అనుకున్నదొక్కటి అయినదొకటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట..
posted on Apr 26, 2021 @ 9:33AM
అనుకున్నదొక్కటి అయినదొకటి. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అదేంటి పాట పాడుతున్నడు అనుకుకుంటున్నారా.. మనిషికి దురాశ పెరిగితే ఇలాంటి పాటలు మాత్రమే పాడుకోవాలి. మనిషి కి ఆశ ఉండాలి. కానీ అత్యాశ ఉండకూడదు అంటారు మన పెద్దవాళ్ళు. కానీ ఈ మధ్య కాలం లో మనుషులకు అత్యాశ ఎక్కువైయింది. అందుకోసం ఈజీ మనీ కి అలవాటు పడ్డారు. ఈజీ గా డబ్బులు వస్తాయంటే ఆలస్యమెందుకు అడుగేసేయి ముందుకు అంటూ వెనక ముందు చూసుకోవడం లేదు. చివరికి చిక్కులో పడుతున్నారు. ఇప్పుడున్న సమాజంలో ఒకడి ఆశ, అవసరం. మరొకడికి పెట్టుబడిగా మారుతుంది. కొంత మంది అక్రమంగా డబ్బులు దండుకోవడం కోసం రకరకాలుగా మోసాలకు పాలుపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోసపోయే వాళ్ళు అనంత కాలం. మోసం చేసే వాళ్ళు ఉంటున్న్టే ఉంటారు. గత కొన్ని రోజుల కింద నాగ స్వరం కాయలు ఉంటే కోట్లు వస్తాయంటూ ముమ్మరంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మోసగాళ్లు కొత్త నాటకానికి తెరలేపారు.
ఓపెన్ చేస్తే.. తెలంగాణ ప్రాంతం. అది కామారెడ్డి జిల్లా. చిన్న మల్లారెడ్డి గ్రామము. ఈ గ్రామానికి చెందిన కస్తూరి నర్సింహులు అనే వ్యక్తికి ఒక అనౌన్ నెంబర్ నుండి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ లో అవతలి వ్యక్తి మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ఉందా..? అయితే మీరు లక్షాధికారి అయిపోవచ్చు..? అయితే ఆ ఐదు రూపాయల నోటు మీద ట్రాక్టర్ బొమ్మ ఉండాలి. అప్పుడు మీకు 11.74 లక్షలు వస్తాయంటూ ఆశ చూపి అస్త్రం వేశారు.
కట్ చేస్తే.. డబ్బులకు ఆశపడిన నర్సింహులు సంబరంతో నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉందని దుండుగులకు చెప్పాడు. అయితే మీకు రూ.11.74 లక్షలు ఐటీ, అకౌంట్ క్లియరెన్స్ ద్వారా అకౌంట్లోకి పంపుతామని ఆశ చూపించి నర్సింహులును నమ్మించారు. కానీ, మీకు ఆ డబ్బులు రావాలంటే మాకు ట్యాక్స్ రూపంలో కొంత చెల్లించాల్సివుంటుందని చెప్పారు. వారు చెప్పినట్లుగానే ఆ దుండగులకు కొంత డబ్బును విడతల వారీగా రూ.8.35 లక్షలు ఆన్లైన్ ద్వారా చెల్లించారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక దుండగుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. దీంతో తను మోసపోయాడని తెలుసుకున్న నర్సింహులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీయగా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.