టీడీపీ లాయర్ వాదిస్తే బెయిల్ వచ్చింది!
posted on Nov 11, 2020 @ 2:42PM
ఇటీవల నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ కుటుంబం పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డితో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. అయితే, వీరిద్దరికీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. నంద్యాల ఘటన బాధాకరమని సీఎం జగన్ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను అరెస్ట్ చేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ వేశారని, కోర్టులో నిందితులకు బెయిల్ కూడా మంజూరైందన్నారు. బెయిల్ రద్దు చేయాలని తాము హైకోర్టును ఆశ్రయించామని సీఎం తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరామన్నారు. ప్రభుత్వంపై బురద జల్లాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ట్విట్టర్, జూమ్ లో మాత్రమే మైనార్టీలపై ప్రేమ చూపిస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మైనార్టీలను పట్టించుకోలేదని విమర్శించారు.
సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. సీఎం గారూ, నంద్యాల ముద్దాయిల తరఫున టీడీపీ లాయర్ వాదిస్తే బెయిల్ వచ్చిందని మీరు అనడం ఘోరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం అధినేత ఓవైసీకి బీజేపీ నేత రఘునందన్ రావు న్యాయవాది అని, రామ్ జెఠ్మలాని ఎన్నోసార్లు కాంగ్రెస్ తరఫున కోర్టుల్లో వాదించారని గుర్తుచేశారు. అసలు మీ ప్రభుత్వమే నంద్యాల కేసును కోర్టులో నీరుగార్చిందని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.