షర్మిల పాదాలు ఎక్కడికి... ఏపీకా.. తెలంగాణాకా?
posted on Aug 10, 2023 @ 11:48AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్ షర్మిల కారణాలు ఏవైనా, రెండేళ్ళ క్రితం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ) ఏర్పాటు చేశారు. తెలంగాణలో వైఎస్ పాలన అందిస్తామని ప్రజల్లోకి వెళుతున్నారు.
అయితే, అప్పటి నుంచీ... ఆమె ఏపీ గురించి ఇసుమంతైనా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వాదాన్ని బలంగా వ్యతిరేకించిన సంగతి తెలంగాణ వాదులందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి కుమార్తె.. తెలంగాణలో వైఎస్ పాలనను అందిస్తానంటూ రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడమే విశేషం అనుకుంటే.. అంతటితో ఆగకుండా ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో షర్మిల అన్నకు అండగా ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కే మద్దతు పలికారు. అక్రమాస్తుల కేసులో అన్న జగన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు... ఆమె ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ మూడు వేల కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలేశారో .. లేదా బాణమే జగనన్నను వదిలేసిందో తెలియదు కానీ పుట్టింటిని వదిలి మెట్టి నింటికి చేరుకున్నారు.
తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి ఆమె తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసేఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తనదైన ప్రత్యేక పంథాలో పోరాటం సాగిస్తున్నారు.పాదయాత్రలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు షర్మిల త్వరలోనే, వైఎస్సారు టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే షర్మిల మాత్రం ఇంత కష్టపడి పార్టీని నడిపించిన తాను, పార్టీని ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నా.. ఆమె ‘అడుగులు’ మాత్రం విలీనం దిశగానే కదులుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అలాగే టీపీసీసీ నేతలు షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అన్న అంశంపై చర్చోపచర్చలు చేస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత కొద్ది రోజులు సాగిన ఈ ప్రచారం మధ్యలో కొంత బ్రేక్ తీసుకుంది. కానీ, ఇప్పడు తాజాగా మరో మారు ఆ ప్రచారం జోరందుకుంది. అంతే కాదు షర్మిల చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు. హస్తినలో సోనియాగాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీని విలీన ప్రకటన చేస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్‌లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీ కొంతవరకు తేరుకోవడానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే సీనియర్ నాయకుడు వీహెచ్ లు తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల వేలు పెడితే అంగీకరించేది లేదని ఇప్పటికే కుండబద్దలు కొట్టేశారు.
అయితే పార్టీలో తమ ప్రాబల్యాన్ని పెంచుకుని, రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు పావులు కడుతున్న.. భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి వైఎస్ ఫ్యామిలీపై ఉన్నగౌరవంతో షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చి తెలంగాణలో క్రియాశీలంగా పని చేస్తే బీఆర్ఎస్ ను మరింత బలంగా ఢీకొనే అవకాశాలు మెరుగౌతాయని అంటున్నారు. దీనికి తోడు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలోకి రెడ్ కార్పెట్ పరిచినట్లే అయ్యిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుంది, దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారు, అనేది తెలియ వలసి వుంది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంత వరకు షర్మిలను గాంధీ భవన్ మెట్లు ఎక్కనీయనని భీషణ ప్రతిజ్ణ చేశారు. అయితే, షర్మిల పైకి ఏమి చెప్పినా, నాలుగు దిక్కుల నుంచి గాంధీ భవన్ మెట్లు ఎక్కేందుకు చకచకా పావులు కదుపుతున్నారనే పరిశీలకులు అంటున్నారు. ఇక పోతే కాంగ్రెస్ అధిష్ఠానం, మరీ ముఖ్యంగా వైఎస్ ఆత్మగా అంతా చెప్పే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు మాత్రం షర్మిల కాంగ్రెైస్ లో చేరి ఏపీ పగ్గాలు చేపట్టాలనీ, తద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ బలోపేతమయ్యే అవకాశలు ఉంటాయనీ భావిస్తున్నారు. ఆ దిశగా షర్మిలను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ మొదలు రాహుల్ గాంధీ వరకు, పొంగులేటి, కోమటి రెడ్డి మొదలు ఇతర సీనియర్ నాయకులు అందరితోనూ వైఎస్ కుటుంబ బంధాలను పునరుద్దరించే ప్రయత్నాలు షర్మిల సాగిస్తున్నారు. గతంలో బెంగుళూరు వెళ్లి మరీ డీకేకు వెళ్లి మరీ అభినందనలు తెలిపిన షర్మిల, గతంలో ఎప్పుడు లేని విధంగా రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే, షర్మిల పాదాలు కాంగ్రెస్ దిశగా నడక సాగిస్తున్నాయన్నది తేటతెల్లమౌతోంది. అయితే.. వైఎస్ వారసురాలిగా.. ఆమె ఏపీలో ఎక్కువ ప్రభావం చూపగలుగుతారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. జగన్ సర్కార్ విధానాల కారణంగా ప్రజలలో వైసీపీ పట్ల వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకత.. షర్మిల కాంగ్రెస్ నాయకురాలిగా ఏపీలో అడుగుపెడితే అది కాంగ్రెస్ కు సానుకూలంగా మారుతుందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపునకు మళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.