ఉత్తమ్ కు దుబ్బాక సెగ! పీసీసీకి కొత్త బాస్ వచ్చేస్తారా?
posted on Nov 11, 2020 @ 5:38PM
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రేపో మాపో కొత్త సారధిని హైకమాండ్ ప్రకటిస్తుందని చెబుతున్నారు కాని అది జరగడం లేదు. లోక్ సభ ఎన్నికల తర్వాత నుంచి ఇదే ప్రచారం జరుగుతోంది. నెలలు గడుస్తున్నాయి కాని టీకాంగ్రెస్ కు కొత్త బాస్ రాలేదు. రాష్ట్రానికి కొత్త ఇంచార్జ్ వచ్చారు కాని పీసీసీలో మాత్రం మార్పులు జరగలేదు. దుబ్బాక ఉప ఎన్నికతో మళ్లీ పీసీసీ అంశంపై కాంగ్రెస్ లో తెరపైకి వచ్చింది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలంటూ కార్యకర్తలే రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేయడం కాంగ్రెస్ లో కాక రేపుతోంది.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ కాంగ్రెస్ లో మంట పుట్టించింది. హోరాహోరీగా సాగిన దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వరంగల్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసనకు దిగారు. కాజీపేట మండలం మడికొండలో ఉత్తమ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. సోషల్ మీడియాలో పీసీసీని మార్చాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు కాంగ్రెస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు హోరాహోరిగా తలపడుతుంటే కాంగ్రెస్ మాత్రం చాలా వెనకబడి పోయింది. మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కేవలం 22 వేల ఓట్లు మాత్రమే సాధించాడు. మొత్తం 23 రౌండ్‌లు కౌటింగ్ జరగగా.. ఒక్క రౌండ్‌లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి లీడ్‌లోకి వచ్చారు. అది కూడా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలున్న ప్రాంతంలోనే. కాంగ్రెస్ ఘోర ఓటమితో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు
నిజానికి దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ఆ పార్టీ కీలక నేతలంతా రంగంలోకి దిగారు. దుబ్బాకలో 145 గ్రామాలుండగా.. గ్రామానికో కీలక నేతను ఇంచార్జీగా పెట్టారు. గతంలో ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ నేతలు ఇంతగా కష్టపడలేదని ఆ పార్టీ సీనియర్ నేతలే చెబుతున్నారు. ఈ స్థాయిలో ప్రచారం చేసినా కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కు పడిపోవడం కార్యకర్తల ఆగ్రహానికి కారణమవుతోంది. చివరివరకు టీఆర్‌ఎస్ టికెట్ కోసం యత్నించిన శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం సరికాదనే అభిప్రాయం కేడర్ నుంచి వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కూడా ఓటమికి కారణమనే చెబుతున్నారు. పీసీసీ నేత నిర్లక్ష్యం వల్లే కాంగ్రెస్ రోజురోజుకుబలహీనపడుతోందని కార్యకర్తలు ఓపెన్ గానే చెబుతున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
ఇటీవల మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. గ్రేటర్ వరద సాయంలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వాన్ని కడిగిపారేశారు రేవంత్ రెడ్డి. గ్రేటర్ వ్యాప్తంగా పర్యటించి బల్దియా అధికారులకు చుక్కలు చూపించారు. రేవంత్ రెడ్డి పోరాటాలతో ప్రస్తుతం గ్రేటర్ లో కాంగ్రెస్ బాగా పుంజుకుందని చెబుతున్నారు. అలాంటి డైనమిక్ లీడర్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పగ్గాలిస్తేనే కేసీఆర్ ను,టీఆర్ఎస్, తెలంగాణలో ఎదగాలని ఎత్తులు వేస్తున్న బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ సాధ్యమవుతుందని, లేదంటే ఏపీలానే తెలంగాణలోనూ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు అవేదన చెందుతున్నారని చెబుతున్నారు.