సీఎం జగన్‌కు సన్న గడ్డి.. క్యూలో అక్క చెల్లెమ్మలు!
posted on Feb 15, 2021 @ 1:19PM
ఎపిలోని జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం, అలాగే రేషన్ డోర్ డెలివరీ పై టీడీపీ నేత మాజీ మంత్రి లోకేష్ సెటైలరు వేశారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం, ఇతర సరుకులు ఇచ్చే చౌకధరల దుకాణం వద్ద ప్రజలు క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, అలాగే సరుకుల కోసం దూర ప్రాంతానికి వెళ్లే ఇబ్బందులు తొలగించడానికి ఏపీలోని జగన్ సర్కారు రేషన్ డోర్ డెలివరీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, దీని వల్ల ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారంటూ లోకేశ్ తాజాగా ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
"ప్రభుత్వ పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదే. సన్న బియ్యం అన్న సన్నాసులు దొడ్డు బియ్యానికే పాలిష్ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేశారు. ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ అంటూ జనాల్ని వ్యాన్ల డోర్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారు' అని నారా లోకేశ్ తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతేకాకుండా "డోర్ డెలివరీ మాయలోడు జగన్ కనపడితే సన్న గడ్డి పెట్టడానికి అక్క చెల్లెమ్మలు క్యూలో రెడీగా ఉన్నారు" అని నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు.