షర్మిల పార్టీకి వ్యూహకర్తగా పీకే ! కాంగ్రెస్, కారు పార్టీల్లో టెన్షన్
తెలంగాణ రాజకీయాల్లో దివంగత వైఎస్సార్ కూతురు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న వార్త సంచలనంగా మారింది. లోటస్ పాండ్ లో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. రాష్ట్రమంతా దీనిపైనే చర్చించుకుంటోంది. రాజకీయ పార్టీల్లోనూ ఇదే కీలక అంశంగా మారింది. షర్మిల పార్టీ ఎందుకు పెడుతున్నారు... షర్మిల పార్టీకి స్పేస్ ఉంటుందా.. షర్మిల పార్టీ బలపడితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే అంశాలపై జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి.
వైఎస్ షర్మిల పార్టీపై టీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చ జరుగుతోందని తెలుస్తోంది. టీఆర్ఎస్ టార్గెట్ గానే షర్మిల పార్టీ వస్తుందన్న ప్రచారం గూలాబీ నేతలను కలవరపెడుతుందని చెబుతున్నారు. షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతుండటంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. అన్న అన్యాయం చేస్తే ఆంధ్రాకు వెళ్లాలని, తెలంగాణలో డ్రామాలు చేస్తే డిపాజిట్లు కూడా రావని పోస్టులు పెడుతున్నారు. అసలు తెలంగాణలో షర్మిల ఏం చేస్తారని సెటైర్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఉద్యమకాలంలో చెప్పుల దండలు వేసిన షర్మిల ఫ్లెక్సీలను ఇప్పుడు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేతలు వైరల్ చేస్తున్నారు. తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులు ఉండవని మంత్రి గంగుల కమలాకర్ కామెంట్ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి అవకాశమే లేదని, వేరే పార్టీలు రావని.. వచ్చినా బతకవని కుండబద్దలు కొట్టారు. ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ నడవవన్నారు గంగుల కమలాకర్.
వైఎస్ షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇతర పార్టీల మేలు కోసం షర్మిల రాజన్న పేరును వినియోగించొద్దని సూచించారు. రాజీవ్ రాజ్యం అయినా, రాజన్న రాజ్యం అయినా కాంగ్రెస్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వేర్వేరు కాదన్నారు. షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుందన్నారు సీతక్క. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టుకోవచ్చని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. తమకు ఏ పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని షబ్బీర్ అన్నారు. వైఎస్‌కు కుటుంబసభ్యులు వారసులు కారని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే వైఎస్‌కు నిజమైన వారసులన్నారు షబ్బీర్ అలీ. వైఎస్‌ను సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీనేని తెలిపారు,
వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇదే షర్మిల పార్టీ పేరు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ‘తెలంగాణ వైఎస్సార్‌సీపీ’గా షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వైఎస్ఆర్, తెలంగాణ ఈ రెండు పేర్లు వచ్చే విధంగానే పార్టీ పేరు నామకరణం చేస్తారని మరికొందరు చెబుతున్నారు. మార్చిలో పార్టీ ప్రకటన ఉంటుందని.. ఈలోగా తెలంగాణలోని అన్ని జిల్లాల ముఖ్య నేతలతో షర్మిల సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది. త్వరలోనే 100 నియోజకవర్గాల్లో 16 నెలలపాటు షర్మిల పాదయాత్ర నిర్వహిస్తారని చెబుతున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా షర్మిల పార్టీని అన్ని విధాలుగా చూసుకుంటారని సమాచారం. ఇప్పటికే షర్మిలతో పీకే చర్చించారని, బెంగాల్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారని చెబుతున్నారు.