కేసీఆర్ అవినీతి సొమ్ము కక్కిస్తాం! వివేక్ సంచలన కామెంట్స్
దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జోష్ మీదున్న బీజేపీ.. టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. గత అరేండ్లలో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. కేంద్ర సంస్థలతో విచారణ జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ , యాదాద్రి పవర్ ప్లాంట్ సహా పలు ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికితీయాలని కేంద్ర సర్కార్ ను కోరాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. బీజేపీ సీనియర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇదే విషయాన్ని ప్రకటించారు. గత ఆరేండ్లుగా కేసీఆర్ చేసిన దోపిడిని అంతా కక్కిస్తామని వివేక్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ప్రత్యేకంగా జాతీయ మీడియా సమావేశం నిర్వహించిన వివేక్ .. తీవ్ర పదజాలంతో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి సోమ్ముతో కేసీఆర్ ఫ్యామిలి వేల కోట్ల రూపాయల సంపద కూడబెట్టిందని ఆరోపించారు వివేక్. 30 వేల కోట్ల రూపాయలతో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలకు లక్ష కోట్లకు పెంచారని, అందులో కమీషన్ల రూపంలో కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల రూపాయలు దోపిడి చేసిందని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో పైప్ లైన్లలో అవినీతికి పాల్పడ్డారని, వందల కోట్లు స్వాహా చేశారని చెప్పారు. రాష్ట్రంలో గత అరేండ్లలో జరిగిన అన్ని పనుల్లోనూ అవినీతి జరిగిందని, కేసీఆర్ ఫ్యామిలీకి వాటా వెళ్లిందని వివేక్ ఆరోపించారు. కేసీఆర్ అవినీతి సంబంధించిన అన్ని వివరాలతో త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర సర్కార్ పెద్దలకు అందిస్తామని వివేక్ తెలిపారు.
ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ..ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని వివేక్ ఆరోపించారు. కేసీఆర్ తుగ్లక్ పాలన వల్లే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని మండిపడ్డారు. నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చిన కేసీఆర్.. ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేదని వివేక్ విమర్శించారు. రెండున్నర లక్షల డబుల్
బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పి.. అందులో ఇప్పటివరకు ఐదు శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. కేసీఆర్ నిర్వాకంతో కేంద్రం నుంచి ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద పేదలకు అందాల్సిన ఇండ్లు కూడా అందకుండా పోయాయని వివేక్ మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని చెప్పారు.
దుబ్బాక ఫలితంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని విషయం తేలిపోయిందన్నారు వివేక్. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాక ప్రజలు స్పష్టమైన తీర్పు
ఇచ్చారన్నారు. రైతులు, యువకులు, మహిళలు, దళితులు, కార్మికులు .. ఇలా ఏ ఒక్కరు కూడా టీఆర్ఎస్ పాలనలో సంతృప్తిగా లేరని చెప్పారు. దుబ్బాక ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతల ఆదేశాలతో
హైదరాబాద్, సైబరాబాద్, సిద్ధిపేట పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని వివేక్ మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధించిన ఓ విషయంలో హైదరాబాద్ సీపీ అనవసరంగా తన పేరు, తన కంపెనీ తీశారని చెప్పారు. తనకు సంబంధం లేని విషయంలో హైదరాబాద్ సీపీ అలా మాట్లాడటంపై వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి దుబ్బాక ఎన్నికల సమయంలో బీజేపీ నేతల ఇండ్లలో పోలీసులు సోదాలు చేశారని, కాని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో, ప్రగతి భవన్ లో తనిఖీలు చేస్తే వందలాది నోట్ల కట్టలు దొరికేవన్నారు వివేక్.
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కష్టపడుతున్నందువల్లే తనను కేసీఆర్ టార్గెట్ చేశారని వివేక్ ఆరోపించారు. అక్రమ కేసులతో తనను ఇబ్బంది పెట్టాలని, బెదిరించాలని చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ , టీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, వేధింపులకు పాల్పడినా తాను భయపడేది లేదని, మరింత ఉత్సాహంగా బీజేపీ కోసం పని చేస్తానని చెప్పారు. 2103లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు వివేక్. కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైందని, ఇప్పుడాయన ఏం చేసినా ప్రజలు నమ్మబోరన్నారు వివేక్.