ముందస్తు ఉంటుందా.. వెనక్కి తగ్గుతారా? గ్రేటర్ సస్పెన్శ్
posted on Nov 11, 2020 @ 3:42PM
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సస్పెన్శ్ నెలకొంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చకాచకా ఏర్పాట్లు చేస్తున్నా.. దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని ముందు నుంచి టీఆర్ఎస్సే తహతహలాడింది. గ్రేటర్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేశారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ అదేశాలతోనే ఎన్నికల సంఘం ఏర్పాట్లు స్పీడప్ చేసింది. డివిజన్ల వారిగా అబ్జర్వర్లను, రిటర్నింగ్ అఫీసర్లను కూడా నియమించింది. డిసెంబర్ తొలివారంలో పోలింగ్ ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే దుబ్బాక ఫలితంతో ముందస్తు గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ వెనక్కి తగ్గవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినా అడ్డుకునే అవకాశం సర్కార్ కు ఉంది. ఇటీవల చేసిన జీహెచ్ఎంసీ చట్టసవరణలో ఇందుకోసం కొత్త నిబంధన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించొద్దని చట్టంలో చేర్చారు. దీంతో గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది సర్కార్ నిర్ణయం ప్రకారమే జరగనుంది.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ప్రభావం బల్దియా ఎన్నికలపై పడనుంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 74 లక్షల మంది ఓటర్లున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర మొత్తం ఓటర్లలో 25 శాతం కన్నా ఎక్కువ. అందుకే గ్రేటర్ ఎన్నిక అన్ని పార్టీలకు అత్యంత కీలకం. అధికార పార్టీగా ఉండి దుబ్బాకలో ఓడిపోవడం టీఆర్ఎస్ కు షాకులా మారింది. ఈ సమయంలోనే గ్రేటర్ ఎన్నికలకు పోతే పార్టీకి నష్టమని కొందరు సీనియర్ నేతలు పార్టీ పెద్దలకు చెబుతున్నారని తెలుస్తోంది. బీజేపీకి మొదటి నుంచి నగరంలో పట్టుంది. ఇటీవల కాలంలో గ్రేటర్ లో బీజేపీ బలపడిందని చెబుతున్నారు. పార్టీ చీఫ్ బండి సంజయ్ తో పాటు పార్టీ నేతలు హైదరాబాద్ లో పర్యటిస్తూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. దుబ్బాక విజయం బీజేపీకి మరింత బూస్ట్ ఇచ్చింది. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని, షెడ్యూల్ ప్రకారం వెళితే బెటరని కొందరు నేతలు కేటీఆర్ కు సూచిస్తున్నారట. షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ గ్రేటర్ ఎన్నికలకు గడువుంది.
ఇటీవల కురిసిన వర్షాలు, వరద సాయం తదితర అంశాల్లో ప్రజల నుంచి సిట్టింగ్ కార్పొరేటర్లపై పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఆపదలో తమను ఆదుకోలేకపోవడమే గాక, తమకు అందాల్సిన పరిహారాన్ని సైతం పంచుకున్నారని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కార్పొరేటర్లపై ఉన్న అసహనం ఓట్ల రూపంలో వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ అంతర్గత సర్వేలోనూ ప్రస్తుత కార్పొరేటర్ల తీరుపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది. తాను చేయించిన సర్వేల ఆధారంగా ఇప్పుడున్న వారిలో 35 మంది కార్పొరేటర్లు కచ్చితంగా ఓడిపోతారని కేటీఆర్ కూడా డిసైడయ్యారని, వారిలో కొందరికి ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేశారని గులాబీ నేతలు చెబుతున్నారు. వరదల సమయంలో కూడా ప్రజలకు మొహం చూపించని కార్పొరేటర్లు వీరికి అదనం. వీరందరిని కలుపుకుంటే ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్లలో దాదాపు 50 మంది మళ్లీ పోటి చేస్తే ఓడిపోవడం ఖాయమని టీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది.
గ్రేటర్ లో ప్రభుత్వం చేపట్టిన వరద సాయం పంపిణీ అనుకున్న ఫలితాలనివ్వకపోగా వ్యతిరేకతను పెంచింది. సాయం అందిన వారు సైలెంట్ గా ఉండిపోగా.. అందని వారంతా సర్కార్ కు వ్యతిరేకంగా మారారు. ఇటీవల వరద బాధితుల ధర్నాలు, నిరసనలతో గ్రేటర్ లోని పలు కాలనీలు దద్దరిల్లాయి. మున్సిపల్ కార్యాలయాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగాయి. కొందరు వరద బాధితులు ఆవేశంలో మంత్రి కేటీఆర్‌నే పక్కకు నెట్టేశారంటే పరిస్తితి ఎలా ఉందో ఊహించవచ్చు. వరద సాయాన్ని విపక్షాలు కూడా పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. బాధితులతో కలిసి ఆందోళనలు నిర్వహించాయి. వరద సాయం అందలేదన్న కోపంతో ఉన్న ప్రజలు తమను ఎలా సత్కరిస్తారోనన్న భయంతో టీఆర్ఎస్ కార్పొరేటర్లు బయటికి కూడా ఎక్కువగా రావడం లేదని తెలుస్తోంది. ఇవన్ని అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాలేనని చెబుతున్నారు.
ప్రజల్లో తమపై వచ్చిన వ్యతిరేకతతో ఇప్పటికే కంగారు పడుతున్న గ్రేటర్ కారు నేతలకు దుబ్బాక ఉప ఎన్నిన ఫలితం మరింత కలవరపెడుతోంది. ఇటీవలే నగరంలో బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. సిటీపై స్పెషల్ ఫోకస్ చేసిన బండి సంజయ్.. తానే స్వయంగా కండువాలు కప్పి టీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కొందరుసభ్యులు. మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. దుబ్బాకలో గెలవడంతో ఆ పార్టీలోకి మరిన్నివలసలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వద్దని గ్రేటర్ టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కు మొర పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ముందస్తుగా గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ ఓటమి ఖాయమనే రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో కేటీఆర్ కూడా బల్దియా ఎన్నికలపై పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ చట్టంలో చేర్చిన కొత్త నిబంధనతో తమకు అనుకూల సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి గులాబీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది.