ప్రభుత్వ పరిహారం నిరాకరించిన అబ్దుల్ సలాం అత్త
posted on Nov 12, 2020 @ 11:42AM
అంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జగన్ ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని తీసుకునేందుకు నిరాకరించింది అబ్దుల్ సలామ్ అత్త మాబూని. గోల్డ్ షాప్‌లో చోరీ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలని కోరారు. తమ కుటుంబ సభ్యుల చావుకు కారణమైన పోలీసులను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని మాబూని డిమాండ్ చేశారు.
నంద్యాలలో మహిళా ఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి 10 గంటలకు అబ్దుల్ సలాం ఇంటికి వెళ్లడం దుమారం రేపింది. తెల్లకాగితంపై సంతకం చేయాలని పోలీసులు అబ్దుల్ సలాం అత్తపై ఒత్తిడి తీసుకొచ్చారని చెబుతున్నారు. పోలీసులు రావడంతో భయపడిన అబ్దుల్ సలాం అత్త మాబిమ్ సబ్ కలెక్టర్ కల్పనా కుమారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో పోలీసులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది సబ్ కలెక్టర్. దీంతో పోలీసులు వెనక్కు వెళ్లిపోయారని తెలుస్తోంది.