బీహార్ ఎన్నికలలో నేను అనుకున్నది సాధించా... చిరాగ్ పాశ్వాన్
posted on Nov 11, 2020 @ 4:20PM
ఎన్డీఏ నుండి బయటకు వచ్చి బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అంచనాలు పాపం తలకిందులయ్యాయి. బీహార్ లోని 243 స్థానాలకు గానూ.. 137 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆయన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో నెగ్గి దానితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికలలో తాను అనుకున్నది సాధించానంటూ చిరాగ్ మీడియాతో అన్నారు. బీహార్ ఎన్నికలలో బీజేపీ మరింత బలపడాలని తాను బలంగా కోరుకున్నాననీ.. అది తన పార్టీ ప్రభావంతోనే జరిగినందుకు చాల సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అన్ని పార్టీల మాదిరిగానే నేను కూడా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో మా పార్టీ గెలవాలని కోరుకున్నాను. అయితే ఈ ఎన్నికల్లో నా అసలు లక్ష్యం మాత్రం రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే. అనుకున్నట్టుగానే ఆ మేరకు మా పార్టీ ప్రభావం చూపడం మాకు చాలా సంతోషంగా ఉంది.. అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. అయితే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన 37 ఏళ్ల చిరాగ్... ఎన్డీయే నుంచి తాను బయటికి రావడానికి ప్రధాన కారణం నితీశ్ ప్రభుత్వాన్ని ఓడించడమేనని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికలలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని బీజేపీతో కలిసి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
మరోపక్క కేవలం పాశ్వాన్ కారణంగానే జేడీయూ దాదాపు 20 స్థానాల్లో ఓడిపోయిందని బీజేపీ ముఖ్య నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ సైతం ఒప్పుకున్నారు. అయితే జేడీ (యూ) ఓట్లను భారీగా చీల్చేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయించిందని మరికొందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఏదేమైనా అటు చిరాగ్ సాయంతో అటు జేడీయూ ను, ఇటు ఎంఐఎం సాయంతో ఆర్జేడీ కూటమిని దెబ్బ కొట్టారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు.