రేవంత్ తో ప్రియాంక టాక్స్! పీసీసీ ఖాయమైనట్టేనా? 

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై క్లారిటీ వచ్చినట్టేనా? హైకమాండ్ నుంచి ఆ నేతకు సిగ్నల్స్ వచ్చాయా? తెలంగాణ కాంగ్రెస్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ రేసులో ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డితో... ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని దాదాపుగా ఖరారు చేశారనే చర్చ జరుగుతోంది.  కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యేందుకు బెంగళూరు వచ్చారు ప్రియాంక గాంధీ.ఆ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా హాజరయ్యారు. అక్కడే రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు ప్రియాంక గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వెళ్ళిపోతున్న క్రమంలో కారులో ఎక్కి కూర్చుకున్న ప్రియాంకాగాందీ తన సెక్యూరిటీ సిబ్బంది ద్వారా రేవంత్ రెడ్డిని కారు దగ్గరకే పిలిపించుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు కారులో కూర్చునే మాట్లాడుకున్నారు. పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రకటన వాయిదా పడిన నేపథ్యంలో ఆమె రేవంత్ రెడ్డితో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.    ఇప్పటిదాకా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో మాత్రమే కలిసిన రేవంత్ రెడ్డి ప్రియాంకాగాంధీతో ఎప్పుడు సమావేశం కాలేదు. అలాంటిది రేవంత్ రెడ్డిని తన సిబ్బంది ద్వారా పిలిపించుకుని ప్రియాంక గాంధీ మాట్లాడటం కాంగ్రెస్ లో చర్చగా మారింది.  తెలంగాణలో పార్టీ అంశాలను, పాదయాత్రకు సంబంధించిన స్పందన గురించి ఆమె ఆరా తీశారని తెలుస్తోంది. పాదయాత్రలో రైతులు ప్రధానంగా ఏయే అంశాలను ప్రస్తావించారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా స్పందిస్తున్నారు, ప్రస్తుతం తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటి, కొత్త వ్యవసాయ చట్టాలపై వారికున్న అవగాహన ఏపాటిది వంటి అంశాలపై రేవంత్ రెడ్డితో ప్రియాంక మాట్లాడారని చెబుతున్నారు. పాదయాత్రలో తనకు ఎదురైన అంశాలను రేవంత్ రెడ్డి వివరించారని తెలుస్తోంది.     రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా పిలుపించుకుని ప్రియాంక గాంధీ మాట్లాడటంతో పీసీసీ చీఫ్ అంశంలో క్లారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటంపై హైకమాండ్ దగ్గర పూర్తి సమాచారం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీకి రేవంత్ కీలకమని పార్టీ పెద్దలు భావిస్తున్నారని  సమాచారం. అందుకే తనను ఇప్పటివరకు కలవకపోయినా.. అతని గురించి తెలుసుకుని ప్రియాంక మాట్లాడారని అంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి విషయంలోనూ హైకమాండ్ క్లారిటీగా ఉందంటున్నారు. కొంత ఆలస్యం కావొచ్చు కాని.. పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి రావడం ఖాయమని చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రకు హైకమాండ్ అనుమతి లేదనే ప్రచారం చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు షాకయ్యారని తెలుస్తోంది.

మళ్లీ పులి.. ఈసారైనా పట్టుకుంటారా?

మూడు నెలలుగా టైగర్ టెన్షన్. 35 గ్రామాల్లో పెద్ద పులి హడల్. ఇప్పటికే ఇద్దరు పులి పంజాకు బలైయ్యారు. మన్యం పులి మళ్లీ వేటకు వచ్చింది. ఈ సారి ఎవరి ప్రాణాలు తీస్తుందోననే హైరానా. పెద్ద పులి భయంతో కొమురంభీం జిల్లా వణికిపోతోంది. కొన్ని వారాలు బ్రేక్ ఇచ్చిన బెబ్బులి.. మళ్లీ ఆసిఫాబాద్ అడవుల్లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా, గుండెపల్లి గ్రామంలో స్థానికులకు పులి కనిపించింది. పెంచికల్ పేట, బెజ్జూరు, దహేగం మండలాలను టైగర్ జోన్ గా చేసుకొని పులి వేట కొనసాగిస్తోంది. గతంలో ఆ మ్యాన్ ఈటర్ ను పట్టుకోడానికి అటవీ శాఖ విశ్వ ప్రయత్నం చేసింది. వందలాది మంది సిబ్బంది సీసీకెమెరాలతో బోన్లతో, మత్తు ఇంజెక్షన్ ఇచ్చే గన్స్ తో పులి వేట కొనసాగించారు కానీ ఫలితం లేకుండా పోయింది. ఫారెస్ట్ సిబ్బంది కనులు గప్పి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిపోయింది. కొన్ని వారాలు రెస్ట్ తీసుకొని మళ్లీ కొమురం భీం జిల్లాలో ప్రత్యక్షమైంది. దీంతో.. స్థానికులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పులి పంజాకు మరొకరు బలి కాకముందే.. ఏ2 టైగర్ ను బంధించాలని అడవి బిడ్డలు వేడుకుంటున్నారు. మరి, అటవీ అధికారులు ఈ సారైనా పులిని పట్టుకుంటారా? టైగర్ హంట్ సాధ్యమేనా?  

మహిళ మరణం..నాలుగు రోజులుగా అంత్యక్రియలు బంద్..

ఎక్కడైనా ఆస్తుల కోసం కొట్టుకుంటారు. లేదా పొలం సరిహద్దుల కోసం కొట్టుకుంటారు. కానీ శ్రీకాకులలో మాత్రం విచిత్రంగా శ్మశానం కోసం కొట్టుకున్నారు. ఎంత సంపాదించినా పోయేటప్పుడు ఆరు అడుగుల నెల తప్ప మన వెంట ఏం రాదన్న విషయాన్నీ గట్టిగ నమ్మినట్లున్నారు. అటు వైపు, ఇటు వైపు ఎవరు మరణించిన అంత్యక్రియలు జరగకుండా స్థానికులు అడ్డుకోవడంతో జిల్లాలోని  మెట్టూరుగూడ, మెట్టూరు గ్రామాల మధ్య వైరాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఘటన మెట్టూరుగూడకు చెందిన మహాలక్ష్మి అనే మహిళ అంత్యక్రియలపై ఈ వివాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో ఆ మహిళ చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా అంత్యక్రియలు పూర్తి కాలేదు. దీంతో మహిళ మృతదేహాన్ని  పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో వెంటనే ఘటనా స్థలికి వెళ్లి ఇరువురు గ్రామపెద్దలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

ఒకే గ్రామంలో 33 మందికి కరోనా! కరీంనగర్ జిల్లాలో కలకలం

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా కేసులు బాగా తగ్గినట్లే తగ్గి  మళ్లీ పెరుగుతుండటం వైద్య వర్గాలను కలవరపెడుతోంది. కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు వెళ్లిన వారిలో 33 మందికి కరోనా సోకింది. చేగుర్తి మండలంలో... 10 రోజుల కిందట ఓ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అంత్యక్రియలకు జనం భారీగా వచ్చారు. ఆ తర్వాత కొందరి అనారోగ్యానికి గురయ్యారు. టెస్టులు చేస్తే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు కరోనా నిర్దారణ అయింది. దీంతో అప్రత్తమైన అధికారులు గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి.. అంత్యక్రియలకు హాజరైన వారందరికి టెస్టులు చేశారు. శుక్రవారం వరకు 33 మందికి కరోనా సోకిందని తేలింది.  గ్రామంలో 33 మంది కరోనా సోకడంతో ఆరోగ్య శాఖ ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోంది. కరోనా సోకిన వారి కాంటాక్టులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. చేగుర్తిలో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చేగుర్తితో పాటు పక్క గ్రామాలన్ని ఇప్పుడు భయంతో వణికిపోతున్నాయి. ఇక్కడ చాలా కాలంగా ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. దీంతో కరోనా చాలా మంది సోకి ఉంటుందని భావిస్తున్నారు.    తెలంగాణలో  మూడు రోజుల క్రితం వరకు రోజూ 120 వరకే కేసులు రాగా.. గత మూడు రోజులుగా 160 కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తుందోమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా ఘటనలతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకునేలా చెయ్యాలని ఆదేశించింది.     

అమిత్ షాకు బెంగాల్ కోర్టు సమన్లు..

పశిమ బెంగాల్ లో త్వరలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేసథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2018 నాటి వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఈరోజు సమన్లు జారీ చేసింది. 2018 ఆగస్టు 11న అమిత్ షా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు సమన్లు జారీ చేసింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఈ చర్యలు తీసుకుంది. ఈ నెల 22న తన సమక్షంలో హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని అమిత్ షాకు స్పష్టం చేసింది. 2018 ఆగస్టులో అమిత్ షా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో అభిషేక్ బెనర్జీ విధాన్ నగర్ లోని ఎంపీ, ఎమ్మెల్యేల న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అమిత్ షా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ విచారణలో అమిత్ షా సమాధానం అవసరమని కోర్టు అభిప్రాయపడింది.      

బైక్ ర్యాలీస్ కి నో పర్మిషన్..

ప్రస్తుత ఎమ్మెల్సి ఎన్నికల ప్రచారానికి గాను హైదరాబాద్ నగరంలో బైక్ ర్యాలీలకు అనుమతిలేదని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై జిహెచ్ఎంసి కార్యాలయంలో కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి నిర్వహించిన సమావేశంలో నగర పోలీసు అడిషనల్ సిపి డి.ఎస్.చౌహాన్, జాయింట్ సిపి అరుణ్ జోషి, సెంట్రల్ జోన్ జాయింట్ సిపి విశ్వప్రసాద్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా, అడిషనల్ కమిషనర్ పంకజ లు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 191 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాల పై ముందస్తుగా అనమతులు పొందాలని, ముఖ్యంగా సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణపై తేదీ, సమయం, రూట్లను స్పష్టంగా తెలియజేయాలని అడిషనల్ కమిషనర్ చౌహాన్ స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాన్ని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ కుమార్ తెలిపారు. ఒక్కో హాల్ లో 7 టేబుళ్ల చొప్పున 8 గదుల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కౌంటింగ్ పూర్తికి దాదాపు 40 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు.

హెల్మెంట్ లేదా? మీ లైసెన్సు క్యాన్సిల్..

హెల్మెంట్ లేదా? మీ లైసెన్సు రద్దు. ఫైన్ కడితే సరిపోతుందనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరబడినట్లే. హైదరాబాద్ లో కొత్త రూల్స్ వస్తున్నాయి జాగ్రత్త. హెల్మెంట్ లేకపోతే ఇకపై బండి నడపలేరు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై వేటు వేయనున్నారు హైద్రాబాద్ ట్రాఫిక్  పోలీసులు.ఎన్ని సార్లు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనా  కల్పించిన వాహన దారుల్లో మార్పురావడం లేదు. వాహనం వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెంట్ పెట్టుకోవాలన్న విషయాన్నీఅసలు పట్టించుకోవడంలేదు. చెప్పి చెప్పి అలసిపోయిన పోలీసులు ఇక  రూల్స్ తో రాచరంబోలా చేసేందుకు రెడీ అవుతున్నారు. హెల్మెట్‌ లేకుండా తొలిసారి బైక్‌ నడుపుతూ పట్టుబడితే.. మూడు నెలల పాటు లైసెన్స్‌ రద్దు చేస్తారు. రెండోసారి హెల్మెట్‌ లేకుండా దొరికితే శాశ్వతంగా లైసెన్స్‌ రద్దు అవుతుంది. డ్రైవింగ్‌ చేస్తున్నవారితో పాటు వెనక కూర్చున్నవారికి కూడా హెల్మెట్‌ తప్పనిసరి. 2019 ఎంవి (MV) యాక్ట్‌ను కఠినంగా  అమలు చేస్తామని  సైబరాబాద్‌ పోలీసులు చెప్పారు. 

టీడీపీ వర్గపోరుపై నాని కామెంట్స్

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా నగర టీడీపీలో వర్గ విభేదాలు బయటుపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎవరైనా తన వెనుక రావాల్సిందేనని.. తాను ఒకరి వెనుక వెళ్లాల్సిన అవసరం లేదని"  కేశినేని నాని తేల్చి చెప్పారు. తనకున్న ప్రజాబలంతో విజయవాడలో టీడీపీని గెలిపిస్తానని అయన స్పష్టం చేశారు. ఓడిపోయిన సామంతులే ఇప్పుడు పార్టీకి నష్టం చేస్తున్నారని అయన ఆరోపించారు. అంతేకాకుండా "ఓటమి చెందే అభ్యర్థులను మార్చితే తప్పేంటి? ప్రజలకు క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్నోడంటే నమ్మకం. అవినీతిపరులు, లాలూచీపరులను ప్రజలు నమ్మరు. ముస్లిం కోసం చంద్రబాబును కూడా కాదని నిలబడ్డా. అందరూ కలిసి వెళ్లాల్సిన సమయంలో పార్టీకి నష్టం చేస్తున్నారు. నేను, నా కూతురు మేయర్ పదవి కోసం కష్టపడటం లేదు. పదవులు అక్కర్లేదు... పార్టీ కోసమే పని చేస్తున్నా. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా? వారిని చంద్రబాబు గాడిలో పెడితే పార్టీకే మంచిది" అని కేశినేని నాని హితవు పలికారు.

కేకులతో పాటు పీకలు కోశారు! 

పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య తెలంగాణను షేక్ చేస్తోంది. హత్యల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజున ఓవైపున మొక్కలు నాటి, కేకులు కోసిన టీఆర్ఎస్ నాయకులు పీకలు కూడా కోశారని ఆరోపించారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు జరిగిన ఈ ఘటన ఆయన జీవితానికే మచ్చలా మిగిలిపోతుందన్నారు వీహెచ్. కేసీఆర్ జన్మదినం బ్లాక్ డేగా చేసుకోవాల్సిన పరిస్థితి తయారైందన్నారు. సీఎం కేసీఆర్ ఈ దారుణంపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.  మంథనిలో  పర్యటించిన వీహెచ్.. వామనరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వామనరావు దంపతుల హత్యను చేయడం అత్యంత కిరాతకమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే.. పేదలకు అండగా నిలుస్తున్న హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిలను హత్య చేశారని ఆయన మండిపడ్డారు. 2018లో ఇనుముల సతీశ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు రూ. 50 లక్షల సుపారి మాట్లాడుకున్న ఆడియోలు లీకయ్యాయని చెప్పారు. సతీశ్ కూడా పుట్ట మధుపై కేసులు వేయడంతో సుపారీ మాట్లాడారన్నారు.  గతంలో సుపారీ ఆడియోలు లీకైనా పోలీసులు స్పందికపోవడం వల్లే ఈ హత్యలు జరిగాయని వీహెచ్ ఆరోపించారు. తెలంగాణ పోలీస్ అన్ని వేళల్లో సేవలందిస్తామంటూ కాలర్ ట్యూన్ పెట్టుకున్నారని.. కాని పట్టపగలు హత్యలు జరగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతును చంపాలన్న ఆలోచనతోనే చేశారు తప్ప గ్రామంలోని గుడి పంచాయితీ.. వామనరావు దంపతుల హత్యకు  కారణం కాదన్నారు. రాజకీయ నేతల హస్తం ఖచ్చితంగా ఉందన్నారు వి హనుమంతరావు.

కార్మికుల పాదయాత్ర ఉద్రిక్తం..

రోజంతా రోడ్లు ఊడుస్తారు. చెత్త శుభ్రం చేస్తారు. నగరాన్ని క్లీన్ గా ఉంచుతారు. ఇంత కష్టం చేసినా.. సమయానికి జీతాలు మాత్రం ఇవ్వరు. ఇవీ జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ పారిశుద్ద్య కార్మికుల కష్టాలు. మూడు నెలలుగా సరిగ్గా సాలరీ ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయింటుకుంటే ఎలా? పూట ఎలా గడిచేది? అందుకే, వెంటనే జీతాలు చెల్లించాలంటూ రోడ్డెక్కారు బాధితులు. చార్మినార్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు కార్మికులు పాదయాత్ర నిర్వహించారు. ఔట్ సోర్సింగ్ జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ వేల సంఖ్యలో బల్దియా కార్మికులు ఆందోళనకు దిగారు. తమను ఉద్యోగాల్లో తీసుకొని.. ఇబ్బందులకు గురి చేస్తున్న రాంకీ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాంకీ కంపెనీని జీహెచ్ఎంసీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.   

స్టీల్‍ ప్లాంట్‍ పై కమలంలో కుంపటి!

విశాఖపట్నం స్టీల్‍ ప్లాంట్‍ వ్యవహారం కమలం పార్టీలో కుంపటి రాజేస్తోంది. ఏపీలో బీజేపీ అబాసుపాలైతే.. ఢిల్లీ పెద్దల్లో వర్గ పోరుకు కారణమవుతోంది. ఇటీవల అమిత్ షా, సోము వీర్రాజుల మధ్య జరిగిన ఓ ఎపిసోడ్ ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది.  ప్రైవేటీకరణ చేయవద్దని కోరేందుకు కేంద్ర హోం మంత్రిని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బిజెపి నేతలు కలిసినప్పుడు అమిత్‍ షా వారికి ఎలాంటి షాక్‍ ఇచ్చారంటే… పార్టీ వ్యవహారాలైతే జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డాను అడగండి. నా శాఖ లో పని ఉంటే నన్ను అడగండి. విశాఖ స్టీల్‍ ప్రాజెక్టు వ్యవహారంతో నాకు సంబందం లేదు. ఆ ఊసే నా దగ్గర ఎత్తవద్దు. మీరు ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి అడగండి అని అమిత్‍షా ఆగ్రహంతో అన్నారట. పార్టీ వ్యవహారాలలో పదే పదే కలుగజేసుకుంటున్న అమిత్‍షా తాజాగా పార్టీ వ్యవహారాలపై నడ్డాను సంప్రదించండి అని ఎందుకు అన్నారంటే.. విశాఖ స్టీల్‍ ప్రాజెక్టును ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. ఇందులో తాను కలుగ చేసుకున్నా.. మోడీ తన మాట వినరన్న విషయం అమిత్‍షాకు తెలుసు. అందుకే అటు నడ్డాను కలవండి అని లౌక్యంగా సలహా ఇచ్చారు. అదే లౌక్యాన్ని ప్రదర్శించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవండి అని పార్టీ నేతలకు తాను సూచించినట్లుగా స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో జనసేనతో బిజెపి పొత్తు పెట్టుకున్నా.. ఆరడగులు ముందుకు వెళ్లి.. 60అడుగులు వెనక్కి వస్తుందని.. అమిత్‍షాకు తెలుసు. 2024 ఎన్నికలలో జనసేన, బిజెపి పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితులే కనిపించటం లేదు. సిఎం జగన్‍రెడ్డిపై కేసులు ఉన్న పరిస్థితులలో ఆయన వంగి వంగి దండం పెడతారు. అదే చంద్రబాబు బలపడితే.. గతంలో వలె ఎదురు తిరిగి పోరాటం జరుపుతారన్న అనుమానం అమిత్‍షాకు ఉంది. అందుకే తెలివిగా.. లౌక్యంగా రాష్ట్ర బిజెపి నేతలకు తిరిగి తేరుకోలేనంతగా షాక్‍ ఇచ్చి వెనక్కి పంపారు కేంద్ర హోమంత్రి అమిత్‍షా.

సైకిల్ పై అసెంబ్లీ కి ఎమ్యెల్యే..

దేశంలో వరుసగా పదకొండో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులే కాదు, ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వాలను నిలదీసేందుకు తెలుపుతున్నారు. వివిధ రీతుల్లో తమ నిరసన సెగలు వినిపిస్తున్నారు. బీహార్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం అంచుల వరకూ వచ్చిన ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్  సైకిల్‌పై అసెంబ్లీలో వచ్చి తన నిరసన తెలిపారు. మహువాకు చెందిన  ముఖేష్ రౌషన్ పాట్నాలోని అసెంబ్లీ హాలుకు సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చారు. ఇంధనం ధరలు చుక్కలనంటుతుండటంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. 'హజీపూర్ నుంచి సైకిల్ తొక్కుతూ వస్తున్నాను. ఉదయం 7 గంటలకు సైకిల్‌పై బయలుదేరాను. ఏదో కొనేలా లేదు. ధరలు చుక్కులనంటుతున్నాయి. ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం' అని ముఖేష్ రౌషన్ మీడియాకు తెలిపారు.

పులివెందులలో వికటించిన వ్యాక్సిన్?

  కరోనా వాక్సిన్ పై ప్రజల్లో ఇంకా అనుమానాలు వీడలేదు. వరస పుకార్లతో ప్రజల్లో వ్యాక్సిన్ పై భయాందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా   కడప జిల్లా పులివెందులలో నారాయణమ్మ అనే అంగన్‌వాడి టీచర్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. కరోనా వ్యాక్సిన్ వికటించి మృతి చెందిందని మృతురాలి బంధువులు రిమ్స్ ఆసుపత్రి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. 50 లక్షలు నష్టపరిహారం,  మృతురాలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ముందు ఎలాంటి జబ్బులూ లేవని, కరోనా వ్యాక్సిన్ వేశాక అనారోగ్యానికి గురైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

రాత్రి పోస్టింగ్.. ఉదయానికి క్యాన్సిల్! ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ అధికారుల బదిలీలు.. అంతలోనే  మళ్లీ మార్పులు.. రాత్రికి రాత్రే జీవోలు వస్తుండటం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రికి నచ్చకపోతే వెంటనే బదిలీ చేయడం, ఆయనను ప్రసన్నం చేసుకుంటే తిరిగి పోస్టింగ్ తెచ్చుకోవడం అధికారులకు పరిపాటిగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీనియర్ ఐఎఎస్‍ అధికారి పూనం మాలకొండయ్య వ్యవహారంలో జరిగిన పరిణామాలతో ఇది  నిజమైందంటున్నారు.  సీనియర్‍ ఐఎఎస్‍ అధికారి పూనం మాలకొండయ్యపై ఆధారాలతో సిబిసిఐడి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. రేపో మాపో పూనం మాలకొండయ్యపై ముఖ్యమంత్రి జగన్‍రెడ్డి చర్య తీసుకోవటం ఖాయమని సీనియర్‍ అధికారులు భావించారు. అయితే తాజాగా సీన్ మారిపోయింది. పూనం మాలకొండయ్యపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోరని స్పష్టం అవుతోందంటున్నారు అధికారులు. పూనం మాలకొండయ్య అదనంగా నిర్వహిస్తున్న పశుసంవర్దక శాఖ నుంచి ఆమెను తప్పించింది జగన్ సర్కార్. ఆ పోస్టులో ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ఐఎఎస్‍ అధికారి నరేష్‍ శ్రీనివాస్‍ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కాపు కార్పోరేషన్‍ ఎండీగా ఎవరికి బాధ్యతలు అప్పజెప్పాలన్న విషయం ఆ శాఖాదిపతికే సూచిస్తూ  ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయింది. పూనం నుంచి తప్పించిన శాఖను తిరిగి ఆమె అప్పగిస్తూ తెల్లవారగానే మరో ఉత్తర్వు వచ్చేసింది.  అంతకు ముందు నరేష్‍ శ్రీనివాస్‍ బాధ్యతలు నిర్వహిస్తున్న కాపు కార్పోరేషన్‍ ఎండీగానే ఆయనను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే ఉత్తర్వులు మారిపోయాయంటే.. పూనం మాలకొండయ్యకు జగన్‍ రెడ్డి వద్ద ఎంత పలుకుబడి ఉందో స్పష్టం అవుతోందంటున్నారు అధికారులు.  కార్యదర్శి హోదాలో ఉన్న నరేష్‍ శ్రీనివాస్‍కు ముఖ్యకార్యదర్శి హోదా ఇవ్వటమే కాకుండా ఆయనకు చాలా రోజులు ప్రభుత్వం పోస్టింగ్‍ కూడా ఇవ్వలేదు. తాజాగా ముఖ్యకార్యదర్శి హోదాను నరేష్‍కు ఇస్తూ… ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అయితే  పశుసంవర్దక శాఖాదిపతిగా నియమించిన ఉత్తర్వులను నిలిపివేసి ఆయనను మళ్లీ కాపు కార్పోరేషన్‍ ఎండీగా యధావిధిగా కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముఖ్య కార్యదర్శి హోదా వచ్చిందని సంతోషపడాలో లేక పశుసంవర్దకశాఖాదిపతిగా నియమించిన ఉత్తర్వులను రద్దు చేసిన దానికి బాధ పడాలో తెలియని పరిస్థితిలో నరేష్‍ శ్రీనివాస్‍ ఉన్నారనే చర్చ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జోరుగా జరుగుతోంది.

ఓటర్లు.. తిరుపతి లడ్డు కావాలా నాయనా..!

అధికారం కోసం అక్రమ కేసులు, బెదిరింపులు, దాడులు  ఒక ఎత్తు అయితే, తిరుపతిలో ఏకంగా దేవుడితో రాజకీయం చేస్తున్నారు. తిరుపతి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు కొత్త ప్రచారానికి తెరలేపారు. ఒక్కో ఏరియాలో ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నారు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీలో ఎన్నికల కోసం దేవుడికి కూడా రాజకీయాలను ఆపాదిస్తున్నారు. వెంకన్న తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవిదేశాల్లో ఎంత  ఫేమసో.. తిరుపతి లడ్డు కూడా అంతే ఫేమస్. ఇప్పుడు దాన్ని కూడా వైసీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రచారంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాలను ఉపయోగిస్తూ. ఓటర్ స్లిప్పులతో పాటుగా శ్రీవారి లడ్డూలను పంచిపెడుతూ. ‘‘లడ్డూ తీసుకోండి...మాకు ఓటు వేయండి’’ అని అంటున్నారు.  కరోనా తర్వాత తిరుపతికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడ శ్రీవారి లడ్డూలు లభించక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ నేతలకు మాత్రం లడ్డూలకు కరువే లేదు. దర్జాగా తిరుపతి నుంచి తీసుకువచ్చి పంచాయతీ ఎన్నికల్లో పంచిపెడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం చూసీచూడనట్టుగా ఉంటున్నారు.  ప్రచారంలో వైసీపీ నేతలు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని వినియోగించడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తిరుమల ప్రసాదాన్ని ప్రలోభాలకు వినియోగించడం దిగజారుడుతనమని వ్యాఖ్యానించారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారన్నారు. దేవాదాయశాఖ మంత్రి దీనిపై ఎందురు నోరు తెరవరని ప్రశ్నించారు. దేవుడి ప్రసాదంతోనూ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి...ఇక దేవుడిని కూడా రాజకీయాల్లోకి దింపారంటూ వైసీపీ నేతల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేనే తోపు.. నేనే నెంబర్ వన్! అధికార పార్టీ ఎమ్మెల్యే సెల్ఫ్ డబ్బా 

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే..  ప్రభుత్వ పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితుడని చెబుతారు.. ఉత్తర తెలంగాణకు చెందిన ఆ ఎమ్మెల్యే బిల్డప్ కూడా అలానే ఉంటుందని పార్టీ కార్యకర్తలే అనుకుంటూ ఉంటారు. తాజాగా ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చకు దారి తీశాయి. అంతేకాదు ఆయన ఓవరాక్షన్ పై సహచర నేతల నుంచే విమ్శలు  కూడా వస్తున్నాయి. తనకు తాను గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో... ఇతర నేతలను కించపరేచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో దుమారం రేపుతోంది.  వివాదాస్పద వ్యాఖ్యలతో కాక రేపింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.మాక్లూర్ మండలం మానిక్ భాండార్ గ్రామంలో నిర్వహించిన టీఆరెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో నేనే తోపు... నాకున్న ఫాలోయింగ్  మా పార్టీలో ఎవరికీ లేదు.. నాకున్న కార్యకర్తల బలం, రాష్ట్రంలో మరే ఇతర ఎమ్మెల్యే కు లేదు అంటూ కామెంట్ చేశారు జీవన్ రెడ్డి. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన సురేష్ రెడ్డి, ఆకుల లలిత లాంటి నేతలు కూడా టీఆరెస్ లో చేరారని చెప్పారు. మరో మూడు తరాలు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు జీవన్ రెడ్డి. దేశంలో ఎక్కువ సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎసేనని కూడా చెప్పారు.  అయితే టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పడం బాగానే ఉన్నా.... తనకు తానే గొప్పగా చెప్పుకుంటూ ఇతర నేతలను చులకన చేసి మాట్లాడరనే చర్చ గులాబీ పార్టీలోనే జరుగుతోంది. తనకే ఎక్కువ మాస్ ఫోలోయింగ్ ఉందని జీవన్ రెడ్డి చెప్పుకోవడంపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారట. తన గురించి చెప్పుకోవడం సరేగాని.. ఇతరులతో పోల్చుతూ తనను గ్రేట్ అని చెప్పుకోవడం ఏంటని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన కామెంట్లపై కారు పార్టీలో పెద్ద చర్చే జరుగుతుందని తెలుస్తోంది. 

దేశం లో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే..

దేశం లో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే. ఇది బీజీపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాట. శుక్రవారం పలువురు ముస్లిం నాయకులు సోమువీరాజులు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ.. దేశంలో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే అని అన్నారు. దేశభక్తి, రాముడు ఆలోచనలే బీజేపీ సిద్ధాంతాలని వీర్రాజులు చెప్పారు. . అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది బీజేపీనే అని గుర్తుచేశారు. దేశంలో మైనార్టీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్రం చేస్తున్నదే అని సోమువీర్రాజు తెలిపారు. అయితే వీర్రాజు వ్యాఖ్యలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ భక్తి తో వందేమాతరం అని అనలిగాని.. దేశంలో ఉన్నవారంతా  వందేమాతరం పాడాల్సిందే అని బెదిరించడమేంటని వీర్రాజు వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.  

కొత్తగా వచ్చిన వారికే పదవులు! మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి తీవ్ర స్థాయికి చేరిందా?   పార్టీ పనితీరుపై నేతలు అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ఆ పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, ఆ పార్టీ లీడర్ల  కామెంట్లతో.. కారు పార్టీలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే తానొక లిమిటెడ్ కంపెనీలో ఉన్నానంటూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ కాక రాజేశారు.      ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి మరోసారి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే మంత్రి పదవులు వచ్చాయని కామెంట్ చేశారు. టీఆర్ఎస్‌లో తాను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్నానని తెలిపారు. పార్టీలోకి నిన్న, మొన్న వ‌చ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా తాను ఎలాంటి గొడవ పడలేదన్నారు. పదవుల విషయంలో తన అసమ్మతిని చెబుతూనే.. మళ్లీ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ముత్తిరెడ్డి. కార్యకర్తలు, నేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి.. ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‌ కేసీఆర్‌పై న‌మ్మకం ఉంద‌ని, ప‌నిచేసే వారికి న్యాయం చేస్తార‌ని కూడా ఆయనే చెప్పారు.  జ‌న‌గామ జిల్లా స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమ‌ ఇంచార్జ్ మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితతో కలిసి నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లో కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని తెలిపారు. ఇకపై గ్రామాలు, పట్టణాలలో పార్టీ కార్యకర్తలు సూచించిన వారికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరు జరుగుతుందన్నారు. తాను కూడా కార్యకర్తల ప్రాధాన్యం కోసం ఇదే పద్ధతిని అవలంభిస్తానని స్పష్టం చేశారు.జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన తాాజా వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.   

కర్ణాటకలో కమలానికి షాక్.. కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ కుమారుడు!

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి షాక్   తగలనుంది. చిక్కబళ్లాపుర బీజేపీ ఎంపీ బచ్చేగౌడ కుమారుడు హొసకోటె స్వతంత్ర ఎమ్మెల్యే శరత్‌ బచ్చేగౌడ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.శరత్‌ బచ్చేగౌడనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. శరత్‌ కాంగ్రెస్‌లో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోను ఇటీవల ఆయన చర్చలు జరిపారు. దీంతో ఈ నెలాఖరులోపు శరత్‌ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైంది.  ఇటీవల శాసనసభ సమావేశాలలో హక్కుల ఉల్లంఘనపై శరత్‌ బచ్చేగౌడ చర్చకు అవకాశం కోరగా సభాపతి పట్టించుకోలేదు. ఆయనకు మద్దతుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు మూకుమ్మడిగా పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడం కర్ణాటక రాజకీయాల్లో చర్చగా మారింది. అప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే అంశం తెరపైకి వచ్చింది.  2018 శాసనసభ ఎన్నికలలో శరత్‌ బీజేపీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయ సమీకరణలు మారడంతో  ఎంటీబీ నాగరాజు సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2020లో జరిగిన ఉప ఎన్నికలలో ఎంటీబీ నాగరాజు బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోగా శరత్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఎంటీబీ నాగరాజు ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శరత్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. బీజేపీ ఎంపీ బచ్చేగౌడ కూడా పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా  పాల్గొనడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన కూడా కొడుకు బాటలోనే కాంగ్రెస్ లో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.