ఇద్దరు అభ్యర్థుల పేర్లు సేమ్! గందరగోళంలో ఓటర్లు
posted on Feb 15, 2021 @ 10:22AM
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. గ్రామ అభివృద్ధి కోసమంటూ కొన్ని చోట్ల అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసిపోతున్నాయి. ఇంకొన్ని చోట్ల సొంత కుటుంబ సభ్యులే హోరాహోరీగా పోరాడుతున్నారు. కృష్ణా జిల్లాలోని ఓ పంచాయతీలో మాత్రం మరో సమస్య అందరిని ఇబ్బంది పెడుతోంది. సర్పంచ్ బరిలో ఉన్న ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ఓటర్లు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
కృష్ణా జిల్లాలో తిరువూరు మండలంలోని మల్లేల పంచాయతీకి నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అయితే ఈ గ్రామంలో వైసీపీ బలపరిచిన వంగూరి మరియమ్మ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ మద్దతుదారు పేరు కూడా మరియమ్మే. పేరే కాదు ఇంటి పేరు కూడా సేమ్. ఇద్దరి ఇంటి పేరు వంగూరినే. ఇద్దరు అభ్యర్థుల పేర్లూ, ఇంటి పేరుతో సహా ఒకటే కావడంతో గ్రామస్తులు గందరగోళ పడుతున్నారు.
ఈ పేర్లతో ప్రజలు తికమకపడి ఎవరి మద్దతుదారులు ఎవరికి ఓటేస్తారోనని సర్పంచ్ అభ్యర్థులకు గుబులు పట్టుకుంది. అందుకే తమకు కేటాయించబోయే గుర్తులను ప్రచారంలో బాగా వాడుకుని, ప్రజల మైండ్లలో రిజిస్టర్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ గ్రామంలో ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాలి. మరోవైపు ఈ పోటీపై గ్రామస్తుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎవరు గెలిచినా వంగూరి మరియమ్మ అనే పేరు గల వ్యక్తే ఈసారి సర్పంచ్ అవుతారని చెబుతున్నారు.