ఓటిటి ప్లాట్ ఫార్మ్, ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ పై కేంద్రం కంట్రోల్
posted on Nov 11, 2020 @ 5:28PM
ఓటిటి ప్లాట్ ఫార్మ్ లు, ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ ఇక నుండి వళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి నియంత్రణ లేని ఈ రంగాల పై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి ఆన్‌లైన్ కంటెంట్ ప్రొవైడర్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం పంపిన ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంల్లో వచ్చే వార్తలపై కూడా ఇక నుంచి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ కన్నేయనుంది. ఇక ఆన్‌లైన్‌లో విడుదలయ్యే సినిమాలు, ఆడియో విజువల్స్, వార్తలు, సమకాలీన పరిస్థితులపై వచ్చే కంటెంట్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి రానుంది.
అయితే ఇప్పటివరకూ డిజిటల్ కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు భారత్‌లో ఎలాంటి వ్యవస్థ లేని సంగతి తెల్సిందే. దీంతో వాస్తవాలతో పాటు గాలి వార్తలు (ఫేక్‌న్యూస్) కూడా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అంతేకాకుండా సినిమాల పేరుతో అసభ్యకర చిత్రాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని భావించిన కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రింట్ మీడియాను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ మీడియాను న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోషియేషన్, సినిమాలను సెన్సార్ బోర్డు పర్యవేక్షిస్తున్నాయి. తాజా నిర్ణయంతో.. డిజిటల్ కంటెంట్‌ను కేంద్రమే స్వయంగా పర్యవేక్షించనుంది.