గులాబీలో కొత్త పార్టీ కలకలం! కులాల కుంపట్లతో ఆగమాగం
posted on Feb 15, 2021 @ 1:16PM
కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ అన్యోపదేశంగానే అయినా కొత్త పార్టీ పెట్టడం అంత తేలిక కాదు అంటూ ఒక హెచ్చరిక లాంటి వ్యాఖ్య చేశారు. అలాగే పార్టీ పెట్టి భంగపడిన ఆలే నరేంద్ర, దేవేందర్ గౌడ్, విజయశాంతి అనుభవాలను కూడా కేసీఆర్ గుర్తు చేశారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అలాంటి హితబోధ చేశారన్నది పక్కన పెడితే.. తాజాగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి తారక రామా రావు, తమ సొంత నియోజక వర్గం సిరిసిల్లలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, “తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడి బతికి బట్టకట్టిన పార్టీలు రెండే రెండు, ఒకటి ఎన్టీర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ, రెండు కేసీఆర్ స్థాపించిన తెరాస పార్టీ”అంటూ ఇతర పార్టీలు అన్నీ పుబ్బలో పుట్టి మఖలో మాయమైన పార్టీలే అని అన్నారు.అంటే ఎవరికైనా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలాంటిది ఏదైనా ఉంటే, ఆ ఆలోచనలు పక్కన పెట్టండి అని కేటీఆర్ తమ స్టైల్లో చెప్పకనే చెప్పారు.
ఇలా తండ్రీ కొడుకులు ఇద్దరూ వేర్వేరు సందర్భాలలో కొత్త పార్టీల ప్రస్తావన చేయడం కేవలం యాదృచ్చికమా లేక గుండెల్లో చేరిన గుబులు వారి చేత అలాంటి పలుకులు పలికించిందా అంటే.. రెండోదే ఖాయం చేసుకోమనే మాట పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. అలాగే ఇదేదో యాదృచ్చికంగా చేసిన వ్యాఖ్య కాదనే వాళ్ళు లేక పోలేదు. నిప్పులేనితే పొగరాదు, అన్నట్లుగా ఎక్కడో ఎదో జరుగుతోంది,ఆ వంటకం తాలూకు మసాలా ఘాటు తండ్రీకొడుకులను ఉక్కిబిక్కిరి చేస్తోంది, అందుకే కేసీఆర్, కేటీఆర్’ కొత్త పార్టీల ప్రస్తావన చేశారని అనే వాళ్ళున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా కొత్త పార్టీ ఏర్పాటు విషయంగా నిజానిజాలు ఎలా ఉన్నా, తెరాసలో ముసలం పుట్టింది, సంకుల సమరానికి కుంపట్లు రాజుకుంటున్నాయని చెబుతున్నారు. .తండ్రీ కొడుకులు, అన్నా చెల్లెలు, బావ బామ్మర్డులు ఇలా ఎవరెవరి మధ్య ఏమేమీ జరుగుతోందో ఏమో గానీ,అధికార పార్టీ అధికార కేంద్రాలు ప్రగతి భవన్, తెరాస భవన్, ఫార్మ్ హౌస్ లో ఎదో జరుగుతోందని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.
సరే లోపలి శక్తుల కుమ్ములాటల విషయం పక్కన పెట్టినా.. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరినీ ఇలా కలవరపాటుకు గురి చేస్తున్న ఆ ‘కొత్త’ హీరో’, విలన్, కంటికి కనపడని ఆ నాలుగో సింహం ఎవరు? గతంలోనే ‘గులాబీ జెండా ఓనర్లం’ అంటూ తొడకొట్టిన బీసీ నాయకులా?.. ఇస్తానన్న ముఖ్యమంత్రి పదివి ఇవ్వకపోతే ఇవ్వక పాయే, కనీసం మంత్రి వర్గంలో సముచిత స్థానం అయినా ఇవ్వరా,ఇచ్చిన పదవుల నుంచి అవమానకరంగా బయటకు పపంపడం, చివరకు అస్మేదీయ ఎమ్మెల్ల్యేలు , నాయకుల చేత, అధికారుల మీద పెట్టి, ఎస్సీ,ఎస్టీ నాయకులను, ‘అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికిరారు’ అనిపించి అవమానించడం ఏమిటీ? ఇదెక్కడి అన్యాయం అని గుండెను చెరువు చేసుకుని, లోలోన రోదిస్తున్న దళిత బహుజనులా... అగ్రవర్ణాలలోని అణగారిన వర్గాల ప్రతినిధులా .. అంటే అందరూ .. అన్యాయాలకు, అవమానాలకు గురవుతున్నామన్న అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు ప్రత్యాన్మాయ రాజకీయ వేదిక ఏర్పాటు ప్రయత్నాలలో ఉన్నారని అంటున్నారు.
నిజానికి కేసీఆర్ ను, ఆయన నాయకత్వాన్ని ఎవరూ ఏనాడూ ప్రశ్నించలేదు. మంచైనా చెడైనా రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఆయన్ని, అన్ని వర్గాల ప్రజలు గౌరవించారు. కానీ, ఎప్పుడైతే కొడుకు కేటీఆర్’ తండ్రి చెప్పుల్లో కళ్ళు పెట్టారో, ఎప్పుడైతే సీనియర్లను, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర బడుగు, బలహీన వర్గాల నాయకుల ప్రాధాన్యతను తగ్గిచడం మొదలైందో, అప్పుడే పార్టీలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. బడుగు,బలహీన వర్గాలకు బర్రెలు, గొర్రెలు ఎరగా వేసి,ఆవర్గాల నాయకులను అధికార కేంద్రాలకు దూరం చేయడంతో బడుగు బలహీన వర్గాలు, అధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు వైపు అడుకులు వేస్తున్నారు. ఆ అడుగుల చప్పుడుకే, తండ్రీ కొడుకులు ఉలిక్కి పడుతున్నారు.
మరో వంక దక్షిణాదిలో పట్టు కోసం, విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ కొత్త శక్తుల పునరేకీకరణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొలకత్తాలో కేంద్ర హోం మంత్రి, అమిత్ షా, బెంగాళ తర్వాతి లక్ష్యం తెలంగాణ అని ప్రకటించడం ఇందులో భాగంగానే కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఎవరు ఎమన్నా, కేసీఆర్ అన్నట్లుగా కొత్త పార్టీ పెట్టండం, పెట్టిన పార్టీని బతికించుకోవడం, అంత ఈజీ యవ్వారం అయితే కాదు. కానీ, రాజకీయాలలో ఏదైనా జరగవచ్చును. కొయ్యాగుర్రం ఎగరావచ్చు ..