న్యాయం చేయలేకపోతే గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చో.. వైసిపి ఎమ్మెల్యే పై ఘాటు వ్యాఖ్యలు 

నంద్యాల అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో బాధితులకు న్యాయం చేయడం చేతకాకపోతే చీర, గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని ఉద్దేశించి ఎంఐఎం పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్‌ జునైద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని 16 రోజులవుతున్నా ఈ కేసులో ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేకపోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. అబ్దుల్‌ సలాం అత్త మాబున్నీసాను పరామర్శించేందుకు ఎంఐఎం నాయకులు బుధవారం నంద్యాలకు వచ్చారు. ఆమెను పరామర్శించిన తరువాత ఎంఐఎం నాయకులు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి చీర, గాజులు అందించేందుకు వెళ్తుండగా స్థానిక బొమ్మలసత్రం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడినుండి అబ్దుల్‌ సలాం న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం సర్కిల్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించి దీక్షలకు మద్దతు తెలిపారు.

ఏపీలో ముందే ఎన్నికలు! పార్టీ కేడర్ ను అప్రమత్తం చేసిన పవన్ 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి గడువు కంటే ముందుగానే ఎన్నికలు వస్తాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మోడీ సర్కార్ చేస్తున్న కసరత్తు ఫలిస్తే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. అదే జరిగితే ఏపీలో గడువు కంటే దాదాపు రెండేడ్ల ముందే అసెంబ్లీ పోల్ జరిగే ఉంది. అయితే జమిలి ఎన్నికలు రాకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఖాయమని మరికొందరు చెబుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. 2024 కంటే ముందే వచ్చే ఏపీలో ఎన్నికలు వచ్చే  అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటి నుంచే అందుకు సిద్ధం కావాలని జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో జనసేనాని ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు.   ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం నిలబడాలన్నఉద్దేశంతోనే పార్టీని పెట్టినట్టు చెప్పారు పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో జన బలాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమైనట్టు తెలిపారు. భవిష్యత్తులో అధికారాన్ని అందుకోవాలంటే క్రియాశీలక సభ్యత్వం చాలా అవసరమని, ప్రతి సభ్యుడు కనీసం 50 మందిని ప్రభావితం చేయాలని పార్టీ కేడర్ కు సూచించారు. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతోందని, ఒక్క జనసేన సైనికులు మాత్రమే బెదిరింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతున్నారని పవన్ కల్యాణ్ వివరించారు. మరో రెండు వారాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి ఏపీ ప్రభుత్వ మద్యం, ఇసుక విధానాలతోపాటు ఇతర సమస్యలపై చర్చిస్తామని పవన్ వివరించారు.    మరోవైపు జనసేన మద్దతుదారులమంటూ కొందరు చిన్నచిన్నవేదికలు ఏర్పాటు చేసుకుని సొంత అజెండాతో వస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించవద్దని ప్రజలను పవన్ కల్యాణ్ కోరారు. ఎవరైనా సరే జనసేన స్రవంతి ద్వారానే రావాలని అన్నారు. పార్టీ నచ్చకపోతే సరైన కారణాలు తెలియజేయాలి తప్పితే ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తామంటే కుదరదని అన్నారు. వందమంది వెళ్లిపోతే వెయ్యి మందిని తీసుకొస్తామని పవన్ స్పష్టం చేశారు.  జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని గ్రామ వలంటీర్ల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని, అయినా ఒత్తిళ్లకు తట్టుకుని పవన్ కల్యాణ్‌పై నమ్మకంతో పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

అక్కడ ఊరందరికీ కరోనా.. కానీ ఒకే ఒక్కడు క్వారంటైన్ లో..

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొన్ని రోజుల క్రితం వైరస్ వ్యాప్తి కొంత తగ్గినట్టుగా కనిపించినా మళ్ళీ శీతాకాలం మంచు కారణంగా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా సోకిన వారు వీలయితే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తెస్కుకుంటున్నారు లేదంటే హాస్పిటల్ లో జాయిన్ అవుతున్నారు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని జన్‌జాతీయ జిల్లా లాహౌల్-స్పీతి లోని థొరాంగ్ గ్రామంలో భూషన్ ఠాకుర్ అనే ఒక వ్యక్తికి మినహా మిగిలిన 42 మందికి కరోనా సోకింది. అయితే భూషన్ కుటుంబంలో కూడా అతను మినహా అతని భార్యతో పాటు కుటుంబంలోని ఆరుగురికి కూడా కరోనా సోకింది. దీంతో గ్రామం మొత్తంలో కరోనా సోకని వ్యక్తిగా భూషన్ ఠాకుర్ ఒక్కరే నిలిచారు. కరోనా సోకకుండా ఉండేందుకు తాను తగిన జాగ్రత్తలు తీసుకున్నందునే వ్యాధి బారిన పడలేదని అయన తెలిపారు. ఈ విషయం పై లాహౌల్- స్పీతికి చెందిన డాక్టర్ పల్జోర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన భూషన్ లో రోగ నిరోధక శక్తి సమర్థవంతంగా పనిచేస్తున్నదన్నారు.   మొత్తం గ్రామంలోని అందరికీ కరోనా పాజిటివ్ వచ్చినా, భూషన్‌కు మాత్రం నెగిటివ్ రావడం చాల మందికి విచిత్రంగా అనిపించిందన్నారు. మొదట్లో గ్రామానికి చెందిన ఐదుగురు కరోనా పాజిటివ్ ‌గా తేలారని, దీంతో గ్రామంలోని వారంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకున్నారన్నారు. ఈ గ్రామంలో మొత్తం జనాభా 100 మంది కాగా.. ప్రస్తుతం అక్కడ మంచు కురుస్తున్న కారణంగా కొంతమంది కూలూ ప్రాంతానికి తరలి వెళ్లిపోయారని అన్నారు. ఇది ఇలా ఉండగా కరోనా సోకని భూషన్ తన ఇంటిలోని వారికి దూరంగా ఒక గదిలో ఒక్కడే ఉంటూ.. స్వయంగా వంట వండుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు భూషన్ కూడా కరోనా టెస్టు చేయించుకోగా.. అతనికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కరోనాను ఎంత మాత్రం తేలికగా తీసుకోవద్దని, మాస్క్ ధరించడంతో పాటు శానిటైజ్ చేసుకోవడం మరచిపోకూడదని ఈ సందర్భంగా భూషన్ స్పష్టం చేస్తున్నాడు.

పాపం విద్యాశాఖా మంత్రి గారు.. జనగణమన కూడా రాదు..

మన జాతీయ గీతం పాడమంటే చిన్న పిల్లవాడిని అడిగినా గడగడా పాడేస్తాడు. కానీ ఆ రాష్ర విద్యాశాఖా మంత్రి మాత్రం జాతీయ గీతాన్ని ఖూనీ చేసి పారేసారు. బీహార్ లో కొద్దీ రోజుల క్రితం ఎన్నికలు పూర్తయి మళ్ళీ నితీష్ కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెల్సిందే. తాజాగా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న అక్కడి విద్యాశాఖా మంత్రి జాతీయ గీతం పాడే విషయంలో అడ్డంగా బుక్కయి ఇపుడు హాట్ టాపిక్ గా మారారు.   బీహార్ లో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవాలాల్ ఛౌదరి ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం లో భాగంగా జాతీయ గీతాలపన చేస్తూ తప్పులో కాలేశారు. జనగణమన పాడడం రాక.. తన నోటికొచ్చింది పాడుతూ.. అయన నవ్వుల పాలయ్యారు. అయితే ఈ వీడియోను ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌ అయింది. అంతేకాకుండా "ఎన్నో అవినీతి కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ విద్యాశాఖమంత్రి మేవాలాల్ చౌదరికి జాతీయ గీతం పాడడం కూడా రాదు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకైమైనా ఉందా? నితీష్‌జీ మీ అంతరాత్మ ఎక్కడ మునిగిపోయింది.'' అంటూ వీడియోతో పాటు ట్వీట్ చేసింది ఆర్జేడీ. ఆ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు మాత్రం.. నిజంగా ఇది సిగ్గుచేటని.. ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి జాతీయ గీతం పాడడం రాదా.. ? అని మండిపడుతున్నారు.   ఇది ఇలా ఉండగా, మంత్రి మేవాలాల్ చౌదరిపై ఇప్పటికే పలు అవినీతి కేసులున్నాయి. గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీల్లో లెక్చరర్ల నియమకాల్లో అక్రమాలు జరిగాయని.. అందులో కోట్ల రూపాయలు చేతులు మారాయని మేవాలాల్‌పై ఆరోపణలున్నాయి. అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గతంలో మంత్రి పదవి నుంచి కూడా తప్పించారు. ఐతే తాజాగా ఏర్పాటైన బీహార్ కొత్త ప్రభుత్వంలో మేవాలాల్‌కు మళ్లీ కీలకమైన విద్యాశాఖా మంత్రి పదవి ఇవ్వడంపై తాజాగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రేటర్ టికెట్ల కోసం పోటీ! టీటీడీపీలో జోష్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన టీటీడీపీ నేతలు బలమైన అభ్యర్థులును రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే టికెట్లు కావాలంటూ వారికి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో టీటీడీపీ నేతలు అశ్చర్యపోతున్నారట. గ్రేటర్ లో పోటీ చేయాలని భావిస్తున్న అశావహులతో ఎన్టీఆర్ భవన్ కళకళలాడుతుందని చెబుతున్నారు. నేతలు రాక ఇటీవల కాలంలో బోసిపోయినట్లు కనిపించిన ఎన్టీఆర్ భవన్ కు చాలా కాలం తర్వాత పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారని చెబుతున్నారు.   అభ్యర్థులు బలంగా ఉన్న ప్రతీ డివిజన్‌లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది టీటీడీపీ. అయితే వారికి ఊహించని రీతిలో స్పందన వస్తోందట. ఒక్కో డివిజన్‌కు రెండు నుంచి ఐదు వరకు దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు. టీటీడీపీ సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ టీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్ అశావాహులను వడపోస్తున్నారని తెలుస్తోంది. 80 మంది బలమైన అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధం చేశారని సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేసి సత్తా చాటాలని కంభంపాటి టీటీడీపీ నేతలను సూచించారు. అభ్యర్థుల ఎంపిక కోసం తాను అన్ని డివిజన్లలో పర్యటించానని, మంచి స్పందన వచ్చిందని అరవింద్‌కుమార్ గౌడ్ తెలిపారు.

ముసలం మొదలైందా.. రాజీనామాలు చేయబోతున్నారా! ఆ లేఖే కొంప ముంచిందా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో ముసలం పుట్టబోతుందా? జగన్ విధానాలతో తమ కొంప మునుగుతుందని ఆ పార్టీ నేతలే భయపడుతున్నారా? కష్టాలు రాకముందే తప్పుకోవాలని డిసైడవుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో సంచలనం జరుగబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది.    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఎం వైఎస్ జగన్ లేఖ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దేశంలోని న్యాయ నిపుణులు, న్యాయవాదులు జగన్ లేఖపై తీవ్రంగా స్పందిస్తున్నారు. జగన్ పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. జగన్ లేఖలకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. జగన్ రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేస్తుందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి.   సీజేఐకి జగన్ లేఖ రాసిన తర్వాత వైసీపీ నేతల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ ఏదో చేస్తుందన్న భయం అధికార పార్టీ నేతలను వెంటాడుతుందని చెబుతున్నారు. జగన్ లేఖ తర్వాత జరుగుతున్న పరిణామాలపై వైసీపీలోని చాలా మందిలో ఒక రకమైన ఆందోళన పెరిగిందంటున్నారు. జగన్ రాజకీయంగా ప్రస్తుతం తనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకుని తప్పులు చేస్తున్నారు అనే భావన చాలా మంది అధికార పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. ఇదేరకమైన అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.    ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మీడియా ముందు లెక్చర్లు దంచే వైసీపీ నేతలు కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. కోర్టులపై, న్యాయమూర్తుల పై రెచ్చిపోయి మాట్లాడే నాయకులు ఇప్పుడు కనిపించటం లేదు. చాలా మందిలో కేసుల్లో ఇరుక్కుంటాం అనే ఆందోళన ఉందని..అందుకే మీడియాతో మాట్లాడేందుకు జంకుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారులు కూడా మీడియా ముందుకు రావడానికి గాని, సలహాలు ఇవ్వడానికి గాని ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు అయితే అమరావతి రాక రెండు నెలలు అయిందట. అంతే కాదు చాలా మంది సలహాదారులు  మంత్రులతోనే మాట్లాడటం లేదని సమాచారం. ఇక ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్ష వార్తలు వడ్డించే జర్నలిస్ట్ లు కూడా కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.    సీజేఐకి జగన్ రాసిన లేఖను ఏ వర్గం మీడియా అయితే హైలెట్ చేసిందో ఆ మీడియా కూడా యూ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరి నుంచో  సూచనలు రావడం వల్లే అందరూ  సైలెంట్ అయ్యారని భావిస్తున్నారు. ఆరుగురు సలహాదారులు రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారనే అంతర్గత సమాచారం. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వంలో సంచలనమే. న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక రాజ్యసభ ఎంపీ చుట్టూ కొన్ని పరిణామాలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో.. సదరు ఎంపీ రాష్ట్రానికి కూడా రావడం లేదని తెలుస్తోంది.    గత కొన్ని రోజులుగా రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు చేస్తున్న వ్యాఖ్యలతో అధికార పార్టీ నాయకుల్లో అలజడి మొదలైందని చెబుతున్నారు. అన్నీ బాగుంటే తరువాత చూసుకోవచ్చు, కొన్ని రోజులు సైలెంట్ అయితేనే మంచిదని వారు భావిస్తున్నారట. అందుకే ఎప్పుడూ హడావుడి చేసే నేతలు కూడా ఏం మాట్లాడటం లేదని, అమరావతి రావడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు. మొత్తంగా జగన్ రాసిన లేఖతో ఆయన ఇబ్బందుల్లో పడటంతో పాటు నేతలందరిని ఇరికించేలా ఉన్నారనే చర్చ వైసీపీ నేతల్లోనే అంతర్గతంగా జరుగుతుందని తెలుస్తోంది. పార్టీలో రాజీనామాల పర్వం మొదలైతే మాత్రం అది ఆగకుండా ఉండే అవకాశం ఉందని కొందరు అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు.

భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తావా? కేసీఆర్ కు సంజయ్ సవాల్

గ్రేటర్ హైదరాబాద్ లో ఆగిన వరద సాయం పంపిణిపై రాజకీయ మంటలు రేగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీనే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని అన్నారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయాన్ని బీజేపీ ఆపిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తావా? అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్.    వరద సాయం కోసం క్యూలో నిల్చున్న మహిళ చనిపోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని బండి సంజయ్ అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాదులో సమావేశం నిర్వహిస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ స్పందిస్తూ... గతంలో కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో జనాలంతా చూశారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తొత్తులా మారిందని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో ఎన్నికల సాయాన్ని నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వరద బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

వరద సాయం నిలుపుదలతో మండిపడుతున్న హైదరాబాదీలు

హైదరాబాద్ లో వరద సాయానికి బ్రేక్ పడింది. దీంతో అటు మీసేవ దగ్గర పడిగాపులు పడుతున్న జనంతో పాటు.. ఇటు టోకెన్ తీసుకుని రాబోయే రెండు రోజులలో అప్లై చేయడానికి సిద్దమవుతున్న వారిలో కుడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో బాధితులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. పలు చోట్ల మీ సేవా కేంద్రాల వద్ద తోపులాటలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇలా హైదరాబాద్ మహా నగరంలో పలుచోట్ల వరద బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.   అయితే జీహీచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో వరద సాయం కొనసాగించవచ్చని పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా వరదసాయం నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వరదసాయం పంపిణీకి హఠాత్తుగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వరద సాయం పొందేందుకు మీ సేవా కేంద్రాల వద్ద నగర ప్రజలు వందల కొద్ది బారులు తీరారు. అయితే ఉన్నట్టుండి వరదసాయం నిలిపివేసినట్లు వార్తలు రావడంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో రోడ్డుపై మహిళలు బైఠాయించారు. అలాగే రాంనగర్‌లో సిటీ బస్సులను వరద బాధితులు నిలిపివేశారు. ఇక మరికొన్ని చోట్ల మీ- సేవా సెంటర్లను మూసివేసినా కూడా ప్రజలు కదలకుండా అక్కడే నిరసనకు దిగారు. ఇక వనస్థలిపురంలో తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.   రాష్ట్ర ప్ర‌భుత్వం సహాయం చేస్తామ‌ని చెప్తేనే మూడు రోజులుగా తిండి కూడా లేకుండా ఎండ‌లోనే క్యూలైన్లో ఉన్నామ‌ని ప్రజలు క‌న్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న చేసే స‌మ‌యంలోనూ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అప్లై చేసుకోవ‌చ్చ‌ని చెప్పిందని, అయితే ఇప్పుడిలా మాట మార్చేస్తే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లే వ‌ర‌ద‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యాం.. తినేందుకు స‌రుకులు కూడా లేని ప‌రిస్థితిలో స‌ర్కార్ సాయం చేస్తామ‌న‌టంతో న‌మ్మి లైన్లో నిల‌బ‌డ్డామ‌ని, ఇప్పుడు తీరా సాయం అందే స‌మ‌యానికి ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు ఆగాల‌నడం స‌రైంది కాదంటున్నారు. మరి కొంతమందైతే మూడు రోజులుగా లైన్లో ఉంటే గురువారానికి టోకెన్ వ‌చ్చింద‌ని, ఇప్పుడు కాదు పోమ్మంటే మా నాలుగు రోజుల కష్టం బూడిద‌లో పోసిన‌ట్లు అవుతుంద‌ని స‌ర్కార్ తీరుపై మండిప‌డుతున్నారు.

బీజేపీ దుర్మార్గ పార్టీ! యుద్ధం ప్రకటించిన కేసీఆర్ 

బీజేపీపై హైదరాబాద్ నుంచే యుద్ధం ప్రకటిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలతో టీఆర్‌ఎస్ భవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. బీజేపీపై తెలంగాణ భవన్ వేదికగానే సీఎం కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. డిసెంబర్‌ రెండో మాసంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాద్‌లోనే సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశానికి సీఎం మమతా బెనర్జీ, మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్ యాదవ్, మాయావతితో పాటు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు.    గ్రేటర్ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు కేసీఆర్. ఎవరికి ఏ డివిజన్‌లో బాధ్యతలు అప్పగిస్తే.. ఆ డివిజన్‌లో ఆయా బాధ్యులు గట్టిగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వంపై, పార్టీపై బీజేపీ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్‌ను అసలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎల్‌ఐసీ, రైల్వే లాంటి సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులను కలుపుకొని వెళ్లాలని నేతలకు మార్గనిర్దేశనం చేశారు. జీహెచ్‌ఎంసీ సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, 110 డివిజన్ లో టీఆర్‌ఎస్‌దే గెలుపని ఆ సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.    గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయం నిలిపివేతపై  సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. వరద సాయం ఆపేయించింది బీజేపీనే అని మండి పడ్డారు. ఈసీకీ బీజేపీ ఫిర్యాదు చేయడం వల్లే సాయం ఆగిపోయిందని అన్నారు. వరద సాయం కోసం ఇప్పటికే రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఇంకా ఇప్పటికి వేల మందికి వరద సాయం అందాల్సి ఉందని వెల్లడించారు.   పార్టీ నేతలతో జరిగిన సమావేశంలోనే  పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు కేసీఆర్. 16 పేజీలతో కూడిన మేనిఫెస్టో ఆయన విడుదల చేశారు. 19 వందల కోట్ల రూపాయలతో మరో 280 కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైప్‌లైన్ వేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం, జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని గ్రంథాలయాల ఆధునీకరణకు హామీ ఇచ్చారు.    హైదరాబాద్‌లో ఆధునిక స్టేడియాలు, క్రీడా వసతుల ఏర్పాటుచేస్తామని తెలిపారు. రూ.130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది టీఆర్ఎస్. త్వరలో నగరమంతా ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. మూసీ పునరుద్దరణ, సుందరీకరణ.. హుస్సెన్‌సాగర్ శుద్ధికి ప్రణాళికలు అమలు చేస్తామని అధికార పార్టీ గ్రేటర్ ప్రజలకు హామీ ఇచ్చింది.

బీజేపీలోకి 10 మంది టీఆర్ఎస్ నేతలు! 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నామినేషన్లు ప్రారంభమయ్యాయి. నామినేషన్లతో పాటు నేతల జంపింగులు జోరందుకున్నాయి. తమ కేడర్ ను కాపాడుకుంటూనే ఇతర పార్టీల్లోకి బలమైన నేతలకు గాలం వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. మాజీ కార్పొరేటర్లు, టికెట్ ఆశిస్తున్న నాయకులతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్ లు సైతం వలస బాట పట్టారు. అయితే అన్ని పార్టీల కంటే బీజేపీలోకి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి  చెందిన పలువురు నేతలు కమలం తీర్థం పుచ్చుకున్నారు. గ్రేటర్ పై ఫోకస్ చేసిన బీజేపీ ముఖ్య నేతలు.. చేరికలపైనే ఎక్కువ దృష్టి సారించారని చెబుతున్నారు.    వలసలపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 10 మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ పది మంది నేతలు తనతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు సోయం బాపూరావు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయన్నారు.  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారశైలి పట్ల టీఆర్ఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి కూడా టీఆర్ఎస్ భయపడుతోందన్నారు సోయం. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత... బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాలను గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. భయంతోనే అధికార పార్టీ రాయితీలు ప్రకటిస్తోందని సోయం బాపురావు విమర్శించారు. అయితే బీజేపీలో చేరబోతున్న 10 మంది టీఆర్ఎస్ నేతలు ఎవరో మాత్రం బీజేపీ ఎంపీ వెల్లడించలేదు.

ఫిబ్రవరిలోనే స్థానిక సమరం! జగన్ సర్కార్ పై నిమ్మగడ్డదే విజయం?

జగన్ ప్రభుత్వంతో జరుగుతున్న పోరాటంలో ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమారే గెలవబోతున్నారా? సర్కార్ ఎన్ని అడ్డంకులు వేయాలని చూసినా ఆయన హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయంటున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికలు జరగడం ఖాయమని విశ్లేషకులు కూడా తేల్చి చెబుతున్నారు. ఎన్నికల విషయంలో నిమ్మగడ్డను నిలువరించడం జగన్ సర్కార్ కు సాధ్యం కాదని న్యాయ నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు.   అంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చ్ 31 తో పదవీ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఈలోగానే ఆయన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపి తీరతారని చాలామంది అంచనా వేశారు. ఆయన నిర్వహించే పదవికి, పదవి బాధ్యతల నుంచి వైదొలగేలోగా ఆయన చేపట్టనున్న ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కూడా రాజ్యాంగ రక్షణ ఉండడం ఆయనకు కలిసి వస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణలో ఎన్నికైన ప్రభుత్వంపై ఆయనదే పై చేయి అవుతుందని చెబుతున్నారు. అందరూ అనుకుంటున్నట్లే స్థానిక ఎన్నికల కసరత్తు ప్రారంభించారు నిమ్మగడ్డ. రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ముహుర్తం కూడా పెట్టేశారు ఎస్ఈసీ. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగంతోనూ సమీక్షలకు సిద్ధమవుతున్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.    నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికలు జరగకుండా చూడడానికి జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఆయనపై చేసిన న్యాయ పోరాటం వీగిపోయింది. నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు అయ్యేలా జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు చెల్లకుండా పోయింది. నిమ్మగడ్డ స్థానంలో నియమితమైన జస్టిస్ కనగరాజ్ నియామకం చెల్లలేదు. రమేష్ కుమార్  పదవిలో ఉండగా ఎన్నికల నిర్వహణను నిలువరించడానికి వైసీపీ సర్కార్  చేసిన కసరత్తు ఏదీ అక్కరకు రాలేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పట్ల కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు  ఫిబ్రవరి లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. స్థానిక ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకులు ఏమీ లేవని కూడా స్పష్టం చేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.    నిమ్మగడ్డ తాజా ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చింది. ఫిబ్రవరి లో ఎన్నికలు ఖాయమని తేలిపోయింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు నాలుగు వారాల ముందే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని కూడా రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడం అంటే  మొత్తం ప్రభుత్వ  అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ నియంత్రణలోకి వెళ్లిపోవడమే. అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాష్ట్ర డీజీపీ వరకు మొత్తం యంత్రాగమంతా ఎన్నికల కమిషన్ కనుసన్నలలో పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే రాజ్యాంగం ఊరుకోదు. గతంలో ప్రారంభించిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాలేదని, వాయిదా మాత్రమే పడిందని సుప్రీంకోర్టు లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదించినందున గతంలో జరిగిన ఏకగ్రీవాలు రద్దు కాక పోవచ్చు.    ఏకగ్రీవ స్థానాలు వదిలేసి మిగిలిన స్థానాలకు ఎన్నికలను నిర్వహించే విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటో చూపించే అవకాశం నిమ్మగడ్డకు ఉందని కొందరు పరిశీలకులు అంటున్నారు.అంటే కలెక్టర్, ఎస్పీ లతో సహా ఎవరిని బదిలీ చేయమంటే వారిని చేయాల్సివుంటుంది. ఎవరిని సస్పెండ్ చేయమంటే వారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరి మీద కేసు నమోదు చేయమంటే వారి మీద కేసు నమోదు చేయాలి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్న ఎన్నికల కమిషన్ మధ్య ఘర్షణ అనేది లేకుండా విధుల నిర్వహణ బాధ్యత ఈ రెండు వ్యవస్థల మీద ఉందని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు.    మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికల విషయం పై గవర్నర్ తో సమావేశమైన నిమ్మగడ్డ.. తాను పలు రాజకీయ పార్టీలతో చర్చించిన సమావేశ వివరాలను ఆయన వివరించారు. హైకోర్టు ఆదేశాలను సీఎస్ నీలం సహానీ ఉల్లంఘిస్తున్నారని ఒక లేఖ ద్వారా అధికారికంగా నిమ్మగడ్డ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఒకపక్క పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా రాష్ట్రంలో మాత్రం కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకొనేందుకు  ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది.  స్వయం ప్రతిపత్తి గల ఎస్ఈసీ సంస్థను చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తోందని కూడా గవర్నర్ కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారని సమాచారం. నిమ్మగడ్డ సమర్పించిన లేఖపై గవర్నర్ స్పందించకపోయినా లేక ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించకపోయినా అయన మరోసారి హైకోర్టుకెళ్లే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించకపోతే  ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

ప్రాణం తీసిన వరద సాయం! ఓట్ల కోసమేనా ఈ పాపం ? 

గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం ఓ ప్రాణం తీసింది. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం గంటల పాటు నిల్చోవడంతో ఓ మహిళ చనిపోయింది. ఈ ఘటన గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ-సేవ కేంద్రం వద్ద జరిగింది. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం మీసేవా కేంద్రంలో అప్లయ్ చేసుకోవడానికి 50 ఏళ్ల మున్నవర్ ఉనిస అనే మహిళ వచ్చింది. సుమారు 3 గంటల పాటు ఆమె లైన్‌‌లో నిలబడింది. మండుటెండల్లో నిలబడిన ఆమె ఒక్కసారిగా క్యూలైన్ లోనే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మున్నవర్‌‌ను పరిశీలించిన డాక్టర్లు ఆమె చనిపోయిందని తెలిపారు. మృతురాలిని హకీంపేట్ కుంట వాసిగా పోలీసులు నిర్థారించారు.   ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు హైదరాబాద్ వరద బాధితులు, తెల్లవారక ముందే మీ సేవ సెంటర్ల ముందు క్యూ కడుతున్నారు బాధితులు. దరఖాస్తులు పట్టుకొని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మహిళలతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు కూడా గంటలకొద్దీ లైన్లలో నిలబడుతున్నారు. గరంలోని అన్ని మీ-సేవ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర క్యూలైన్లే కనిపిస్తున్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో జనం గుమిగూడటంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. లైన్లలో కొందరు సొమ్ముసిల్లి పడిపోతున్నారు. జనాలను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.    కొన్ని ఏరియాల్లో సర్వర్ ప్రాబ్లమ్ జనాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. దీంతో గంటల తరబడి మీ సేవ సెంటర్ల దగ్గరే ఉండాల్సి వస్తోంది. సర్వర్ ప్రాబ్లమ్ తో కిలీమీటర్ల మేర క్యూలైన్లు పెరిగి భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. కిలోమీటర్ల  మేర జనాలు బారులు తీరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గుంపుగుంపులుగా జనాలు నిలబడి ఉంటుండటంతో కరోనా విస్తరించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉన్న ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరద బాధితులు. క్యూ లైన్లో ఎవరికైనా కరోనా ఉంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. కరోనా టైంలో డబ్బులు ఎకౌంట్లో వేసినట్లు బాధితులకు కూడా డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.   ఓట్ల కోసమే గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం వరద సాయం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మండుటెండల్లో పసిపిల్లలతో మహిళలు అవస్థలు పడుతున్నారని, వద్దులు క్యూలైన్లలో నిల్చుని నరకయాతన పడుతున్నారని మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య వచ్చిందంటున్నారు. ఇక వరంగల్ లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా వరద బాధితులు ఆందోళన చేస్తున్నారు. వరంగల్ లో ఎలక్షన్లు లేకపోవడం వల్లే ఇక్కడ ఇళ్లు మునిగిన వాళ్లకు పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు అక్కడి ఓరు గల్లు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ తరహాలో వరంగల్ వరద బాధితులకు ఇంటికి 10 వేల రూపాయల సాయం చేయాలని కేయు క్రాస్ వద్ద బిజెపి ఆందోళన చేసింది.

చిరిగిన బట్టలతోనే ఉద్యమం చేయాలా? అమరావతికే తన మద్దతన్న పవన్

అమరావతి ఉద్యమాన్ని ఓ సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరావతి ఉద్యమకారులపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, బంగారం నగలు ధరించి ఉద్యమం చేయకూడదా? అని జనసేనాని నిలదీశారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే చేయాలా? అని ప్రశ్నించారు. రాజధానిని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని పవన్ కల్యాణ్ విమర్శించారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.    అమరావతి పరిరక్షణ సమితి నేతలతో మరోసారి సమావేశమయ్యారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని తనకు బీజేపీ స్పష్టం చేసిందని చెప్పారు. అలాగే రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్పలేదన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తే తమ పార్టీ కార్యాచరణ వెల్లడిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

టికెట్ రాకుంటే జంపే! గులాబీకి రెబెల్స్ గండం

దుబ్బాకలో ఓటమితో షాకైన అధికార టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అత్యంత సీరియస్ గా తీసుకుంది. గ్రేటర్ లో దెబ్బ పడితే పార్టీ భవిష్యత్ పై ప్రభావం ఉంటుందని భావిస్తున్న గులాబీ నేతలు.. బల్దియాలో గెలుపు కోసం పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే విపక్షాలకు ఎక్కువ సమయం దొరకకుండా ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. టీఆర్ఎస్ కు ప్రయోజనం కల్గేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలు ఆరోపణలు చేస్తున్నా ఎన్నికల ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్న అధికార పార్టీ..  దుబ్బాక విజయంతో దూకుడు మీద ఉన్న బీజేపీలోకి వలసలకు వీల్లేకుండా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తమ పార్టీలోని అసంతృప్తులను కూడా కాపాడుకునేలా ఎత్తులు వేసిందని చెబుతున్నారు. అందులో భాగంగానే అభ్యర్ధుల జాబితా సిద్ధమైనా ప్రకటించడం లేదని తెలుస్తోంది.   గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి 25 నుంచి 30 మంది వరకు కొత్తవారికి టికెట్లు ఇస్తారని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. పనితీరు సరిగా లేని, వివాదాలున్న 25 నుంచి 30 మంది సిట్టింగ్ లను తప్పిస్తారని తెలుస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, అంబర్ పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్,  కూకట్ పల్లి, సనత్ నగర్, గోషామహల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కొందరు సిట్టింగులకు మొండి చేయి చూపే అవకాశం కనిపిస్తున్నది. దీంతో టికెట్ దక్కని  సిట్టింగ్ కార్పొరేటర్లు,ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ నేతలు.. పార్టీ నుంచి ఎవరూ వలస పోకుండా చూస్తున్నారట. అందుకే జాబితా విడుదల ఆలస్యం అయిదంటున్నారు. వివాదం లేని చోట నామినేషన్లు వేసేందుకు రెడీగా ఉండాలని అభ్యర్థులకు ఫోన్ చేసి చెప్తున్నట్టు తెలిసింది. వివాదం లేని డివిజన్ల అభ్యర్థుల పేర్లను ముందుగా ప్రకటించి.. వివాదం ఉన్న చోట్ల నామినేషన్ల పరిశీలన రోజే బీ–ఫామ్ ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. దీంతో టికెట్ దక్కని సిట్టింగ్ కార్పొరేటర్లకు మరో అవకాశం ఉండదు కాబట్టి.. వారంతా పార్టీలోనే ఉండేలా గులాబీ పార్టీ ప్లాన్ చేసిందని చెబుతున్నారు.    జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. టికెట్ కోసం ఒక్కో డివిజన్​లో నలుగురి నుంచి 10 మంది వరకు పోటీ పడుతున్నారు. టికెట్ దక్కకపోతే వేరే పార్టీలో చేరాలని, అక్కడా టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేసి పార్టీ అభ్యర్థిని ఓడించాలని కొందరు కారు పార్టీ నేతలు పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో రెబల్స్ బెడద లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకోవాలని పార్టీ ఆదేశించినట్టు తెలిసింది. రెబల్స్ ను దారిలోకి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. ముందుగా బుజ్జగించాలని, లేకపోతే ఇతర పద్ధతుల్లో దారిలోకి తెచ్చుకునేందుకు వెనకాడొద్దని ఆలోచనగా ఉన్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఏంచేసైనా సరే గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రూపొందిస్తోంది అధికార పార్టీ.    బల్దియాలో టికెట్ల కేటాయింపు ప్రక్రియలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయమే ఫైనల్ గా కనిపిస్తోంది. చెప్పినవారికే టికెట్లు ఇచ్చి... వారిని గెలిపించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలపైనే వేసినట్లు తెలుస్తోంది. నిజానికి గ్రేటర్ లో చాలా రోజులుగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లుగా విడిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కార్పొరేటర్లు పట్టించుకోవడమే మానేశారు. ఇంకొన్ని డివిజన్లలో ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు తరచూ మంత్రి, ఎమ్మెల్యేలు రావడాన్ని కూడా కొందరు కార్పొరేటర్లు సహించలేకపోయారు. అయితే ఇంతకాలం ఎమ్మెల్యేలను ధిక్కరించిన కార్పొరేటర్లు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. టికెట్ల కేటాయింపులో పార్టీ అధిష్ఠానం వారిమాటే ఫైనల్ అని చెప్పడంతో వారంతా మరో అవకాశం కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని చెబుతున్నారు. 

గ్రేటర్ లో బీజేపీ, జనసేన, టీడీపీ ఒంటరి పోరు! ఎందుకోసం.. ఎవరికోసం? 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు మొదలయ్యాయి. 13 రోజుల్లోనే పోల్ వార్ ముగియనుండంటంతో మహానగరంలో రాజకీయాలు మహా రంజుగా జరుగుతున్నాయి. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. గ్రేటర్ లో ప్రస్తుతం జంపింగుల పర్వం జరుగుతోంది. టికెట్ల కోసం కొందరు, పార్టీలు ఇవ్వజూపుతున్న తాయిలాల కోసం ఇంకొందరు.. రాజకీయ భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనతో మరికొందరు వలస బాట పట్టారు. అయితే రాజకీయ నేతల మైండ్ సెటే కాదు పార్టీల ఎత్తుగడలు క్షణక్షణం మారిపోతున్నాయి.   బీజేపీకి జనసేన ప్రస్తుతం మిత్రపక్షంగా ఉంది. గ్రేటర్ సమరంలోనూ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు. గ్రేటర్ లో జనసేనకు కేడర్ ఉంది. ముఖ్యంగా సీమాంధ్ర ఓటర్లు ఎక్కువుండే ప్రాంతాల్లో జనసేన ప్రభావం బాగానే ఉంటుంది. పవన్ అభిమానులకు సిటీలో కొదవ లేదు. దీంతో బీజేపీ, జనసేన కలిస్తే కారు పార్టీకి కష్టమేనన్న ప్రచారం కూడా ఉంది. ఈ రెండు పార్టీలు టీడీపీని కూడా తమతో కలుపుకుని పోవచ్చన్న చర్చ జరిగింది. అయితే గ్రేటర్ నోటిఫికేషన్ వచ్చిన రోజే పోత్తుల్లో ట్విస్టులు జరిగాయి. బీజేపీ, జనసేన ఎవరికి వారే సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించాయి.    గ్రేటర్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని ముందుగా ప్రకటించారు పవన్ కల్యాణ్. తమకు పట్టున్న దాదాపు 50 డివిజన్లలో పోటీ చేస్తామని, అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రకటించడమే కాదు గ్రేటర్ ఎన్నికల కోసం హెల్ప్ డెస్క్ ను పార్టీ కార్యాలయంలో ప్రారంభించింది జనసేన.  పవన్  ప్రకటన తర్వాత స్పందించిన బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణకు వర్తించదని బాంబ్ పేల్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను నిలబెడతామని సంజయ్ స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉన్నబీజేపీ, జనసేన గ్రేటర్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తుండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.       తెలంగాణలో జనసేనతో బీజేపీకి పొత్తు లేదని సంజయ్ చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించగానే జనసేనానిని కలిశారు. చాలా సేపు మాట్లాడారు. పవన్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. జనసేనతో కలిసి ముందుకు పోతామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆయన స్వరం మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనకు ఆంధ్రా పార్టీగా ముద్ర ఉందని, గ్రేటర్ ఎన్నికల్లో అది తమకు నష్టం కల్గిస్తుందనే భయంతో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారని చెబుతున్నారు. రాష్ట్ర విభజనపై గతంలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను తెరపైకి తెచ్చి టీఆర్ఎస్ లబ్ది పొందే అవకాశం ఉందని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి ప్రజల్లో టీఆర్ఎస్ సెంటిమెంట్ రగిలించిందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారట. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు వద్దని తెలంగాణ బీజేపీ నేతలు డైసైడయ్యారని తెలుస్తోంది.    జనసేనకు బీజేపీ కటీఫ్ చెప్పడంపై మరికొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో తేడా జరిగిందని చెబుతున్నారు. తమకు 50 డివిజన్లు కావాలని జనసేన కోరిందని, అందుకు బీజేపీ అంగీకరించలేదని కొందరు కమలం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. దుబ్బాక ఫలితం తర్వాత ఇతర పార్టీ నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. దీంతో గ్రేటర్ టికెట్ల కోసం కమలం పార్టీలో పోటీ తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో 50 డివిజన్లు వదులుకుంటే చాలా మంది నేతలకు పోటీ చేసే అవకాశం రాకుండా పోతుందని, పార్టీలో ముసలం వచ్చే అవకాశం ఉందన్న భయంతోనే జనసేన పొత్తుకు బ్రేక్ వేశారని చెబుతున్నారు. వ్యూహాత్మంగానే రెండు పార్టీలు సొంతంగా పోటీ చేస్తున్నాయని మరికొందరు ప్రచారం చేస్తున్నారు.    టీడీపీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో తమకు పట్టున్న ప్రాంతాల్లో సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించింది. కలిసి పోటీ చేస్తాయని భావించిన మూడు పార్టీలు.. ఒంటరి పోరుకు దిగుతుండటంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆసక్తిగా మారబోతున్నాయి. అయితే అన్ని పార్టీలు పోటీలో ఉండటం వల్ల ప్రజా వ్యతిరేక ఓటు చీలి.. అంతిమంగా అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కేసీఆర్ కు ప్రయోజనం కలిగించేందుకే టీడీపీ, జనసేన సొంతంగా పోటీ చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

అళగిరికి బీజేపీ ఆహ్వానం! తమిళనాట కమల వ్యూహం

తమిళనాడులో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసిన బీజేపీ.. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రజనీకాంత్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసినా.. ఆరోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇక ఇప్పుడు డీఎంకే అధినేత స్టాలిన్ కుటుంబ సభ్యులకే గాలం వేస్తున్నారు కమలనాధులు. ఆరేళ్ల క్రితం డీఎంకే నుంచి డిస్మిస్ అయి, ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన కరుణానిధి కుమారుడు ఆళగిరిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు.    తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త పార్టీ పెట్టేందుకు అళగిరి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే సొంత పార్టీ కాకుండా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తే అళగిరిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ వ్యాఖ్యానించారు. కొత్త రాజకీయ పార్టీపై అళగిరి ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ రాజకీయ పార్టీని ప్రారంభించకుంటే మాత్రం బీజేపీకి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.          తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అళగిరిని ఆహ్వానిస్తూ చేసిన ప్రకటనపై చర్చ జరుగుతుండగానే.. ఈనెల 20న మద్దతుదారులతో జరపాల్సిన సమావేశాన్ని అళగిరి వాయిదా వేసుకోవడం మరింత ఆసక్తిగా మారింది. దీంతో అళగిరి జేపీలోకి వెళ్లవచ్చన్న ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో జరుగుతున్న ప్రచారం, బీజేపీ చీఫ్ కామెంట్లపై స్పందించిన అళగిరి మాత్రం తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మురుగన్ తన సొంత అభిప్రాయాన్ని చెప్పి వుండవచ్చని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై జనవరిలోగా నిర్ణయం తీసుకుంటానని, ఆపై దాన్ని బహిరంగంగానే చెబుతానని స్పష్టం చేశారు అళగిరి.    బీజేపీలో చేరబోనని అళగిరి చెప్పినా... కమలం నేతలు మాత్రం అళగిరిపై ఆశలు పెంచుకుంటున్నారని తెలుస్తోంది. స్టాలిన్ కన్నా అళగిరి రాజకీయ అనుభవం అధికంగా కలిగివున్న నేతని బీజేపీ కార్యదర్శి శ్రీనివాసన్ పొగడ్తల వర్షం కురిపించారు. అపర చాణక్యుని వంటి అళగిరి బీజేపీలో చేరితే, రాష్ట్రంలో బీజేపీదే అధికారమని అన్నారు. 21న చెన్నైకి రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ జిల్లా కార్యదర్శలను కలిసి మాట్లాడనున్నారని, ఆ తరువాత రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారిపోతాయని, బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు శ్రీనివాసన్.

ఏపీ సర్కార్ సహకరించడం లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్  

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయం పై ఈరోజు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుమారుగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో తాను పలు రాజకీయ పార్టీలతో చర్చించిన సమావేశ వివరాలను ఎస్ఈసీ రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదని అయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై పునరాలోచాన చేయాలనీ.. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధంగా లేదని.. అదే సమయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించవద్దని సీఎస్ నీలం సహానీ రాసిన లేఖను తీసుకు వెళ్లి ఎస్ఈసీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం సహకరించడం లేదని.. హైకోర్టు ఆదేశాలను సీఎస్ నీలం సహానీ ఉల్లంఘిస్తున్నారని ఒక లేఖ ద్వారా అధికారికంగా నిమ్మగడ్డ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఒకపక్క పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా రాష్ట్రంలో మాత్రం కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది. అంతేకాకుండా స్వయంప్రతిపత్తి గల ఎస్ఈసీ సంస్థను చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తోందని గవర్నర్ కు అయన ఫిర్యాదు చేశారని సమాచారం.   ఏపీలో కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని చెపుతున్న జగన్ ప్రభుత్వ వాదనపై.. నిమ్మగడ్డ తన వాదన‌ను కూడా వివరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని.. దానికి సంబంధించిన గణాంకాలను కూడా అయన వివరించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో కరోనా కారణంగా ప్రభుత్వం తన కార్యకలాపాలలో ఏ ఒక్కదాన్ని కూడా వాయిదా వేయలేదని.. ఇటు మద్యందుకాణాల దగ్గరనుండి అటు స్కూళ్ల వరకూ అన్నింటినీ ప్రారంభించారని .. మరో పక్క ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందన్న విషయాన్ని అయన గవర్నర్‌కు వివరించినట్లుగా సమాచారం.   తాజాగా నిమ్మగడ్డ సమర్పించిన లేఖపై గవర్నర్ స్పందించకపోయినా, లేక ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి.. సహకరించకపోయినా.. అయన మరోసారి హైకోర్టుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించకపోతే.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

సొంత గూటివైపు కీలక నేతలు! ఆ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లేనా?

తెలంగాణలో టీడీపీకి మంచి రోజులు రాబోతున్నాయా? గతంలో చక్రం తిప్పిన నేతలు తిరిగి సొంత గూటికి రాబోతున్నారా? సీఎం కేసీఆర్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు?. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. గతంలో తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీకి పునర్ వైభవం రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఓ వెలుగు వెలిగి.. ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలు టీడీపీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే టీటీడీపీకి మళ్లీ బలమైన శక్తిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.    ఖమ్మం జిల్లా నుంచే రాజకీయ పెను మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మాజీ మంత్రి , గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తిరిగి సొంత గూటికే వస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తన అనుచరులతో ఆయన చర్చలు కూడా జరుపుతున్నారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ ఫస్ట్ టర్మ్ లో మంత్రిగా పనిచేశారు తుమ్మల, అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలేరులో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఆయన సైలెంట్ గానే ఉన్నారు.    తుమ్మలపై గెలిచిన ఉపేందర్ రెడ్డి కూడా కొన్ని రోజుల తర్వాత కారు పార్టీలో చేరారు. ఉపేందర్ రెడ్డి చేరికతో నియోజకవర్గంలో తుమ్మల హవా పూర్తిగా తగ్గిందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, అధికార యంత్రాంగంమంతా ఉపేందర్ రెడ్జి డైరెక్షన్ లోకి వెళ్లిపోయాయి. పార్టీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన ప్రాధాన్యం తగ్గడంతో తుమ్మల మరింత సైలెంట్ అయిపోయారు. తుమ్మ‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డం ఇబ్బంది మారడంతో చాలా వ‌ర‌కు ఆయన ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. కొన్ని రోజులుగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదని తుమ్మల అనుచరులు చెబుతున్నారు.  టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న తుమ్మల పార్టీ మారుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ ముఖ్యనేతలు ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే తుమ్మల మాత్రం బీజేపీలోకి వెళ్లేకంటే టీడీపీలో చేరితే బెటరని భావిస్తున్నారనే చర్చ ఖమ్మం జిల్లాలో జరుగుతోంది. టీడీపీకి తెలంగాణలో బలమైన కేడర్ ఉందని.. సరైన లీడర్ వస్తే వారంతా యాక్టివ్ అవుతున్నారని తుమ్మల భావిస్తున్నారని చెబుతున్నారు. తుమ్మల టీటీడీపీ పగ్గాలు చేపడితే.. గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం ఇతర పార్టీల్లోనే ఉన్న నేతలంతా తిరిగి సొంత గూటికి వస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. గ‌తంలో తెలంగాణ టీడీపీలో ప‌నిచేసి..ఇప్పుడు రాజ‌కీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న నేత‌ల‌ను కూడ‌గ‌ట్టే బాధ్య‌త‌ను జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు మాజీమంత్రి తుమ్మ‌ల‌కు అప్ప‌గించ‌బోతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. గ‌తంలో తుమ్మ‌ల‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్రియారిటీని సైతం వారు గుర్తు చేస్తున్నారు.    తుమ్మల నాగేశ్వరరావు కదలికలను గమనిస్తున్న సీఎం కేసీఆర్.. ఆయన పార్టీ మారతారనే ప్రచారంతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇటీవల రైతు వేదిక ప్రారంభోత్సవం కోసం ఇద్దరు మంత్రులు తుమ్మల ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చిన మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డిలు.. తుమ్మల ఇంటికెళ్లారు. ఇద్దరు మంత్రులు దగ్గరుండి ఆయన్ను రైతు వేదిక ప్రారంభోత్సానికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే అజయ్, నిరంజన్ రెడ్డిలు తుమ్మల ఇంటికి వచ్చారనే చర్చ జరుగుతోంది. పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని తుమ్మలను కేసీఆర్ మంత్రుల ద్వారా బుజ్జగించినట్లు చెబుతున్నారు. ఇంతకాలం తుమ్మలను పట్టించుకోని కేసీఆర్.. ఆయన పార్టీ మారుతారనే ప్రచారంతో టెన్షన్ పడుతున్నారని సమాచారం. అందుకే ఇద్దరు మంత్రులను రాయబారానికి పంపారని చెబుతున్నారు.   సీఎం కేసీఆర్ ఇద్దరు మంత్రులను తుమ్మల ఇంటికే పంపారంటనే ఆయన పవర్ ఏంటో తెలుసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ బలపడితే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టే గులాబీ బాస్ గుబులు పడుతున్నారని వారు అంటున్నారు. తుమ్మల గనక టీడీపీలోకి వస్తే తెలంగాణ రాజకీయ సమీకరణలు భారీగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే తుమ్మ‌ల మాత్రం తనపై జరుగుతున్న ప్రచారంపై మౌనం వీడ‌టం లేదు. అయితే టీఆర్ఎస్ పార్టీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా ఆయ‌న దూరంగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి తుమ్మ‌ల ఎలాంటి రాజకీయ నిర్ణ‌యం తీసుకుంటారన్నదానిపై మాత్రం జనాల్లో ఆసక్తి పెరుగుతోంది.

రాజ్యాంగబద్ద వ్యవస్థలో కూర్చుని చిల్లర పనులు.. ఎస్‌ఈసీపై కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్ 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికోసం సన్నాహాలు చేసుకోవాలని అటు రాజకీయ పార్టీలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అయన సూచించారు. దీనిపై ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ.. ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం, అలాగే ప్రస్తుత కరోనా పరిస్థితుల గురించి అయన వివరంగా ప్రస్తావించారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు కూడా లేవని రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.   అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రకటనపై మంత్రులు, పలువురు వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా.. ఏపీ మంత్రి కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సిగ్గులేకుండా, చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటు. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరు. నిమ్మగడ్డకు అసలు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు. రాజ్యాంగబద్ద వ్యవస్థలో కూర్చున్న నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా, రిటైర్ అయ్యే లోపు హుందాగా వ్యవహరించాలి. ప్రస్తుతం ఉన్న కరోనా తీవ్రత దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది. వయసు వచ్చినా బుద్ధి, జ్ఞానం లేకుండా కోవిడ్ కేసులు తీవ్రంగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకం. రాష్ట్రంలో రెండు కరోనా కేసులు ఉన్నపుడు ఎన్నికలు జరపలేని ఈ చవట దద్దమ్మ రోజుకు 1500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నపుడు ఎన్నికలు నిర్వహిస్తాడట. ఏపీ ప్రజలను ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్, జూమ్ బాబులు ఇద్దరు కలిసి ఏపీ ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఒకవేళ ఈ విషయంలో అయన కోర్టుకు వెళితే మేము కూడా అక్కడే తేల్చుకోవడానికి రెడీగా ఉన్నాము" అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.