మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
posted on Feb 15, 2021 @ 10:40AM
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల నగారా మోగింది. ఏపీ సర్కార్ మెడలు వంచి పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలకు వెళుతున్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎస్ఈసీ. మార్చి 10న ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2, 3 తేదీలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకూ ఉపసంహరణకు సమయం ఉంటుందని, మార్చి 3న మధ్యాహ్నం 3 తరువాత అభ్యర్ధుల తుది జాబితాను విడుదల చేయనుంది. మార్చి 10న ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకూ పోలింగ్ జరుగనుంది. మార్చి 13న ఉదయం 7 నుంచీ సాయంత్రం 5 వరకూ రీపోలింగ్‌ను నిర్వహించనుంది. మార్చి 14న ఉదయం 8 నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది.
ఏపీలోని 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది. గత మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై... కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు గతంలో ఆగిపోయిన దగ్గర నుంచే మళ్లీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపల్, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది మార్చి 23న మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకునే వరకు 12 నగరపాలక సంస్థల్లో 6,563 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు వేశారు.