నితీశే బీహార్ సీఎం! మాట తప్పేది లేదన్న బీజేపీ
posted on Nov 11, 2020 @ 2:34PM
బీహార్ లో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమారే సీఎంగా ఉంటారని ప్రకటించింది. జేడీ (యూ)కు బీజేపీ కన్నా సీట్లు తగ్గినంత మాత్రాన, ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ను తొలగించి, మరొకరిని ఆ పదవిలో కూర్చోబెట్టే ప్రశ్నే లేదని, బీహార్ కు సీఎంగా ఆయనే ఉంటారని కమలదళం తేల్చి చెప్పింది. బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారు. ఇది మేమిచ్చిన మాట. ఈ విషయంలో ఎటువంటి సందేహమూ లేదని సుశీల్ మోడీ చెప్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 సీట్లకు బీజేపీ 74 సీట్లలో గెలవగా, నితీశ్ నేతృత్వంలోని జేడీయూ 43 సీట్లకు పరిమితమైంది. అయితే ఎన్డీఏ కూటమి మాత్రం సర్కార్ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించింది. బీజేపీ కన్నా జేడీయూకు భారీగా సీట్లు తగ్గడంతో నితీశ్ కు సీఎం పగ్గాలు ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరిగింది. బీజేపీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రచారం జరిగింది. నితీశ్ కుమార్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది. దీంతో బీహార్ పరిణామాలపై స్పందించిన బీజేపీ ముఖ్యమంత్రి ఎవరవుతారన్న దానిపై క్లారిటీ ఇచ్చింది.
బీహార్ ను బీజేపీ ఇంతవరకూ సొంతంగా పాలించలేదు. ఇప్పుడు కూడా నితీశ్ సహకారం లేకుంటే, అధికారంలో ఉండే అవకాశాలు బీజేపీకి లేవు. నితీశ్ ను పట్టనపెట్టి సీఎం పోస్టు తీసుకున్నా.. సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మెజార్టీకన్నా మూడు సీట్లే ఎక్కువున్నాయ కాబట్టి ఏదైనా జరగొచ్చు. అందుకే నితీశ్ నే మళ్లీ సీఎంగా కొనసాగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ జేడీయూకి తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి.. మంత్రి పదవులే ఎక్కువగా బీజేపీకే వస్తాయని... నితీశ్ సీఎంగా ఉన్నా, ప్రధాన మంత్రిత్వ శాఖలతో పాటు అధికారాలన్నీ బీజేపీ చేతిలోనే ఉంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.