రాజ్యాంగబద్ద వ్యవస్థలో కూర్చుని చిల్లర పనులు.. ఎస్‌ఈసీపై కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్ 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికోసం సన్నాహాలు చేసుకోవాలని అటు రాజకీయ పార్టీలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అయన సూచించారు. దీనిపై ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ.. ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం, అలాగే ప్రస్తుత కరోనా పరిస్థితుల గురించి అయన వివరంగా ప్రస్తావించారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు కూడా లేవని రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.   అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రకటనపై మంత్రులు, పలువురు వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా.. ఏపీ మంత్రి కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సిగ్గులేకుండా, చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటు. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరు. నిమ్మగడ్డకు అసలు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు. రాజ్యాంగబద్ద వ్యవస్థలో కూర్చున్న నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా, రిటైర్ అయ్యే లోపు హుందాగా వ్యవహరించాలి. ప్రస్తుతం ఉన్న కరోనా తీవ్రత దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది. వయసు వచ్చినా బుద్ధి, జ్ఞానం లేకుండా కోవిడ్ కేసులు తీవ్రంగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకం. రాష్ట్రంలో రెండు కరోనా కేసులు ఉన్నపుడు ఎన్నికలు జరపలేని ఈ చవట దద్దమ్మ రోజుకు 1500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నపుడు ఎన్నికలు నిర్వహిస్తాడట. ఏపీ ప్రజలను ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్, జూమ్ బాబులు ఇద్దరు కలిసి ఏపీ ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఒకవేళ ఈ విషయంలో అయన కోర్టుకు వెళితే మేము కూడా అక్కడే తేల్చుకోవడానికి రెడీగా ఉన్నాము" అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే 10 మంది మృతి 

గుజరాత్‌లోని వడోదర సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ కంటెయినర్, ఓ లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సూరత్ నుంచి పావగఢ్‌కు వెళ్తున్న లారీ అతివేగంతో వడదోర శివారులో వాగోడియా క్రాస్‌రోడ్డు సమీపంలోని వంతెనపై కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని.. వీరంతా సూరత్‌కు చెందినవారని, పంచమహల్ జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే వడోదర దగ్గర లో పొగ మంచు వాతావరణం ఉండడంతో.. రోడ్డు కనిపించే పరిస్థితి లేదని అదే సమయంలో లారీ అతివేగం కూడా ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెపుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాల్సిందిగా అధికారులను అదేశించారు.

‘గ్రేటర్’లో బీజేపీ ‘పంచ’తంత్రం!

సంజయ సారథ్యంలో కమలం సమరోత్సాహం   చేరికలతో ఎన్నికల కోలాహలం   ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే గందరగోళం   గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల యుద్ధానికి కమలదళం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు సంజయ్ సారథ్యంలో పంచతంత్రం ప్రణాళిక సిద్ధమవుతోంది. దుబ్బాక విజయోత్సాహంతో ఊపు మీదున్న కమలదళాలు, గ్రేటర్ ఎన్నికల్లో మేయర్‌ను పట్టేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.  సంజయ సారథ్యంలో గ్రేటర్‌లోని మెజారిటీ డివిజన్లను సాధించేందుకు ఐదుగురు అగ్రనేతలతో కమలదళం ఎన్నికల బరిలోకి దిగనుంది.   అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బండి సంజయ్ సారథ్యంలోని కమలదళం, అస్త్రశస్ర్తాలతో రంగంలోకి దిగుతోంది. ప్రస్తుతం రాజధాని నగరంలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే, నలుగురు  కార్పొరేటర్లు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి గ్రేటర్‌పై పట్టు బిగించాలన్న పట్టుదలతో ఉన్న కమలదళానికి, ఇటీవలి దుబ్బాక విజయం ఒక టానిక్‌లా మారింది. దానికితోడు టీఆర్‌ఎస్-కాంగ్రెస్ నుంచి వరసగా చేరుతున్న వలసలతో,  బీజేపీలో సమరోత్సాహం తొంగిచూస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మేయర్ బండ కార్తీక్‌రెడ్డి దంపతులు బీజేపీలో చేరనున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటరు కూడా కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పేసుకున్నారు.   వీరుకాకుండా, ఎన్నికల ముందు వరకూ మరింతమంది చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇది  ఆ పార్టీలో జోష్‌ను పెంచుతోంది. దుబ్బాక విజయం తర్వాత, నగరంలో కూడా బీజేపీ ట్రెండ్ కొనసాగుతుందన్న అంచనాయే,  ఈ వలసలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దానితో పోటీ చేసే ఆశావహ అభ్యర్ధుల  సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ ఉత్సాహం చూసి అగ్రనేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న,  సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలో చేరికల సంఖ్య పెరుగుతోంది. టీఆర్‌ఎస్ అసమ్మతులపై ఆయన కన్నేయడంతో, నియోజకవర్గ స్థాయి నేతలు బీజేపీలో చేరేందుకు క్యూలు కడుతున్నారు.   ఇక గ్రేటర్‌పై కాషాయ జెండా ఎగుర వేయాలన్న కలను నిజం చేసేందుకు,  పార్టీ దళపతి సంజయ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. కేంద్రమంతి కిషన్ రెడ్డి కన్వీనర్‌గా 23మందితో ఎన్నికల కమిటీని ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరిని ఇన్చార్జిగా నియమించారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారబరిలో సంజయ్‌తోపాటు, కిషన్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, డికె అరుణ దిగనున్నారు. వీరిలో అంతా ఫైర్‌బ్రాండ్లే. కేసీఆర్ సర్కారును దునుమాడేందుకు, ఈ పెద్దనోరు నేతలు రంగంలోకి దిగితే ఇక ఎన్నికల యుద్ధం అంతా ఆసక్తికరమే. వీరిలో సంజయ్-అర్వింద్-అరుణ త్రయం సంగతి చెప్పనవసరం లేదు. ఈ  ‘పంచ’తంత్రం ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచిచూడాలి. గత ఎన్నికల్లో బీజేపీ 3,46,253 ఓట్లతో 10.34 శాతం ఓట్లు సాధించింది. అయితే కేవలం నలుగురు కార్పొరేటరు సీట్లు మాత్రమే గెలిచింది. అంతకుముందు.. టీడీపీతో పొత్తులో పోటీచేసిన బీజేపీ డిప్యూటీ మేయర్, ఒక స్టాండింగ్ కమిటీ చైర్మన్‌తోపాటు 14 సీట్లు సాధించింది. ఆ సమయంలో బీజేపీ  5 ఎమ్మెల్యే స్థానాలు కూడా సాధించింది. టీడీపీతో తెగతెంపుల తర్వాత, బీజేపీ స్థానాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.   ఇప్పుడు మళ్లీ గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపధ్యంలో.. కనీసం 70 స్థానాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో, సంజయ దళం తీవ్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ప్రచార కమిటీతో సంజయ్ ప్రతిరోజూ భేటీ అవుతున్నారు. కిషన్‌రెడ్డి నగరంలోనే తిష్టవేశారు. ఏకంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పర్యవేక్షకుడిగా వస్తున్నారంటే, ఈ ఎన్నికలను బీజేపీ ఏ స్ధాయిలో ప్రతిష్ఠగా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు.    కులాలు-ప్రాంతాలు-మతాల ప్రాతిపదికన ప్రచారంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు టీఆర్‌ఎస్ డివిజన్‌కు ఒక ఎమ్మెల్యేను పర్యవేక్షకుడిగా నియమిస్తున్న నేపథ్యంలో, బీజేపీ సైతం అందుకు దీటుగా నేతలను ఎంపిక చేస్తోంది. సెటిలర్లు ఉన్న డివిజన్లలో ప్రచారం చేసేందుకు, ఏపీ నుంచి పార్టీ అగ్రనేతలను తీసుకువచ్చే యోచన చేస్తున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ కాబట్టి, ఏపీ నేతలు ప్రచారానికి వస్తే ప్రాంతం ముద్ర పడే ప్రమాదం లేదు. కాగా కరోనా కష్టకాలంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సొంతంగా,  తన 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పేదలను ఆదుకున్న వైనం కూడా,  పార్టీకి కలసివస్తుందని నేతలు చెబుతున్నారు. కరోనా కాలంలో, కిషన్‌రెడ్డి భార్య వివిధ నియోజకవర్గాల్లో నిత్యావసర వస్తువులు సమకూర్చిన విషయం తెలిసిందే.   కాగా, గ్రేటర్‌లో పార్టీ విజయావకాశాలు పెరుగుతున్నందున.. టీఆర్‌ఎస్-కాంగ్రెస్-టిడిపి నుంచి చేరిన నేతలు టికెట్లకు పోటీ పడుతుండటంతో, అభ్యర్ధుల ఎంపిక క్లిష్టంగా మారుతోంది. దీర్ఘకాలం నుంచి పార్టీకి పనిచేస్తున్న వారిని కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి టికెట్లు ఇస్తే, అది గెలుపుపై ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. పైగా ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు, తమ సహజ లక్షణాల ప్రకారం కింది స్ధాయిలో పనిచేయకుండా.. కేవలం ఫ్లెక్సీలు, పత్రికా ప్రకటనలు, గతంలో తమ పార్టీల నుంచి బీజేపీలో చేరిన అగ్ర నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ, లాబీయింగ్‌కు తెరలేపడం కింది స్ధాయిలో గందరగోళానికి కారమవుతోంది. కొత్తగా చేరిన నేతల వల్ల, పార్టీలో ఎప్పుడూ లేనన్ని గ్రూపు రాజకీయాలు పెరిగాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  దీనికి అడ్డుకట్ట వేయకపోతే.. తొలి నుంచీ పనిచేస్తున్న కార్యకర్తలు- నేతల ఆత్మస్థైర్యం దెబ్బతిని, అది పరోక్షంగా పార్టీ ఓటమికి దారితీసే ప్రమాదం లేకపోలేదని పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సమస్యను  నాయకత్వం,  ఎలా పరిష్కరిస్తుందో చూడాలి! -మార్తి సుబ్రహ్మణ్యం

మీరు అవునంటే మేము కాదనిలే.. ఎన్నికల కమిషన్ కు ఏపీ సర్కార్ లేఖ 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న సమయంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం దీనిపై స్ప‌దించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని, కరోనా నేపథ్యంలో చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిన విషయాన్ని సీఎస్ ఆ లేఖలో ప్రస్తావించారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి సమయంలో మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.   ప్రస్తుత పరిస్థితుల్లో కనుక ఎన్నికలు జరిపితే వైరస్ గ్రామాలకు కూడా పాకిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు, పరిపాలన సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని.. పరిస్థితి అనుకూలించిన వెంటనే ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తామని సీఎస్ ఆ లేఖలో తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రత నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఎంతమాత్రమూ ఆమోద యోగ్యం కాదని అన్నారు. అలాగే, ఎన్నికల కమిషన్ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిసిందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది కూడా అవసరం లేదని తాము భావిస్తున్నట్టు నీలం సాహ్ని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అవుతున్నారు.

సీఎంవోలో ఇద్దరు అవుట్! ఆయన కోసమే పొగబెట్టారా? 

ఇప్పటి వరకూ వాళ్లిద్దరు సూపర్‌ బాస్‌లు. సీఎంవోలో వారికే ఎదురు లేదు. అధికారులకు వారి మాటే శాసనం. అంతటి స్థాయిలో చక్రం తిప్పిన వాళ్లిద్దరు ఇప్పుడు ఆ పోస్టుల నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది. సీఎంవో కీలక అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తో పాటు సీఎంకు సలహాదారుగా ఉన్న పీవీ రమేశ్ లు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారనే ప్రచారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ ఏరికోరి పెట్టుకున్న ఇద్దరూ ఒకేసారి సీఎంవోనూ వీడుతుండటం చర్చనీయంశంగా మారింది. ఏపీ సీఎంవోలో మార్పులపై జనాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారే పోతున్నారా లేక పొయ్యేలా పొగ్గబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొయ్యేలా పొగబెట్టారనుకుంటే.. ఇంతకాలం అందలం ఎక్కించి సడెన్ గా ఎందుకు వారిని టార్గెట్ చేశారనే చర్చ వస్తోంది.    సీఎం జగన్ సలహాదారుగా ఉన్నా పీవీ రమేశ్‌ను ప్రభుత్వం కొంతకాలంగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆయనకు అప్పగించిన శాఖలన్నింటినీ గత జూలైలో తీసేసింది. దళిత అధికారి అయినందుకే శాఖలు తీసేశారన్న విమర్శలు రాకుండా ఉండేందుకు.. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం వద్ద ఉన్న శాఖలను కూడా తీసేశారు. అయితే ఆ తర్వాత తీసేసిన శాఖలను కల్లంకు అప్పగించారు. పీవీ రమేశ్‌ను మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ వైఖరితోనే రాజీనామా చేయాలనే నిర్ణయానికి పీవీ రమేష్ వచ్చినట్లు చెబుతున్నారు. అజయ్ కల్లం కోసమే తనను పట్టించుకోవడం లేదనే భావనలో పీవీ రమేష్ ఉన్నారని తెలుస్తోంది. తాను సలహాదారు పదవి నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు సీఎంకు చెప్పారని.. సీఎం జగన్‌ సానుకూలంగా తలూపి రమేశ్ ను పంపించివేశారని తెలిసింది. దీంతో ఈ నెలాఖరున పీవీ రమేశ్‌ సలహాదారు పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.   సీఎంవోలో తన శాఖలను కత్తిరించినప్పటి నుంచి రమేశ్ అసంతృప్తిగానే ఉన్నారని చెబుతున్నారు. గత జూలైలో ఆయన చేసిన ట్వీట్ కూడా ఇందుకు బలాన్నిచ్చింది. ఐఏఎస్ లపై పంజాబ్ కు చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు పీవీ రమేశ్. అది అప్పుడు సంచలనమైంది. మన దేశంలో అఖిల భారత సర్వీసులకు ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. ఓ కుటుంబంలో ఏఐఎస్ సర్వీసుకు ఒకరు ఎంపికైనా కొన్ని తరాల వరకూ చెప్పుకునే వారు. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో వీరి పాత్ర ఎంతో కీలకం. అలాంటి బ్యూరోక్రాట్లు కొన్నేళ్లుగా రాజకీయ విష వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీరికి చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో వీరు పోషించిన పాత్రను బట్టే ప్రస్తుత స్ధానాలు నిర్ణయం అవుతున్నాయి. దీంతో వారిలో అసంతృప్తి కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని పంజాబ్ కు చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ ట్వీట్ చేయగా..పీవీ రమేష్ దీన్ని రీట్వీట్ చేశారు. ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని రమేశ్ వ్యక్తం చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది.     రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన పీవీ రమేష్ కు ప్రభుత్వ వర్గాల్లో సమర్ధుడిగా మంచి పేరుంది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా బాధ్యతలు నిర్వర్తించిన క్లీన్ రికార్డు ఆయనది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో ఆయన కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. అందుకే రిటైర్మెంట్ తర్వాత కూడా జగన్  సీఎంవోలో ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరుగా, కీలకమైన విద్య, వైద్యం వంటి శాఖల బాధ్యతలు చూశారు. గతేడాది కాలంగా ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు నీతి ఆయోగ్ వంటి సంస్ధల వద్ద కూడా ప్రభుత్వ గళాన్ని గట్టిగా వినిపించారు.  ప్రభుత్వం తరఫున కరోనా సహాయక చర్యలను పర్యవేక్షించారు. కానీ పలు కారణాలతో జగన్ సర్కారు ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించింది. దీన్ని పీవీ రమేష్ అవమానంగా భావించారని,, అందుకే అందివచ్చిన ట్వీట్ రూపంలో తన అసంతృప్తి వెళ్లగక్కారని ప్రచారం జరిగింది.     ఏపీలో సీఎం జగన్ అధికారం చేపట్టిన తరువాత కొద్ది కాలానికే  సీఎంవో ముఖ్య కార్య‌ద‌ర్శిగా, జీఏడీలోనూ కీల‌క అధికారిగా ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్ర‌వీణ్ ప్ర‌కాష్ నడిపించారు. అయన ఆదేశాలతోనే అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను కూడా అర్ధాంత‌రంగా తొల‌గించారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్ర‌వీణ్ ప్ర‌కాష్ సీఎంవో బాధ్య‌త‌ల నుండి త‌ప్పుకుని కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్తున్నార‌ని తెలుస్తోంది. అయితే చాలా కాలం కేంద్ర స‌ర్వీసుల్లో ప‌ని చేసిన ప్రవీణ్ ప్రకాష్.. జగన్ సీఎం అయ్యాకే ఏపీకి వ‌చ్చారు. చంద్ర‌బాబు సీఎంగా ఉండగా రాష్ట్ర స‌ర్వీసుల్లోకి రాగా… ఆయనను ఏపీ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గా నియమించారు. జగన్ సీఎం అయ్యాక ఆయనను సీఎంవో ముఖ్య కార్యదర్శిగా.. అలాగే జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వంలో ఆయన మాటే వేదవాక్కుగా నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్ర‌వీణ్ ప్ర‌కాష్ తప్పుకోవడం ప్రాధన్యత సంతరించుకుంది. సీఎంవోలో సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్ కల్లంతో ఆయనకు పడటం లేదని, అందుకే ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళుతున్నారని చెబుతున్నారు.

జనసేనతో టీబీజేపీ కటీఫ్! ఏపీ వరకే పరిమితమన్న సంజయ్

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అయితే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించగా.. ఆ పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. గ్రేటర్ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమకు పట్టున 50 డివిజన్లలో పోటీ చేస్తామని, అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్.    జనసేన ప్రకటన తర్వాత స్పందించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణకు వర్తించదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని... మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను నిలబెడతామని సంజయ్ స్పష్టం చేశారు.

కరోనా ఉధృతి కారణంగా ఆ రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్...!

భారత్ లోని చాలా రాష్ట్రాలలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్న సంగతి తెల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం అలర్ట్ అయి.. ప్రముఖ మార్కెట్లను మూసి వేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని అయన అన్నారు. దీపావళి సమయంలో ఎక్కువ మంది ప్రజలు మాస్కులు ధరించకుండా, సామాజికదూరం కూడా పాటించలేదని కేజ్రీవాల్ అన్నారు. తమకు ఏమీ కాదనే ధోరణిలో జనాలు ఉంటున్నారని అయన అసహనం వ్యక్తం చేశారు. కరోనా ఎవరికైనా వస్తుందని, పరిస్థితిని దారుణంగా మారుస్తుందని అయన చెప్పారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని అన్నారు. మార్కెట్లలో జనాలు ఎక్కువగా పోగవుతున్నారని... దీంతో ఇవి కరోనా హాట్ స్పాట్ లుగా మారే అవకాశం ఉందని అయన అన్నారు. దీంతో కొన్ని రోజుల పాటు మార్కెట్లను మూసేయాలని నిర్ణయించామని దీనిపై కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రతిపాదనను పంపామని అయన చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రస్తుతం పెళ్లిళ్లకు 200 మంది వరకు అనుమతిస్తున్నామని... కానీ, ప్రస్తుత కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ పాత నిబంధన (50 మందికే అనుమతి) కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కేజ్రీవాల్ తెలిపారు.

బాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి! గ్రేటర్ లో పోటీ చేస్తామన్న రమణ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.‌రమణ చెప్పారు. రెండు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. బలంగా ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామన్నారు రమణ. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. గ్రేటర్‌లో టీటీడీపీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు రమణ. హైదరాబాద్‌ అభివృద్ధికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబేనని చెప్పారు. చంద్రబాబుకు గ్రేటర్ లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారన్నారు. జీహెచ్ఎంసీలో మంచి ఫలితాలు సాధిస్తామని రమణ ధీమా వ్యక్తం చేశారు.

మూడేళ్ళ తరువాత వైసీపీ ఉండదు... బీజేపీ నేత సెన్సేషనల్ కామెంట్స్  

ఏపీ సీఎం జగన్, అలాగే అయన పార్టీ పై బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "వైసీపీ అనేది మూసేసే పార్టీ. మూడు సంవత్సరాల తర్వాత అసలు ఆ పార్టీనే ఉండదు. గ్యారెంటీగా చెబుతున్నా. కావాలంటే మీరు రాసిపెట్టుకోండి. ఇక్కడ మూసేయడం అంటే ఆ పార్టీ అధికారంలో ఉండదని అర్థం.’’ అంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ ఓడిపోతుందని తాను ముందే చెప్పానని, 2019 ఎన్నికలలో అదే జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా నోటికి వచ్చింది చెప్పడానికి తాను కేఏ పాల్‌ను కానని విష్ణుకుమార్ రాజు సెటైర్ వేశారు. సంవత్సరంన్నరలోనే జగన్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని అయన చెప్పారు. పాదయాత్ర సమయంలో ప్రజలకు జగన్ ముద్దులు పెడితే నిజమైన ప్రేమ అనుకున్నారని, కానీ ఇప్పుడు వారికి అది దొంగ ప్రేమ అని తెలిసిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు లోపల వేస్తున్నారని అయన దుయ్యబట్టారు. విశాఖలో అక్రమ కట్టడాలంటూ ప్రతివారం శుక్రవారం రాత్రి నుండి మొదలుపెట్టి కూలగొడుతున్నారని చెప్పారు. ఇకనుండి కోర్టులు శని, ఆదివారాలు కూడా తెరిచే విధంగా చూడాలని అయన కోరారు. విశాఖలో హైకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేయాలని, అప్పుడే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుందని, లేకపోతే సామాన్యులు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

రెండు వారాల్లోనే ఖతం! గులాబీ ప్లాన్ ప్రకారమే షెడ్యూల్?  

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. రెండు వారాల్లోనే నామినేషన్లు, పోలింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నవంబర్ 18న నామినేషన్లు ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. అంటే రెండు వారాల్లోనే పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగియనుంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ పై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత హడావుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలించేలా షెడ్యూల్ ఉందని, టీఆర్ఎస్ డైరెక్షన్ లోనే ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజులే నామినేషన్లకు గడువుందని, పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం కూడా కష్టమనే వాదనలు వస్తున్నాయి.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ వెనక టీఆర్ఎస్ భారీ ప్లాన్ ఉందని చెబుతున్నారు. గ్రేటర్ లో ముందస్తుకు వెళ్లాలని మూడు నెలలక్రితమే డిసైడైన గులాబీ పార్టీ.. అందుకు పక్కా ప్రణాళికలు  వేసుకుంది. గత రెండు నెలలుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేశారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ లో పార్టీ పరిస్థితి, ప్రస్తుత కార్పొరేటర్ల పనితీరు, కొత్తగా ఇస్తే ఎవరికి టికెట్ ఇవ్వాలన్న అంశాలపై కారు పార్టీ కసరత్తు కూడా పూర్తి చేసిందని చెబుతున్నారు. వివిధ సంస్థలతో సర్వే చేయించి.. అందుకు అనుగుణంగా అభ్యర్థుల లిస్టును అధికార పార్టీ ఇప్పటికే రెడీ చేసిందని చెబుతున్నారు. టికెట్ కన్పామ్ అయిన నేతలకు ముందే సమాచారం ఇవ్వడంతో వారంతా ప్రచారం కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం పంపిణి చేసిన వరద సాయాన్ని ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల చేతుల మీదుగానే అందించారని చెబుతున్నారు.                  వరద బాధితులకు సాయం గా ఇప్పటికే 5 వందల కోట్ల రూపాయల వరకు పంపిణి చేసింది సర్కార్.  వరద సాయం పంపిణీ కొన్నిప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. వరద సాయం గురించి జనం మరువక ముందే ఎలక్షన్స్ పెడితే ఫాయిదా ఉంటుందని అధికార పార్టీ అంచనాలు వేసుకుందని సమాచారం. గ్రేటర్ లో  ఒక్కో  కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఇప్పటికి 5 లక్షల మందికి ఆర్థిక సాయం చేసినట్లు టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. లోకల్ కార్పొరేటర్, గులాబీ లీడర్ల పర్యవేక్షణలో సాయం పంపిణీ జరుగుతోంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని టైంలో అందించిన ఈ సాయాన్ని ఓట్లుగా మల్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కుటుంబానికి మూడు ఓట్లు లెక్కేసినా 15 లక్షల మందికి పైగా సాయం చేసినట్లు.. ఇవన్ని తమకు ఓట్ల రూపంలో కలిసి వస్తాయని గులాబీ నేతల అంచనాగా ఉంది. గ్రేటర్ లో 74 లక్షల ఓట్లుగా.. పోలయ్యేది 35 లక్షల వరకే ఉంటుంది. దీంతో తమకు గెలుపు ఈజీగానే ఉంటుందంటున్నారు టీఆర్ఎస్ నేతలు.     గ్రేటర్ ఎన్నికలకు ఇలా అని విధాలా సిద్ధమైన కారు పార్టీ.. విపక్షాలకు ఏ మాత్రం సమయం ఇవ్వకూడదన్న ప్లాన్ తోనే ఎన్నికల షెడ్యూల్ ను ఇలా రూపొందించిందనే విమర్శలు వస్తున్నాయి. దుబ్బాకలో బీజేపీ గెలవడంతో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పట్టుకుందట. దుబ్బాక ఫలితంతో  బీజేపీలో జోష్ పెరిగిందని అంచనా వేస్తున్న టీఆర్ఎస్ పెద్దలు.. గ్రేటర్ ఎలక్షన్స్ను ఆలస్యం చేస్తే బీజేపీ పుంజుకుంటుందని భావించారట. ఇప్పటికే గ్రేటర్ లో బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంచార్జ్ గా జాతీయ నేత భూపేంద్ర యాదవ్ ను నియమించింది బీజేపీ. దీంతో తమ పార్టీ కేడర్ వలసపోవచ్చనే భయం గులాబీ పెద్దల్లో ఉందని చెబుతున్నారు. అందుకే గ్రేటర్లో బీజేపీ బలం పెంచుకునేందుకు ట్రైం ఇవ్వకుండా వెంటనే ఎన్నికలు పెట్టిందని చెబుతున్నారు.    కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల గ్రేటర్ లో దూకుడు పెంచింది. వరద సాయంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి జోనల్ కమిషనర్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. కాంగ్రెస్ ఆందోళనలకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. గ్రేటర్ లో మరింత పోరాటానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండగానే గ్రేటర్ షెడ్యూల్ వచ్చేసింది. గ్రేటర్ లో కాంగ్రెస్ కు ప్రస్తుతం సరైన లీడర్లు లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇప్పుడు చాలా చోట్ల కొత్త అభ్యర్థులను వెతుక్కొవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నామినేషన్లను మూడు రోజులే గడువుంది. దీంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం కాంగ్రెస్ కు కష్టమేనన్న చర్చ జరుగుతోంది.    కేవలం రెండు వారాల్లోనే పోలింగ్ ఉంది. అభ్యర్థుల ఎంపికకే ప్రతిపక్షాలకు రెండు, మూడు రోజుల సమయం పోతుందని చెబుతున్నారు. ఇక ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకోవడానికి ఐదారు రోజులే లభిస్తుందని తెలుస్తోంది. ఐదారు రోజుల్లో ఎంత మందిని కలుస్తారు.. ఇతరత్రా ఎన్నికల పనులు ఎవరూ చూస్తారోనన్న ఆందోళన విపక్షాల్లో వ్యక్తమవుతోంది. ఇవన్ని లెక్కలు వేసుకున్నాకే అధికార పార్టీ పక్కా ప్లాన్ ప్రకారమే ఎన్నికల సంఘం నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటున్నారు. అందుకే ఎన్నికల షెడ్యూల్ పై విమర్శలు చేస్తోంది బీజేపీ. టీఆర్ఎస్ రాసిచ్చిన షెడ్యూల్ నే ఎన్నికల  సంఘం ఖరారు చేసిందని ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు బీజేపీ నేతలు.  

దిగొచ్చిన కొత్తా దేవుడు! ప్రత్యేక మర్యాదలు సస్పెండ్

కొత్తా దేవుడు దిగొచ్చాడు. కోంగత్తా దేవుడికి ‘అసలు దేవుడే దిగివచ్చి’జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని తలంచిన శారదాపీఠం ప్రజాగ్రహంతో వెనక్కి తగ్గింది. అదేనండి మన జగన్గురువు, జగద్రక్షకుడైన విశాఖ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వరూపానంద మహాస్వామి జన్మదిన ముచ్చట ముగిసిపోయింది. జగన్ రాజగురువు స్వామీజి స్వరూపానంద పుట్టిన రోజున 23దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలంటూ ఏపీ దేవాదాయ శాఖకు తాము రాసిన లేఖ ను శారదాపీఠం వెనెక్కి తీసుకుంది.   ఈ నెల 18న శారదాపీఠం స్వామీజి స్వరూపానంద పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా 23దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ పై హైకోర్టు లో విచారణ జరిగింది. హైకోర్టు విచారణ సందర్భంగా తాము రాసిన లేఖ ను వెనెక్కి తీసుకుంటున్నామని తెలిపారు శారదా పీఠం తరపు న్యాయవాది. దీంతో విశాఖ పీఠాథిపతి  స్వరూపానందుల వారికి చేయ తలపెట్టిన ప్రత్యేక మర్యాదలపై దేవాదాయశాఖ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో ఇద్దరు ముఖ్యమంత్రుల ముద్దుల స్వామిముచ్చట తీరకుండా పోయింది.   విశాఖ పీఠాధిపతి జన్మదినం సందర్భంగా ప్రత్యేక ఆశీర్వచనాలు ఇవ్వాలని 23 దేవాలయాలకు దేవాదాయశాఖ కమిషనర్ లేఖ రాయడమే వింత. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహంవ్యక్తమైంది. సర్వసంగ పరిత్యాగులు- సన్యాసులకు జన్మదిన వేడుకలేమిటన్న చర్చ జరిగింది. సన్యాసి అంటే స్వయంగా నారాయణ స్వరూపుడు. సన్యాసులు ఆశీర్వదించాలే తప్ప, ఆశీస్సులు తీసుకోవడం ఉండదు. నారాయణ స్వరూపులు ఎదురయితే యమధర్మరాజు కూడా పక్కకు తొలగి దారి ఇచ్చారని చెబుతారు. అలాంటిది ఆలయ ప్రధాన అర్చకులే తరలివచ్చి విశాఖ స్వామి వారిని ఆశీర్వదించడమేమిటన్న  ప్రశ్న ప్రజల నుంచి వచ్చింది. అసలు ప్రధానార్చకులు ఆలయంలోని మూలవిరాట్టును వదలి బయటకు రాకూడదు. మరి విశాఖ వేలుపు వద్దకు వెళ్లడమంటే.. స్వయంగా ఆ దేవదేవతలే విశాఖ స్వామి వద్దకు  వెళ్లినట్టు కాదా అని పండితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు.. అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

విజయనగరం గజపతిరాజుల కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సంచయిత గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌ గా నియామకం అయినప్పటి నుంచి వివాదం రాజుకుంటూనే ఉంటుంది. తాజాగా, సంచయితకు జగన్ సర్కార్‌ తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాల బాధ్యతను అప్పగించింది. ఈ క్రమంలో సంచయితపై టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 104 ఆలయాలకు ఒక్కసారి కూడా సంచయిత హాజరవ్వలేదన్నారు. తమ పూర్వీకులు నిర్వీహించే ఆలయాలకు ఒక్కసారి కూడా రానివారు.. వాటి ఆస్తులపై కన్నేయడం బాధాకరమని కాదన్నారు.   తాజాగా సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్ట్‌పై అశోక్ గజపతిరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు.. తండ్రి, తాతను సంచయిత ఒక్కసారైనా కలవలేదని విమర్శించారు. ఒక్కో చోట ఒక్కో విధంగా తండ్రి పేరు మార్చే పిల్లలను తానెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.   మాన్సాస్ ఛైర్మన్ హోదా అన్నది ప్రభుత్వం కల్పించిన పదవి కాదన్నారు. ట్రస్టు నియామకాల్లో ప్రభుత్వ నియంతృత్వ ధోరణితో వ్యవహరించిందని.. ఆనవాయితీలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు. చట్ట విరుద్ధంగా అర్ధరాత్రి జీవోలో ఛైర్మన్‌గా తనను తొలగించారని.. తనకు కనీసం ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. ఛైర్మన్ పోస్ట్ అపాయింటింగ్ పోస్ట్ కాదు.. ఆనవాయితీగా వచ్చే పోస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆనవాయితీలకు విరుధ్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇష్టమొచ్చిన వారిని కుటుంబసభ్యులని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఎవరు ఏ కుటుంబంలో ఉండాలన్నదీ ప్రభుత్వం నిర్ణయించే ధోరణి సరికాదని.. ఆదాయం, ఆస్తి ఉన్న ఆలయాలపై ప్రభుత్వం కన్నేయటం బాధాకరమని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు

క‌రోనా‌ కారణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వాయిదా పడిన స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఏపీలో కరోనా ఉధృతి తగ్గడంతో తొలి విడతగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. పంచాయ‌తీ ఎన్నిక‌లు పార్టీల‌క‌తీతంగా జ‌రిగేవి కావ‌డంతో.. న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు ఉండే అవ‌కాశం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలతో ఎన్నికలపై చర్చించామని.. ఎన్నికల షెడ్యూల్‌ ను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ఖరారు చేస్తామని అన్నారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ద, న్యాయబద్ధమైన బాధ్యతని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా.. భవిష్యత్‌లో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అని ఆయన తెలిపారు.    ఏపీలో కరోనా ఉధృతి తగ్గడంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అనుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని చెప్పారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీలో కరోనా అదుపులోకి వస్తోందని.. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నిస్వార్ధంగా పని చేస్తున్నారని కొనియాడారు. గతంలో 10 వేల కేసులుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 753కి తగ్గిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతోనే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ ప్రశంసించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని నిమ్మ‌గ‌డ్డ‌ తెలిపారు.

ముగ్గురు నానీలతో ప్రాణాలకు ముప్పు.. దళిత మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు

ఏపీలోని అధికార పార్టీ నేతల నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న ముగ్గురు నానీ (పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని) ల నుండి తనకు రక్షణ కల్పించాలని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక దళిత మహిళా వ్యాపారవేత్త లక్ష్మీనరసింహన్‌ ఏపీ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై విజయవాడలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "మచిలీపట్నానికి చెందిన నేను బెంగళూరులో స్థిరపడ్డాను. అయితే సొంత రాష్ట్రంలో వ్యాపారం చేయాలని భావించి గుడివాడ సమీపంలోని నందివాడలో 150 ఎకరాల చెరువును నూకల రామకృష్ణ, నూకల బాలాజీ నుంచి లీజుకు తీసుకున్నాను. లాక్‌డౌన్‌ సమయంలో ఏడాదికి ఎకరా రూ.60 వేలకు లీజుకు ఇచ్చిన వారు ఆ తర్వాత రూ.90 వేలు డిమాండ్‌ చేయడంతో దానికి అంగీకరించి 2023 వరకు లీజు ఒప్పందం చేసుకున్నాను".   అయితే ఈ క్రమంలో "గత ఏప్రిల్‌ నెలలో చేపలను విక్రయించుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో లీజుకు ఇచ్చిన వ్యక్తులు చాలా తక్కువ రేటుకు తమకే విక్రయించాలని డిమాండ్‌ చేశారు. దానికి అంగీకరించకపోవడంతో నాపై దౌర్జన్యం చేశారు" అని ఆమె ఆరోపించారు. వారు తనపై దాడి చేయడమే కాకుండా దౌర్జన్యంగా 150 ఎకరాల్లో రొయ్యలను తరలించుకుపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా పోలీసులు స్వీకరించలేదని, అంతేకాకుండా స్పందనలో రెండుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె తెలిపారు. తాజాగా అక్టోబరులో మరోసారి డీజీపీకి ఫిర్యాదు చేశానని, దాంతో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారని అయితే ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. నిందితులకు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని అండ ఉండటమే కారణమని ఆరోపించారు. దళితురాలినైన తనకు నూకల రామకృష్ణ, నూకల బాలాజీ, అలాగే మంత్రులు ముగ్గురు నానీల నుంచి ప్రాణహాని పొంచి ఉందని, తనకు రక్షణ కల్పించి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని" ఆమె సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వ్యవహారంపై సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఈసారైనా "మేయని వారికి" మేయర్ పదవి దక్కుతుందా దొరా.. కేసీఆర్ పై రాములమ్మ ఫైర్

దుబ్బాక ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి విరుచుకు పడ్డారు. "మేయ‌రు" ప‌ద‌వి అంటే మేసేవారికే అన్న‌ట్లు త‌యారైంద‌ని… క‌నీసం ఈసారైనా "మేయ‌రు.." అనే వారికి మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తారా అని ఆమె సూటిగా ప్ర‌శ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో స్పందించిన ఆమె ఫేస్‌బుక్ వేదికగా కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని "మేసేవారికి కాకుండా మేయరు " అనే వారికి దక్కాలని తానూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవానికి దూరమైన ప్రకటనలు చేస్తూ.. సీఎం దొర గారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరగారు ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోంది".   అంతేకాకుండా "చాలా ఏళ్ల పాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా… కేవలం విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అందె వేసిన చేయిగా మారిపోయారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ఫార్ములా గురించి కెసిఆర్ గారు ఎమ్ఐఎమ్ అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కెసిఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ వోటర్లు ఈసారి మాత్రం టిఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఐఎం తో కలిసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్నో జిమ్మిక్కులు చేయాలనుకుని సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఈ మధ్య కాలంలో ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోంది. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ మేయరు పదవి ఈ పర్యాయం "మేసేవారికి" కాక "మేయరు..." అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవం’’ అని విజయశాంతి తన పోస్టులో పేర్కొన్నారు.

బెంగాల్ వదిలేసి గుజరాత్ వెళ్లిపోండి! బీజేపీ చీఫ్‌కు టీఎంసీ కౌంటర్

సవాళ్లు, ప్రతిసవాళ్లతో పశ్చిమ బెంగాల్ రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బెంగాల్ బీజేపీ చీఫ్, ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు సెగలు రేపుతున్నాయి. ఉత్తర 24 పరగణ జిల్లాలోని బరసాత్‌లో మాట్లాడిన ఘోష్.. వచ్చే ఎన్నికల్లో తాము కనుక అధికారంలోకి వస్తే బెంగాల్‌ను గుజరాత్‌లా మారుస్తామని చెప్పారు. తాము ఈ మాటంటే మమత బెనర్జీ విమర్శిస్తున్నారని, కానీ తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ పని చేస్తామని తెలిపారు. అప్పుడు తమ పిల్లలు ఉద్యోగాల కోసం గుజరాత్ వెళ్లాల్సిన పని ఉండదన్నారు. అందరికీ ఎంచక్కా ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు దిలీప్ ఘోష్.    దిలీఫ్ ఘోష్ కామెంట్లకు బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం కౌంటరిచ్చారు. అలా అయితే ఘోష్ వెంటనే రాష్ట్రాన్ని వదిలేసి గుజరాత్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో అదానీ, అంబానీ లాంటి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఫలితంగా చిరు వ్యాపారులు చితికిపోయారని హకీం ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలివెళ్లిన నానో కంపెనీని కూడా మూసివేశారని మంత్రి విమర్శించారు. గుజరాత్ అల్లర్లలో దాదాపు 2 వేల మంది చనిపోయారని చెప్పిన హకీం.. ఇష్రాత్ జహాన్ వంటి ఎందరో ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌లా మారుస్తామని అంటున్నారని, అదే జరిగితే ఇక్కడి ప్రజలు నిత్యం ఎన్‌కౌంటర్ల భయంతో బతకాల్సి వస్తుందని చెప్పారు ఫిర్హాద్ హకీం.

పాతబస్తీలో రోడ్డెక్కిన మహిళలు! పతంగి పార్టీకి పతనమేనా? 

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయంటారు. రాజకీయాల్లో ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. అధికారం చలాయించిన పార్టీలు, నేతలకు అప్పుడప్పుడు అడ్డంకులు ఎదురవుతుంటాయి. పవర్ లో ఉన్నప్పుడు పెత్తనం చేసిన నేతలు.. టైం కలిసిరాకపోతే కనిపించకుండా పోతుంటారు. ప్రజాగ్రహం ముందు రాజ్యాలే కూలిపోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే ఎంతటి వారైనా తలొగ్గాల్సిందే. హైదరాబాద్ పాతబస్టీలోనూ ఇప్పుడు అలాంటి సీనే కనిపిస్తోంది. ముస్లిం సామాజిక వర్గమంతా తమవెంటే ఉందని, ఉంటుందనే ధీమాలో ఉన్న ఓ పార్టీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. తమ పార్టీ గురించి కనీసం మాట్లాడేందుకు కూడా భయపడే ప్రజలు... తమకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుండంటతో ఆ పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారు.    పాతబస్తీలో పట్టుందని చెప్పుకునే ఎంఐఎం పార్టీకి తొలిసారి అక్కడ షాకిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓల్డ్ సిటీలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లిం మహిళలు రోడ్డెక్కి ధర్నాలు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాతబస్తీలో వరద బీభత్సం స్పష్టించింది. వరద ముంచెత్తడంతో వందలాది కాలనీలు నీట మునిగాయి. వరద బాధితులకు కేసీఆర్ ప్రభుత్వం సాయం చేస్తోంది. నీట మునిగిన ఇంటి కుటుంబానికి 10 వేల రూపాయలు పరిహారంగా ఇస్తోంది. అయితే అధికార టీఆర్ఎస్ నేతలతో కలిసి ఎంఐఎం నేతలు వరద సాయం పంపిణిలో అక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిజమైన వరద బాధితులకు సాయం చేయకుండా.. తమ ఇష్టం వచ్చినవారికి డబ్బులు ఇస్తున్నారని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బాధితుల పేర్లతో లోకల్ లీడర్లే నగదు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.   సర్కార్ చేస్తున్న వరద సాయమే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీని షేక్ చేస్తోంది. సాయం అందని బాధితులంతా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున బయటికి వచ్చి ప్రధాన రోడ్లపై భైటాయించి ధర్నాలు చేస్తున్నారు. ధర్నా చేయడమే కాదు ఎంఐఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ముస్లిం మహిళలు. గల్లీ గల్లీ మే షోర్ హై.. ఎంఐఎం చోర్ హై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ ధర్నాలు కూడా ఎక్కడో కాకుండా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహించే చాంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంఐఎంకు వ్యతిరేకంగా గతంలో నిరసనలు జరిగిన కార్యక్రమాలు జరగలేదు. అలాంటిది ఎక్కువగా ఇండ్లలోనే ఉండి ముస్లిం మహిళలే  రోడ్డెక్కి పతంగి పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం సంచలనంగా మారింది.    ఎంఐఎంతో పాటు ముస్లింలకు తమ సర్కార్ ఎంతో చేసిందని గొప్పగా చెప్పుకునే గులాబీ పార్టీని టార్గెట్ చేస్తున్నారు పాతబస్తి ముస్లింలు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ క్యా కియా? 90 పీకే సోగయా అంటూ మండిపడుతున్నారు ముస్లిం మహిళలు. బల్దియా మే క్యా కియా? కాయా పీయా సోగయా అంటూ కేసీఆర్ సర్కార్ పై, ఎంఐఎంపై తమ ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. వరదల సమయంలో పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్దరాత్రి ఒక్కసారిగా వరద రావడంతో ఏం చేయాలో తెలియక డాబాలపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు. వారంతా రెండు, మూడు రోజుల పాటు నీళ్లలోనే ఉన్నా స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కనీసం స్పందించలేదని వరద బాధితులు ఫైరవుతున్నారు. అప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.    ఓల్డ్ సిటీలో జరుగుతున్న తాజా పరిణామాలతో పతంగి పార్టీకి పతనం ప్రారంభమైందనే చర్చ జరుగుతోంది. నిజానికి హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా.. పాతబస్తి దశ మాత్రం మారలేదు. ఎంఐఎం వల్లే అభివృద్ధి జరగడం లేదనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఎన్నికలప్పుడు తప్ప మిగితా సమయాల్లో ఎంఐఎం ఎమ్మెల్యేలు, లీడర్లు జనాలకు అందుబాటులో ఉండరనే విమర్సలు ఉన్నాయి. పాతబస్తీలో తమకు పోటీగా మరో బలమైన పార్టీ లేకపోవడంతో పతంగి పార్టీ నేతలు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారని చెబుతారు. అయితే ప్రస్తుతం పాతబస్తి ప్రజల్లోనూ మార్పు వచ్చిందని, అభివృద్ధి కోణంలో వారు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమంటున్నారు.    ఓల్డ్ సిటీలో మరో పార్టీ బలంగా పోరాడితే ఎంఐఎంకు పతనం తప్పదనే అభిప్రాయం ముస్లిం వర్గాల నుంచే వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వారు ఉదహరిస్తున్నారు. హిందుత్వ  పార్టీగా చెప్పుకునే బీజేపీ మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మంచి విజయం సాధించింది. సీమాంచల్ లోని ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న 52 నియోజకవర్గాల్లో 40 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మోడీ సర్కార్ తీసుకువచ్చి త్రిపుల్ తలాఖ్ బిల్లుతో ముస్లిం మహిళల్లో మైండ్ సైట్ లో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ముస్లిం యువతలో కూడా కొంత మార్పు కనిపించిందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలనే భావనలో కమలానికి సపోర్ట్ చేశారనే చర్చ కూడా జరుగుతోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ ముస్లింలు ఎక్కువగా ఉండే దౌల్తాబాద్ లో బీజేపీకి గతంలో కంటే ఓట్లు భారీగా పెరిగాయి.   హైదరాబాద్ పాతబస్తీ ప్రజల్లోనూ ఇప్పుడు చాలా మార్పు వచ్చిందంటున్నారు. అభివృద్ధి, తమ సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నేతలనే ఎన్నుకోవాలనే ఆలోచనకు ఓటర్లు వచ్చారని చెబుతున్నారు.ఈ పరిస్థితిని గమనించడం వల్లే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అప్రమత్తమయ్యారని, కొన్నిరోజులుగా పాతబస్తిలో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు. వరదల సమయంలో బయటికి రాని ఎంఐఎం నేతలు.. నిరసనలు జరుగుతుండటంతో సాయం వేగవంతం చేశారని చెబుతున్నారు. ఒవైసీ బ్రదర్సే స్యయంగా బాధితులకు చెక్కులు ఇస్తున్నారంటే ఆ పార్టీ ఎంత ఆందోళనగా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓల్డ్ సిటి పరిణామాలకు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ కొంత కష్టపడితే పాతబస్తిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఓల్డ్ సిటీ షేర్ గా చెప్పుకునే పతంగి పార్టీకి కలవరపడే పరిణామాలు జరగడం సంచలనమే.

డిసెంబర్ 1న గ్రేటర్ పోలింగ్. రేపటి నుంచే నామినేషన్లు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నగరా మోగింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషనర్ పార్థసారథి విడుదల చేశారు. బుధవారం నుంచే జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమం కానుంది. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లకు గడువు. ఈ నెల 21న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 తుది గడువు. డిసెంబర్ 1న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబరు 4న ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రేటర్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు.   జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి బ్యాలెట్‌ పద్ధతిలోనే జరగనున్నాయి. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని, 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని పార్థసారథి తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ‌ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులని వివరించారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసినట్లు చెప్పారు ఎస్ఆసీ పార్థసారథి   జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 74,04,000 మందికి పైగా ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 38 లక్షల 56 వేల 770 మంది కాగా.. మహిళలు 35 లక్షల 46 వేల 847 మంది. ఇతరులు 669. గ్రేటర్ లో మొత్తం పోలింగ్ కేంద్రాలు 9248 .గ్రేటర్ లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈ ఓటింగ్ కు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పార్థసారథి తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికాగ్నసేశన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. . మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 79,290 మంది, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,997 మంది ఓటర్లు ఉన్నారు.

జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు మరో షాక్.. విశాఖ ఫ్యూజన్ ఫుడ్స్ పై స్టేటస్ కో

ఏపీలో జగన్ సర్కార్ కు ఏపి హైకోర్టు మరో షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా విశాఖలోని వీఎంఆర్‌డీఏ స్థలంలో హోటల్ నిర్వహిస్తున్నారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌ను అధికారులు సెలవు రోజైన ఆదివారం నాడు బలవంతంగా ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హోటల్ నిర్వహకులు హైకోర్టును ఆశ్రయించగా ఈ​ విషయంలో (స్టేటస్ కో) యధాతధస్థితి పాటించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.   లీజు గడువు పూర్తికాకముందే తమ హోటల్​ విషయంలో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఫ్యూజన్​ ఫుడ్స్​ హోటల్ యజమాని హర్షవర్ధన్​ ప్రసాద్​ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా హడావుడిగా హోటల్​ను ఖాలీ చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని...ఇది చట్ట విరుద్ధమని అయన తన పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ బి.కృష్ణ మోహన్​ విచారణ జరిపి యధాతధ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసారు. అంతేకాకుండా తమ అనుమతి లేకుండా ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.