సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే! సీబీఐ విచారణకు బాబు డిమాండ్

జగన్ రాక్షసత్వం, అసమర్థకు అమయాక కుటుంబాలు బలైపోతున్నాయని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీలో కలకలం రేపుతున్న నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై మరోసారి వేధింపులకు గురిచేసి అబ్గుల్ సలాం కుటుంబాన్ని బలితీసుకున్నారని ఆయన  విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ప్రభుత్వ ఉదాసీనతే ప్రజల్లో అభద్రతను పెంచుతోందన్నారు .రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదని విమర్శించారు చంద్రబాబు.  కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే.. అబ్దుల్ సలాం కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని  చంద్రబాబు అన్నారు. సలాం కేసులో రైల్వే పోలీసులు కేసు నమోదు చేస్తే.. స్థానిక పోలీసులు తెలియనట్లు నటించారని చంద్రబాబు మండిపడ్డారు. సలాం కుటుంబసభ్యులు వీడియో విడుదల చేసే వరకూ..వాస్తవాలు బయటకు రాలేదన్నారు. తాను ట్వీట్ పెట్టాక పోలీసులు స్పందించారన్నారు. టీడీపీ న్యాయవాది వల్లే బెయిల్ వచ్చిందంటూ ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందన్నారు. న్యాయవాదుల వల్ల బెయిల్‌లు వస్తాయా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అచ్చెన్న, కొల్లు రవీంద్ర, రాజధాని రైతులపై ఎలాంటి కేసులు పెట్టారని నిలదీశారు. పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఎవర్ని మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంఐఎం ఎమ్మెల్యేను అడ్డుకున్న బీజేపీ! పాతబస్తీలో టెన్షన్

హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రిని అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా గౌలిపురాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించడానికి వచ్చారు ఎంఐఎం ఎమ్మెల్యే. బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆయన్ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు మద్దతుగా ఎంఐఎం కార్యకర్తలు భారీగా రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే  పాషాఖాద్రిని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో గౌలిపురాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులను మోహరించారు.

ఆ వర్గాన్ని టార్గెట్ చేసిన శ్రీదేవి! ఆడియో లీక్‌తో కలకలం

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియా  కాల్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తాజా ఆడియోలో రెడ్డి  సామాజిక వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రీదేవి.  రెడ్లు చాలా డేంజర్ అని ఆమె కామెంట్ చేశారు. మనల్ని ఎంతసేపు వాళ్లకు అడ్డం రాకుండా వాడుకొని వదిలేస్తారని ఎమ్మెల్యే అన్నట్లు  ఆడియోలో ఉంది. అధికారం అంతా వాళ్ల చేతల్లో పెట్టుకుని మనల్ని ఎలా అణగతొక్కాలా అని మనసులో ఉంటుందని ఆడియోలో చెప్పుకొచ్చారు  ఎమ్మెల్యే.  స్థానిక నేతలతో  ఉన్న విభేదాలను కూడా సందీప్ అనే వ్యక్తితో శ్రీదేవి మాట్లాడినట్లుగా  వైరల్ అవుతున్న ఆడియోలో ఉంది. ఎస్సీలు, బీసీలు ఒకటిగా ఉండాలని శ్రీదేవి మాట్లాడినట్లుగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, కోన రఘుపతి, అప్పిరెడ్డితో పాటు  చాలా మంది నేతల పేర్లు కూడా ఆడియోలో ఎమ్మెల్యే శ్రీదేవి ప్రస్తావనకు తెచ్చారు గతంలోనూ ఎమ్మెల్సే శ్రీదేవికి సంబంధించిన ఓ ఆడియా తీవ్ర దుమారం రేపింది. గత ఆడియోలో పేకాట విషయమై సందీప్‌-శ్రీదేవి మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. టీడీపీలో ప్రత్తిపాటి పుల్లారావు,  మోదుగుల క్లబ్‌లు నడిపించారని.. మనం కూడా పేకాట ఆడిద్దామని సందీప్‌తో శ్రీదేవి చెప్పినట్లుగా ఆడియోలో ఉంది. ఫిరంగిపురం మండలంలో ఆడిద్దామని శివరామిరెడ్డి చెబుతున్నారని.. 5 శాతం ఇస్తామని  చెబుతున్నారని కూడా అందులో ఉంది. చాలా డబ్బులు వస్తాయని శివరామిరెడ్డి చెబుతున్నాడని.. ఏం చేయాలో చూడాలని సందీప్‌తో ఎమ్మెల్యే శ్రీదేవి చర్చించినట్లు స్పష్టంగా ఉంది. ఎమ్మెల్యేతో మాట్లాడిన సందీపే ఆ ఆడియోను రిలీజ్ చేశారు.  గతంలో సందీప్ విడుదల చేసిన ఆడియో టేపు విషయంలో శ్రీదేవి స్పందిస్తూ.. తాడికొండ పీఎస్‌లో నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. తన మాజీ అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయాల్లో తాను ఎదుగుతుంటే చూడలేక ఇలా రాళ్లు వేస్తున్నారని.. అంతేకాదు తన వెంట  మారణయుధాలతో తిరుగుతున్నారని శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. తన గొంతును మార్ఫింగ్ చేసి  ఫేక్ ఆడియోలు విడుదల చేస్తున్నారని కూడా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే శ్రీదేవి కేసు తనపై కేసు పెట్టడంతో సందీప్ కూడా స్పందించారు. సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఎమ్మెల్యే శ్రీదేవి కేసు పెట్టడంపై సందీప్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం వైఎస్ జగనే తనను కాపాడాలని వీడియోలో వేడుకున్నాడు.  నాపై అక్రమ కేసులు పెట్టడంతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నాకు చావు తప్ప మరో మార్గం  కనిపించటం లేదని వీడియోలో సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ ధర్మేంద్ర, ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. శ్రీదేవికి కష్టకాలంలో అండగా ఉన్నానని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ఆమె కంటతడి పెట్టుకుంటే.. తనకు తెలిసినవాళ్ల దగ్గర తానుమధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించానని తెలిపారు. ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతుంటే..ఇవ్వకుండా తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని సెల్పీ  వీడియోలో సందీప్ తెలిపారు.  గత ఆడియో వివాదం , సందీప్ సెల్ఫీ విడియో  ప్రకంపనలు కొనసాగుతుండగానే.. తాజాగా మరో ఆడియో బయటికి రావడంతో ఎమ్మెల్యే శ్రీదేవి ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో ఆమె కలవరపడుతున్నట్లు చెబుతున్నారు. తాజా ఆడియోలో ఆమె రెడ్డి వర్గ  నేతలను టార్గెట్ చేయడంతో.. వారంతా ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తంగా గత వివాదానికి ఫుల్ స్టాప్ పడకముందే మళ్లీ ఎమ్మెల్యే కొత్త వ్యవహారం వెలుగుచూడటంతో తాడికొండలో రాజకీయం మరింత ముదిరింది.

మైనార్టీ ఏరియాలో బీజేపీ విజయం! సహకరించిన ఎంఐఎం? 

హోరాహారీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ కన్నా మూడు సీట్లు ఎక్కువ సాధించింది బీజేపీ కూటమి. చివరి వరకు ఉత్కంఠ సాగినా బీహార్ కౌంటింగ్ లో చివరికి బోటాబోటీ మెజార్టీతో గట్టెక్కింది ఎన్డీఏ. పోత్తులో భాగంగా బీజేపీ 115 నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. 65 శాతానికి పైగా సక్సెస్ రేటుతో 74 సీట్లు గెలిచింది. జేడీయూ మాత్రం 115కు కేవలం 43 చోట్ల విజయం సాధించింది. ఆర్జేడీ 76 సీట్లు సాధించగా.. 70 స్థానాల్లో బరిలో నిలిచిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. 20 చోట్ల పోటీ చేసి 16 సీట్లు గెలిచి పట్టు నిలుపుకున్నారు కమ్యూనిస్టులు. అయితే బీహార్ ఫలితాలను విశ్లేషిస్తే ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి.  హిందుత్వ  పార్టీగా చెప్పుకునే బీజేపీ మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విజయం సాధించడం రాజకీయ వర్గాలను అశ్చర్య పరుస్తోంది. బీహార్ లో 243 నియోజకవర్గాలుండగా.. దాదాపు 60 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే 20 శాతానికి పైగా ఉన్నారట. ఈ సీట్లపై గతంలో బీజేపీకి పెద్దగా అశలు  ఉండేవి కావు. కాని ఈసారి ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సీమాంచల్ లోని 52 నియోజకవర్గాల్లో 40 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇదే ఇప్పుడు బీహార్ లో చర్చనీయాంశంగా మారింది.  మైనార్టీల ప్రాబల్యం ఉన్నప్రాంతంలో కమలం వికసించడంపై రాజకీయ విశ్లేషకులు పలు రకాలు వాదనలు వినిపిస్తున్నారు. ఎంఐఎం విడిగా పోటీ చేయడంతో ముస్లిం ఓట్లు చీలి బీజేపీకి ఫ్లస్ అయిందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ పైనే ఫోకస్ చేసింది ఎంఐఎం. లోకల్ ప్రాంతీయ పార్టీలతో కలిసి 20 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. మరికొన్ని సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది. సీమాంచల్ లో ఎంఐఎం 14 సీట్లలో పోటీ చేయగా.. ఐదు చోట్ల విజయం సాధించింది. మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ భారీగానే ఓట్లు సాధించింది పతంగి పార్టీ. ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్, ఆర్డేజీ కూటమినే ఎక్కువ టార్గెట్ చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. దీంతో యూపీఏకు పడాల్సిన ఓట్లకే ఎంఐఎం గండి కొట్టిందని చెబుతున్నారు. అందుకే మైనార్టీల కోటగా చెప్పుకునే సీమాంచల్ లో బీజేపీ 40 స్థానాలు సాధించిందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.   ముస్లింలు ఎక్కువున్న ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడంపై మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మోడీ సర్కార్ తీసుకువచ్చి త్రిపుల్ తలాఖ్ బిల్లుతో ముస్లిం మహిళల మైండ్ సైట్ లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. తమకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న సమస్యను పరిష్కారించారన్న భావనలో ఉన్న కొందరు ముస్లిం మహిళలు.. బీహార్ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గుచూపారని చెబుతున్నారు, ముస్లిం యువతలో కూడా కొంత మార్పు కనిపించిందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలనే భావనలో కమలానికి సపోర్ట్ చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ఎంఐఎం పోటీ చేయడంతో కొన్ని ఓట్లు చీలడం కూడా బీజేపీ కలిసివచ్చిందని చెబుతున్నారు.  బీహార్ లో తృటిలో అధికారం అందుకోలేకపోయిన ఆర్డేజీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమి నేతలు మాత్రం ఎంఐఎం వల్లే బీహార్ లో బీజేపీ బయటపడిందని ఆరోపిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ముస్లిం ఓట్లను చీల్చే కుట్రలో భాగంగానే బీహార్ లో ఎంఐఎం పోటీ చేసిందని చెబుతున్నారు. ఎప్పుడూ బీజేపీని విమర్శించే ఒవైసీ.. ఎన్నికల సభల్లో మాత్రం బీజేపీ గురించి మాట్లాడలేదని.. అక్కడే ఆ పార్టీ కుట్ర ఏంటో తెలిసిపోతుందని అర్జేడీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. బీహార్ లో బీజేపీ గెలుపునకు పరోక్షంగా ఒవైసీ సహకరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్ లోని అమిత్ షా నివాసంలో  బీజేపీ నేతలతో అక్భరుద్దీన్ ఒవైసీ చర్చలు జరిపారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆప్ అధినేత.

ప్రభుత్వ పరిహారం నిరాకరించిన అబ్దుల్ సలాం అత్త

అంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.  జగన్  ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని తీసుకునేందుకు నిరాకరించింది అబ్దుల్ సలామ్ అత్త మాబూని. గోల్డ్ షాప్‌లో చోరీ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలని కోరారు. తమ కుటుంబ సభ్యుల చావుకు కారణమైన పోలీసులను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని మాబూని డిమాండ్ చేశారు. నంద్యాలలో మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి 10 గంటలకు అబ్దుల్ సలాం ఇంటికి వెళ్లడం దుమారం రేపింది. తెల్లకాగితంపై సంతకం చేయాలని పోలీసులు అబ్దుల్ సలాం అత్తపై ఒత్తిడి తీసుకొచ్చారని చెబుతున్నారు. పోలీసులు రావడంతో భయపడిన అబ్దుల్ సలాం అత్త మాబిమ్ సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో పోలీసులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది సబ్ కలెక్టర్. దీంతో పోలీసులు వెనక్కు వెళ్లిపోయారని తెలుస్తోంది.

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా యాంటీబాడీలు.. తాజా సర్వేలో వెల్లడి 

దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి ఒంట తగ్గినప్పటికీ వ్యాప్తి మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రజలు మాస్క్ ధరించకపోవడం, సేఫ్ డిస్టెన్స్ పాటించకపోవడం వంటి తప్పులతో దేశంలో కరోనా వ్యాప్తి జరుగుతోంది. ఐతే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి పై సిరో సర్వేజరపగా ప్రతి నలుగురు జనాభాకు గాను ఒకరిలో కరొనను ఎదుర్కునే యాంటీబాడీలు ఉనట్లుగా తేలింది. ఈ సర్వేను ఢిల్లీలోని అన్ని ప్రాంతాలలో అక్టోబరు 15 నుంచి అక్టోబరు 21 మధ్య చేపట్టారు. ఈ సర్వే కోసం మొత్తం 15,162 మంది నుండి శాంపిల్స్ సేకరించారు.   ఈ తాజా సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం ఢిల్లీ లో ప్రతీ నాలుగో వ్యక్తిలో కరోనాతో పోరాడే యాంటీబాడీని గుర్తించారు. అయితే అంతకు ముందు సిరో నిర్వహించిన సర్వేలో 22.86 శాతం మందిలో మాత్రమే కరోనాతో పోరాడే యాంటీబాడీలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ప్రొఫెసర్ నావల్ విక్రం మాట్లాడుతూ.. మనిషి శరీరంలో తయారైన ఈ యాంటీబాడీలు ఎప్పటికీ అలానే ఉండిపోవని, యాంటీబాడీ ఒకసారి తయారైన తరువాత కొంతకాలానికి అవి తగ్గిపోతాయని తెలిపారు. దీంతో వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ప్రజలంతా పూర్తి అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి అని అయన అన్నారు.

కరోనాకు ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే మృతి

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహమ్మారితో చనిపోయేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ జీనాను కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది. కరోనా సోకడంతో ఇటీవల ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు జీనా. నిన్న రాత్రి  ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.ఎమ్మెల్యే జీనా భార్య  ఇటీవలే గుండెపోటుతో చనిపోయారు. ఆమె  చనిపోయిన కొన్ని రోజులకే జీనా మృతి చెందడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 8 డిసెంబరు 1969లో అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో జీనా జన్మించారు జీనా. 2007లో తొలిసారి బిక్యాసెన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 47,905 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,83,917 కి చేరింది. గత 24 గంటల్లో 52,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల్లో  550 మంది కరోనా కారణంగా మృతి చెందడంతో దేశంలో మొత్తం కరోనా మహమ్మారి మృతుల సంఖ్య 1,28,121 కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 80,66,502 మంది కోలుకోగా..  4,89,294 యాక్టివ్ కేసులున్నాయి.

దుబ్బాకలో చతికిల పడినా మారని కాంగ్రెస్ అగ్రనేతల తీరు..

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధికి కేవలం 22196 ఓట్లు రావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. అయినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ ప్రవర్తనను ఏమాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా ఖమ్మంలో జరిగిన ఒక సమావేశంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. టిపిసిపిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మంలో చేపట్టిన "రైతు పొలికేక" సభలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ సభలో వీహెచ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని అన్నారు. దీంతో సభలోని కొందరు కార్యకర్తలు రేవంత్‌కు సపోర్ట్ గా నినాదాలు చేశారు. అయితే వాటిని ఏమాత్రం పట్టించుకోని వీహెచ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఎన్నికల టైం లో ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని చేర్చుకుని టికెట్ ఇవ్వడం సరికాదని, ఎప్పటి నుండో పార్టీని నమ్ముకుని ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని అన్నారు.   అయితే విహెచ్ ప్రసంగం తరువాత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వీహెచ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏకంగా అమ్ముడుపోయే నేతలు ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి పార్టీనుండి ఏరివేయాలని అన్నారు. అంతేకాకుండా పార్టీలో డిపాజిట్లు రాని నాయకుల పెత్తనం కూడా కొనసాగుతోందని, ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగవని అధిష్ఠానం కూడా తేల్చి చెప్పిందని.. వీహెచ్‌ను ఉద్దేశించి రేవంత్ అన్నారు. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదని, ఎక్కడి నుండి వచ్చినా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులనే ప్రజలు గెలిపిస్తారని రేవంత్ ఈ సందర్భంగా అన్నారు. రేవంత్, వీహెచ్ వ్యాఖ్యలతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎస్వీబీసీ లీలలు చూడతరమా? 

తిరుమల ‘కొండా’రెడ్లు ఏం చేస్తున్నారు?   ధర్మరాజు పాలనలో ఏమిటీ దారుణాలు దేవా?   తిరుమల వెంకన్న కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు... 12 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఎస్వీబీసీ చానెల్, ఇప్పుడు ధర్మరాజు లాంటి ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో, ‘అత్యంత విజయవంతంగా’ ‘మునుపెన్నడూ లేనంత సమర్థతతో సాగుతోంది. శ్రీవారి సేవలో తరించాల్సిన భక్తిచానెల్, పాలకుల పల్లకీలో తన జన్మ ధన్యం చేసుకునే పనిలో ‘శ్రమ’టోడ్చుతోందట. మరి పెద్ద పెద్ద సార్లు, పాలకుల పల్లకీ మోసే పనిలో క్షణం తీరిక లేకుండా ఉంటే.. కింద పనిచేసే చిన్న సార్వాడీలు మాత్రం తక్కువ తినరు కదా? వారూ తమకు తోచిన లీలలు కొనసాగిస్తున్నారు.   మొన్నామధ్య ‘శతమానం భవతి’ కార్యక్రమం కోసం.. ఎస్వీబీసీ ఉద్యోగికి ఒక భక్తుడు మెయిల్ పెట్టారట. దాన్ని చూసిన సదరు ఉద్యోగి, పోర్నుసైటు లింకు పెట్టి, పండగ చేసుకోమని చెప్పారట. దాన్ని చూసిన సదరు భక్తశిఖామణి అపచారమంటూ నెత్తికొట్టుకుని, ఆ విషయాన్ని ఎస్వీబీసీ చైర్మన్, టీటీడీ చైర్మన్, ఈవోకు చేరవేశారు. దానితో భక్తుడిపై కరుణించిన టీటీడీ పెద్దలు.. విజిలెన్స్, సైబర్ క్రైం పోలీసులను రంగంలోకి దింపారు. ఆఫీసులో కంప్యూటర్లు తనిఖీ చేస్తే, ఉద్యోగుల‘ రాసలీలాభిమానం’ ఏమిటో బయటపడిందట.   ఈ అరాచకం-అపచారంపై టీడీపీ-బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్వీబీసీ అరాచాలను తూర్పారపట్టారు. హిందూధర్మ ప్రచారంపై, ఎస్వీబీసీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విరుచుకుపడ్డారు. అయోధ్య ప్రత్యక్ష ప్రసారం ఇవ్వని నిర్లక్ష్యాన్ని గుర్తు చేశారు. అవసరాలకు మించి ఉద్యోగుల నియామకాలు, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎండగట్టారు. దోషులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సైతం, టీటీడీ పాలకుల తీరును దునుమాడారు. టీడీపీ కార్యకర్తలు, ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. మరి కొండమీదున్న ‘కొండారెడ్లు’ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి!   అయోధ్య శంకుస్థాపనను.. లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వలేనంత బిజీగా, పాలకుల సేవలో తరిస్తున్న ఈ ఎస్వీబీసీ చానెల్‌కు, టీటీడీ ఏడాదికి ఇచ్చే బడ్జెట్ అక్షరాలా 25 కోట్లు. అందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 250 మంది. నిజానికి ప్రస్తుత అవసరాలకు సరిపోయే సిబ్బంది 100 మంది మాత్రమే. ఇప్పటిదాకా ఏఓ, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ టెక్నికల్ ఆపీసర్, చీఫ్ ప్రోగ్రామింగ్ పోస్టులు భర్తీ చేయలేదు. టీటీడీ వ్యవహారాలపై, భక్తకోటి పక్షాన, నిరంతరం పోరాటం చేస్తున్న, రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడయిన నవీన్ అనే భక్తుడు.. ఎస్వీబీసీ చానెల్ అక్రమాలపై హైకోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాల ప్రకారం విజలెన్స్ అధికారులు విచారణ జరిపితే, అందులో 2 కోట్ల 30 లక్షల అవినీతి జరిగిందని తేలింది. దానితో నాటి సీఈఓను తొలగించేశారు. ఆ అవినీతి కథ అక్కడితో ముగిసింది. అసలు అవససం లేకుండానే ఉద్యోగులను 50 వేలు-70 వేలు ఇచ్చి ఎందుకు నియమించుకుంటున్నారో తెలియదు. టీటీడీ ఇప్పటిదాకా దాడులు చేసిన 30 మందిని ఎందుకు కొనసాగిస్తుందో పాలకమండలికే తెలియాలి.అంతేనా?.. కోట్లాదిరూపాయలు ఖర్చు పెట్టి తీసిన శ్రీవారి ‘టేప్’లు ఎక్కడున్నాయి? అసలు ఉన్నాయా? లేవా? గత 13 ఏళ్ల నుంచి ఎస్వీబీసీ చానెల్ , ఏ కార్యక్రమానికి ఎన్ని కోట్లు ఖర్చు చేసిందన్న లెక్కలున్నాయా? అన్న ప్రశ్నలకు ఎవరి నుంచీ జవాబు లేదు.   భక్తులిచ్చే విరాళాలతో నడుస్తూ, టీటీడీ నిర్విహంచే.. ఎస్వీబీసీ నిధులన్నీ పప్పుబెల్లాల మాదిరిగా పంచేస్తుంటే, కొండమీదున్న ‘కొండారెడ్లు’ ఎందుకు గమ్మునుంటున్నారు? ఒకరా.. ఇద్దరా.. కొండమీద ఎటు చూసినా అంతా రెడ్డిగార్లే. ఇటు చూస్తే చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి.. అటు చూస్తే ఈఓ జవహర్‌రెడ్డి.. మరోవైపు చూస్తే ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి. కొండపై కొలువుదీరిన ఈ ‘కొండారెడ్ల’ జమానాలో టీటీడీ ‘ఆరకంగా ముందుకెళుతోంది’ మరి! ఎస్వీబీసీ నిర్వహణపై శరపరంపరగా ఆరోపణలొస్తుంటే, ప్రక్షాళనకు ఎందుకు నడుం బిగించడం లేదు? వైఫల్యాలకు-ఆరోపణలకు కింది స్ధాయి వారినే ఎందుకు బలిచేస్తున్నారు? అందులో ‘కొండారెడ్ల’ నిర్వహణా వైఫల్యం లేదా? మరి ఆ లెక్కన వారిపైనా చర్యలు తీసుకోవాలి కదా? ఎస్వీబీసీకి బాసుగా ఉన్న వారిపై కదా, వేటు వేయాల్సింది?. ఈ ప్రశ్నలకు బదులిచ్చే దమ్ము, కొండమీదున్న స్వాములకు ఉందా?!  -మార్తి సుబ్రహ్మణ్యం

ఉత్తమ్ కు దుబ్బాక సెగ! పీసీసీకి కొత్త బాస్ వచ్చేస్తారా?

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రేపో మాపో కొత్త సారధిని హైకమాండ్ ప్రకటిస్తుందని చెబుతున్నారు కాని అది జరగడం లేదు. లోక్ సభ ఎన్నికల తర్వాత నుంచి ఇదే ప్రచారం జరుగుతోంది. నెలలు గడుస్తున్నాయి కాని టీకాంగ్రెస్ కు కొత్త బాస్ రాలేదు. రాష్ట్రానికి కొత్త ఇంచార్జ్ వచ్చారు కాని పీసీసీలో మాత్రం మార్పులు జరగలేదు. దుబ్బాక ఉప ఎన్నికతో మళ్లీ పీసీసీ అంశంపై కాంగ్రెస్ లో తెరపైకి వచ్చింది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని  మార్చాలంటూ కార్యకర్తలే రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేయడం కాంగ్రెస్ లో కాక రేపుతోంది.    దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ కాంగ్రెస్ లో మంట పుట్టించింది. హోరాహోరీగా సాగిన దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వరంగల్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసనకు దిగారు. కాజీపేట మండలం మడికొండలో ఉత్తమ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. సోషల్ మీడియాలో పీసీసీని మార్చాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్ కుమార్‌ రెడ్డే కారణమని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు కాంగ్రెస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.   దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు హోరాహోరిగా తలపడుతుంటే కాంగ్రెస్ మాత్రం చాలా వెనకబడి పోయింది. మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కేవలం 22 వేల ఓట్లు మాత్రమే సాధించాడు. మొత్తం 23 రౌండ్‌లు కౌటింగ్ జరగగా.. ఒక్క రౌండ్‌లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి లీడ్‌లోకి వచ్చారు. అది కూడా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలున్న ప్రాంతంలోనే. కాంగ్రెస్ ఘోర ఓటమితో  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు   నిజానికి దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ఆ పార్టీ కీలక నేతలంతా రంగంలోకి దిగారు. దుబ్బాకలో 145 గ్రామాలుండగా.. గ్రామానికో కీలక నేతను ఇంచార్జీగా పెట్టారు. గతంలో ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ నేతలు ఇంతగా కష్టపడలేదని ఆ పార్టీ సీనియర్ నేతలే చెబుతున్నారు. ఈ స్థాయిలో ప్రచారం చేసినా కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కు పడిపోవడం కార్యకర్తల ఆగ్రహానికి కారణమవుతోంది. చివరివరకు టీఆర్‌ఎస్ టికెట్ కోసం యత్నించిన శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం సరికాదనే అభిప్రాయం కేడర్ నుంచి వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కూడా ఓటమికి కారణమనే చెబుతున్నారు. పీసీసీ నేత నిర్లక్ష్యం వల్లే కాంగ్రెస్ రోజురోజుకుబలహీనపడుతోందని కార్యకర్తలు ఓపెన్ గానే చెబుతున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.    ఇటీవల మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. గ్రేటర్ వరద సాయంలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వాన్ని కడిగిపారేశారు రేవంత్ రెడ్డి. గ్రేటర్ వ్యాప్తంగా పర్యటించి బల్దియా అధికారులకు చుక్కలు చూపించారు. రేవంత్ రెడ్డి పోరాటాలతో ప్రస్తుతం గ్రేటర్ లో కాంగ్రెస్ బాగా పుంజుకుందని చెబుతున్నారు. అలాంటి డైనమిక్ లీడర్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పగ్గాలిస్తేనే కేసీఆర్ ను,టీఆర్ఎస్, తెలంగాణలో ఎదగాలని ఎత్తులు వేస్తున్న బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ సాధ్యమవుతుందని, లేదంటే ఏపీలానే తెలంగాణలోనూ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు అవేదన చెందుతున్నారని చెబుతున్నారు.

ఓటిటి ప్లాట్ ఫార్మ్, ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ పై కేంద్రం కంట్రోల్ 

ఓటిటి ప్లాట్ ఫార్మ్ లు, ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ ఇక నుండి వళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి నియంత్రణ లేని ఈ రంగాల పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి ఆన్‌లైన్ కంటెంట్ ప్రొవైడర్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం పంపిన ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంల్లో వచ్చే వార్తలపై కూడా ఇక నుంచి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ కన్నేయనుంది. ఇక ఆన్‌లైన్‌లో విడుదలయ్యే సినిమాలు, ఆడియో విజువల్స్, వార్తలు, సమకాలీన పరిస్థితులపై వచ్చే కంటెంట్‌ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి రానుంది.   అయితే ఇప్పటివరకూ డిజిటల్ కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు భారత్‌లో ఎలాంటి వ్యవస్థ లేని సంగతి తెల్సిందే. దీంతో వాస్తవాలతో పాటు గాలి వార్తలు (ఫేక్‌న్యూస్) కూడా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అంతేకాకుండా సినిమాల పేరుతో అసభ్యకర చిత్రాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని భావించిన కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ మీడియాను న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోషియేషన్, సినిమాలను సెన్సార్ బోర్డు పర్యవేక్షిస్తున్నాయి. తాజా నిర్ణయంతో.. డిజిటల్ కంటెంట్‌ను కేంద్రమే స్వయంగా పర్యవేక్షించనుంది.

బీహార్ ఎన్నికలలో నేను అనుకున్నది సాధించా... చిరాగ్ పాశ్వాన్

ఎన్డీఏ నుండి బయటకు వచ్చి బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అంచనాలు పాపం తలకిందులయ్యాయి. బీహార్ లోని 243 స్థానాలకు గానూ.. 137 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆయన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో నెగ్గి దానితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికలలో తాను అనుకున్నది సాధించానంటూ చిరాగ్ మీడియాతో అన్నారు. బీహార్ ఎన్నికలలో బీజేపీ మరింత బలపడాలని తాను బలంగా కోరుకున్నాననీ.. అది తన పార్టీ ప్రభావంతోనే జరిగినందుకు చాల సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అన్ని పార్టీల మాదిరిగానే నేను కూడా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో మా పార్టీ గెలవాలని కోరుకున్నాను. అయితే ఈ ఎన్నికల్లో నా అసలు లక్ష్యం మాత్రం రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే. అనుకున్నట్టుగానే ఆ మేరకు మా పార్టీ ప్రభావం చూపడం మాకు చాలా సంతోషంగా ఉంది.. అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. అయితే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల చిరాగ్... ఎన్డీయే నుంచి తాను బయటికి రావడానికి ప్రధాన కారణం నితీశ్ ప్రభుత్వాన్ని ఓడించడమేనని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికలలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని బీజేపీతో కలిసి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.   మరోపక్క కేవలం పాశ్వాన్ కారణంగానే జేడీయూ దాదాపు 20 స్థానాల్లో ఓడిపోయిందని బీజేపీ ముఖ్య నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ సైతం ఒప్పుకున్నారు. అయితే జేడీ (యూ) ఓట్లను భారీగా చీల్చేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయించిందని మరికొందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఏదేమైనా అటు చిరాగ్ సాయంతో అటు జేడీయూ ను, ఇటు ఎంఐఎం సాయంతో ఆర్జేడీ కూటమిని దెబ్బ కొట్టారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు.

కేసీఆర్ గతంలో పాస్‌పోర్ట్ బ్రోకర్! సంజయ్ హాట్ కామెంట్స్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ గతంలో పాస్‌పోర్ట్ బ్రోకర్ అని విమర్శించారు. నిజామాబాద్‌లో కేసీఆర్ బిడ్డను.. దుబ్బాకలో అల్లుడిని ఓడించామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ బాక్స్ బద్దలు కొడతామని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు చెంచాగాళ్లు.. ఎందుకా బతుకు బతుకుతున్నారంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు సంజయ్. కేసీఆర్ బీసీలను అణగదొక్కుతూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని తప్పుబట్టారు. బీసీలపై ప్రేమ ఉంటే టీఆర్ఎస్‌కు బీసీని అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. దుబ్బాక ప్రజల స్ఫూర్తితో గ్రేటర్ ప్రజలు బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ అభ్యర్ధించారు.

వేధింపులతో మింగేస్తున్నారు! వైసీపీపై నారా లోకేష్ ఫైర్ 

నంద్యాల అబ్దుల్ సలాం ఘటనపై మరోసారి తీవ్రంగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్. వేధింపులకు గురిచేసి అబ్దుల్ సలాం కుటుంబాన్ని మింగేశారని మండిపడ్డారు. సలాం కుటుంబసభ్యుల ఇంటికి పోలీసులను పంపి భయపెడుతున్నారని, తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఒక మైనార్టీ కుటుంబానికి ఇన్ని వేధింపులా? అని ట్విట్టర్ ద్వారా నారా లోకేష్ ప్రశ్నించారు. బెదిరించి సాక్ష్యాలు తారుమారు చేసి దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అబ్దుల్ సలాం కుటుంబం సూసైడ్  కేసును సీబీఐకి అప్పగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ వద్ద సలాం కుటుంబసభ్యులు వాపోయిన వీడియోను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.   మరోవైపు అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులు సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్‌పై గురువారం నంద్యాల కోర్టులో విచారణ జరుగనుంది. బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు రివిజన్ పిటిషన్ వేశారు.  అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా.. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదుచేశారు. నిందితులు సోమశేఖర్‌రెడ్డి, గంగాధర్‌కు నంద్యాల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులు బెయిల్ పిటిషన్ వేయగా ..ఇద్దరికి నంద్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కుటుంబ సభ్యులంతా సూసైడ్ చేసుకోవడానికి కారకులయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు వెంటనే బెయిల్ రావడంపై విమర్శలు వచ్చాయి. దీంతో బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

ముందస్తు ఉంటుందా.. వెనక్కి తగ్గుతారా? గ్రేటర్ సస్పెన్శ్ 

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సస్పెన్శ్ నెలకొంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నా.. దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని ముందు నుంచి టీఆర్ఎస్సే తహతహలాడింది. గ్రేటర్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేశారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ అదేశాలతోనే ఎన్నికల సంఘం ఏర్పాట్లు స్పీడప్ చేసింది. డివిజన్ల వారిగా అబ్జర్వర్లను, రిటర్నింగ్ అఫీసర్లను కూడా నియమించింది. డిసెంబర్ తొలివారంలో  పోలింగ్ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే దుబ్బాక ఫలితంతో ముందస్తు గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ వెనక్కి తగ్గవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినా అడ్డుకునే అవకాశం సర్కార్ కు ఉంది. ఇటీవల చేసిన జీహెచ్ఎంసీ చట్టసవరణలో ఇందుకోసం కొత్త నిబంధన పెట్టారు.  రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించొద్దని చట్టంలో చేర్చారు. దీంతో గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది  సర్కార్ నిర్ణయం ప్రకారమే జరగనుంది.    దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ప్రభావం బల్దియా ఎన్నికలపై పడనుంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 74 లక్షల మంది ఓటర్లున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర మొత్తం ఓటర్లలో 25 శాతం కన్నా ఎక్కువ. అందుకే గ్రేటర్ ఎన్నిక అన్ని పార్టీలకు అత్యంత కీలకం. అధికార పార్టీగా ఉండి దుబ్బాకలో ఓడిపోవడం టీఆర్ఎస్ కు షాకులా మారింది. ఈ సమయంలోనే గ్రేటర్ ఎన్నికలకు పోతే పార్టీకి నష్టమని కొందరు సీనియర్ నేతలు పార్టీ పెద్దలకు చెబుతున్నారని తెలుస్తోంది. బీజేపీకి మొదటి నుంచి నగరంలో పట్టుంది. ఇటీవల కాలంలో గ్రేటర్ లో బీజేపీ బలపడిందని చెబుతున్నారు. పార్టీ చీఫ్ బండి సంజయ్ తో పాటు పార్టీ నేతలు హైదరాబాద్ లో పర్యటిస్తూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. దుబ్బాక విజయం బీజేపీకి మరింత బూస్ట్ ఇచ్చింది. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని, షెడ్యూల్ ప్రకారం వెళితే బెటరని కొందరు నేతలు కేటీఆర్ కు సూచిస్తున్నారట. షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ గ్రేటర్ ఎన్నికలకు గడువుంది.    ఇటీవల కురిసిన వర్షాలు, వరద సాయం తదితర అంశాల్లో ప్రజల నుంచి సిట్టింగ్ కార్పొరేటర్లపై పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఆపదలో తమను ఆదుకోలేకపోవడమే గాక, తమకు అందాల్సిన పరిహారాన్ని సైతం పంచుకున్నారని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు  ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కార్పొరేటర్లపై ఉన్న అసహనం ఓట్ల రూపంలో వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి.  టీఆర్ఎస్ అంతర్గత సర్వేలోనూ ప్రస్తుత కార్పొరేటర్ల తీరుపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది. తాను చేయించిన సర్వేల ఆధారంగా ఇప్పుడున్న వారిలో 35 మంది కార్పొరేటర్లు కచ్చితంగా ఓడిపోతారని కేటీఆర్ కూడా డిసైడయ్యారని, వారిలో కొందరికి ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేశారని గులాబీ నేతలు చెబుతున్నారు.  వరదల సమయంలో కూడా ప్రజలకు మొహం చూపించని కార్పొరేటర్లు వీరికి అదనం. వీరందరిని కలుపుకుంటే ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్లలో దాదాపు 50  మంది మళ్లీ పోటి చేస్తే ఓడిపోవడం ఖాయమని టీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది.    గ్రేటర్ లో ప్రభుత్వం చేపట్టిన వరద సాయం పంపిణీ అనుకున్న ఫలితాలనివ్వకపోగా వ్యతిరేకతను పెంచింది. సాయం అందిన వారు సైలెంట్ గా ఉండిపోగా.. అందని వారంతా సర్కార్ కు వ్యతిరేకంగా మారారు. ఇటీవల వరద బాధితుల ధర్నాలు, నిరసనలతో గ్రేటర్ లోని పలు కాలనీలు దద్దరిల్లాయి. మున్సిపల్ కార్యాలయాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగాయి. కొందరు వరద బాధితులు ఆవేశంలో మంత్రి కేటీఆర్‌నే పక్కకు నెట్టేశారంటే పరిస్తితి ఎలా ఉందో ఊహించవచ్చు. వరద సాయాన్ని విపక్షాలు కూడా పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. బాధితులతో కలిసి ఆందోళనలు నిర్వహించాయి. వరద సాయం అందలేదన్న కోపంతో ఉన్న ప్రజలు తమను ఎలా సత్కరిస్తారోనన్న భయంతో టీఆర్ఎస్ కార్పొరేటర్లు బయటికి కూడా ఎక్కువగా రావడం లేదని తెలుస్తోంది. ఇవన్ని అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాలేనని చెబుతున్నారు.    ప్రజల్లో తమపై వచ్చిన వ్యతిరేకతతో ఇప్పటికే కంగారు పడుతున్న గ్రేటర్ కారు నేతలకు దుబ్బాక ఉప ఎన్నిన ఫలితం మరింత కలవరపెడుతోంది. ఇటీవలే నగరంలో బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. సిటీపై స్పెషల్ ఫోకస్ చేసిన బండి సంజయ్.. తానే స్వయంగా కండువాలు కప్పి టీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కొందరుసభ్యులు. మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. దుబ్బాకలో గెలవడంతో ఆ పార్టీలోకి మరిన్నివలసలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వద్దని గ్రేటర్ టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కు మొర పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ముందస్తుగా గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ ఓటమి ఖాయమనే రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో కేటీఆర్ కూడా బల్దియా ఎన్నికలపై పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు.  జీహెచ్ఎంసీ చట్టంలో చేర్చిన కొత్త నిబంధనతో తమకు అనుకూల సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి గులాబీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది.

టీడీపీ లాయర్ వాదిస్తే బెయిల్ వచ్చింది!

ఇటీవల నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ కుటుంబం పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డితో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. అయితే, వీరిద్దరికీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.     ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. నంద్యాల ఘటన బాధాకరమని సీఎం జగన్ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను అరెస్ట్ చేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ వేశారని, కోర్టులో నిందితులకు బెయిల్ కూడా మంజూరైందన్నారు. బెయిల్ రద్దు చేయాలని తాము హైకోర్టును ఆశ్రయించామని సీఎం తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామన్నారు. ప్రభుత్వంపై బురద జల్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ట్విట్టర్, జూమ్ లో మాత్రమే మైనార్టీలపై ప్రేమ చూపిస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మైనార్టీలను పట్టించుకోలేదని విమర్శించారు.   సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. సీఎం గారూ, నంద్యాల ముద్దాయిల తరఫున టీడీపీ లాయర్ వాదిస్తే బెయిల్ వచ్చిందని మీరు అనడం ఘోరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం అధినేత ఓవైసీకి బీజేపీ నేత రఘునందన్ రావు న్యాయవాది అని, రామ్ జెఠ్మలాని ఎన్నోసార్లు కాంగ్రెస్ తరఫున కోర్టుల్లో వాదించారని గుర్తుచేశారు. అసలు మీ ప్రభుత్వమే నంద్యాల కేసును కోర్టులో నీరుగార్చిందని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

నితీశే బీహార్ సీఎం! మాట తప్పేది లేదన్న బీజేపీ

బీహార్ లో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమారే సీఎంగా ఉంటారని ప్రకటించింది. జేడీ (యూ)కు బీజేపీ కన్నా సీట్లు తగ్గినంత మాత్రాన, ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ను తొలగించి, మరొకరిని ఆ పదవిలో కూర్చోబెట్టే ప్రశ్నే లేదని, బీహార్ కు సీఎంగా ఆయనే ఉంటారని కమలదళం తేల్చి చెప్పింది. బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారు. ఇది మేమిచ్చిన మాట. ఈ విషయంలో ఎటువంటి సందేహమూ లేదని సుశీల్ మోడీ చెప్పారు.    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 సీట్లకు బీజేపీ 74 సీట్లలో గెలవగా, నితీశ్ నేతృత్వంలోని జేడీయూ 43 సీట్లకు పరిమితమైంది. అయితే ఎన్డీఏ కూటమి మాత్రం సర్కార్ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించింది. బీజేపీ కన్నా జేడీయూకు భారీగా సీట్లు తగ్గడంతో నితీశ్ కు సీఎం పగ్గాలు ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరిగింది. బీజేపీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రచారం జరిగింది. నితీశ్ కుమార్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. దీంతో బీహార్ పరిణామాలపై స్పందించిన బీజేపీ ముఖ్యమంత్రి ఎవరవుతారన్న దానిపై క్లారిటీ ఇచ్చింది.    బీహార్ ను బీజేపీ ఇంతవరకూ సొంతంగా పాలించలేదు. ఇప్పుడు కూడా  నితీశ్ సహకారం లేకుంటే, అధికారంలో ఉండే అవకాశాలు బీజేపీకి లేవు. నితీశ్ ను పట్టనపెట్టి సీఎం పోస్టు తీసుకున్నా.. సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మెజార్టీకన్నా మూడు సీట్లే ఎక్కువున్నాయ కాబట్టి ఏదైనా జరగొచ్చు. అందుకే నితీశ్ నే మళ్లీ సీఎంగా కొనసాగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ జేడీయూకి తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి.. మంత్రి పదవులే ఎక్కువగా బీజేపీకే వస్తాయని... నితీశ్ సీఎంగా ఉన్నా, ప్రధాన మంత్రిత్వ శాఖలతో పాటు అధికారాలన్నీ బీజేపీ చేతిలోనే ఉంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

దుబ్బాక ఉపఎన్నికపై నిజమైన తెలుగు వన్ సర్వే

తెలంగాణలో గతంలో ఎప్పుడు లేనంతగా రాజకీయ కాక రేపిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. పోలింగ్ తర్వాత ఓటర్ల మూడ్ ను బట్టి తెలుగు వన్ సర్వే .. రాబోయే ఫలితాన్ని అంచనా వేసింది. బీజేపీ అభ్యర్థి స్వల్ప మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులోనూ అదే జరిగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెయ్యి ఓట్ల స్వల్ప ఆధిక్యంతో దుబ్బాకలో విక్టరీ కొట్టారు.దుబ్బాక నియోజకవర్గంలోని ఏఏ మండలాల్లో ఏ పార్టీ ఆధిక్యత వస్తుందో కూడా ముందే చెప్పింది తెలుగువన్. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లోనూ అవే ఫలితాలు వచ్చాయి.     ఈనెల 3న దుబ్బాకలో పోలింగ్ జరిగింది. ఓటింగ్ ముగియగానే ఫలితాన్ని అంచనా వేసింది తెలుగు వన్. దుబ్బాక మండలంలో బీజేపీకి మంచి లీడ్ వస్తుందని చెప్పింది. నార్సింగ్. చేగుంట మండలాల్లోనూ ఆధిక్యత సాధిస్తుందని వెల్లడించింది. తోగుంటలోమూడు పార్టీల మధ్య టప్ ఫైట్ ఉంటుందని, మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో గులాబీ గుబాళిస్తుందని తెలుగు వన్ అంచనా వేసింది. అయితే ఫలితాల్లో అచ్చుగుద్దినట్లు అదే జరిగింది. దుబ్బాక మండలానికి సంబంధించిన తొలి ఐదు రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. ఐదు రౌండ్లలోనూ బీజేపీకే లీడ్ వచ్చింది. దుబ్బాక మండలంలోనే రఘునందన్ రావుకు 3 వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. చేగుంట, నార్సింగ్ మండలాల్లోనూ బీజేపీ హవా చాటింది. 19వ రౌండ్ తర్వాత టీఆర్ఎస్ లీడ్ లోకి రాగా.. చివరి నాలుగు రౌండ్ల కౌంటింగ్ ఈ మండలాలను చెందిన ఈవీఎంలే. నాలుగు రౌండ్లలోనూ కమలం వికసించడంతో రఘునందన్ రావు వెయ్యికి పైగా ఓట్ల లీడ్ లోకి వచ్చారు.    తెలుగు వన్ చెప్పినట్లే మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. మిరుదొడ్డి మండలం ఓట్లను 6,7 రౌండ్లలో లెక్కించగా.. ఆ రెండు రౌండ్లలో కారు దూసుకుపోయింది. తోగుంట మండలంలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ నడిచింది. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలు కాంగ్రెస్ కు జై కొడతాయని తెలుగు వన్ చెప్పగా.. అలాగే జరిగింది. మల్లన్నసాగర్ 9 ముంపు గ్రామాల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి ఆధిక్యం వచ్చింది. ఇక్కడ టీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. ఇక దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో గులాబీకి మంచి మెజార్టీ వచ్చింది. 13 నుంచి19 రౌండ్ల వరకు కారుకే మెజార్టీ రావడంతో.. సోలిపేట సుజాత ఏకంగా రఘునందన్ రావు క్రాస్ చేసి తొలిసారి లీడ్ లోకి వెళ్లింది.

జగన్ కు ఈవీఎంల టెన్షన్! బీహార్ పరిణామాలతో పరేషాన్ 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్డిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ  ఎన్డీఏ విజయం సాధించింది. ఆ కూటమి బోటాబోటీ మెజార్టీతో అతికష్టం మీద గట్టెక్కింది. సర్కార్ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 122 కాగా.. ఎన్డీఏ కూటమికి మూడంటే మూడే సీట్లు అదనంగా వచ్చాయి. బీజేపీకి 73 సీట్లు రాగా, నితీస్ సారథ్యంలోని జేడీయూ 43 సీట్లపై పరిమితమైంది. ఆర్జేడీ 75 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెట్ పార్టీగా అవతరించినా.. కూటమి పార్టీలకు అశించిన సీట్లు రాకపోవడంతో కొద్ది దూరంలో అధికార పీఠానికి దూరమైంది యూపీఏ కూటమి.    బీహార్‌ లో ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని, కౌంటింగ్ లోనూ మేనేజ్ చేసిందని ఆర్జేడీ కూటమి పక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ రోజున ప్రజల మైండ్ స్పష్టంగా కనిపించిందని, అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని వారు చెబుతున్నారు. ఎన్డీఏ కూటమిలోనూ జేడీయూ ఎక్కువ సీట్లు కోల్పోగా.. బీజేపీ మాత్రం తాము పోటీ చేసిన స్థానాల్లో 70 శాతానికి పైగా గెలిచింది. 115 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 75 సీట్లలో గెలుపొందింది. ఇదే ఇప్పుడు విపక్షాల అనుమానాలకు కారణమవుతోంది. జేడీయూ మెజార్టీ సీట్లలో ఓడిపోయి బీజేపీ గెలవడం చర్చగా మారింది. బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 39 స్థానాలు గెలిచింది. అప్పుడు కూడా  ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందంటూ పెద్ద ఎత్తున  ఆరోపణలు వచ్చాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా తనకు విశ్వాసం లేదని, ఈవీఎంలన్నీ మోడీ ఓటింగ్‌ మెషిన్లే అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా ప్రచారంలో విమర్శిస్తూ వచ్చారు.    ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనని సాంకేతిక నిపుణులు ఇది వరకే సాక్ష్యాధారాలతో నిరూపించారు.  ఒక్కసారే పలు యంత్రాలను ట్యాంపరింగ్‌ చేయడం కుదరదని, అయితే వేర్వేరుగా ఏ ఈవీఎంనైనా ట్యాంపరింగ్‌ చేయవచ్చని వారు వివరించారు. ఫలితాలను తారుమారు చేయాలంటే అన్ని ఈవీఎంలను ట్యాంపర్‌ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైన నియోజక వర్గాల్లో, అవసరమైన చోట కొన్ని ఈవీఎంల చొప్పున ట్యాంపరింగ్‌ చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చని కూడా ఎన్నికల విశ్లేషకులు వివరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా చాలా ఆలస్యంగా జరగడం.. ఈవీఎంల ఓట్లను లెక్కించటానికి గంటలకొద్ది సమయం తీసుకోవడంతో ఇప్పుడు అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు కారణమవుతున్నాయి.    బీహార్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ కలవరపడుతున్న తెలుస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో ఏపీలో బీజేపీ పాగా వేస్తుందేమోనన్న ఆందోళన సీఎం జగన్ లో ఉందని చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే వైసీపీ గెలిచిందనే ఆరోపణలున్నాయి. వైసీపీకి ఏకంగా 151 సీట్లు రావడం అప్పుడు అందరిని అశ్చర్యపరిచింది. వైసీపీ నేతలు కూడా ఇన్ని సీట్లు వస్తాయని ఊహించలేదంటారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వైసీపీకి బీజేపీ సహకరించిందని, అందుకే వైసీపీ ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయనే ఆరోపణలు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపించాయి. వైసీపీకి వచ్చిన మెజార్టీలు కూడా ఈ ఆరోపణలకు బలాన్నిచ్చాయి.    2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాంగ్రెస్ తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఏపీకి అన్యాయం చేశారంటూ ప్రధాని మోడీ, అమిత్ షాను ఘాటుగా విమర్శించారు. దీంతో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ తమను టార్గెట్ చేసిన చంద్రబాబును బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారని చెబుతారు. అందులో భాగంగానే చంద్రబాబును ఓడించేందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు ఇప్పటికి ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ గెలిచినా తమ చేతుల్లోనే ఉంటుందనే భావనలోనే బీజేపీ అలా చేసిందంటున్నారు. బీజేపీ అనుకుంటున్నట్లే ఇప్పుడు వైసీపీ వ్యవహారం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పుచేతుల్లోనే వైసీపీ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.      ఇప్పుడు దక్షిణాదిపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉండటంతో తెలంగాణ, అంధ్రప్రదేశ్, తమిళనాడును టార్గెట్ చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారింది బీజేపీ. దుబ్బాక  ఉప ఎన్నికలో విజయంతో బీజేపీకి మరింత బూస్ట్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే అధికారమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.ఏపీలోనూ అధికారం కోసం కమలనాధులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అధికారం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని, ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా చేయవచ్చని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. 2019 ఎన్నికల్లో తమ గెలుపునకు సహకరించాయనే ఆరోపణలు ఉన్న ఈవీఎంలే...  2023 ఎన్నికల్లో తమ కొంప ముంచుతాయోమనన్న టెన్షన్ వారిలో కనిపిస్తుందని చెబుతున్నారు. బీజేపీ సీరియస్ గా దృష్టి సారిస్తే ఏపీలోనూ బీహార్ వ్యూహాలను అమలు చేయవచ్చని వారు భయపడుతున్నారు. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పరిణామాలతో ఫ్యాన్ పార్టీ నేతలు లోలోపల పరేషాన్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.