మైనార్టీ ఏరియాలో బీజేపీ విజయం! సహకరించిన ఎంఐఎం?
posted on Nov 12, 2020 @ 12:00PM
హోరాహారీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ కన్నా మూడు సీట్లు ఎక్కువ సాధించింది బీజేపీ కూటమి. చివరి వరకు ఉత్కంఠ సాగినా బీహార్ కౌంటింగ్ లో చివరికి బోటాబోటీ మెజార్టీతో గట్టెక్కింది ఎన్డీఏ. పోత్తులో భాగంగా బీజేపీ 115 నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. 65 శాతానికి పైగా సక్సెస్ రేటుతో 74 సీట్లు గెలిచింది. జేడీయూ మాత్రం 115కు కేవలం 43 చోట్ల విజయం సాధించింది. ఆర్జేడీ 76 సీట్లు సాధించగా.. 70 స్థానాల్లో బరిలో నిలిచిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. 20 చోట్ల పోటీ చేసి 16 సీట్లు గెలిచి పట్టు నిలుపుకున్నారు కమ్యూనిస్టులు. అయితే బీహార్ ఫలితాలను విశ్లేషిస్తే ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి.
హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విజయం సాధించడం రాజకీయ వర్గాలను అశ్చర్య పరుస్తోంది. బీహార్ లో 243 నియోజకవర్గాలుండగా.. దాదాపు 60 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే 20 శాతానికి పైగా ఉన్నారట. ఈ సీట్లపై గతంలో బీజేపీకి పెద్దగా అశలు
ఉండేవి కావు. కాని ఈసారి ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సీమాంచల్ లోని 52 నియోజకవర్గాల్లో 40 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇదే ఇప్పుడు బీహార్ లో చర్చనీయాంశంగా మారింది.
మైనార్టీల ప్రాబల్యం ఉన్నప్రాంతంలో కమలం వికసించడంపై రాజకీయ విశ్లేషకులు పలు రకాలు వాదనలు వినిపిస్తున్నారు. ఎంఐఎం విడిగా పోటీ చేయడంతో ముస్లిం ఓట్లు చీలి బీజేపీకి ఫ్లస్ అయిందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ పైనే ఫోకస్ చేసింది ఎంఐఎం. లోకల్ ప్రాంతీయ పార్టీలతో కలిసి 20 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. మరికొన్ని సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది. సీమాంచల్ లో ఎంఐఎం 14 సీట్లలో పోటీ చేయగా.. ఐదు చోట్ల విజయం సాధించింది. మిగిలిన 9 నియోజకవర్గాల్లోనూ భారీగానే ఓట్లు సాధించింది పతంగి పార్టీ. ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్, ఆర్డేజీ కూటమినే ఎక్కువ టార్గెట్ చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. దీంతో యూపీఏకు పడాల్సిన ఓట్లకే ఎంఐఎం గండి కొట్టిందని చెబుతున్నారు. అందుకే మైనార్టీల కోటగా చెప్పుకునే సీమాంచల్ లో బీజేపీ 40 స్థానాలు సాధించిందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
ముస్లింలు ఎక్కువున్న ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడంపై మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మోడీ సర్కార్ తీసుకువచ్చి త్రిపుల్ తలాఖ్ బిల్లుతో ముస్లిం మహిళల మైండ్ సైట్ లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. తమకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న సమస్యను పరిష్కారించారన్న భావనలో ఉన్న కొందరు ముస్లిం మహిళలు.. బీహార్ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గుచూపారని చెబుతున్నారు, ముస్లిం యువతలో కూడా కొంత మార్పు కనిపించిందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలనే భావనలో కమలానికి సపోర్ట్ చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ఎంఐఎం పోటీ చేయడంతో కొన్ని ఓట్లు చీలడం కూడా బీజేపీ కలిసివచ్చిందని చెబుతున్నారు.
బీహార్ లో తృటిలో అధికారం అందుకోలేకపోయిన ఆర్డేజీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమి నేతలు మాత్రం ఎంఐఎం వల్లే బీహార్ లో బీజేపీ బయటపడిందని ఆరోపిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ముస్లిం ఓట్లను చీల్చే కుట్రలో భాగంగానే బీహార్ లో ఎంఐఎం పోటీ చేసిందని చెబుతున్నారు. ఎప్పుడూ బీజేపీని విమర్శించే ఒవైసీ.. ఎన్నికల సభల్లో మాత్రం బీజేపీ గురించి మాట్లాడలేదని.. అక్కడే ఆ పార్టీ కుట్ర ఏంటో తెలిసిపోతుందని అర్జేడీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. బీహార్ లో బీజేపీ గెలుపునకు పరోక్షంగా ఒవైసీ సహకరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్ లోని అమిత్ షా నివాసంలో బీజేపీ నేతలతో అక్భరుద్దీన్ ఒవైసీ చర్చలు జరిపారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆప్ అధినేత.