కొత్తగా వచ్చిన వారికే పదవులు! మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి తీవ్ర స్థాయికి చేరిందా? పార్టీ పనితీరుపై నేతలు అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ఆ పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, ఆ పార్టీ లీడర్ల కామెంట్లతో.. కారు పార్టీలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే తానొక లిమిటెడ్ కంపెనీలో ఉన్నానంటూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ కాక రాజేశారు.
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే మంత్రి పదవులు వచ్చాయని కామెంట్ చేశారు. టీఆర్ఎస్‌లో తాను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్నానని తెలిపారు. పార్టీలోకి నిన్న, మొన్న వచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా తాను ఎలాంటి గొడవ పడలేదన్నారు. పదవుల విషయంలో తన అసమ్మతిని చెబుతూనే.. మళ్లీ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ముత్తిరెడ్డి. కార్యకర్తలు, నేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి.. ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై నమ్మకం ఉందని, పనిచేసే వారికి న్యాయం చేస్తారని కూడా ఆయనే చెప్పారు.
జనగామ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జ్ మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితతో కలిసి నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లో కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని తెలిపారు. ఇకపై గ్రామాలు, పట్టణాలలో పార్టీ కార్యకర్తలు సూచించిన వారికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరు జరుగుతుందన్నారు. తాను కూడా కార్యకర్తల ప్రాధాన్యం కోసం ఇదే పద్ధతిని అవలంభిస్తానని స్పష్టం చేశారు.జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన తాాజా వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.