కొత్త రూపంలో ఓమిక్రాన్ వైరస్!? జాగ్రత్తలు తప్పని సరి!
posted on Aug 10, 2023 @ 1:17PM
కరోనా పేరు చెబితే ఇప్పటికీ వణికిపోయే వారు చాలామంది ఉన్నారు. ప్రపంచం మీద మృత్యు తాండవం చేసిన ఈ వైరస్ దేశదేశాలకు తలపెట్టిన ప్రాణనష్టం అంతా ఇంతా కాదు. ఏకంగా రెండేళ్ల పాటు ప్రపంచం మొత్తం మహమ్మారి దెబ్బకు కుదేలైపోయింది. లాక్ డౌన్ లు, క్వారంటైన్లతో అల్లాడిపోయింది. కరోనా వైరస్ తగ్గిందని అనుకునేలోపు ఓమిక్రాన్ వైరస్ గా తిరిగి ప్రజలమీదకు దండెత్తి వచ్చింది. ఇది కూడా కొన్నిరోజుల పాటు ప్రజలను నానాతిప్పలూ పెట్టింది. ఓమిక్రాన్ వైరస్ తగ్గిపోతోంది కరోనాను ఇక తరిమికొట్టిశాం అని ఊపిరిపీల్చుకునేలోపు ఒమిక్రాన్ కొత్త రూపంలో మానవాళిపై దాడికి రెడీ అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. దాదాపు ప్రపంచం అంతా కోవిడ్, దాని వేరియంట్ల భయం నుంచి బయటపడి ప్రశాంతంగా, స్వేచ్ఛగా గడుపుతున్న సమయంలో ఓమిక్రాన్ కొత్త వేరియంట్ విజృంభణ ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది. వివిధ పరిశోధనలలో ఎరిస్ వేరియంట్ ఓమిక్రాన్ కు వారసత్వం అని నిర్ధారణ అయ్యింది. అంటే కరోనా తరువాత ఓమిక్రాన్, ఓమిక్రాన్ తరువాత ఇప్పుడు ఎరిస్ వైరస్ మానవాళిపై దాడికి రెడీ అవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ అమెరికాలో కరోనా తరువాత అక్కడివారిని ప్రభావితం చేస్తున్న రెండవ అతి ప్రమాదకమైన వైరస్ గా గుర్తించారు. ఈ వైరస్ ను ఇండియాలో కూడా గుర్తించారు. మహారాష్ట్రలో ఈ వైరస్ బయటపడటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ కొత్త వైరస్ ఎరిస్ వైరస్ బారిన పడినా కొంచం ముందుగా గుర్తించి తగిన చర్యలు, చికిత్స తీసుకోవచ్చు. ఇంతకూ ఎరిస్ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే...
ఎరిస్ వైరస్ లక్షణాలు ఇప్పటివరకు ఓమిక్రాన్ లక్షణాల మాదిరిగానే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకినప్పుడు గొంతునొప్పి, ముక్కు కారటం, తుమ్ములు, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఒళ్ళు నొప్పులు, పొడిదగ్గు , వాసన లేకపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కరోనాలో ,ఆ తరువాత ఓమిక్రాన్ లో ఆ తరువాత ఇప్పుడు ఎరిస్ వైరస్ సోకినప్పుడు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం అమెరికాను వణికిస్తున్న ఈ వైరస్ ఇక్కడ మహారాష్ట్రలో కనిపించినా దీని ప్రభావం దేశంలో అంతగా ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ విషయం నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఎందుకంటే వైరస్ వ్యాప్తి ఆరోగ్య నిపుణుల చేతుల్లో కాదు ప్రజలు తీసుకునే జాగ్రత్తల్లో, ప్రజల ఆరోగ్య దృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది.
ఎరిస్ వైరస్ వ్యాప్తి భారతదేశంలో ఎంత తీవ్రంగా ఉంటుందన్నది పక్కన నెడితే.. కరోనా సమయంలో అందరూ ఎలలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో, అలాంటి జాగ్రత్తలే.. అంటే సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, సానిటైజర్ వాడటం. వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే ఎరిస్ వైరస్ మాత్రమే కాదు వేరే ఏ వైరస్ వచ్చినా ఎవరినీ ఏమీ చేయదు.