సినీ పరిశ్రమపై జగన్ సర్కార్ కక్ష సాధింపు!
posted on Aug 10, 2023 @ 12:49PM
ఇంత కాలం జగన్ సినీ ఇండస్ట్రీ పట్ల ఎంత వివక్షతో వ్యవహరించినా.. రాజకీయాలతో మనకెందుకు అనుకున్నారో ఏమో సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. జగన్ సర్కార్ తీరు పట్ల కనీసంగా కూడా నిరసన వ్యక్తం చేయలేదు.
అదే సమయంలో జగన్ పంచన చేరిన కొందరు పరిశ్రమకు చెందిన నటులు మాత్రం నేల విడిచి సాము చేసిన చందంగా రాజకీయంలో జగన్ కు వ్యతిరేక పార్టీలకు మద్దతుగా నిలిచిన వారిపై విమర్శలతో చెలరేగిపోయారు. అయితే పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండవు అన్నట్లుగా ఇప్పుడు సినీ పరిశ్రమలో గుర్తింపు ఉన్న ఒక్కొక్కరూ ఏపీలో జగన్ సర్కార్ తీరు పట్ల కన్నెర్ర చేస్తున్నారు. నిర్మొహమాటంగా ఇండస్ట్రీ జోలికొస్తే ఊరుకునేది లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల నాటికే ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఆయన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టలేదు. కానీ అప్పటి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ కూటమి తరఫున ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగారు. జయాపజయాల సంగతి పక్కన పెడితే.. ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తే అయినా ఎక్కడా సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ రాజకీయం చేసిన సందర్భం లేదు.
అయితే అప్పటి ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, పార్టీ టికెట్ ఆశించి.. అన్ని పార్టీల తలుపూ తట్టి చివరికి జగన్ గూటికి చేరిన అలీ, ఇంకా పోసాని వంటి వారు మాత్రం జగన్ మనసెరిగి పవన్ కల్యాణ్ సహా జగన్ ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకు ప్రతిఫలమేమిటన్నది ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అంతే కాదు స్వయంగా వారు అనుభవిస్తున్నారు కూడా. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకీ, అధికార వైసీపీకి మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు కనిపిస్తోంది. నాలుగేళ్లకు పైబడి సాగిన జగన్ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి పెల్లుబుకుతున్న సంగతిని గ్రహించిన వైసీపీ నేతలలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. యధాలాపంగా ప్రభుత్వ విధానాలపై చేసిన వ్యాఖ్యలను కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.
అధికార పార్టీ ఎంపీ రాజ్యసభ వేదికగా సినీ నటుల పారితోషకాలపై చేసిన కామెంట్లపై ఓ సినీ ఫంక్షన్ లో హీరో చిరంజీవి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క సారిగా దూషణలతో విరుచుకుపడటం చూస్తుంటూ అధికార పార్టీలో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందే అర్ధం చేసుకోవచ్చు. ఇంత కాలం చిరంజీవిని భుజాన మోసిన వారే ఇప్పుడు ఆయనను తూలనాడటం చూస్తుంటే.. చిన్న పాటి వ్యతిరేక వ్యాఖ్యను కూడా సహించలేనంతగా అధికార పార్టీ నాయకులలో అహం, అసహనం ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం అవుతోందని పరిశీలకులు అంటున్నారు. పైగా చిరంజీవి ఆ సినిమా ఫంక్షన్ లో విమర్శలు చేయలేదు.. అధికార పార్టీ సినీ పరిశ్రమపై పడి ఏడవడం కాదు.. అంత కంటే పెద్ద పనులు ఉన్నాయి వాటిని చేయాలని హితవు మాత్రమే పలికారు.
లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం సినీమా హీరోల పారితోషకాల గురించి మాట్లాడటమేమిటని సహజంగానే జన బాహుల్యంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అలాగే రజనీకాంత్ గతంలో అంటే ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో రెండు ముక్కలు చంద్రబాబు గురించి మంచిగా మాట్లాడినందుకే ఆయనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ విమర్శలకు సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్ లో దీటుగా సమాధానం ఇచ్చారు. సరే అదలా ఉంటే.. ఇప్పుడు చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఆగస్ట్ 11న రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ ఏపీ సర్కార్‌కి టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు. అయితే భోళా శంకర్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. టికెట్ ధరల పెంపుకోసం వచ్చిన అనుమతిని కనీసం పరిశీలను కూడా తీసుకోవద్దంటూ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయని చెబుతున్నారు.
గతంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా జగన్ సర్కార్ ఇదే తీరున వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జగన్ సర్కార్ సినీ పరిశ్రమపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందన్న మెసేజ్ ఇప్పటికే బలంగా ప్రజలలోకి వెళ్లింది. ఇది జగన్ సర్కార్ కు ఎంత మాత్రం మేలు చేయదు. సినీ పరిశ్రమ మీద ఆధారపడి జీవించే లక్షలాది మందే కాకుండా ఆయా హీరోల అసంఖ్యాక అభిమానలను కూడా వైసీపీ దూరం చేసుకున్నట్లేననీ, వచ్చే ఎన్నికలలో ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమనీ అంటున్నారు.