కేసీఆర్ కు రేవంత్ భలే ఆఫర్!
రాజకీయాలలో ముఖ్యంగా, తెలంగాణ రాజకీయాల్లో నెగ్గుకురవాలంటే ఏమున్నా, ఏమి లేక పోయినా, నోరైతే ఉండాలి. నిజానికి కాలు జారినా ఫర్వాలేదు, నోరు జారితే వెనక్కి తీసుకోలేమని అంటారు. కానీ, అది రాజకీయలకు వర్తించే సామెత కాదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు విషయాన్నే తీసుకుంటే, ఆయన ఒక మాటల మరాఠీ. మాటలతో ఎదుటి వారి నోరు మూయించడంలో ఆయనకు ఆయనేసాటి. అవతలి వారు ఎంతటి వారైనా సరే, ఆయన అసలు పట్టించుకోరు. ప్రధానమంత్రి అయినా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా మరో మహా నేత అయిన సరే, ఆయన నోటికి చిక్కితే, నమిలి ఉమ్మేస్తారు. అవసరం అయితే మళ్ళీ ఆయనే మాట మడత పెడతారు. వంగి వంగి దండాలు పెడతారు.అలాగే, కేటీఆర్’కూడా కోతల కోటలు కట్టడంలో కేసీఆర్ బాటలోనే ముందుకు సాగుతున్నారు.
ఇదలా ఉంటే ఇప్పుడు ఆ ఇద్దరికీ సమ ఉజ్జీగా మాటల తూటాలు పేల్చే మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, తెరాస నాయకులపై, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ జోడీపై ఎలాంటి మాటల తూటాలు పెలుస్తున్నారో,చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు బీజేపీ బాధ్యతల్లో ఉన్న నాయకులలో ఏ ఒకక్రు కూడా , కారణాలు ఏవైనా రాజకీయ ప్రత్యర్దులపై, ముఖ్యంగా తెరాస పార్టీ, ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. కానీ, బండి సంజయ్ అందుకు విరుద్ధంగా, ‘నువ్వొకటంటే నేను నాలుగంటా’ /నువ్వు తమల పాకుతో ఒకటంటే నేనుతలుపు చెక్కతో నాలుగేస్తా’ అన్నట్లుగా మాటకు మాట అప్పగిస్తున్నారు. అది నిజం అయినా కాక పోయినా, బండి సంజయ్ సక్సెస్’కు ఆయన ‘మాట తూలుడు’ కూడా ఒక కారణం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది.
ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగి ఎంపీ రేవంత్ రెడ్డిది ముందునుంచి అదేతీరు. అయినా, పీసీసీ రేసులో భాగంగా చేపట్టిన రైతు భరోసా యాత్ర ముగింపు సమావేశంలో రేవంత్ రెడ్డి తనకు తానే సాటి, తనకెవ్వరు లేరి పోటీ అన్న రీతిలో రెచ్చిపోయారు.ఎక్కడా కామా, ఫుల్ స్టాప్ లేకుండా, ముఖ్యమంత్రిని, తెరాస ప్రభుత్వాన్ని, అదే నోటితో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎకి పారేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్’ కు వ్యతిరేకంగా ఉప్పెన సృష్టిస్తా ... కప్పెడతా’ అంటూ ఎప్పుడో కేసీఆర్ తనకు వ్యతిరేకం అనుకున్న మీడియాని పది తాళ్ళ లోతున పాతేస్తా అంటూ గర్జించిన సందర్భాన్ని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు రైతుల పచ్చని పొలాలను తక్కువ ధరకు స్వాధీనం చేసుకుని కార్పొరేట్ సంస్థలు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి వెయ్యి ఎకరాలు ఉన్న సీఎం ఫామ్‌హౌస్ భూములను తాను ఎకరా రూ.25 లక్షలు ఇచ్చి తీసుకుంటానని, ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. సీఎం సై అంటే 48 గంటల్లో నోట్ల కట్టలు పట్టుకు వస్తానని కూడా అన్నారు ... ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఏమాత్రం నదురు బెదురూ లేకుండా మాటల తూటాలు పేల్చారు. అంతే కాదు, ఏఐసీసీ అనుమతితో రాష్ట్ర వ్యాప్త పాద యాత్ర చేపడతానని కూడా రేవంత్ ప్రకటించారు. అంటే ... రేవంత్ రెడ్డి పీసీసీ పీఠం తనదే అన్న ధీమాతో ఉన్నట్లున్నారు. మొత్తానికి చాలా కాలంగా కొంత స్తబ్దుగా తెలంగాణ మీడియాకు ఇక మేతకు కొదవుండదు..