కేసీఆర్ కు చలి జ్వరం! ఎందుకో తెలుసా..
posted on Feb 15, 2021 @ 11:05AM
తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, విపక్ష నాయకులు వ్యక్తిగత దూషణలతో మంటలు రేపుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్నారు. రైతు దీక్షలతో దూకుడు పెంచిన హస్తం లీడర్లు.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ కేడర్ లో జోష్ నింపుతున్నారు.
తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్.. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వంత పాడుతున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని మోడీని కలిశాక చలి జ్వరంతో ఫామ్‌హౌజ్ చేరుకున్నారని ఎద్దేవా చేశారు. రైతులను కంటతడి పెట్టిస్తున్న మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌కు రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేయాలని కోరారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను లాక్కుని బహుళజాతి కంపెనీలకు అమ్ముకుంటోందని ఆరోపించారు. ప్రజలకు, భూమికి హాని కలిగించే ఫార్మాసిటీని అడ్డుకునేందుకు రైతుల పక్షాన కాంగ్రెస్ నిలుస్తుందని తెలిపారు.
చాయ్‌వాలా, మందువాలా జతకట్టి కుట్ర రాజకీయాలు సాగిస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ రేవంత్ చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర 9వ రోజు కొనసాగుతోంది. ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాలలో బస చేశారు రేవంత్ రెడ్డి . మంగళవారం రావిరాలలో పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సభకు జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి రైతు ఎజెండాతో ఉప్పెనలా కదిలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు. రావిరాల బహిరంగ సభకు భారీ జనసమీకరణ చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.