కేంద్రం చేతిలో సామాన్యుడికి "బండ" దెబ్బలు
posted on Feb 15, 2021 @ 9:56AM
ప్రతి రోజు పెట్రోల్ ధరలు పెంచుతూ వినియోగదారుడికి చుక్కలు చూపిస్తున్న కేంద్ర చమురు సంస్థలు.. తాజాగా సబ్సిడీ గ్యాస్ బండ ధరను ఏకంగా రూ.50 పెంచేశాయి. సబ్సిడీ, సబ్సిడీ లేని డొమెస్టిక్ సిలిండర్లకు ఈ కొత్త ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచాయి. గత 15 రోజుల వ్యవధిలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర పెరగడం ఇది రెండో సారి. డిసెంబరులో రెండుసార్లు పెరిగిన ధరలు జనవరిలో ఒకసారి పెరిగాయి. మోనా జనవరిలో రూ.746.50 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఈ నెల 3న రూ.771.50కు పెరిగింది. తాజాగా ఆదివారం మళ్లీ రూ. 50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో.. 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ. 821.50కు చేరుకుంది. ఢిల్లీలో ఈ కొత్త ధర రూ. 769గా ఉంది. కేవలం మూడునెల్లలో సిలిండర్‌పై ఏకంగా రూ. 200 పెరగడంతో కేంద్ర సర్కార్ బాదుడుకు సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
అంతేకాకుండా ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి గ్యాస్ ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇంకో 15 రోజుల తర్వాత మళ్ళీ బాదుడు ఉంటుందన్న మాట. మరోపక్క చమురు సంస్థలు తాజాగా డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచడంలో ఎలాంటి పద్ధతిని పాటించలేదని ఎల్పీజీ డీలర్లు ఆరోపిస్తున్నారు. " ఎల్పీజీ సిలిండర్ దర పెంచడానికి కారణాలేమిటో చెప్పలేదు. సాధారణంగా అంతర్జాతీయ ధరల ఆధారంగా, రూపాయి-డాలర్ మారక విలువ ఆధారంగా ఎల్పీజీ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ, తాజాగా ధర పెంచడానికి స్పష్టమైన కారణాలేమీ చూపలేదు అని డీలర్లు వ్యాఖ్యానిస్తున్నారు.