విశాఖ వారాహి యాత్రలో పొత్తు పొడుపులపై కొత్త చర్చకు తెర లేపిన పవన్ ప్రసంగం
posted on Aug 11, 2023 @ 11:59AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో అధికార వైసీపీ అవినీతి, అక్రమాలు, ఆర్థిక అరాచకత్వంపై విమర్శలు గుప్పించారు. వారాహి మూడో విడత యాత్రలో భాగంగా ఆయన విశాఖలో జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. వాలంటీర్ వ్యవస్థపై తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఏపీ ప్రజల డేటా అంతా హైదరాబాద్ కు చేరుతోందన్నారు.
వలంటీర్లపై తనకేం ఆగ్రహం లేదంటూనే వలంటీర్ల వ్యవస్థ ఎంత దుర్మార్గమైనదో వివరించారు. ఇక్కడి వరకూ అంతా బానే ఉంది.. కానీ ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ పై అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించడం, తాను చెబితే చాలు జగన్ అక్రమాలకు, అన్యాయాలకు, అరాచకత్వానికి మోడీ సర్కార్ చరమ గీతం పాడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయడంపైనే పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉండి ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టికి రాష్ట్రంలో సాగుతున్న దుష్టపాలన గురించి పవన్ కల్యాణ్ తీసుకువెళ్లలేదా అని ప్రశ్నిస్తున్నారు. తీసుకువెళ్లినా మోడీ అండ్ కో పెడచెవిన పెట్టారా, పట్టించుకోలేదా? లేక కేంద్రంలో మోడీ సర్కార్ కు రహస్య మిత్రుడిగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు మోడీకి పుత్ర సమానుడైన జగన్ రాష్ట్రంలో సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన గురించి చెప్పడానికి జనసేనాని సంకోచించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే దానిని పక్కన పెడితే
వారాహి మూడవ విడత యాత్ర విశాఖలో ఆరంభమైంది. ఊహించినట్లే.. జనసేనాని జగన్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. సవాళ్లు విసిరారు. హెచ్చరికలూ చేశారు. విశాఖలోని జగదాంబా సెంటర్ వద్ద జరిగిన భారీ సభలో పవన్ కల్యాణ్.. జగన్ మీద విమర్శల దాడి స్థాయిని పెంచారు. ఇన్నాళ్ళూ విమర్శలు మాత్రమే చేస్తూ వస్తున్న పవన్ ఈసారి కార్యాచరణకు దిగుతానని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద వైసీపీ అవినీతి చిట్టా ఉందని ఇక జగన్ కు చుక్కలేనని ప్రకటించారు.
కేంద్ర హోం మంత్రి విశాఖ వచ్చి వైసీపీ ప్రభుత్వ అవినీతి గురించి చెప్పారని తాను కూడా కేంద్రం సాయంతో జగన్ కట్టిస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తోందనీ, అందుకు సంబంధించిన ఫైల్ కేంద్రం దగ్గర ఉందని పవన్ చెప్పుకొచ్చారు. ఇలా మైనింగ్ అక్రమంగా చేస్తున్న ఎమ్మెల్యేల చిట్టా కూడా కేంద్రం వద్ద ఉందన్న కొత్త విషయాన్ని కూడా బయటపెట్టారు. విశాఖ జిల్లాలోనే మైనింగ్ కుంభకోణాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే కేంద్రం ఇచ్చిన నిధులతో పనులు చేస్తూ దానికి జగన్ తన సొంత బొమ్మ వేసుకుంటున్నారు అని విమర్శించారు. విశాఖలో పాతిక వేల కోట్ల విలువ చేసే ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీ ప్రభుత్వం అని పవన్ ఆరోపించారు
ఇక దేశంలోనే పేరెన్నిక కలిగిన ఆంధ్ర యూనివర్సటీ పూర్తిగా భ్రష్టు పట్టి ర్యాంకులు లేక దిగజారిపోయిందనీ, ఏకంగా క్యాంపస్ లో సెక్యూరిటీయే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనీ ఆరోపించారు. ఏయూ వీసీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని గ్యాడ్యుయేట్లపై ఒత్తిడి తేవడం వ్యవస్థల దిగజారుడుకు నిలువెత్తునిదర్శనంగా పవన్ అభివర్ణించారు.
ఈ విమర్శలలో కొత్తవేమీ లేకపోయినా.. పవన్ కల్యాణ్ స్వరంలో వాడీ వేడి పెరిగి నిప్పుల బాణాల్లో ఆయన మాటలు దూసుకు వచ్చాయి. అలాగే ఇప్పటి వరకూ ఎక్కడా ఆయన అధికారంలోకి వచ్చాకా అన్న మాట అనలేదు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఇంత కాలం చెబుతూ వచ్చిన పవన్ విశాఖలో తొలి సారిగా జనసేన అధికారం గురించి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటే సరిపోదనీ, మీరు కూడా అంటే జనం కూడా కోరుకోవాలని పిలుపు నిచ్చారు.
జనసేన అధికారంలోకి వచ్చాకా.. ఆంధ్రా యూనివర్సిటీని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పడం ద్వారా రాష్ట్రంలో పొత్తు పొడుపులకు సంబంధించి కొత్త చర్చకు ఆయన తెరలేపారు. జగన్ని ఏకంగా వ్యాపారిగా అభివర్ణించారు. ఆయన వద్దకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే యువతకు ఉద్యోగాలు అడగడం మాని.. తనకు ఎంత కమిషన్ అని అడుగుతారని తీవ్ర ఆరోపణలు చేశారు.