జగన్ కు ఈవీఎంల టెన్షన్! బీహార్ పరిణామాలతో పరేషాన్
posted on Nov 11, 2020 @ 2:12PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్డిట్ పోల్స్ అంచనాలు తప్పయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ విజయం సాధించింది. ఆ కూటమి బోటాబోటీ మెజార్టీతో అతికష్టం మీద గట్టెక్కింది. సర్కార్ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 122 కాగా.. ఎన్డీఏ కూటమికి మూడంటే మూడే సీట్లు అదనంగా వచ్చాయి. బీజేపీకి 73 సీట్లు రాగా, నితీస్ సారథ్యంలోని జేడీయూ 43 సీట్లపై పరిమితమైంది. ఆర్జేడీ 75 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెట్ పార్టీగా అవతరించినా.. కూటమి పార్టీలకు అశించిన సీట్లు రాకపోవడంతో కొద్ది దూరంలో అధికార పీఠానికి దూరమైంది యూపీఏ కూటమి.
బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని, కౌంటింగ్ లోనూ మేనేజ్ చేసిందని ఆర్జేడీ కూటమి పక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ రోజున ప్రజల మైండ్ స్పష్టంగా కనిపించిందని, అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని వారు చెబుతున్నారు. ఎన్డీఏ కూటమిలోనూ జేడీయూ ఎక్కువ సీట్లు కోల్పోగా.. బీజేపీ మాత్రం తాము పోటీ చేసిన స్థానాల్లో 70 శాతానికి పైగా గెలిచింది. 115 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 75 సీట్లలో గెలుపొందింది. ఇదే ఇప్పుడు విపక్షాల అనుమానాలకు కారణమవుతోంది. జేడీయూ మెజార్టీ సీట్లలో ఓడిపోయి బీజేపీ గెలవడం చర్చగా మారింది. బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 39 స్థానాలు గెలిచింది. అప్పుడు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా తనకు విశ్వాసం లేదని, ఈవీఎంలన్నీ మోడీ ఓటింగ్ మెషిన్లే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో విమర్శిస్తూ వచ్చారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనని సాంకేతిక నిపుణులు ఇది వరకే సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఒక్కసారే పలు యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం కుదరదని, అయితే వేర్వేరుగా ఏ ఈవీఎంనైనా ట్యాంపరింగ్ చేయవచ్చని వారు వివరించారు. ఫలితాలను తారుమారు చేయాలంటే అన్ని ఈవీఎంలను ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైన నియోజక వర్గాల్లో, అవసరమైన చోట కొన్ని ఈవీఎంల చొప్పున ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చని కూడా ఎన్నికల విశ్లేషకులు వివరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా చాలా ఆలస్యంగా జరగడం.. ఈవీఎంల ఓట్లను లెక్కించటానికి గంటలకొద్ది సమయం తీసుకోవడంతో ఇప్పుడు అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు కారణమవుతున్నాయి.
బీహార్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ కలవరపడుతున్న తెలుస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ పాగా వేస్తుందేమోనన్న ఆందోళన సీఎం జగన్ లో ఉందని చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే వైసీపీ గెలిచిందనే ఆరోపణలున్నాయి. వైసీపీకి ఏకంగా 151 సీట్లు రావడం అప్పుడు అందరిని అశ్చర్యపరిచింది. వైసీపీ నేతలు కూడా ఇన్ని సీట్లు వస్తాయని ఊహించలేదంటారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వైసీపీకి బీజేపీ సహకరించిందని, అందుకే వైసీపీ ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయనే ఆరోపణలు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపించాయి. వైసీపీకి వచ్చిన మెజార్టీలు కూడా ఈ ఆరోపణలకు బలాన్నిచ్చాయి.
2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. కాంగ్రెస్ తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఏపీకి అన్యాయం చేశారంటూ ప్రధాని మోడీ, అమిత్ షాను ఘాటుగా విమర్శించారు. దీంతో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ తమను టార్గెట్ చేసిన చంద్రబాబును బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారని చెబుతారు. అందులో భాగంగానే చంద్రబాబును ఓడించేందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలు ఇప్పటికి ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ గెలిచినా తమ చేతుల్లోనే ఉంటుందనే భావనలోనే బీజేపీ అలా చేసిందంటున్నారు. బీజేపీ అనుకుంటున్నట్లే ఇప్పుడు వైసీపీ వ్యవహారం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పుచేతుల్లోనే వైసీపీ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు దక్షిణాదిపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉండటంతో తెలంగాణ, అంధ్రప్రదేశ్, తమిళనాడును టార్గెట్ చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారింది బీజేపీ. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో బీజేపీకి మరింత బూస్ట్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే అధికారమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.ఏపీలోనూ అధికారం కోసం కమలనాధులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అధికారం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందని, ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా చేయవచ్చని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. 2019 ఎన్నికల్లో తమ గెలుపునకు సహకరించాయనే ఆరోపణలు ఉన్న ఈవీఎంలే... 2023 ఎన్నికల్లో తమ కొంప ముంచుతాయోమనన్న టెన్షన్ వారిలో కనిపిస్తుందని చెబుతున్నారు. బీజేపీ సీరియస్ గా దృష్టి సారిస్తే ఏపీలోనూ బీహార్ వ్యూహాలను అమలు చేయవచ్చని వారు భయపడుతున్నారు. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పరిణామాలతో ఫ్యాన్ పార్టీ నేతలు లోలోపల పరేషాన్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.