కేసీఆర్ ఉచ్చులో విపక్షాలు!
posted on Feb 14, 2021 @ 5:53PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచడంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఉచ్చులో విపక్షాలు పడినట్లుగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ తన ఎత్తులతో విపక్షాలను తన చుట్టూ తిప్పుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా అలానే కనిపిస్తున్నాయి.
దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో టీఆర్ఎస్ ఢీలా పడింది. ఆ తర్వాత పార్టీపై ఫోకస్ చేసిన గులాబీ బాస్.. తన వ్యూహాలను పదును పెట్టారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి మార్పు అంశం తెరపైకి వచ్చింది. కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా కేటీఆర్ జపం చేయడంతో.. విపక్షాలు కూడా ఇదే అంశంపై దృష్టి సారించాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎక్కడ మాట్లాడినా.. ముఖ్యమంత్రి మార్పుపైనే విమర్శలు చేశారు, కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కామెంట్లు చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా... ఇతర అంశాలను పక్కన పెట్టి.. కేసీఆర్, కేటీఆర్ లపైనే ఆరోపణలు చేస్తూ వచ్చారు.
కేటీఆర్ పై ప్రచారం జోరుగా సాగుతున్నా స్పందించని సీఎం కేసీఆర్.. గత ఆదివారం జరిపిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. మరో పదేండ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి పదవి గురించి ఎవరూ మాట్లాడినా ఊరుకునేది లేదంటూ పార్టీ నేతలను హెచ్చరించారు. తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలోనూ విపక్షాలకు విరుచుకుపడ్డారు కేసీఆర్. ఈ రెండు పరిణామాల తర్వాత విపక్షాలు కూడా వెంటనే తమ స్టాండ్ మార్చాయి. తమపై ఆరోపణలు చేసిన కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ఉచ్చులో విపక్షాలు పడ్డాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వస్తోంది.
కేసీఆర్ ఎత్తులో చిక్కిన విపక్షాలు.. క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ మాట్లాడుతున్న అంశాల్లో స్పష్టత లేదంటున్నారు. గతంలో ఎప్పుడు మాట్లాడినా .. కేసీఆర్ అవినీతిని బయటపెడతాం, జైలుకు పంపుతామని సంజయ్ చెప్పేవారు. అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారనే ప్రచారం రాగానే.. ఒక్కసారిగా తన మాట మార్చారు. కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటారని పదేపదే ప్రకటనలు చేశారు. దీంతో కేసీఆర్ ను జైలుకు పంపిస్తామన్న సంజయ్.. ఆయనే సీఎంగా ఉంటారని చెప్పడమేంటనే చర్చ జరిగింది. తాజాగా మళ్లీ కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు బండి సంజయ్. దీంతో కేసీఆర్ రాజకీయ వ్యూహాల ముందు బీజేపీ నేతలు నిలవలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు కూడా ఇలానే ఉంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ విఫలమయ్యారనే ఆరోపణలు చేస్తూ వచ్చారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం రాగాానే.. మళ్లీ మాట మార్చారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సీఎం మార్పుపై లేదని కేసీఆర్ క్లారిటీ ఇవ్వగానే... మళ్లీ పాత పాటే పాడుతున్నారు. విపక్షాల తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు... కేసీఆర్ ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో ప్రతిపక్ష నేతలు చిక్కుకుంటున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనికి రాడని విమర్శించిన వారే.. కేసీఆరే మరో మూడేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనే చెప్పేలా కేసీఆర్ డ్రామా నడిపించారని అంటున్నారు. మొత్తంగా తన రాజకీయ చతురతతో విపక్షాలన్ని తన చుట్టే తిరిగేలా కేసీఆర్ కొత్త మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.