  ముందు... అప్పటి విపక్ష నేత జగన్ సొంత చిన్నాన్న, మాజీ మంత్రి  పులివెందులలోని తన సొంత ఇంట్లో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అప్పటి  ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్.. హైదరాబాద్‌లోనే ఉన్నారు. హత్య జరిగిన తరువాత ఆయన తాపీగా సాయంత్రం పులివెందులకు చేరుకొని..  తన చిన్నాన్నా ఇంత దారుణంగా హత్యకు గురి కావడం,  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై కోడికత్తితో దాడి జరగడం వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ..  పులివెందుల్లో వివేకా మృతదేహం వద్దే మీడియా ముందు  ప్రకటించారని.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎన్నికలు రావడం.... ఆ ఎన్నికల ఫలితాల్లో ఎవరు, ఏ పార్టీ భారీగా లబ్ది పోందిందో అందరికీ తెలిసిందేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పట్లో ఆ హత్య, ఆ కోడికత్తి దాడి వల్ల ఎవరికి సానుభూతి పవనాలు వీచాయో తెలిసిందేనని అంటున్నారు. ఇంకోవైపు వైయస్ వివేకా అత్యంత దారుణంగా హత్యకు గురి అయితే.. వైయస్ వివేకా గుండెపోటుతో మరణించారంటూ మార్చి 15వ తేదీ ఉదయం 6.00 గంటలకే ఇదే విజయసాయిరెడీ మీడియా ముందుకు వచ్చి మరీ  ప్రకటించారని... అయితే ఈ వివేకా హత్య కేసు విచారణ.. సీబీఐ చేతిలోకి వెళ్లిన తర్వాత.. నిందితుల్లో ఒక్కరైన దస్తగిరి అప్రూవర్‌గా మారి.. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రదారులు ఎవరో వారి పేర్లు బయటకు పొక్కినా కూడా.. విజయసాయిరెడ్డి పేరు ఎక్కడా మాత్రం కనిపించలేదు. వినిపించలేదని.. కానీ అదే విజయసాయిరెడ్డి ఇలా ట్విట్ చేయడం చూస్తుంటే.. ఎక్కడో ఏదో తేడా కొడుతోందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది.  2019 ఎన్నికల ముందు నాటి ఘటనలు మళ్లీ రాష్ట్రంలో పునరావృతమవుతాయా? అంటే.. ఏమో అనే సందేహం సైతం వ్యక్తమవుతోంది. అలా అయితే ఈ సారి సానుభూతి పొందేందుకు దారుణాలకు పాల్పడే అవకాశాలున్నాయంటూ విజయసాయి చేసిన ట్వీట్ ప్రధాన్యత సంతరించుకుంది.  గతంలో తమకు సానుభూతి పవనాలు వీచేలా చేసిన రెండు సంఘటనలలోనూ ఇప్పటికీ నిందితులు ఎవరన్నది తేలలేదు. వివేకా హత్య కేసు అయితే దర్యాప్తు పూర్తయ్యింద. కోర్టులో విచారణ జరుగుతోంది. దర్యాప్తు సందర్భంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాడు నారాసుర రక్త చరిత్ర అంటూ ఊరూ వాడా ఏకం చేసిన వారు దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలతో నోరెత్తలేని స్థితిలో పడ్డారు. నాడు ఎవరైతో నారాసుర రక్త చరిత అంటూ ఆరోపణలు గుప్పించారో వారే నేడు సీబీఐ దర్యాప్తులో అనుమానితులుగా, నిందితులుగా తేలారు. ఇక ఇప్పుడు నాలుగున్నరేళ్ల తరువాత విజయసాయి రెడ్డి మళ్లీ ఎన్నికలలో సానుభూతి కోసం దారుణాలు, హత్యలు అంటూ ప్రస్తావించారు. ఆయన చెప్పినట్లుగా అప్పట్లోలా విపక్షాలకు చెందిన నాయకులెవరూ హైదరాబాద్ లో తాపీగా కూర్చుని లేరు. తెలుగుదేశం అధినేత, జనసేనాని ఇరువురకూ కూడా ప్రజల మధ్యలో బిజీబిజీగా ఉన్నారు. దీంతో విజయసాయి ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసినదీ, ఎవరిని టార్గెట్ గా చేశారు అన్న అనుమానాలు  రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. 

పవార్ మహా రాజకీయం.. ఇండియా కూటమికి చిక్కులేనా?

శరద్ పవార్ అంటేనే కాకతు తీరిన రాజకీయ దురంధరుడు. ఆయన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలూ చివరి నిముషం వరకూ ఎవరికీ అర్ధం కావు. తన రాజకీయ చతురత, వ్యూహాలతో 38 సంవత్సరాల పిన్న వయస్సులోనే మహారాష్ట్ర వంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయ పరమపద సోపానపటంలో నిచ్చెనలే ఎక్కుతూ వచ్చారు.  ఆయనతో ఢీ కొన్న వారే పాముల బారిన పడ్డారు. కాంగ్రెస్ ను ఢీ కొని  నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ స్థాపించి కూడా నిలదొక్కుకుని స్వల్ప కాలం మినహా అధికారంలో కొనసాగారంటే ఆయన రాజకీయ రణరంగపుటెత్తులు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆయన చుట్టూనే మహా రాజకీయాలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఒక్క మహా రాజకీయాలనేమిటి?   82 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.   999లో ఎన్సీపీని స్థాపిస్తే అప్పటినుంచి 2014 వరకు మహారాష్ట్రలో  ఎన్సీపీయే అధికారం చెలాయించింది.  శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు చూశారు.  2019-22 మధ్య ఎన్సీపీ అక్కడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామి. దీన్నిబట్టే పవార్ లకు పవర్ తో ఎంత అనుబంధం ఉందో తెలిసిపోతుంది. అయితే.. నిరుడు మహా వికాస్ అఘాడీ సర్కారు కూలిపోవడంతో అజిత్ పవర్ కోల్పోయారు. దీంతో ఏకంగా బాబాయ్ ను ధిక్కరించి ఎన్సీపీని నిట్టనిలువుగా చీల్చి బీజేపీ సర్కారులో చేరిపోయారు.   ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరో వైపు శరద్ పవార్ ప్రతిపక్ష  ఇండియా కూటమి ఏర్పాట్ల ప్రయత్నాల్లో ఉంటే.. మరోవైపు అజిత్ ఆయనకు వెన్నుపోటు పొడిచినట్లు ఇప్పటి వరకూ అంతా భావించారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే..ఇదంతా శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  అసలు ఎన్సీపీ చీలిక తరువాత చీలిక వర్గం ఎమ్మెల్యేలు శరద్ పవార్ ను కలిసి ఆశీస్సులు తీసుకోవడం.. ఆయన ఆశీర్వదించడం వంటి వరుస సంఘటనలతో అప్పట్లోనే శరద్ పవార్ ఏదో వ్యూహంతోనే  తెర వెనుక నిలబడి ఇదంతా జరిపించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.  ఇప్పటికీ శరద్ పవార్ ఇండియా కూటమిలోనే ఉన్నారని బయటకు కనిపిస్తున్నది. తన శ్రేయోభిలాషులు బీజేపీతో కలిసి వెళ్లాలని సూచిస్తున్నారంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ మాటలు ఆయన అజిత్ పవార్ తో భేటీ తరువాత చెప్పారు. పార్టీని నిట్టనిలువుగా చీల్చిన అజిత్ పవార్.. తన బాబాయ్ (శరద్ పవార్)తో తరచూ భేటీ అవుతుండటం చూస్తుంటే.. ఇండియా కూటమిలో ఉంటూ శరద్ పవార్ తెరవెనుక బీజేపీకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.   తనను బీజేపీలో చేరాలని కొంతమంది హితైషులు ఒత్తిడి తీసుకువస్తున్నారని  అయితా తాను ససేమిరా అన్నారనీ ఉటంకించారు.  అజిత్ తో భేటీ తరువాత ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. శరద్ పవార్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యూహ రచన చేస్తున్నారా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం, అందుకు ప్రతిఫలంగా ఇండియా కూటమిని బలహీన పరిచి కేంద్రంలో మరో సారి బీజేపీ సర్కార్ ఏర్పాటు అయ్యేందుకు ఇతోథికంగా సహకరించడం అన్న ఎత్తుగడతో శరద్ పవార్ సాగుతున్నారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వ్యక్తం అవుతున్నాయి.  ప్రతిపక్షాల మహా కూటమి ''ఇండియా''.. ఇప్పటికే పట్నా, బెంగళూరులో సమావేశమైంది. తదుపరి సమావేశం ఈ నెలాఖరులో మహా రాజధాని ముంబైలో  ముంబైలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే అజిత్ పవార్, శరద్ పవార్ భేటీ,  ఆ తరువాత శరద్ పవార్ బీజేపీ కూటమిలో చేరిక వ్యాఖ్యలు రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇక ఏపీలో బండి సంజయ్‌ రాజకీయాలు...? వైసీపీకి ఇక చెమటలేనా..?

రాజకీయాల్లో.. ఎప్పుడు ఏమి జరుగునో ఎవరికి ఎరుకా..?;ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు కీలక స్థానంలో ఉంటాడో, ఏ నాయకుడు ఎప్పుడు కిందికి జారుతాడో తెలియదు. ఇప్పుడు కొత్తగా బీజేపీ జాతీయ కార్యదర్శి అయిన బండి సంజయ్‌ పరిస్థితి దాదాపు ఇలానే ఉంది.  ఆయన్ను.. హైకమాండ్‌ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించినప్పుడు కాషాయం నేతలే ఆశ్చర్యపోయారు. సామాన్య ప్రజలు కూడా ఏమిటి ఇలా జరిగిందని అనుకున్నారు. బండి కూడా అవేదన చెందాడు. కేంద్ర  కేబినెట్ లో బండికి హో సహాయ మంత్రి ఇస్తారని టాక్ వచ్చింది. ఏం చేయాలో పాలుపోక.. బండన్న  సైలెంట్ అయిపోయాడు.  పార్టీకి కమిటెడ్‌ నాయకుడుగా ఉన్న వాడు కాబట్టి గమ్మున ఉండిపోయాడు. మరో పార్టీలో అయితే తిరుగుబాటు జరిగేదే.  తెలంగాణలో బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మంచి ఊపు మీద ఉన్న సమయంలో హఠాత్తుగా మార్పు జరగడం నిజంగా పెద్ద షాక్‌. అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుందని మీడియాలోనూ కథనాలు వచ్చాయి. బండిని తప్పించడంవల్ల తెలంగాణలో బీజేపీ నష్టపోతుందనే  అభిప్రాయం వ్యక్తమైంది. కొత్త అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బండితో కంపేర్‌ చేసుకుంటే చాలా సౌమ్యుడు. బీఆర్‌ఎస్‌పైన, కేసీఆర్‌పైన దూకుడుగా వ్యవహరించలేడు. అధ్యక్షుడయ్యాక బీఆర్‌ఎస్‌ పైన గట్టిగా మాట్లాడిన దాఖలాలు కనబడలేదు. మరి ముందు ముందు ఏం చేస్తాడో చూడాలి. అధిష్టానం బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అంతటితో ఊరుకోలేదు. ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించిన హైకమాండ్‌  ఆ స్థానంలో పురందేశ్వరిని నియమించింది.  అయితే.. ఏపీ బీజేపీ ఇన్‌చార్జిగా బండి సంజయ్‌ని నియమించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. పురందేశ్వరికి తోడు ఓ ఫైర్‌బ్రాండ్‌ అవసరమని ఢిల్లీ పెద్దలు భావించి ఉండొచ్చు. అక్కడ పార్టీ గెలుస్తుందా, ఓడుతుందా అనేది వేరే సంగతి. కాని తెలంగాణలో మాదిరిగా పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చే నాయకుడు కావాలి. అందుకే ఇన్‌చార్జిగా బండి నియమంచాలనే ఆలోచన  చేసి ఉండొచ్చు. ఏపీ ఇంఛార్జిగా ఉన్న సునీల్‌ దేవ్‌ధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని బండితో భర్తీ చేయనున్నట్లు పార్టీ అంతర్గతంగా వినవస్తున్న సమాచారం. అదే ప్రచారం కూడా  జరుగుతోంది. ఏపీలో జనసేనతో కలిసి  బీజేపీ రాజకీయ ప్రయాణం చేస్తోంది.   ఈ పొత్తు నామ్ కే వాస్తే..అయినా  అది వేరే విషయం. టీడీపీతో పొత్తు పైన స్పష్టత రావాల్సి ఉంది.  ఇదే సమయంలో కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉంటూనే ఇన్‌ఛార్జ్‌గా చురుగ్గానే వ్యవహరించేవారు. కానీ, కొంత కాలంగా మూడు నెలలకొకసారి కూడా ఏపీకి రావడంలేదు. కాగా ఏడాదిన్నరగా ఏపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించమని పార్టీ హైకమాండ్‌ను మురళీధరన్ కోరుతున్నారని సమాచారం. బీజేపీలో గత ఎన్నికల తరువాత చేరిన కొందరి నేతల తీరు..రాష్ట్ర పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జ్‌లను సహ ఇన్‌ఛార్జ్‌లని మార్చడానికి బీజేపీ అధిష్టానం‌ కసరత్తులు చేస్తోంది.  ఏపీ నుంచి తనని తప్పించాలని మురళీధరన్‌  కోరుతుండటంతో కొత్త ఇంఛార్జ్ నియమాకం పైన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా బండి సంజయ్ ను నియమించే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ దూకుడుతో పార్టీకి మైలేజ్ వచ్చింది. ఏపీ బీజేపీలోనూ సంజయ్ కు ఆదరణ ఉంది. ఇదే సమయంలో పొత్తు రాజకీయం.. ఎన్నికల సమయం కావటంతో ఏపీ బాధ్యతలు అప్పగించటం ద్వారా అటు తెలంగాణ.. ఇటు ఏపీలోనూ బండి సంజయ్ నియామకం పార్టీకి మేలు చేస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఎంతైనా..బండి తిమ్మిని బమ్మి చేసే ఘనుడు.. అతన్ని ఏపీలీ వదిలితే.. అడ్డతిడ్డగా మాట్లాడుతూ.. వైసీపీ దుమ్ము దులుపుతాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టుకు అవినాష్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం (ఆగస్టు 14) సీబీఐ కోర్టుకు హారయ్యారు. వివేకా హత్య కేసులో ఏ8గా ఉన్న అవినాశ్ రెడ్డి ప్రస్తుతం యాంటిసిపేటరీ బెయిలు మీద ఉన్న సంగతి తెలిసిందే. కాగా వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవలే కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా  ఈ కేసు విచారణకు ఈ నెల 14 అంటే సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో  అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ విషయం అలా ఉంటే.. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును సమీక్షించాలని కోరుతూ అవినాష్ రెడ్డి జూన్ 19న సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. ఆ లేఖలో సీబీఐ మాజీ డైరెక్టర్ దర్యాప్తుపై పలు ఆరోపణలు గుప్పించారు. తానే టార్గెట్ గా దర్యాప్తు సాగిందని ఆరోపణలు గుప్పించారు.  సీబీఐ మాజీ డైరెక్టర్ రామ్ సింగ్ హయాంలో వివేకా హత్య కేసు దర్యాప్తు వివక్ష పూరితంగా సాగిందనీ, విచారణ ఏ మాత్రం సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు.  అయితే ఈ లేఖకు సంబంధించి సీబీఐ ఇంత వరకూ స్పందించలేదు.  ఇక పోతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న  వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్‌లను జైలు అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపరిచారు.

కేసీఆర్ జాబితా సిద్ధం.. ఇక..  ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌నే మరి..!

తెలంగాణ కు దశ..దిశ తనే అని భావిస్తున్న కేసీఆర్..  హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. పార్టీని ఎలాగైనా గెలిపించాల‌ని ప్ర‌ణాళిక‌ల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. అభ్య‌ర్థుల జాబితాపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. ఈ నెల 17 త‌ర్వాత 80 నుంచి 90 స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. అంద‌రి కంటే ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తున్న కేసీఆర్‌.. ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. త‌న ఫామ్‌హౌజ్‌లో ఇప్ప‌టికే కేటీఆర్‌, హ‌రీష్ రావుతో క‌లిసి అభ్య‌ర్థుల ఎంపిక‌పై కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. మొద‌ట ఎలాంటి స‌మ‌స్య‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాల జాబితాను ప్ర‌క‌టించాల‌ని కేసీఆర్ చూస్తున్నారు. వ‌చ్చే వారంలోనే ఆయ‌న జాబితా వెల్ల‌డించే అవ‌కాశ‌ముంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతా బాగానే ఉంది.. కానీ స‌మ‌స్య‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్ని ఉన్నాయ‌న్న‌ది కేసీఆర్‌కే తెలియాల‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై సొంత పార్టీ నాయ‌కులే అసంతృప్తితో ఉన్నార‌ని తెలిసింది. అంతే కాకుండా కొంత మంది ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌క‌టించే అభ్య‌ర్థుల జాబితాపై ఆస‌క్తి నెల‌కొంది. ఉమ్మ‌డి నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్ త‌దిత‌ర చోట్ల వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ మ‌రో అవ‌కాశం ఇస్తారా అన్న‌ది ఇక్క‌డ కీల‌కాంశం. ఈ ఎమ్మెల్యేలు టికెట్ వ‌స్తుందో లేదోన‌నే టెన్ష‌న్లో ఉన్న‌ట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి.. అన్నీ తానై..అంతా తానైగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. గెలుపు..ఈ సారి నల్లేరుపై నడక కాకపోవచ్చు.. కాంగ్రెస్ నుంచి ప్రమాదం పొంచి ఉందనేది తెలుసుకోవాలని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

భక్తుల రక్షణను టీటీడీ గాలికొదిలేసిందా?.. భక్తులలో వెల్లువెత్తుతున్న అనుమానాలు

తిరుమలకు వెళ్లే  అలిపిరి నడక దారిలో పిల్లలకు రక్షణ కరవైంది. అది నడక దారి కాదు.. మృత్యుమార్గం అని భక్తులు ఆవేదన, భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల దేవుడి కొండకు నడిచి వస్తామని మొక్కుకున్న భక్తులు ఆ మొక్కు తీర్చడానికి ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ అధికారుల సంయుక్త వైఫల్యం, నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా భక్తుల ప్రాణాలు గాలిలో దీపంగా మారిపోయిన పరిస్థితి అలిపిరి నడకదారిలో ఏర్పడింది.  ఒక సంఘటన జరిగిన తరువాత నిద్రనుంచి మేల్కొన్నట్లుగా ఇకపై అలా జరగదని  హామీ ఇచ్చి కొన్ని రోజులు భక్తుల భద్రత, రక్షణ అంటూ హడావుడి చేసి ఆ తరువాత షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే వన్య ప్రాణులు భక్తులపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని అంటున్నారు. ఇక  ఇటీవల తల్లిదండ్రులతో కలిసి నడక మార్గంలో వెంకన్న దేవుడి దర్శనం కోసం వెళుతున్న కౌశిక్ అనే బాలుడు చిరుత పులి పంజాకు చిక్కి అదృష్ట వశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ సంఘటన తరువాత కూడా మొద్దు నిద్ర నుంచి మేల్కొని తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ అధికారుల కారణంగా తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన  లక్షితఅనే బాలిక చిరుత పలి దాడిలో ప్రాణాలు కోల్పోయింది.  అర్థరాత్రి సమయంలో చిరుత దాడి చేసి లక్షితను అడవిలోకి లాక్కుపోయింది. ఆ తరువాత చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, అటవీ ఆధికారుల గాలింపులో చిరుత దాడిలో మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం బయటపడింది.   చిన్నారి లక్షిత కనిపించని రోజు నుంచి.. ఆసుపత్రి నుంచి నెల్లూరుకు మృతదేహాన్ని తీసుకువెళ్లేంతవరకూ టీటీడీ అధికారులు కానీ, కొత్తగా టీటీడీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి కానీ, ఈవో ధర్మారెడ్డి కానీ ఆ చుట్టుపక్కలకు రాలేదు. ఒక్క మాట మాట్లాడలేదు.   ‘ఇకపై ఇలాంటి సంఘటనలు జరగవని’  గతంలో కౌశిక్‌     అనే బాలుడు చిరుత దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో  కోలుకున్న తరువాత.. కాదు కాదు.. దాడి చేసిన చిరుతను అటవీ అధికారులు బంధించిన తరువాత కౌశిక్ తల్లిదండ్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఇటువంవటి సంఘటనలను పునరావృతం కానీయబోమనీ, పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రకటనలు ఇచ్చారు. అయితే తాజాగా చిన్నారి లక్షిత పులి దాడిలో మరణించిన ఘటనలో మాత్రం ఈవో ధర్మారెడ్డి.. అసలు ఆ పరిసర ప్రాంతాలకు రాకుండా ముఖం చాటేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వరుస సంఘటనలు జరుగుతున్నా.. భద్రతా చర్యల విషయంలో పట్టించుకోకపోవడంతో ముఖం చాటేశారా అని నిలదీస్తున్నారు.  కాలి నడక దారిలో  ఇరువైపులా ఫెన్సింగ్ వేయిస్తామని టీటీడీ ఇచ్చిన హామీ హామీలాగే మిగిలిపోయింది. లక్షిత వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నడక దారిలో వెళ్లే భక్తులకు చిరుతపులుల దాడుల ముప్పు వెంటాడుతూనే ఉంది. వెంకన్న దేవుడి దర్శనం కంటే ముందే ఎలుగుబంట్లు, చిరుతలు దర్శనమిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడకమార్గంలో నడుస్తున్నామని చెబుతున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లమనీ టీటీడీ చెబుతోందనీ, దాని వల్ల దాడుల భయం పోతుందా అని అనిదీస్తున్నారు. చిన్నారుల చేతులకు ట్యాగ్ లు కట్టి ఉపయోగమేమిటని నిలదీస్తున్నారు. అంతా అయిపోయిన తరువాత గుర్తించడానికా ఇందుకేనా అటవీ శాఖ, టీటీడీ ఉన్నదని దుమ్మెత్తి పోస్తున్నారు.  వన్యప్రాణుల దాడులు జరుగుతున్నా కూడా రాత్రి వేళలో నడక దారి మూసేయాలన్న ఉద్దేశమే టీటీడీకి కలగకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. లక్షిత సంఘటన తరువాత కూడా  రాత్రి వేళల్లో నడకదారి మూసివేతపై చైర్మన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామనడం ఏమిటని భక్తులు నిలదీస్తున్నారు. నాస్తికులను టీటీడీ పాలకమండలి చైర్మన్ గా నియమించడం, కొండపై అన్యమత ప్రచారాలు జరుగుతుండటం, అన్యమతస్తులకు టీటీడీలో కొలువులు ఇవ్వడం సరిపోక.. ఇప్పుడు భక్తుల రక్షణను సైతం గాలికొదిలేసి.. వెంకన్న స్వామి దర్శనానికి వచ్చే వారిని రాకుండా చేయడమన్న కుట్ర ఏమైనా దీని వెనుక ఉన్నదా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలు దేవాలయాలపై జరిగిన దాడుల విషయంలో నిందితులపై చర్యలు తీసుకోకపోవడం వంటి సంఘటనలను తమ అనుమానాలకు కారణంగా చెబుతున్నారు.   

హిందూ ధర్మ సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ కూడదు.. ఐవైఆర్

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం పూర్తయినా ఇంకా ఆ నియమకంపై  వివాదాలుకు ఫుల్ స్టాప్ పడలేదు. నాస్తికుడికి తిరుమల తిరుపతి దేవస్థాం చైర్మన్ పదవి కట్టబెట్టడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అంటే వైఎస్ హయాంలో ఆయనను టీటీడీ దేవస్థానం చైర్మన్ గా నియమించిన సమయంలో కూడా ఇదే విధంగా విమర్శలు ఎదురయ్యాయి. అప్పటిలో ఆయన తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే వైఎస్ ఆదేశం వల్లనే ఆయన ప్రచారం విషయంలో ఉద్దేశపూర్వకంగా పెద్దగా శ్రద్ధ తీసుకోకపోవడమే కాకుండా.. అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్పటి ఎన్నికలు ఓటమిని ఆహ్వానించారని, ఆ కారణంగానే వైఎస్ ఆయనను టీటీడీ చైర్మన్ గా నియమించారనీ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు వైఎస్ హయాంలో వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్ గా పని చేశారు. రెండో సారి కాలపరిమితి ముగిసిన తరువాత ఆయన స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమిస్తారని గట్టిగా ప్రచారం జరిగినా.. చివరి నిముషంలో జగన్ భూమననే టీటీడీ చైర్మన్ గా నియమించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా  వెంకన్న దేవుడిని నల్లరాయిగా అభివర్ణించిన వ్యక్తికి టీటీడీ పాలకమండలి చైర్మన్ గా ఎలా నియమింస్తారంటూ సామాన్య భక్త జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే అవన్నీ పక్కన పెడితే టీటీడీ చైర్మన్ పదవి రాజకీయ పోస్టింగ్ గా మారడం దురదృష్టకరమంటూ టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ లో చేసిన ఒక పోస్టులో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా హిందూ ధర్మం పట్ల విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తులను మాత్రమే నియమించాలనీ, అయితే జగన్ సర్కార్ అందుకు భిన్నంగా రాజకీయ అవసరాల కోసం భూమన నియామకం చేపట్టిందని అభిప్రాయపడ్డారు. తన పోస్టుకు ఆయన భూమనను నియమిస్తున్నట్లుగా వచ్చని వార్తల క్లిప్పింగులను జోడించారు.  హిందూ ధర్మ సంస్థల విషయంలో ఏ విధంగా వ్యవహరించినా తమను అడ్డుకునేవారు లేరన్నట్లుగా అ ప్రభుత్వ తీరు ఉందని పేర్కొన్నారు.  హిందూ ధర్మ సంస్థలపై ప్రభుత్వ అజమాయిషీని ఎంత త్వరగా తప్పిస్తే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.  

షర్మిల కోర్టులోకే బంతి.. కాంగ్రెస్ పెట్టిన మెలిక ఇదేనా?

వైఎస్ షర్మిల రాజకీయ భవితవ్యం ఏంటి? తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? షర్మిల తెలంగాణ నుండే రాజకీయాలలో ఉంటారా లేక ఆంధ్రాకి వెళ్ళిపోతారా? కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తే షర్మిల రాజ్యసభకి వెళ్తారా? లేక అసెంబ్లీకి పోటీ చేస్తారా? అసెంబ్లీకి  పోటీ అయితే..  షర్మిల తెలంగాణ నుండి పోటీ చేస్తారా? లేక ఏపీ నుండి బరిలో దిగుతారా?  ఏపీ పీసీసీ పగ్గాలు కాంగ్రెస్ షర్మిలకు అప్పగిస్తుందా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి చేపట్టేందుకు  షర్మిల ఒకే చెప్తారా?  అన్న వైఎస్ జగన్ మీద షర్మిల పొలిటికల్ వార్ ప్రకటిస్తారా? ఇదే ఈ మధ్య కాలం వరకూ తెలుగు రాష్ట్రాలలో షర్మిల చుట్టూ నడిచిన రాజకీయ చర్చ. షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఆ మధ్య తీవ్ర ప్రచారం జరిగింది.  అప్పుడెప్పుడో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడుపుతున్నట్లు చెప్పుకున్నారు. షర్మిల తన పార్టీని విలీనం చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఎందుకో అది ప్రచారంగానే ఉండిపోయింది.  జులైలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున సోనియా, రాహుల్ గాంధీలు కడప జిల్లాలోని ఇడుపులపాయకు వస్తారని.. అక్కడే వారు విజయమ్మతో భేటీ కానున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరిగింది. అయితే, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. కానీ, షర్మిల బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో భేటీ కావడం, తాజాగా ఢిల్లీ వెళ్లడం నిజమే. అంటే ఈ విలీనం లేదా పొత్తు ప్రతిపాదన మాత్రం జరుగుతున్నదని స్పష్టంగా తేలిపోతుంది. అయితే, ఎన్నో ఆశ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి, మంత‌నాలు చేసి.. కాంగ్రెస్‌లో త‌న పార్టీని విలీనం చేయాల‌నుకున్న ష‌ర్మిల‌కు హ‌స్తం పార్టీ చుక్కలు చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి తెలంగాణలోని పాలేరు నుంచి పోటీ చేయాల‌ని ఆశపడుతున్నట్లు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. అయితే తెలంగాణలో ఆమె పార్టీలో ఉండ‌డాన్ని ఇక్క‌డి కాంగ్రెస్ నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన వైఎస్ఆర్ త‌న‌య ష‌ర్మిల పార్టీలోకి వ‌స్తే తెలంగాణ‌లో అది కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ అవుతుంద‌ని ఇక్క‌డి నాయ‌కులు భావిస్తున్న‌ట్లు చెప్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా చెప్పేసినట్లు తెలుస్తుంది. దీంతో ఆమెను ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తున్నది. ఏపీకి వెళ్తే ఆమెను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు ఆమె రాజ్యసభ కావాలంటే రాజ్యసభ, లేదంటే ఏపీలో ఎక్కడ నుండి అసెంబ్లీకి పోటీ చేసినా పూర్తి బాధ్యత అధిష్టానమే తీసుకుంటుందని హామీ ఇచ్చారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అటు కర్ణాటక, ఇటు ఢిల్లీలో జరిగిన సమావేశాలలో ఈ విషయమే తేలడంతో ఇప్పుడు బంతి షర్మిల కోర్టుకి చేరింది. ఆమె ఎంతగా తెలంగాణ కోడలినని చెప్పుకున్నా తెలంగాణ ప్రజలు మాత్రం షర్మిలను అంగీకరించరని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. ఆమెని ఆంధ్రా బిడ్డగానే  తెలంగాణ వాసులు చూస్తారంటున్నారు. ఆమె  తండ్రి, దివంగత ముఖ్యమంత్రి పక్కా తెలంగాణ వ్యతిరేక వాదిగా ముద్రపడడమే అందుకు కారణం. ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు కూడా అదే విషయాన్ని అధిష్టానం వద్ద గట్టిగా చెబుతూ షర్మిల కాంగ్రెస్ లో చేరి తెలంగాణ రాజకీయాలలో వేలుపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ తరుణంలో ఆమె ఏపీకి వెళ్లడమే ఉత్తమమని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా భావిస్తున్నది. అయితే  ఏపీకి వెళ్తే తన అన్న జగన్మోహన్ రెడ్డిపై పోటీకి దిగాల్సి ఉంటుంది. దాని వల్ల  వైసీపీకి నష్టం చేకూరుతుంది దీంతో షర్మిల ఇందుకు ఇష్టపడటం లేదని భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇప్పుడు అన్నచెళ్లుల్ల మధ్య తత్సంబంధాలు లేకపోయినా కూడా షర్మిల   ఏపీకి వచ్చేందుకు ఇష్టపడడం లేదు. అయితే, ఇప్పుడు ఏం తేల్చుకోవాలన్నది షర్మిలకే వదిలేసిన  కాంగ్రెస్ బంతిని షర్మిల కోర్టులోకి విసిరింది. ఇక ఏం చేయాలన్నది ఆమె ఇష్టం.. ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోయేది కూడా ఈ నిర్ణయమే!

రుషికొండపై సెక్రటేరియట్ అంటూ ట్వీట్..అంతలోనే యూ టర్న్!

పులివెందుల పులి మా జగనన్న..  మాట తప్పడు.. మడమ తిప్పడు.. వెన్ను చూపని ధీరుడు   అంటూ వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు తెగ ప్రచారం చేస్తుంటారు. అయితే, అది మాటల్లోనే కానీ చేతల్లో కాదని ఎప్పటి కప్పుడు జగన్మోహన్ రెడ్డి  చేతల్లో చూపుతూ వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో  శాసన మండలి రద్దు నుంచి మొదలు పెడితే.. సీపీఎస్ వంటి ఎన్నో అంశాలలో యూటర్న్ తీసుకున్న జగన్.. ఇప్పుడు తానేం చేస్తున్నారో కూడా చెప్పుకోలేని స్థితిలో దొంగచాటుగా వ్యవహారం నడిపే స్థాయికి చేరారు. ఇదంతా విశాఖలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల గురించే. గత నాలుగేళ్ళలో విశాఖ నగరంలో వైసీపీ నేతల భూకబ్జాలు తారస్థాయికి చేరాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే కొండలు పిండి చేసి సొమ్ము చేసుకున్నారని స్థానిక ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం రుషికొండనే.  అంతకు ముందు ఆకుపచ్చగా ఆకాశం నుండి చూసినా ఆకర్షించేలా ఉండే రుషికొండ ఇప్పుడు సగం తవ్వేసిన సమాధిలా కనిపిస్తుంది. దీన్ని కప్పి పుచ్చేందుకు వైసీపీ సర్కార్ కొండకి గ్రీన్ మ్యాట్ కూడా వేసింది. అయితే, ఇప్పుడు అదే రుషికొండని పూర్తిగా నాశనం చేసేలా అక్కడ రహస్యంగా నిర్మాణాలు చేపట్టింది. ఈ నిర్మాణాలు ఏంటన్న దానిపై గత కొన్ని రోజులు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రుషికొండను చదును చేసి వైసీపీ ప్రభుత్వం అక్కడ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మిస్తుందని, కాదు కాదు సీఎం నివాసమే రుషికొండ మీద నిర్మిస్తున్నారని రాజకీయ వర్గాలలో తీవ్రంగా చర్చ సాగుతున్నది. అసలు రుషికొండ మీద నిర్మించే నిర్మాణాలు ఏంటో చెప్పాలని తులుగుదేశం,   జనసేన నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మరో అడుగు ముందుకేసి బారికేడ్లు దూకి మరీ అక్కడే జరిగే నిర్మాణాలను బయటపెట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ నేతలు అసలు విషయాన్ని బయటపెట్టారు. ముందుగా ఈ విషయంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటి? అని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. రిషికొండపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతున్న మాట వాస్తవమేనని.. రిషికొండ నిర్మాణాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మరో మంత్రి రోజా కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. మిగతా మరికొందరు వైసీపీ నేతలు కూడా రుషికొండపై నిర్మాణాలు నిజమేనని.. వాటిని ప్రభుత్వమే నిర్మిస్తున్నదని కూడా ఒప్పేసుకున్నారు. అయినా ప్రతిపక్షాలు ఈ నిర్మాణాలపై ఆరోపణలు ఆపలేదు. అసలు సీఎం జగన్ కు ఎన్ని నివాసాలు కావాలని.. కొండను తవ్వి మరో జగన్ మరో ఇల్లు కట్టుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో రుషికొండ పై జరిగే నిర్మాణాలు ఏపీ సెక్రటేరియట్ కి సంబంధించినవే అంటూ వైసీపీ అధికారికంగా ట్వీట్ చేసింది.  అక్కడ సెక్రటేరియట్ నిర్మిస్తుంటే దానిపై తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తోందని, ఉత్తరాంధ్రకు పాలనా రాజధాని రావడం ఆ పార్టీకి ఇష్టం లేదని వైసీపీ అధికారిక సోషల్ మీడియా పేర్కొంది.  ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో వెంటనే దాన్ని డిలీట్ చేసింది. మరో ట్వీట్ చేసింది. ‘మా అధికారిక ట్విట్టర్ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్ లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరని పేర్కొంది. వైసీపీ చేసిన ట్వీట్ డిలీట్ చేయడంతో టీడీపీ విమర్శలు చేసింది. ‘ఈ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావ్ బుజ్జి కన్నా’ అంటూ సెటైరికల్ ట్వీట్ వేసింది. దీనికి వైసీపీ సమాధానమిస్తూ.. ‘మానవ తప్పిదాలు సహజంగా జరుగుతూంటాయి. ఇదీ అలానే జరిగింది. దీనిపై ప్రజలకు వివరణ ఇచ్చాం. మీలా మేం ప్రజలను మభ్యపెట్టమమని రీట్వీట్ చేసింది. నిజానికి రుషికొండపై టూరిజం శాఖ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు జరుగుతున్నట్టు రాష్ట్రప్రభుత్వం గతంలో హైకోర్టుకి తెలిపింది. అయితే అది నిజం కాదు సెక్రటేరియట్ అని ఇప్పుడు వైసీపీ చెప్పింది. అంటే హైకోర్టుకి వైసీపీ ప్రభుత్వం అబద్ధం చెప్పిందా, కోర్టుని తప్పుదోవ పట్టించిందా అంటూ మీడియా రచ్చ చేసింది. ఈ రచ్చతో వైపీసీ ట్వీట్ డిలీట్ చేసింది. పైగా ప్రశ్నించిన టీడీపీని మీలా మభ్యపెట్టమంటూ ఇంకా ఈ విషయంలో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. దీంతో సోషల్ మీడియా సీఎం జగన్ ను ఏకిపారేస్తున్నది. కనీసం చేసేది చెప్పుకోలేని పిరికిపంద ప్రభుత్వం ఇదంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిజాయతీగా అక్కడ జరుగుతున్నది ఏంటో చెప్పుకోలేక ఇలా ప్రజలతో పాటు కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తుండడంతో జగన్ సర్కార్ ఇప్పుడు ఈ అంశంలో మరోసారి బొక్కా బోర్లా పడ్డట్లైంది.

తెలుగుదేశంలోకి బొత్స కుటుంబం?.. వైసీపీకి భారీ షాక్

ఎన్నికలు వస్తున్నాయంటే ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో.. ఎవరు ఎప్పుడు గోడ దూకేస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే  కాస్త ముందో వెనకో ఊహాగానాలు మాత్రం బయటపడతాయి. ఇక అధికారంలో ఉన్న పార్టీపై అసంతృప్తి ఎక్కువగా ఉంటే ఈ వలసలు భారీ స్థాయిలో ఉంటాయి. ఏపీలో ఇప్పుడు వైసీపీది కూడా అదే పరిస్థితి. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగా ఇప్పటి నుండే వైసీపీ నుండి మెల్లగా ఒక్కొక్కరు జారుకుంటున్నారు. సమయం సందర్భం చూసుకొని ఒక్కొక్కరు తెలుగుదేశం దారి పడుతున్నారు. అటు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు.. ఉత్తర కోస్తా నుండి దక్షణ కోస్తా వరకూ అన్ని జిల్లాలో ఈ వలసల పరంపర మొదలయ్యే అవకాశం  ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. వైసీపీ నుండి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు మొత్తం 40 నుండి 50 మంది పక్క చూపులు చూస్తున్నారని రాజకీయ వర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. వైసీసీ బహిష్కృత ఎమ్మెల్యేలు నలుగురూ ఇప్పటికే టీడీపీ గూటికి చేరుతారన్నది ఖరారైపోగా, మరో ఆరుగురు వైసీపీ నేతలు ఈ నెలలోనే గోడ దూకేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.  ఏదో సీదా ఎమ్మెల్యేలు, వారి నియోజకవర్గాలను దాటి రాష్ట్ర ప్రజలకు పెద్దగా పరిచయం లేని ఎమ్మెల్యేలే కాకుండా,  రాష్ట్రస్థాయి నేతలు, మాజీ మంత్రులు, సీనియర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వినిపిస్తున్నది. ఉత్తరాంధ్ర నుండి చూస్తే ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో ఎక్కడా బయటకి రావడం లేదు. అవంతికి సన్నిహితుడైన పంచకర్ల రమేష్ విశాఖ వైసీపీ అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అన్న ఆసక్తి మొదలైంది. రమేష్ ఒక్కరే కాదు అవంతి కూడా పార్టీ మార్పుపై ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. విశాఖకు పరిపాలన రాజధాని తీసుకొస్తామని మూడేళ్లుగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తీవ్ర ప్రచారం చేశారు. రాజధాని సంగతేమో కానీ.. విశాఖలో రౌడీయిజం పెరిగి శాంతి భద్రతలు దెబ్బతిన్నట్లు అక్కడి ఘటనలే స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో ఈసారి వైసీపీకి ఎదురుగాలి తప్పదని ప్రచారం జరుగుతున్నది. అందుకే ఇక్కడి నేతలు  ప్రజల మూడ్ ని బట్టి వైసీపీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా ఉత్తరాంధ్రలో వైసీపీ అతి పెద్ద ప్లస్ పాయింట్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం. బొత్స సొంత కుటుంబంతో పాటు ఆయన సామాజిక వర్గం తూర్పు కాపు నేతలకు ఇక్కడ మంచి పట్టు ఉంది. ఈ నేతలలో చాలా మంది బొత్స కుటుంబానికి బంధువులు, సన్నిహితులు. అందుకే బొత్స కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేసినా మళ్ళీ తనని వైసీపీలో చేర్చుకొని సముచిత స్థానం కల్పించారు. అయితే  ఇప్పుడు ఈ బొత్స అండ్ కో తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ సహా వైసీపీకి చెందిన యాభై మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఒక బాంబు పేల్చారు. దీంతో సహజంగానే బోండా వ్యాఖ్యలలో వాస్తవాలు ఎంత అని అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  బొత్స ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన మేనల్లుడు మజ్జి శ్రీను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నారు. మరో బంధువు, బడికొండ అప్పలనాయుడు కూడా నెల్లిమర్ల నుండి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే, అదే నెల్లిమర్లలో బొత్స తమ్ముడు లక్ష్మణరావు కుమారుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఎస్ కోటలో ఉన్న బొత్స సన్నిహిత బంధువు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీగా ఉన్న బొత్స మరో బంధువు బెల్లాన చంద్రశేఖర్ ఇలా బొత్సకు బంధువులే అరడజను మంది ఉండగా తన సన్నిహితుల జాబితా కూడా మరో అరడజను ఉంది. బెల్లాన చంద్రశేఖర్ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆరాటపడుతుండగా వైసీపీ నుండి ఇంకా హామీ దొరకలేదు. బడికొండ అప్పలనాయుడు, బొత్స తమ్ముడు లక్ష్మణరావులలో ఒకరికే వైసీపీ నుండి టికెట్ దక్కుతుందని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిందంటున్నారు. ఈ క్రమంలో వీరిలో ఒకరు టీడీపీతో టచ్ లో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇక మజ్జీ శ్రీనుకు టికెట్ ఇస్తారా? ఎస్ కోట శ్రీనివాసరావు పరిస్థితి ఏంటన్నది కూడా అనుమానమే. ఇవన్నీ లెక్కలేసుకొనే టీడీపీ నేతలు బొత్స కుటుంబాన్ని ఆకర్షించే పని పెట్టుకున్నారా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగి వీరంతా టీడీపీలోకి మారితే ఇటు బొత్సకు, అటు వైసీపీకి భారీ నష్టం తప్పదు.

బెజవాడ తెలుగుదేశంలో నానీ బ్రదర్స్ ట్రబుల్ వెనుక పీవీపీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలలో  ఒక విధమైన వేడి కనిపిస్తున్నది. అధికార వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి రగులుతుంటే..  ప్రతిపక్ష తెలుగుదేశంలోనూ కొన్ని కీలక నియోజకవర్గాలలో వర్గ పోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ రాజధానిగా చెప్పుకుని విజయవాడలో తెలుగుదేశం పార్టీలో కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కేశినేని పార్టీకి దూరంగా ఉంటున్నారని అంతా భావిస్తున్నా.. ఆయన వ్యవహార శైలితో పార్టీయే ఆయనను దూరం పెట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేశినేని సోదరుడు కేశినేని చిన్ని ఇప్పుడు తెలుగుదేశం కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కూడా ఆయనకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర మరి  కొద్ది రోజులలో కృష్ణా జిల్లాలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆ పాదయాత్ర బాధ్యతలను పార్టీ అధిష్ఠానం కేశినేని చిన్నికి అప్పగించింది. దీంతో కేశినేని నానిని పార్టీ పూర్తిగా పక్కన పెట్టినట్టే అన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. అయితే ఈ పరిస్థితికి కేశినేని నాని స్వయంకృతాపరాథమే కారణమని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి.  ఈ  పరిస్థితుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు కీలకమైన బెజవాడ లోక్ సభ నియోజవకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని చిన్ని రంగంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి  కేశినేని నాని ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  ఎంపీ కేశినేని నాని గత కొంత కాలంగా పార్టీకి అయిష్టమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఒకవైపు వైసీపీ పాలనను తప్పు బడుతూనే మరోవైపు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల పనితీరును మెచ్చకుంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సొంత పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికార పార్టీలో ఒకరిద్దరు నేతలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఓ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ నాని.. వైసీపీ ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచెత్తారు. సొంత పార్టీ ఇన్‌ఛార్జ్‌లను గొట్టంగాళ్లంటూ కామెంట్‌ చేశారు. ఇండిపెండెంట్‌గా తనకు గెలిచే సత్తా ఉందని  మరో కార్యక్రమంలో మాట్లాడారు. చివరకు మహానాడుకు  తనను ఆహ్వానించలేదంటూ పార్టీ నాయకత్వంపైనే అసహనం వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో ఎంపీ నానిని పక్కన పెట్టేందుకే తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించిందని అంటున్నారు. అందుకే  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర  బాధ్యతలను ఎంపీ నానిని కాదని అతని తమ్ముడు కేశినేని చిన్నికి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఎంపీ నానీ వాట్ నెక్స్ట్ అనే పొలిటికల్ క్యూరియాసిటీ ఇక్కడ కనిపిస్తుంది.  నిజానికి కొంతకాలంగా కేశినేని నానిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం ఉందనడంలో సందేహం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం, వారిపై పొగడ్తలు కురిపించడం పార్టీ నాయకత్వానికి ఆగ్రహం కలిగించింది. అదే సమయంలో సొంత పార్టీ నియోజకవర్గాలకు చెందిన ఇన్‌ఛార్జ్‌లను  గొట్టంగాళ్లంటూ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరహా వ్యాఖ్యలతో పాటు సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా నాని దూరంగా ఉండడంతో అసలు నానీ పార్టీలో ఉన్నట్టా? లేనట్టా అన్న చర్చ కూడా సాగింది. సరిగ్గా ఇదే సమయంలో  లోకేష్‌ యువగళం పాదయాత్ర బాధ్యతలు కూడా ఆయనకు ఇవ్వకుండా, సోదరుడు చిన్నికి అప్పగించడం ద్వారా  అధిష్టానమే ఆయన్ను సైడ్‌ చేస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కాగా నాని ధిక్కార స్వరం వెనుక వైసీపీ ట్రాప్ ఉందనీ, ఆయన అధికార పార్టీ ట్రాప్ లో పడ్డారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరీ ముఖ్యంగా  గత ఎన్నికలలో నానీ చేతిలో పరాజయం పాలైన అప్పటి వైసీపీ అభ్యర్థి పీవీపీ వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారని ఇటు తెలుగుదేశం  అటు వైసీపీటీడీపీ, వైసీపీ శ్రేణులలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.  పీవీపీ  ఎంపీ కేశినేని నానిని, టీడీపీని దెబ్బ తీసేందుకు, ఆ ఎంపీకి సొంత పార్టీలోనే ఉన్న వ్యతిరేక వర్గంతో చేయి కలిపి.. ఇదంతా చేయిస్తున్నారని అంటున్నారు.   కేశినేని నానీకి వైసీపీ నేతలపై సదభిప్రాయం కలిగేలా   ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ ఎమ్మెల్యేలు నానీ అడిగింది కాదనకుండా చేసేలా పీవీపీ పని గట్టుకొని దగ్గరుండి ఎమ్మెల్యేలను నడిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.  ప్రతిపక్ష తెలుగుదేశంలో చీలిక వస్తే ఈసారి తన విజయం నల్లేరుమీద బండి నడక అవుతుందన్న ఉద్దేశంతోనే పీవీపీ  గత మూడేళ్లుగా పక్కా ప్రణాళికతో ఆ వ్యవహారమంతా నడిపించారని అంటున్నారు. ఈ ట్రాప్ లో  తనకు తెలియకుండానే కేశినేని నానీ పడిపోయారని కృష్ణా జిల్లా రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్నది. తెలుగుదేశం అధిష్టానం నానీ లాంటి నాయకుడిని వదులుకునే ఉద్దేశం లేకనే ఇన్నాళ్లు ఆయన తీరు ఎలా ఉన్నా ఉదాశీనంగా వ్యవహరించిందనీ, అయితే  ఈ మధ్య కాలంలో కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను వెనకేసుకురావడంతోనే టీడీపీ అధిష్టానం ఇక తప్పక ఆయన తమ్ముడు చిన్నిని ఫోకస్ లోకి తీసుకువచ్చిందని అంటున్నారు. అయితే, వారిద్దరు కొట్టుకుంటే నాకే ప్రయోజనం కలుగుతుందని పీవీపీ వేసిన ఎత్తుగడ కేశినేని విషయంలో పారినా.. రేపు ఎన్నికల వ్యూహంలో ప్రజలను ఎంతవరకు నమ్మించగలరన్నదే చూడాల్సి ఉంది.

ఏపీ సీఎంఓలో డిజిటల్ సిగ్నేచర్స్ దుర్వినియోగం.. విచారణకు దిగిన సీఐడీ!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్యాలయంలో మరో మోసం బయటపడింది. మోసం అని ఏదో సింపుల్ గా చెప్పుకొనే కన్నా.. అది తీవ్రమైన దుర్వినియోగంగా చెప్పుకోవచ్చు. అదే డిజిటల్ సిగ్నేచర్ల దుర్వినియోగం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్యన ఉండే ముఖ్యమంత్రి కార్యాలయంలో కొంత మంది కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని  అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. సీఎంవో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ ఈ కేసు నమోదు చేయగా.. సీఎంఓలో పనిచేసే రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పనిచేస్తున్న వారు డిజిటల్ సంతకాలు దుర్వినియోగం చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసులో ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంచలన వివరాలు వెల్లడించారు. జగన్ సీఎంఓలో పనిచేస్తున్న కొందరు గత కొన్ని నెలలుగా కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేశారని.. కార్యదర్శుల ఈ-ఆఫీస్ లాగిన్ యూసర్ నేమ్, పాస్ వర్డ్ లను వినియోగించి.. ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థనలను, సీఎం పిటిషన్లు తయారీ చేసి వీటిని సంబంధిత శాఖలకు పంపిస్తున్నారని చెప్పారు. ఇదంతా సీఎంవో కార్యదర్శులకు తెలియకుండానే వీరు చక్కబెట్టి భారీగా డబ్బులు దండుకొని పంచుకున్నారని వెల్లడించారు. సీఎం పిటిషన్లను ఏ శాఖకు కావాలంటే ఆ శాఖ సెక్రెటరీ, సీఎం సంతకాలను కాపీ, పేస్ట్ చేసి పంపించి వారి నుండి డబ్బులు తీసుకున్నారని.. వీళ్లు ఇలా ఒక్కొక్క ఫైల్ ప్రాసెస్ చేయడానికి రూ.30   నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరిలో వీరిలా ప్రాసెస్ చేసిన ఒక ఫైల్ పై అనుమానం రావడంతో క్రాస్ చెక్ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఒక్క కార్యదర్శి ఫైల్ పై అనుమానం రావడంతో మిగతా కార్యదర్శుల పేషీలు చెక్ చేస్తే మొత్తం 66 సీఎంపీలు ఫేక్ అని గుర్తించారట. ఈ డిజిటల్ సిగ్నేచర్ల చోరీ కేసులో ఇప్పటికే ఆరుగురి మీద కేసులు నమోదు చేయగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కనమర్ల శ్రీను (ముత్యాల రాజు పేషీలో మాజీ డీఈఓ), నలజల సాయి రామ్ (జవహర్ రెడ్డి పేషీలో డీఈవో), గుత్తుల సీతారామయ్య (ధనుంజయ రెడ్డి పేషీలో అడెంటర్), చైతన్య (ముత్యాలరాజు పేషి), అబ్దుల్ రజాక్ (జవహర్ రెడ్డి పేషీలో డీఈవో) ఉన్నట్లు సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. అయితే సీఐడీ ఎస్పీ చెప్పిన వివరాలతో పాటు ఏకంగా సీఎం జగన్ డిజిటల్ సిగ్నేచర్ కూడా దుర్వినియోగం అయ్యిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఇప్పుడు ప్రభుత్వ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సెక్రటరీ, సీఎం సంతకాలను కాపీ చేసినట్లు సీఐడీ ఎస్పీ చాలా చాలా మృదువుగా చెప్పారు కానీ వాస్తవానికి   కాపీ చేసినా చోరీ చేసినా ఒక్కటే. కారణం అది సంతకం. సంతకం విలువ ఏంటో.. అది ఫోర్జరీ చేస్తే ఎంతటి నేరమో అందరికీ తెలిసిందే. అయితే, ఇక్కడ చోరీ అయింది ఒక్క ఉన్నతాధికారులైన కార్యదర్శులతో పాటు సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డిది కూడా. ఏకంగా సీఎం ఈ-ఆఫీస్ లాగిన్ యూసర్ నేమ్, పాస్ వర్డ్ కూడా దుర్వినియోగం చేయడం.. అది కూడా కొన్ని నెలల పాటు ఈ వ్యవహారం సాగడం, పదుల కొద్దీ ఫైళ్లను ఎవరో అనామకులు క్లియర్ చేసి దందా నడిపారంటే ఒక సీఎంకి ఇంతకి మించిన అవమానం మరోటి ఉండదు. తన చుట్టూనే ఇంతటి తీవ్రమైన నేరాలు ఇన్ని నెలల పాటు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం.. ఏకంగా తన సిగ్నేచర్ ను కాపీ చేసి దందా నడుపుతున్నా సీఎం గమనించలేకపోయారంటే అసలు జగన్ సీఎంఓలో ఏం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా సీఎం సంతకాన్ని చోరీ చేశారంటే ప్రజలలో పరువు పోతుందని భావించే ఇలా కార్యదర్శుల సంతకాలు దుర్వినియోగం చేశారని, సీఎం సంతకాన్ని కాపీ పేస్ట్ చేశారని మెలిక పెట్టి సీఐడీ ఎస్పీతో చెప్పించినట్లుగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. తన సంతకాన్ని కాపాడుకోలేని సీఎం ఇక రాష్ట్ర ప్రజలను ఏం కాపాడతారని ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.