దెబ్బేసిన.. దుబ్బాక!
విజేత వకీల్‌సాబ్
కేసీఆర్ పథకాలేమాయె?
ఒక ఎన్నిక.. అనేక ఫలితాలు
అవును. ఆరడగులబుల్లెట్ చెప్పినట్లు అక్కడ ఓటర్లు కరెంటు మోటారుకే ఓటెత్తారు. ఇంకో చిచ్చరపిడుగు చెప్పినట్లు అక్కడి నుంచే టీఆర్‌ఎస్ పతనం మొదలవనుంది. మరో ఫైర్‌బ్రాండ్ చెప్పినట్లు కమల వికాసం అక్కడి నుంచే ఆరంభం కానుంది. యస్. ఇవన్నీ అధికార టీఆర్‌ఎస్‌ను దెబ్బేసిన, దుబ్బాక జనం ఇచ్చిన ఎన్నిక తీర్పు సంకేతాలు. ఊపిరాడని ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నిక.. చివరాఖరకు వకీల్‌సాబ్‌నే విజేతగా నిలిపింది. అయితే ఎన్నిక ఒక్కటే.. ఫలితాలే అనేకం! కడదాకా ‘హీరో’చితంగా పోరాడి విజేతగా నిలిచిన బీజేపీ.. కొసప్రాణం వరకూ పోరాడి ఓడిన టీఆర్‌ఎస్.. ముచ్చటగా మూడో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక ఫలితం అనేక గుణపాఠాలు.
దుబ్బాక ఉప ఎన్నికలో, టీఆర్‌ఎస్ గెలుస్తుందన్న సర్వే సంస్థల అంచనాలు, దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రచార సరళి చూసిన వారికి సైతం, బీజేపీ రెండోస్థానంలో నిలుస్తుందన్న భావన ఏర్పడింది. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం, ఆరడగుల బుల్లెట్ హరీష్‌రావు చేసిన ప్రచారం, బీజేపీ నేతల మైండ్‌గేమ్, కాంగ్రెస్ వైఫల్యాలు.. కలసి వెరసి బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు విజయానికి బాటలు వేశాయి. ఆయన గెలిచింది కేవలం 1,118 ఓట్లతోనే అయినప్పటికీ, ఇప్పటి పరిస్థితిలో అది అద్భుత-అనన్య-అపురూప-అనూహ్య విజయమే.
ఈ ఫలితం నిస్సందేహంగా అధికార టీఆర్‌ఎస్‌కు చావుదెబ్బ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు అమలుచేస్తున్నామని గొప్పలతో జనంలోకి వెళ్లిన కారును, జనం మధ్యలోనే నిలిపివేశారు. దీనికి సంబంధించి బీజేపీ విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ ప్రత్యామ్నాయమయితే కొంపలుమునుగుతాయనుకున్న కేసీఆర్.. కమలం పార్టీని శత్రువుగా కొని తెచ్చుకున్న వ్యూహం వికటించి, బొక్కబోర్లా పడింది. ఇన్ని పథకాలు అమలుచేస్తున్నా, ప్రజలు కారును బోల్తా కొట్టించారంటే.. అది నిస్సందేహంగా తెరాసకు తిరోగమనమే. మరి అన్ని పథకాలతో ప్రజలు లబ్థిపొందుతుంటే, ఆ పార్టీని ఎందుకు తిరస్కరించారన్న ఆత్మవిమర్శ, కేసీఆర్‌లో ఆరంభమయితే మంచిదే. అలా కాకుండా.. కేవలం ‘ఒక్క ఉప ఎన్నికనే కదా’... అని లైట్ తీసుకుంటే, వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలోనూ ప్రమాదఘంటిక తప్పదు. దాదాపు వందకోట్లకు పైగా ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతున్నా, ప్రజలు కమలాన్నే విరబూయించడం కచ్చితంగా ఆత్మవిమర్శకు అర్హమైనదే. అలాకాకపోతే, బీజేపీ దళపతి సంజయ్ చెప్పినట్లు.. ఇక తెలంగాణలో కమల వికాసం దుబ్బాక నుంచి మొదలయినట్లే లెక్క.
దుబ్బాక ఎన్నికలో అందరి కంటే దెబ్బ తిన్నది ఆరడగులు బుల్లెట్ హరీష్‌రావు. ట్రబుల్‌షూటర్‌గా ఉన్న పేరు కాస్తా ఈ ఫలితంతో కొట్టుకుపోయింది. ఈ ఎన్నిక రాకపోతే, ఆయన కీర్తి అలాగే నిలిచేదేమో? ఆయన చెప్పినట్లు జనం.. కారు మోటరు కాకుండా, కరెంటు మోటరుకే ఓటేశారు. అంటే... తెలంగాణ ప్రజలు కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ విధానాన్ని ఆమోదించారన్న మాట. ఈ ఫలితంతో వ్యక్తిగతంగా కేసీఆర్‌కు గానీ, కేటీఆర్‌కు గానీ వచ్చిన నష్టమేమీలేదు. ప్రచారమంతా హరీష్‌రావే చూసుకున్నందున, ఈ పరాజయం కూడా ఆయన ఖాతాలోకే వెళ్లడం సహజం. నిజానికి టీఆర్‌ఎస్ అభ్యర్ధికి సానుభూతి పవనాలు బ్యాలెట్ల రూపంలో వీచితీరాలి. కానీ, అది కూడా పనిచేయడం లేదంటే, సర్కారుపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. గెలుపు-ఓటములకు తేడా వందల ఓట్లే అయినప్పటికీ, ఫలితం మాత్రం కేసీఆర్ పాలనకు తీర్పుగానే భావించక తప్పదు.
ఇక తెలంగాణలో.. ‘ఉత్తరకుమారుడి’ సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, శిథిలావస్థకు దుబ్బాక మరో విషాద సంకేతం. ఆయన సారథ్యంలో.. వరస వెంట వరస విజయవంతంగా జరుగుతున్న పరాజయయాత్రలో, దుబ్బాక కూడా చేరింది. రేవంత్‌రెడ్డి వంటి గొంతున్న నేతల ప్రసంగాలు.. చప్పట్లు కొట్టించాయే తప్ప, ఓట్లు రాల్చలేదని స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీ బహు నాయకత్వం ఇలాగే వర్ధిల్లితే, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ, ఆ పార్టీకి పరాభవం తప్పదు.
ఏటికి ఎదురీది, కేసీఆర్ సర్కారును మొండిధైర్యంతో ఎదుర్కొంటూ వస్తున్న.. తెలంగాణ కమలదళపతి బండి సంజయ్ తెగింపునకు, దుబ్బాక సగౌరవ ఫలితమిచ్చింది. ‘కార్పొరేటర్ స్ధాయికి ఎక్కువ-జిల్లా స్థాయికి తక్కువ నేత’గా.. ఇన్నాళ్లూ ఆయనపై ఉన్న ‘ఎద్దేవా లాంటి ముద్ర’, దుబ్బాక విజయంతో చెరిగిపోయింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పెద్దగా దృష్టి సారించకపోయినా, సీనియర్లు ప్రచారంలోకి పెద్దగా రాకపోయినా.. ఉన్న వనరులతోనే రంగంలోకి దిగి, అద్భుత విజయం సాధించిన అభ్యర్ధి రఘునందన్‌రావు వెంట నిలిచిన సంజయ్..‘వీడు సామాన్యుడు కాదు’ అనిపించుకున్నారు.
నిజానికి కేంద్రంలో అధికారంలో ఉండి, తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎన్నికల ముందు తన అధికారాలు వినియోగించి, కేంద్ర బలగాలను రప్పిస్తారని చాలామంది భావించారు. అది జరిగి ఉంటే ఫలితాలు మరింత ఉత్కంఠభరితంగా ఉండేవంటున్నారు. సిద్దిపేట ఘటనలో పోలీసుకమిషనర్, జిల్లా కలెక్టర్‌ను పిలిపించి మాట్లాడే అవకాశం ఉన్నా, ఏ కారణం చేతనో ఆయన దానిని వినియోగించుకోలేదు. అయినా.. సంజయ్ తన శక్తినంతా దుబ్బాకపై కేంద్రీకరించి సరైన ఫలితం రాబట్టారు.
ఒకరకరంగా ఈ ఫలితం ‘వకీల్‌సాబ్’వ్యక్తిగతంగా కూడా చెప్పకతప్పదు. పార్టీ నేతల మోహరింపు, టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడిలో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నా... అంతిమంగా, అభ్యర్ధి రఘునందన్‌రావుకు వీచిన సానుభూతి పవనాలే, ఆయనను విజేతగా నిలబెట్టాయని నిర్వివాదం. గతంలో ఓడినప్పటికీ.. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న ఆయన చిత్తశుద్ధి.. ప్రజాసమస్యలపై నిరంతరం గళం విప్పే పోరాటతత్వం.. పోలింగుకు ముందు తనను ఒంటరిని చేసి, కేసీఆర్ సర్కారు పోలీసుల సాయంతో దౌర్జన్యం చేస్తుందన్న సందేశాన్ని ఇంటింటికీ చేర్చి, దానిని సానుభూతిగా మలచడంలో వకీల్‌సాబ్ వ్యూహం సక్సెస్ అయింది. ఇప్పుడాయన అసెంబ్లీలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పక్కన, మరొక సభ్యుడిగా కూర్చోనున్నారు. గతంలో బీజేపీ కూడా తన విజయప్రస్థానం ప్రారంభించింది. టీవీ చర్చల్లోనే ప్రత్యర్ధుల నోటికి తాళం వేయించే వకీల్‌సాబ్.. ఇక తెలంగాణ శాసనసభలో, ఎలా వాదిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినంత మాత్రాన.. రేపటి గ్రేటర్ ఎన్నికల్లోనూ, ఫలితాలు పునరావృతమవుతాయనుకుంటే పొరపాటు. అలా ఊహించుకుని, టపాసులు పేల్చుకుంటే మిగిలేది తాత్కాలిక ఆనందమే. గ్రామీణ ప్రాంతాల నేపథ్యం వేరు, నగర నేపథ్యం వేరు. గ్రామీణ-నగర ఓటర్ల ఆలోచనా విధానంలో బోలెడంత తేడా ఉంటుంది. దుబ్బాకలో టీఆర్‌ఎస్ ఓడినప్పటికీ, మెజారిటీ అత్యల్పమేనన్నది విస్మరించకూడదు. పైగా అభ్యర్థి పూర్తిగా రాజకీయాలకు కొత్త. అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాసరెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో?!
గ్రేటర్ హైదరబాద్‌లో పనితక్కువ-పబ్లిసిటీ ఎక్కువ నేతలు బోలెడుమంది. ఫ్లెక్సీలు- ఫొటోలు-జిందాబాద్‌తో లాబీయింగ్ చేసే వాళ్లే ఎక్కువ. ఎక్కువ మంది , క్షేత్రస్ధాయి రాజకీయాలను విస్మరించి చాలాకాలమయింది. పైగా దత్తాత్రేయ-కిషన్‌రెడ్డి-లక్ష్మణ్-ఇంద్రసేనారెడ్డి-రామచంద్రారెడ్డి-రామచంద్రరావు ఇలా డజను వర్గాలున్నాయి. ఇప్పటిదాకా, నగరంలో ఆ పార్టీ నిర్మాణాత్మకంగా చేసిన ఉద్యమం గానీ, ప్రజాసమస్యల పరిష్కారంపై సాధించిన విజయం గానీ, ఒక్కటంటే ఒక్కటీ కనిపించదు. స్థానికంగా అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ, అగ్రనేతల ఇళ్ల చుట్టూ తిరిగే నేతలే ఎక్కువ దర్శనమిస్తారు. ఈ పరిస్థితిలో ‘గ్రేటర్’ ఫలితాలను దుబ్బాకతో పోల్చుకుంటే.. దెబ్బయిపోతారు మరి!
-మార్తి సుబ్రహ్మణ్యం