ఉద్యమ పార్టీ నుంచి ఎన్నికలల పార్టీగా..! టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్రస్థానం
తెలంగాణ రాష్ట్ర సమితి మరో రెండు నెలలలో 20 నిండి 21లోకి అడుగుపెడుతోంది. ఒక రాజకీయ పార్టీ చరిత్రలో రెండు దశాబ్దాలు తక్కువ కాలం కాదు. అందులోను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా అవతరించిన పార్టీ ఇంతలోనే లక్ష్యాన్ని చేరుకొని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అధికార పగ్గాలను చేపట్టడం మాములు విషయం కాదు.అదొక అసాధరణ విజయం. టీడీపీ స్థాపించి సంవత్సరం తిరగకుండా అధికారంలోకి వచ్చిన ఎన్టీఅర్’ది ఓ చారిత్రక విజయం అయితే కొంత ఎక్కువ సమయం తీసుకున్నా ఏకంగా రాష్ట్రాన్ని సాధించి, కొత్త రాష్ట్రంలో వరుసగా రెండవసారి అధికార పగ్గాలను చేపట్టిన కల్వకుట్ల చంద్రశేఖర రావు అనే కేసీఆర్ సాధించిన విజయం నిస్సందేహంగా అంతకు మించిన చారిత్రక విజయం.
2001 ఏప్రిల్ 27 న కొండా లక్ష్మణ బాపూజీ ఆశీస్సులతో జలదృశ్యంలో పురుడు పోసుకున్న తెరాసకు ఇప్పటి టీఆర్ఎస్ ఒకటేనా అంటే, కాదు.స్వాతంత్ర పోరాటానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకి అనంతరం సుదీర్ఘ కాలంపాటు దేశాన్ని పాలించిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యత్యాసం ఉందో, అంతే వ్యత్యాసం ఉంది.దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ కాంగ్రెస్’ను రద్దు చేయమని సూచించారు.ఇతర నాయకులు గాంధీ ప్రతిపాదనని పక్కన పెట్టారు. తెలంగాణ బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ అలాంటి ప్రతిపాదన చేయలేదు గానీ, కేసీఆర్ పార్టీని రద్దు చేయక పోయినా పార్టీ స్వరూప,స్వభావాలను మాత్రం మార్చి వేశారు.ఎన్నికలల పార్టీగ మార్చి వేశారు. కుటుంబ పార్టీగా తీర్చి దిద్దారు.
నిజానికి ఎంతమందికి గుర్తుందో ఏమో గానీ, 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన, తెరాస అధికారంలోకి వచ్చిన సందర్భంలో, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో కేసీఆర్, ఉద్యమ పార్టీ అధ్యాయం ముగిసిందని ప్రకటించారు. ఇక పై తెరాస ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా వ్యవవహరిస్తుందని స్పష్టం చేశారు. గడచిన ఆరేడేళ్ళలో తెరాస మరో అడుగు ముందుకేసింది, ఫక్తు పదహారణాల కుటుంబ పార్టీగా రూపాంతరం చెందిందని, ఉద్యమ పార్టీలో కీలక పాత్రను పోషించిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఉద్యమ పార్టీ నేతగా, పదవులు ఆశించను, రాష్ట్రానికి కావలి కుక్కలా ఉంటా ... దళితుని ముఖ్యమంత్రి చేస్తా... అని ప్రకటించిన కేసీఆర్, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఒట్టుతీసి గట్టున పెట్టారు. ముఖ్యమంత్రి గద్దె నెక్కారు. అంతే కాదు వారసుని సిద్ధం చేశారు. కొడుకు కేటీఅర్’కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కేటీఆర్ పట్టాభిషేకానికి కూడా సర్వం సిద్దమైంది. అయితే, ముహూర్తబలం సరిగా లేకనో ఏమో, కథ కాస్త అడ్డం తిరిగింది.
కానీ ఈ రోజు కాకపోతే రేపు కేసీఆర్ వారసుడు కేటీఆరే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. అయితే అది ఎప్పుడు అన్నదే ప్రస్తుతానికి ప్రశ్న. అలాగే మరో రెండు నెలలలో జరిగే తెరాస ద్విశతాబ్ది ఉత్సవాలలో అయినా వారసుని పట్టాభిషేకం ఉంటుందా ...ఈ లోగా ఇంకాఏమైనా జరుగుతుందా ... కుటుంబ పార్టీలోంచి సామాజిక తెలంగాణ నినాదంతో మరో ఉద్యమ పార్టీ పుట్టుకొస్తుందా? ఇవ్వన్నీ కూడా ప్రస్తుతానికి ఎన్నో కొన్ని డాలర్ల ప్రశ్నలనే అంటున్నారు, విజ్ఞులు,విశ్లేషకులు.