కేసీఆర్ మీద కేటీఆర్ నారాజ్?
కేసీఆర్ మీద కేటీఆర్ నారాజ్. అవును, మీరు విన్నది కరెక్టే. తెలంగాణ భవన్ వర్గాలు నమ్మకంగా చెబుతున్న మాట. గులాబీ బాస్ పై.. కాబోయే బాస్ అలగడానికి అనేక కారణాలు ఉన్నాయట. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ బ్యాచ్ మీద కేసీఆర్ ఫైర్ అయిన తీరు చూసి యువరాజు అవాక్కయ్యారట. ముఖ్యమంత్రి మార్పు.. త్వరలోనే తారక రాముడికి పట్టాభిషేకం వార్తలపై ప్రగతి భవన్ పెద్దాయన ఒంటి కాలిపై లేవడంతో అంతా కంగుతున్నారు. ఆ మీటింగ్ లో కేసీఆర్ వాడిన భాష, వార్నింగ్ ఇచ్చిన తీరు.. పరోక్షంగా కేటీఆర్ తలదించుకునేలా చేసిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి మార్పుపై ఎవరైనా మాట్లాడితే బండకేసి కొడతా.. తోలు తీస్తా.. కర్రుకాల్చి వాత పెడతా.. ఇలా పరుష పదజాలంతో కొందరు మంత్రులను, ఎమ్మెల్యేలను తిట్టిపోశారు కేసీఆర్. మరో పదేళ్లు తానే సీఎం అంటూ సూటిగా, ఘాటుగా చెప్పారు.
కేసీఆర్ తిట్లన్నీ డైరెక్ట్ గా కేటీఆర్ అనుచరులకు, ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్ కు తగిలాయి. యువరాజు.. రాజు అవుతారంటూ భజన చేసిందంతా కేటీఆర్ బ్యాచే. తలసాని, జీవన్ రెడ్డి, షకీల్, శ్రీనివాస్ గౌడ్ ఇలా అంతా ఆయన అనుచరులే. ఇక, డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే.. ఓ సభలో కేటీఆర్ సమక్షంలోనే ఆయన్ను కాబోయే సీఎం అంటూ శుభాకాంక్షలు సైతం చెప్పారు. ఆ సమయంలో కేటీఆర్ మౌనంగా ఆయన విషెష్ ను స్వీకరించారే తప్ప.. ఎక్కడా, కొంచెం కూడా పద్మారావును వారించే ప్రయత్నం చేయలేదు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ వాగిన వారందరినీ కేసీఆర్ చెడామడా తిట్టారంటే.. ఆ తిట్లదండకంలో ఎంతో కొంత తనను ఉద్దేశించి కూడా అని కేటీఆర్ తెగ బాధపడుతున్నారట. అందుకే ఆ రోజు నుంచీ నాన్నతో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.
తండ్రీకొడుకుల మధ్య గ్యాప్.. గ్రేటర్ మేయర్ ఎలక్షన్ తో మరోసారి ముదిరిందని చెబుతున్నారు. కేకే కూతురు విజయలక్ష్మీని మేయర్ గా ఎంపిక చేయడం కేసీఆర్ డెసిషన్. ఆ నిర్ణయం కేటీఆర్ కు ఇష్టం లేదని అంటున్నారు. తన ప్రియమైన అనుచరుడు బొంత రామ్మోహన్ సతీమణి శ్రీదేవికి మేయర్ పదవి కట్టబెట్టాలని కేటీఆర్ భావించారట. అయితే.. సీనియర్ లీడర్ కె.కేశవరావుపై గౌరవంతో ఆయన కూతురిని షీల్డ్ కవర్ లో మేయర్ చేశారు గులాబీ బాస్. ఈ పరిణామాలతో.. కేసీఆర్ పై కేటీఆర్ నారాజ్ అయ్యారట. తండ్రి దగ్గర తన మాట చెల్లుబాటు కావడం లేదని బాగా ఫీలవుతున్నారట. అందుకే గ్రేటర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో కేటీఆర్ డల్ గా కనిపించారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కేటీఆర్ అసహనంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ భవన్ సమావేశం తర్వాత ఆయన ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సోషల్ మీడియాలోనూ పోస్టులు కనిపించడం లేదు. మొత్తంగా ముఖ్యమంత్రి అవుదామనే ఆశ నెరవేరక.. ఇటు నిర్ణయాల్లో ప్రాధాన్యత దక్కక.. కేటీఆర్ తెగ బాధపడుతున్నారని చెబుతున్నారు. మరి, కల్వకుంట్ల వారి ఇంటి పోరు ముందుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో...