ఇంకా జగనన్న వదిలిన బాణమేనా?
posted on Aug 10, 2023 @ 2:34PM
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహార శైలి.. హస్తం పార్టీ అగ్రనేతలకు ఏ మాత్రం అంతుపట్టని విధంగా ఉందని ఢిల్లీ పోలిటికల్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీకి వెళ్లి రాజకీయం చేయమంటే వెళ్లను.. తెలంగాణలోనే ఉండి.. రాజకీయం చేస్తానని షర్మిల చెబుతున్నారనీ, అయితే ఏపీలో పార్టీ బలోపేతం కోసం పని చేయమంటే షర్మిల ఎందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదన్న అంశంపై హస్తిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. రాష్ట్రానికి చెందిన కీలక నేతల నుంచి సమాచారం సేకరిస్తున్నట్ల ఆ పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ఆ సందర్భంగా అందులో అధిష్ఠానం దృష్టికి పలు ఆసక్తికర విషయాలు వస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా అటు జగన్, ఇటు షర్మిలల మధ్య బంధం గట్టిగానే ఉందని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. వీరిద్దరు పైకి కుస్తీ.. లోన దోస్తి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ఓ వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిలను నియమిస్తే.. విభజనతో నష్టపోయిన నవ్యాంధ్ర.. తన సొంత సోదరుడు జగన్ పాలనతో మరింత బాగా వెనుక పడిపోయిందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి మరింత బలంగా చెప్పాల్సి ఉంటుందని.. అలాగే సోదరుడు జగన్.. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ.. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, నవరత్నాలు, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారని.. కానీ అదే సోదరుడు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత.. ఈ అంశాలన్నీ మరిచిపోయారని.. వీటిని సైతం ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత షర్మిలపై ఉంటుందని.. ఇక జగనన్న వదిలిన బాణమంటూ... అటు పాదయాత్ర, ఇటు బస్సు యాత్ర చేసి... 2019 ఎన్నికల్లో గద్దెనెక్కించిన సొంత సోదరుడిని.. మళ్లీ అధికారానికి దూరం చేయాల్సి ఉంటుందని... ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లి సొంత సోదరుడు వ్యతిరేకించే పార్టీలో చేరి.. ఫ్యాన్ పార్టీపై బురద జల్లడం కంటే.. పక్క రాష్ట్రంలో ఉండి తన రాజకీయం తాను చేసుకొంటే మంచిదనే ఓ అభిప్రాయంలో వైయస్ షర్మిల ఉన్నారని రాష్ట్రంలోని కాంగ్రెస్ వర్గాల ద్వారా ఢిల్లీలోని పార్టీ అగ్రనేతలకు సమాచారం చేరిందని అంటున్నారు.
అన్నా చెల్లెళ్ల మధ్య బంధం ఏ మాత్రం చెడలేదని.. ఇప్పటికే సీఎం వైయస్ జగన్ సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్ తులసీ రెడ్డి మీడియా ఎదుటే గతంలోనే వివరించారని.. ఈ విషయం సైతం హస్తం పార్టీ అగ్రనేతల వద్దకు చేరిందని తెలుస్తోంది.
మరో వైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేసేందుకు ఢిల్లీ వేదికగా కసరత్తు జరుగుతోందనీ.. అందులోభాగంగా ఆమె గత వారం రోజులుగా బెంగళూరులోనే ఉంటూ.. కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో చర్చల మీద చర్చలు జరుపుతోంది.
అయితే తాను తెలంగాణలోనే ఉంటానని.. ఇక్కడే రాజకీయం చేస్తానని డీకే శివకుమార్ ద్వారా.. హస్తం పార్టీ అధిష్టానానికి షర్మిల క్లియర్ కట్ సందేశం పంపినట్లు సమాచారం. మరోవైపు షర్మిల రాక వల్ల తెలంగాణలో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. పార్టీ అధిష్టానానికి వివరణ ఇవ్వడంతో... ప్రస్తుతం వైఎస్సార్టీపీని హస్తం పార్టీలో విలీనం చేయాలని.. ఆ తర్వాత అంటే.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని.. కేంద్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే.. మీ తండ్రికి ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కాయో.. అలాంటి గౌరవమే మీకూ దక్కుతుందని వైయస్ షర్మిలకు పార్టీ అధిష్టానం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే వారం డీకే శివకుమార్‌తోపాటు షర్మిల ఢిల్లీ వెళ్లి... పార్టీ అగ్రనేతల సమక్షంలో వైయస్ఆర్‌టీపీని హస్తం పార్టీలో విలీనం చేసి... ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కోసం ఆమె కృషి చేయనున్నారనే ఓ ప్రచారం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.