సీఎం జగన్‌కు సన్న గడ్డి.. క్యూలో అక్క చెల్లెమ్మలు!

ఎపిలోని జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం, అలాగే రేషన్ డోర్ డెలివరీ పై టీడీపీ నేత మాజీ మంత్రి లోకేష్ సెటైలరు వేశారు. ప్రభుత్వం ఇచ్చే రేష‌న్ బియ్యం, ఇతర స‌రుకులు ఇచ్చే చౌక‌ధ‌ర‌ల దుకాణం వ‌ద్ద ప్ర‌జ‌లు క్యూ‌ల్లో నిల‌బ‌డి ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు, అలాగే స‌రుకుల కోసం దూర ప్రాంతానికి వెళ్లే ఇబ్బందులు తొల‌గించ‌డానికి ఏపీలోని జగన్ సర్కారు రేషన్ డోర్ డెలివ‌రీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, దీని వ‌ల్ల ప్ర‌జ‌లు మ‌రిన్ని ఇబ్బందులు పడుతున్నారంటూ లోకేశ్ తాజాగా ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. "ప్రభుత్వ పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే. సన్న బియ్యం అన్న సన్నాసులు దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేశారు. ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అంటూ జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు' అని నారా లోకేశ్ తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా "డోర్ డెలివరీ మాయలోడు జ‌గ‌న్ కనపడితే సన్న గడ్డి పెట్టడానికి అక్క చెల్లెమ్మలు క్యూలో రెడీగా ఉన్నారు" అని నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

గులాబీలో కొత్త పార్టీ కలకలం! కులాల కుంపట్లతో ఆగమాగం

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ అన్యోపదేశంగానే అయినా  కొత్త పార్టీ పెట్టడం అంత తేలిక కాదు అంటూ ఒక హెచ్చరిక లాంటి వ్యాఖ్య చేశారు. అలాగే పార్టీ పెట్టి భంగపడిన ఆలే నరేంద్ర, దేవేందర్ గౌడ్, విజయశాంతి అనుభవాలను కూడా కేసీఆర్ గుర్తు చేశారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అలాంటి హితబోధ చేశారన్నది పక్కన పెడితే..  తాజాగా  తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి తారక రామా రావు, తమ సొంత నియోజక వర్గం సిరిసిల్లలో పార్టీ కార్యకర్తలను  ఉద్దేశించి ప్రసంగిస్తూ, “తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడి బతికి బట్టకట్టిన పార్టీలు రెండే రెండు, ఒకటి ఎన్టీర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ, రెండు కేసీఆర్ స్థాపించిన తెరాస పార్టీ”అంటూ ఇతర పార్టీలు అన్నీ పుబ్బలో పుట్టి మఖలో మాయమైన పార్టీలే అని అన్నారు.అంటే  ఎవరికైనా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలాంటిది ఏదైనా ఉంటే, ఆ ఆలోచనలు పక్కన పెట్టండి అని కేటీఆర్ తమ స్టైల్లో  చెప్పకనే చెప్పారు.  ఇలా తండ్రీ కొడుకులు ఇద్దరూ వేర్వేరు సందర్భాలలో  కొత్త పార్టీల ప్రస్తావన చేయడం కేవలం యాదృచ్చికమా లేక గుండెల్లో చేరిన గుబులు వారి చేత అలాంటి పలుకులు పలికించిందా అంటే.. రెండోదే ఖాయం చేసుకోమనే మాట పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.  అలాగే ఇదేదో యాదృచ్చికంగా చేసిన వ్యాఖ్య కాదనే వాళ్ళు లేక పోలేదు. నిప్పులేనితే పొగరాదు, అన్నట్లుగా ఎక్కడో ఎదో జరుగుతోంది,ఆ వంటకం తాలూకు మసాలా ఘాటు తండ్రీకొడుకులను ఉక్కిబిక్కిరి చేస్తోంది, అందుకే కేసీఆర్, కేటీఆర్’ కొత్త పార్టీల ప్రస్తావన చేశారని అనే వాళ్ళున్నారు.  రాజకీయ విశ్లేషకులు  కూడా కొత్త పార్టీ ఏర్పాటు విషయంగా నిజానిజాలు ఎలా ఉన్నా, తెరాసలో ముసలం పుట్టింది, సంకుల సమరానికి కుంపట్లు రాజుకుంటున్నాయని చెబుతున్నారు. .తండ్రీ కొడుకులు, అన్నా  చెల్లెలు, బావ బామ్మర్డులు ఇలా ఎవరెవరి మధ్య ఏమేమీ జరుగుతోందో ఏమో గానీ,అధికార పార్టీ అధికార కేంద్రాలు  ప్రగతి భవన్, తెరాస భవన్, ఫార్మ్ హౌస్ లో ఎదో జరుగుతోందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.     సరే లోపలి శక్తుల కుమ్ములాటల విషయం పక్కన పెట్టినా.. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరినీ ఇలా కలవరపాటుకు గురి చేస్తున్న ఆ ‘కొత్త’ హీరో’, విలన్, కంటికి కనపడని ఆ నాలుగో సింహం ఎవరు? గతంలోనే ‘గులాబీ జెండా ఓనర్లం’ అంటూ తొడకొట్టిన బీసీ నాయకులా?.. ఇస్తానన్న ముఖ్యమంత్రి  పదివి ఇవ్వకపోతే ఇవ్వక పాయే, కనీసం మంత్రి వర్గంలో సముచిత స్థానం అయినా ఇవ్వరా,ఇచ్చిన పదవుల నుంచి అవమానకరంగా బయటకు పపంపడం, చివరకు అస్మేదీయ ఎమ్మెల్ల్యేలు , నాయకుల చేత, అధికారుల మీద పెట్టి, ఎస్సీ,ఎస్టీ నాయకులను, ‘అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికిరారు’ అనిపించి అవమానించడం ఏమిటీ? ఇదెక్కడి అన్యాయం అని గుండెను చెరువు చేసుకుని, లోలోన రోదిస్తున్న దళిత బహుజనులా... అగ్రవర్ణాలలోని అణగారిన వర్గాల ప్రతినిధులా .. అంటే అందరూ .. అన్యాయాలకు, అవమానాలకు గురవుతున్నామన్న అన్ని కులాలు, అన్ని  వర్గాల ప్రజలు ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక ఏర్పాటు ప్రయత్నాలలో ఉన్నారని అంటున్నారు.    నిజానికి కేసీఆర్ ను, ఆయన నాయకత్వాన్ని ఎవరూ ఏనాడూ ప్రశ్నించలేదు. మంచైనా చెడైనా రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఆయన్ని, అన్ని వర్గాల ప్రజలు గౌరవించారు. కానీ, ఎప్పుడైతే కొడుకు కేటీఆర్’  తండ్రి చెప్పుల్లో కళ్ళు పెట్టారో, ఎప్పుడైతే సీనియర్లను, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర  బడుగు, బలహీన వర్గాల నాయకుల ప్రాధాన్యతను తగ్గిచడం మొదలైందో, అప్పుడే పార్టీలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. బడుగు,బలహీన వర్గాలకు బర్రెలు, గొర్రెలు ఎరగా వేసి,ఆవర్గాల నాయకులను అధికార కేంద్రాలకు దూరం చేయడంతో బడుగు బలహీన వర్గాలు, అధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు వైపు అడుకులు వేస్తున్నారు. ఆ అడుగుల చప్పుడుకే, తండ్రీ కొడుకులు ఉలిక్కి పడుతున్నారు.  మరో వంక దక్షిణాదిలో పట్టు కోసం, విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ కొత్త శక్తుల పునరేకీకరణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొలకత్తాలో కేంద్ర హోం మంత్రి, అమిత్ షా, బెంగాళ తర్వాతి లక్ష్యం తెలంగాణ అని ప్రకటించడం ఇందులో భాగంగానే కొందరు అనుమానిస్తున్నారు. అయితే  ఎవరు ఎమన్నా, కేసీఆర్ అన్నట్లుగా  కొత్త పార్టీ పెట్టండం, పెట్టిన పార్టీని బతికించుకోవడం, అంత ఈజీ యవ్వారం అయితే కాదు. కానీ, రాజకీయాలలో ఏదైనా జరగవచ్చును. కొయ్యాగుర్రం ఎగరావచ్చు .. 

మే14న  షర్మిల పార్టీ జెండా.. ఎజెండా..  

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె,  షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. పార్టీ ఆవిష్కరణకు షర్మిల రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మే 14న .. లేదా జూలై 8న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మే 14 కు ఒక సెంటిమెంట్ ఉంది.. గతంలో  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసింది మే 14నే..  అందుకే ఆ రోజును షర్మిల సెంటిమెంట్ గా భావిస్తున్నారని..  మే 14న పార్టీ జెండా అజెండా ప్రారంభిస్తే పచ్చ జెండా ఊపి పాదయాత్ర లకు వెల్లొచ్చని ముఖ్య నేతలు షర్మిలకు సూచించినట్లు సమాచారం. జులై 8న కూడా షర్మిల ఆలోచిస్తున్నారని ఆరోజు రాజశేఖర్ రెడ్డి జయంతి కావడం వాళ్ళ అదే రోజు  పార్టీ జెండా, ఎజెండా విడుదలకు ముహూర్తం గా  షర్మిల అనుకుంటుంటారని. అయితే జూలై 8 నాటికి ఆలస్యం అవుతుందని ముఖ్యనేతలు చెబుతున్నట్లు తెలియవచ్చింది. కాగా రెండు తేదీల్లో ఒకదానిని ఫైనల్ చేసే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం. చూడాలి  వైఎస్ ప్రమాణ స్వీకారం రోజునా లేక వైఎస్ జయంతి రోజునా షర్మిల పార్టీ జెండా, ఎజెండా..   

కేసీఆర్ కు చలి జ్వరం! ఎందుకో తెలుసా..

తెలంగాణ రాజకీయాల్లో  మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, విపక్ష నాయకులు వ్యక్తిగత దూషణలతో మంటలు రేపుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్నారు. రైతు దీక్షలతో దూకుడు పెంచిన హస్తం లీడర్లు.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ కేడర్ లో జోష్ నింపుతున్నారు.  తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్‌..  కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వంత పాడుతున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌.. ప్రధాని మోడీని కలిశాక చలి జ్వరంతో ఫామ్‌హౌజ్‌ చేరుకున్నారని ఎద్దేవా చేశారు. రైతులను కంటతడి పెట్టిస్తున్న మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌కు రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేయాలని కోరారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను లాక్కుని బహుళజాతి కంపెనీలకు అమ్ముకుంటోందని ఆరోపించారు. ప్రజలకు, భూమికి హాని కలిగించే  ఫార్మాసిటీని అడ్డుకునేందుకు రైతుల పక్షాన కాంగ్రెస్‌ నిలుస్తుందని తెలిపారు.  చాయ్‌వాలా, మందువాలా జతకట్టి కుట్ర రాజకీయాలు సాగిస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ రేవంత్‌ చేపట్టిన రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్ర 9వ రోజు కొనసాగుతోంది.  ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాలలో బస చేశారు రేవంత్ రెడ్డి . మంగళవారం రావిరాలలో పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సభకు జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి రైతు ఎజెండాతో ఉప్పెనలా కదిలిరావాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. రావిరాల బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.   

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల నగారా మోగింది. ఏపీ సర్కార్ మెడలు వంచి పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలకు వెళుతున్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎస్ఈసీ. మార్చి 10న ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.  మార్చి 2, 3 తేదీలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకూ ఉపసంహరణకు సమయం ఉంటుందని, మార్చి 3న మధ్యాహ్నం 3 తరువాత అభ్యర్ధుల తుది జాబితాను విడుదల చేయనుంది.  మార్చి 10న ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరుగనుంది. మార్చి 13న ఉదయం 7 నుంచీ సాయంత్రం 5 వరకూ  రీపోలింగ్‌ను నిర్వహించనుంది. మార్చి 14న ఉదయం 8 నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది.  ఏపీలోని 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది. గత మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై... కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు గతంలో ఆగిపోయిన దగ్గర నుంచే మళ్లీ ఎన్నికల ప్రక్రియను  కొన‌సాగించాల‌ని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 75 మునిసిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.   గత ఏడాది మార్చి 23న మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకునే వరకు 12 నగరపాలక సంస్థల్లో 6,563 మంది  అభ్యర్థులు నామినేషన్లు దాఖ‌లు చేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు వేశారు.   

ఏపీలో ఆఫర్ల జోరు..  

ఏపీలో ఆఫర్ల జోరు నడుస్తుంది.. ఆఫర్లతో ఇతర పార్టీలకు నాయకులకు వైసిపి  ఎరవేస్తుంది.. నెల్లూరులో టీడీపీ, ఇండిపెండెంట్ సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు వైసీపీ నేతలు భారీ ఆఫర్లు ఇస్తూ తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ కండువాలు మార్చే పనిలో ఉన్నారు వైసిపి నాయకులు.. డాక్టర్ పేషేంట్ పల్సు పట్టుకున్నట్లు వైసిపి  నాయకులు గెలిచినా సర్పంచ్ అభ్యర్థుల పల్స్ పట్టుకుంటున్నారు.. మంత్రి మేకపాటి  ఇలాకాలోని అప్పారావుపాళెంలో‌ వార్డు సభ్యరాలిని వైసీపీలోకి రావాలని భారీగా మూల్యం సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఇల్లు, పిల్లలకి ఉద్యోగాలు, పది లక్షల నగదు ఇస్తామని ఫోన్లు చేయడంతో పాటు కోర్టుల్లో కేసులు తీసేయిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. వైసీపీ నేతల ఆఫర్లకు సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయి.. 

నెల్లూరు నాది.. ఆనం సంచలన కామెంట్స్

నెల్లూరు జిల్లాలో వైసిపిలో నడుస్తున్న వర్గపోరు సీఎం జగన్ కు సైతం చుక్కలు చూపిస్తోంది. అక్కడ మంత్రి అనిల్ కు సీనియర్ నేత ఎమ్మెల్యేరామనారాయణ రెడ్డికి ఏమాత్రం పోయసాగడం లేదు. దీంతో నిత్యం కీచులాటలతో రోడ్డెక్కుతున్నారు ఏపీలో తాజాగా జరుగుతన్న పంచాయతీ ఎన్నికలలో గెలిచినా మద్దతుదారులతో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన 4 దశాబ్దాలుగా ఆనం కుటుంబం రాజకీయ జీవితం మొత్తం నెల్లూరుతో ముడిపడి ఉందని అయన అన్నారు. నెల్లూరు ప్రజలను కలవడానికి తమకు ఎన్నికలే కావాల్సిన అవసరం లేదన్నారు. పక్క జిల్లా అయినా ప్రకాశం లోని పొదిలి, దర్శి, కనిగిరి వరకూ వెళ్లి రాజకీయాలు చేసిన తమకు నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో రాజకీయం చేయడం పెద్ద కష్టం కాదన్నారు.నెల్లూరు నగరం నుండి గతంలో రాపూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు వెళ్ళామని.. తమను నెల్లూరు నుంచి ఎవరు దూరం చేయలేరని ఆనం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలకు పార్టీ అదినాయకత్వం ఎక్కడికి వెళ్లమంటుందో అక్కడికి వెళ్లక తప్పదని చెప్తూనే నెల్లూరుపై తమ మార్క్ మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏ పార్టీ నుంచి ఆనం కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నా.. నెల్లూరుతో అదే అనుబంధం కొనసాగిందని అయన స్పష్టం చేసారు . ఇది ఇలా ఉండగా అనంత్ రామనారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతోపార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయట పడడంతో నెల్లూరు వైసిపిలో కలకలం రేగుతోంది. పార్టీ అధిష్టానం తక్షణమే కలగచేయుకుని నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించాలని.. లేదంటే జిల్లాలో పార్టీ పుట్టి మునగడం ఖాయమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇద్దరు అభ్యర్థుల పేర్లు సేమ్! గందరగోళంలో ఓటర్లు 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో  చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.  గ్రామ అభివృద్ధి కోసమంటూ కొన్ని చోట్ల అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసిపోతున్నాయి. ఇంకొన్ని చోట్ల సొంత కుటుంబ సభ్యులే హోరాహోరీగా పోరాడుతున్నారు.  కృష్ణా జిల్లాలోని ఓ పంచాయతీలో మాత్రం మరో సమస్య అందరిని ఇబ్బంది పెడుతోంది. సర్పంచ్ బరిలో ఉన్న ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ఓటర్లు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.   కృష్ణా జిల్లాలో తిరువూరు మండలంలోని మల్లేల పంచాయతీకి నాలుగో విడతలో  పోలింగ్ జరగనుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అయితే ఈ గ్రామంలో వైసీపీ బలపరిచిన వంగూరి మరియమ్మ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ మద్దతుదారు పేరు కూడా మరియమ్మే. పేరే కాదు ఇంటి పేరు కూడా సేమ్. ఇద్దరి ఇంటి పేరు వంగూరినే. ఇద్దరు అభ్యర్థుల పేర్లూ, ఇంటి పేరుతో సహా ఒకటే కావడంతో  గ్రామస్తులు గందరగోళ పడుతున్నారు.  ఈ పేర్లతో ప్రజలు తికమకపడి ఎవరి మద్దతుదారులు ఎవరికి ఓటేస్తారోనని సర్పంచ్ అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. అందుకే తమకు కేటాయించబోయే గుర్తులను ప్రచారంలో బాగా వాడుకుని, ప్రజల మైండ్లలో రిజిస్టర్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ గ్రామంలో ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాలి. మరోవైపు ఈ పోటీపై గ్రామస్తుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎవరు గెలిచినా వంగూరి మరియమ్మ అనే పేరు గల వ్యక్తే ఈసారి సర్పంచ్ అవుతారని  చెబుతున్నారు.   

కేంద్రం చేతిలో సామాన్యుడికి "బండ" దెబ్బలు

ప్రతి రోజు పెట్రోల్‌ ధరలు పెంచుతూ వినియోగదారుడికి చుక్కలు చూపిస్తున్న కేంద్ర చమురు సంస్థలు.. తాజాగా సబ్సిడీ గ్యాస్‌ బండ ధరను ఏకంగా రూ.50 పెంచేశాయి. సబ్సిడీ, సబ్సిడీ లేని డొమెస్టిక్‌ సిలిండర్లకు ఈ కొత్త ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచాయి. గత 15 రోజుల వ్యవధిలో డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్ ‌(14.2 కిలోలు) ధర పెరగడం ఇది రెండో సారి. డిసెంబరులో రెండుసార్లు పెరిగిన ధరలు జనవరిలో ఒకసారి పెరిగాయి. మోనా జనవరిలో రూ.746.50 ఉన్న గ్యాస్‌ సిలిండర్ ధర ఈ నెల 3న రూ.771.50కు పెరిగింది. తాజాగా ఆదివారం మళ్లీ రూ. 50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో.. 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ. 821.50కు చేరుకుంది. ఢిల్లీలో ఈ కొత్త ధర రూ. 769గా ఉంది. కేవలం మూడునెల్లలో సిలిండర్‌పై ఏకంగా రూ. 200 పెరగడంతో కేంద్ర సర్కార్ బాదుడుకు సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. అంతేకాకుండా ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి గ్యాస్ ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ బాదుడు ఉంటుందన్న మాట. మరోపక్క చమురు సంస్థలు తాజాగా డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను పెంచడంలో ఎలాంటి పద్ధతిని పాటించలేదని ఎల్పీజీ డీలర్లు ఆరోపిస్తున్నారు. " ఎల్పీజీ సిలిండర్ దర పెంచడానికి కారణాలేమిటో చెప్పలేదు. సాధారణంగా అంతర్జాతీయ ధరల ఆధారంగా, రూపాయి-డాలర్‌ మారక విలువ ఆధారంగా ఎల్పీజీ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ, తాజాగా ధర పెంచడానికి స్పష్టమైన కారణాలేమీ చూపలేదు అని డీలర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ తో  యువతికి 9.50 లక్షల టిప్పు..

మనకోసం పని చేసిన వాళ్లకు.. మనం ఎప్పుడు రుణపడి ఉంటాం.. ఆ రుణం తీర్చుకోవడానికి అప్పుడపుడు వాళ్ళకి మనకు తోచిన సహాయం చేస్తుంటాం.. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నా, తాగినా, మనకు సర్వ్ చేసిన వారికి ఎంతో కొంత టిప్ ఇచ్చే బయటకు రావడమనేది వారి  శ్రమని గౌరవించడంతో పాటు.. వారి కష్టానికి ఊరట ఇచ్చినవాళ్ళం అవుతాం.. అదే సర్వర్లు కూడా ఊహించని రీతిలో రూ. 9.42 లక్షలు టిప్ గా ఇస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు.. గతంలో ఎన్నో మార్లు తమకు నచ్చిన వెయిటర్లకు భారీగా టిప్ ఇచ్చిన ఘటనలు కూడా మనకు తెలుసుక. తాజాగా, యూఎస్ లోని న్యూయార్క్ లో తనకు సర్వ్ చేసిన ఓ యువతికి ఓ కస్టమర్ ఏకంగా 13 వేల డాలర్లు అంటే దాదాపు రూ. 9.42 లక్షలు టిప్ గా ఇచ్చి ఆమెను అవాక్కు చేశాడు. న్యూయార్క్ లో లిల్లీస కాక్ టైల్ రెస్టారెంట్ పేరిట ఓ హోటల్ ఉండగా, అక్కడ ఉల్యానా హ్రుచాక్ అనే యువతి వెయిట్రెస్ గా పని చేస్తోంది. ఆ హోటల్ కు రెగ్యులర్ గా వెళ్లే రాబిన్ స్కాల్ అనే కస్టమర్, ఆమెను చూసి, ఆమెకేదైనా సాయం చేయాలని భావించాడు. అంటే తన  ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 1.41 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, వారందరికీ ఆమె గురించి చెప్పి, ఎంతో కొంత సాయం చేయాలని, తాను ఆమెకు డబ్బులు ఇచ్చి సాయపడతానని కోరాడు. ఈ పోస్ట్ పెట్టే సమయంలో ఓ 1000 డాలర్ల నిధిని సేకరించి, ఆమెకు ఇచ్చినా తనకు సంతోషమేనని రాబిన్ భావించాడు. అయితే, నిమిషాల వ్యవధిలోనే 13 వేల డాలర్లు పోగయ్యాయి. దీంతో ఆ డబ్బును తీసుకుని రెస్టారెంట్ కు వెళ్లిన రాబిన్ స్కాల్, ఆమెకు మొత్తం తాను సేకరించిన మొత్తాన్ని టిప్ గా ఇచ్చి వచ్చాడు. తొలుత నమ్మలేకపోయినా, ఆపై విషయం తెలుసుకున్న ఆమె, స్కాల్ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఫాలోవర్లకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.

తిరగబడిన ట్రక్కు .. 16 మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జలగావ్ జిల్లాలో  ఆదివారం  రాత్రి అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు  అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులందరూ కూలీలే. మృతుల్లో 8 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  ప్రమాదంలో మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను జలగావ్ జిల్లాలోని అభోడా, కేర్హళ, రావెర్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్‌కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు కింగ్వాన్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు.  సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను రూరల్ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కూలీలు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. 

ప్రసంగిస్తూ కుప్పకూలిన సీఎం

పంచాయతీ ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి .. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వేదికపైనే పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, స్థానిక నాయకులు ముఖ్యమంత్రిని హాస్పిటల్ కు తరలించారు.  గుజరాత్ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల జరుగుతున్నాయి. వడోదర సమీపంలోని నిజామ్ పురాలో జరిగిన సభకు సీఎం విజయ్ రూపాని హాజరయ్యారు. ఆయన సభలో  ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. ముఖ్యమంత్రి పడిపోవడంతో, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఆయనకు వేదికపైగా ప్రథమ చికిత్స చేసి, వెంటనే అహ్మదాబాద్ కు తరలించి, ఆసుపత్రిలో చేర్చారు. గత రెండు రోజులుగా సీఎం విజయ్ రూపాని స్వల్ప అస్వస్థతతో ఉన్నారని చెబుతున్నారు. అయినా ఆయన  ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకోలేదని తెలుస్తోంది.  బాగా అలసి పోవడం వల్లే ఆయన స్పృహ తప్పారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వెల్లడించారు.

ఎమ్మెల్సీ కవితకు కొత్త పదవి 

ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత... రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఆమెకు కొత్త పదవి వస్తుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అది తాజాగా రుజువైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పదవి చేపట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింగరేణిలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌కు అధ్యక్షుడిగా బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి మరోమారు ఎన్నికయ్యారు. శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణి ఆఫీసర్స్ క్లబ్‌లో కంపెనీ స్థాయి యూనియన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. అనంతరం ఎన్నికలు నిర్వహించారు. చర్చల అనంతరం పూర్తిస్థాయి కమిటీని ప్రకటించనున్నట్టు తెలిపారు. గతంలోనూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలిగా పని చేశారు. చివరి సారి జరిగిన సింగరేణి ఎన్నికల్లో ఆమె ఆధ్వర్యంలోనే టీబీజీకేఎస్ విజయం సాధించింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పదవికి కవిత రాజీనామా చేశారు.  టీబీజీకేఎస్ లో కీలక నేతగా ఉన్న నేత.. బీజేపీ అనుబంధ సంఘంలో చేరారు. ఇప్పుడు కవిత మళ్లీ యాక్టివ్ కావడంతో.. టీబీజీకేఎస్ కు దూరమైన నేతలను మళ్లీ ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఆర్టీసీలో బలమైన యూనియన్ గా ఉన్న టీఎంయూ బాధ్యతలు కూడా కవితే తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. గతంలో ఈ సంఘానికి మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. టీఎంయూ నేతలు కూడా ఇప్పటికే కవితతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.   

గంటా మరో సంచలనం! 

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తన  పదవికి రాజీనామా చేశారు విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. తాజాగా గంటా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా వ్యక్తిగతమని చెప్పారు. తన రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికలో.. తాను  పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ పాపంలో అన్ని రాజకీయపార్టీల పాత్ర ఉందన్నారు గంటా. పార్టీలకు అతీతంగా అందరూ పోరాడితేనే స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకోగలమని పిలుపునిచ్చారు.  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ పంథాలను పక్కన పెట్టి ఉద్యమంలోకి రావాలని గంటా కోరారు. తన స్ఫూర్తితో మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని ఆశీస్తున్నాని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారానే స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టుకోగలమని గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు. స్పీకర్ తన రాజీనామా అమోదిస్తారనుకుంటున్నానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న ఎవరైన. నాన్ పొలిటికల్ వ్యక్తిని తన స్థానంలో పోటీ చేయిస్తే బాగుంటుందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని, ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత రాజీనామాను ఆమోదించాలని కోరారు. దీంతో రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లో లేదంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. దీంతో  గంటా మరోసారి తన పదవికి రాజీనామా చేశారు. ఈసారి ఏకవాక్యంతో తన రాజీనామాను  సమర్పించారు.  

కేసీఆర్ ఉచ్చులో విపక్షాలు! 

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచడంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఉచ్చులో విపక్షాలు పడినట్లుగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ తన ఎత్తులతో విపక్షాలను తన చుట్టూ తిప్పుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా అలానే కనిపిస్తున్నాయి.  దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  ఆశించిన ఫలితాలు రాకపోవడంతో టీఆర్ఎస్ ఢీలా పడింది. ఆ తర్వాత పార్టీపై ఫోకస్ చేసిన గులాబీ బాస్.. తన వ్యూహాలను పదును పెట్టారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి మార్పు అంశం తెరపైకి వచ్చింది. కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా కేటీఆర్ జపం చేయడంతో.. విపక్షాలు కూడా ఇదే అంశంపై దృష్టి సారించాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎక్కడ మాట్లాడినా.. ముఖ్యమంత్రి మార్పుపైనే విమర్శలు చేశారు, కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కామెంట్లు చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా... ఇతర అంశాలను పక్కన పెట్టి.. కేసీఆర్, కేటీఆర్ లపైనే ఆరోపణలు చేస్తూ వచ్చారు. కేటీఆర్ పై ప్రచారం జోరుగా సాగుతున్నా స్పందించని సీఎం కేసీఆర్.. గత ఆదివారం జరిపిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. మరో పదేండ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి పదవి గురించి ఎవరూ మాట్లాడినా ఊరుకునేది లేదంటూ పార్టీ నేతలను హెచ్చరించారు. తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలోనూ విపక్షాలకు విరుచుకుపడ్డారు కేసీఆర్. ఈ రెండు పరిణామాల తర్వాత విపక్షాలు కూడా వెంటనే తమ స్టాండ్ మార్చాయి. తమపై ఆరోపణలు చేసిన కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ఉచ్చులో విపక్షాలు పడ్డాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వస్తోంది. కేసీఆర్ ఎత్తులో చిక్కిన విపక్షాలు.. క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ మాట్లాడుతున్న అంశాల్లో స్పష్టత లేదంటున్నారు. గతంలో ఎప్పుడు మాట్లాడినా .. కేసీఆర్ అవినీతిని బయటపెడతాం, జైలుకు పంపుతామని సంజయ్ చెప్పేవారు. అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారనే ప్రచారం రాగానే.. ఒక్కసారిగా తన మాట మార్చారు. కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటారని పదేపదే ప్రకటనలు చేశారు. దీంతో కేసీఆర్ ను జైలుకు పంపిస్తామన్న సంజయ్.. ఆయనే సీఎంగా ఉంటారని చెప్పడమేంటనే చర్చ జరిగింది. తాజాగా మళ్లీ కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు బండి సంజయ్. దీంతో కేసీఆర్ రాజకీయ వ్యూహాల ముందు బీజేపీ నేతలు నిలవలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు కూడా ఇలానే ఉంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ విఫలమయ్యారనే ఆరోపణలు చేస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం రాగాానే.. మళ్లీ మాట మార్చారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సీఎం మార్పుపై లేదని కేసీఆర్ క్లారిటీ ఇవ్వగానే... మళ్లీ పాత పాటే పాడుతున్నారు. విపక్షాల తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు... కేసీఆర్ ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో ప్రతిపక్ష నేతలు చిక్కుకుంటున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనికి రాడని విమర్శించిన వారే.. కేసీఆరే మరో మూడేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనే చెప్పేలా కేసీఆర్ డ్రామా నడిపించారని అంటున్నారు. మొత్తంగా తన రాజకీయ చతురతతో విపక్షాలన్ని తన చుట్టే తిరిగేలా కేసీఆర్ కొత్త మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.   

టీకా తీసుకున్న నిమ్స్ డాక్టర్లకు కోవిడ్! 

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇండియాలో కవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అందిస్తున్నారు. ఈ రెండు టీకాలూ సురక్షితమైనవేనని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుండగా, వైద్యుల్లోనే టీకా పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  తాజాగా హైదరాబాద్ నిమ్స్ లో కలకలం రేగింది. కరోనావ్యాక్యిన్ ను తీసుకున్న 20 రోజుల తరువాత.. ఇద్దరు ప్రముఖ వైద్యులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.  నిమ్స్ కు చెందిన ఓ రెసిడెంట్ డాక్టర్ కు, ఉస్మానియాకు చెందిన పీజీ విద్యార్థికీ కరోనా సోకింది. వీరిద్దరూ దాదాపు 20 రోజుల క్రితం కరోనా టీకా తొలి డోస్  తీసుకున్నారు.  ఇద్దరు వైద్యులకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. టీకా తీసుకున్న తరువాత వీరిద్దరూ తమకు వైరస్ సోకదన్న ధీమాతో మాస్క్ ధరించలేదని, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించలేదని, ఈ కారణంగానే వైరస్ సోకిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిద్దరి పేర్లను మాత్రం బహిర్గతం చేయలేదు.  అయితే  తొలి డోస్ తీసుకున్న 42 రోజుల తరువాతనే శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ వృద్ధి జరుగుతుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. టీకా తీసుకున్నా అన్ని జాగ్రత్తలతో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చాలా మంది తొలి టీకా తీసుకోగానే నిబంధనలను పాటించడం లేదని, అందువల్లే ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.  

కొడాలి నానికి ఖతర్నాక్ షాక్! 

పంచాయతీ ఎన్నికల్లో ఏపీ మంత్రి కొడాలి నానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. తనకు ఎదురు లేదని చెప్పుకునే నానికి.. ఆయన నియోజకవర్గ ఓటర్లు షాకిచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు సంచలన విజయాలు సాధించారు. మంత్రి కొడాలి ఎన్ని ఎత్తులు వేసినా, బెదిరింపులకు దిగినా.. ఓటర్లు మాత్రం బ్యాలెట్ బాక్సుల్లో తమ ప్రతాపం చూపించారు.  గుడివాడ నియోజకవర్గంలో 58 పంచాయతీలు ఉండగా.. 20 స్థానాల్లో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌లు విజయం సాధించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 32 పంచాయతీలు గెలుచుకోగా.. జనసేన ఒకటి, సీపీఎం ఒకటి,  స్వాతంత్ర అభ్యర్థులు నాలుగు పంచాయతీల్లో గెలిచారు. అయితే టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను స్వతంత్రులుగా గలిచామని చెప్పాలంటూ వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను తమ ఖాతాలో వైసీపీ నాయకులు వేసుకుంటున్నారు.   అంతేకాదు కొడాలి నాని సొంతూరు పెదపారుపూడి మండలం యలమర్రులో టీడీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. యలమర్రులో టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు. గుడివాడ నియోజకవర్గం ఫలితాలపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కొడాలి నానికి ఊహించని షాక్ అని  టీడీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  

కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 14 మంది దుర్మరణం

విశాఖపట్నం జిల్లా అరకు లోయలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన మరవకముందే.. కర్నూల్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓ టెంపో రహదారిపై అదుపు తప్పి, కుడివైపునకు పడిపోయింది. అదే సమయంలో అటు వైపుగా వస్తున్న  ఆ దిశగా లారీ టెంపోను ఢీకొట్టింది.   ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు 8 మంది మహిళలు ఉన్నారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. 

కుక్క కన్నా హీనం! కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్ 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ లేకుంటే టీపీసీసీ ఉండేది కాదన్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తెలంగాణ ఎట్లా వచ్చిందో కేటీఆర్ తెలుసుకుని మాట్లాడాలని జీవన్ రెడ్డి సూచించారు. ఉద్యమానికి స్ఫూర్తి ఎవరు? ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నదెవరో తెలంగాణ ప్రజలకు అంతా తెలుసన్నారు. తెలంగాణపై చర్చ జరిగిన రోజు లోక్ సభలో  కేసీఆర్ లేడన్నారు జీవన్ రెడ్డి. ఆయన ఎక్కడ తాగి పన్నాడో ఆనాడాయనకే తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కాపలా కుక్క లెక్క ఉంటా అన్న కేసీఆర్ కు.. ఇప్పుడు తెలంగాణా ప్రజలే కుక్కల్లా కనిపిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కుక్కలకు విశ్వాసం ఉంటది.. కానీ విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్అం టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి.సీఎం పదవిని ఎవడైనా చెప్పుతో సమానం అంటాడా..? చెప్పును పట్టుకుని మరింకా ఎందుకు వేలాడుతున్నావ్.. ఇడిసిపెట్టు కదా..? మళ్ళీ నేనే సీఎం అంటావ్? నీ టైం అయిపొయింది. నీ  ఇంట్లో ముసులం పుట్టుంది.. మొగల్ సామ్రాజ్యం మాదిరిగా నీ ఇంట్లో ఔరాంగజేబు పుట్టిండు.. నీకు పదవి ఉండదు.. జాగ్రత్త అంటూ జీవన్ రెడ్డి హెచ్చరిక చేశారు.  నల్ల కుబేరులకు  మోడీ అండగా నిలుస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. గుడిని పార్టీ అంశంగా మార్చుకుని ప్రజల్ని మత ప్రాతిపదికన చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు జీవన్ రెడ్డి. మద్దతు ధర కల్పించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ సన్న వడ్ల పేరుమీద ఏంచేశాడో తెలంగాణాలో అందరికీ తెలుసన్నారు. ధాన్యం సేకరణ నిలిచిపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదముందన్నారు.