దుబ్బాక ఉపఎన్నికపై నిజమైన తెలుగు వన్ సర్వే
posted on Nov 11, 2020 @ 2:24PM
తెలంగాణలో గతంలో ఎప్పుడు లేనంతగా రాజకీయ కాక రేపిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. పోలింగ్ తర్వాత ఓటర్ల మూడ్ ను బట్టి తెలుగు వన్ సర్వే .. రాబోయే ఫలితాన్ని అంచనా వేసింది. బీజేపీ అభ్యర్థి స్వల్ప మెజార్టీతో విజయం సాధిస్తారని తెలిపింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులోనూ అదే జరిగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వెయ్యి ఓట్ల స్వల్ప ఆధిక్యంతో దుబ్బాకలో విక్టరీ కొట్టారు.దుబ్బాక నియోజకవర్గంలోని ఏఏ మండలాల్లో ఏ పార్టీ ఆధిక్యత వస్తుందో కూడా ముందే చెప్పింది తెలుగువన్. నరాలు తెగే ఉత్కంఠగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లోనూ అవే ఫలితాలు వచ్చాయి.
ఈనెల 3న దుబ్బాకలో పోలింగ్ జరిగింది. ఓటింగ్ ముగియగానే ఫలితాన్ని అంచనా వేసింది తెలుగు వన్. దుబ్బాక మండలంలో బీజేపీకి మంచి లీడ్ వస్తుందని చెప్పింది. నార్సింగ్. చేగుంట మండలాల్లోనూ ఆధిక్యత సాధిస్తుందని వెల్లడించింది. తోగుంటలోమూడు పార్టీల మధ్య టప్ ఫైట్ ఉంటుందని, మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో గులాబీ గుబాళిస్తుందని తెలుగు వన్ అంచనా వేసింది. అయితే ఫలితాల్లో అచ్చుగుద్దినట్లు అదే జరిగింది. దుబ్బాక మండలానికి సంబంధించిన తొలి ఐదు రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. ఐదు రౌండ్లలోనూ బీజేపీకే లీడ్ వచ్చింది. దుబ్బాక మండలంలోనే రఘునందన్ రావుకు 3 వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. చేగుంట, నార్సింగ్ మండలాల్లోనూ బీజేపీ హవా చాటింది. 19వ రౌండ్ తర్వాత టీఆర్ఎస్ లీడ్ లోకి రాగా.. చివరి నాలుగు రౌండ్ల కౌంటింగ్ ఈ మండలాలను చెందిన ఈవీఎంలే. నాలుగు రౌండ్లలోనూ కమలం వికసించడంతో రఘునందన్ రావు వెయ్యికి పైగా ఓట్ల లీడ్ లోకి వచ్చారు.
తెలుగు వన్ చెప్పినట్లే మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. మిరుదొడ్డి మండలం ఓట్లను 6,7 రౌండ్లలో లెక్కించగా.. ఆ రెండు రౌండ్లలో కారు దూసుకుపోయింది. తోగుంట మండలంలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ నడిచింది. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలు కాంగ్రెస్ కు జై కొడతాయని తెలుగు వన్ చెప్పగా.. అలాగే జరిగింది. మల్లన్నసాగర్ 9 ముంపు గ్రామాల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి ఆధిక్యం వచ్చింది. ఇక్కడ టీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. ఇక దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో గులాబీకి మంచి మెజార్టీ వచ్చింది. 13 నుంచి19 రౌండ్ల వరకు కారుకే మెజార్టీ రావడంతో.. సోలిపేట సుజాత ఏకంగా రఘునందన్ రావు క్రాస్ చేసి తొలిసారి లీడ్ లోకి వెళ్లింది.