భార్యతో గొడవ.. ముగ్గురి మర్డర్.. సైకో మొగుడు..
posted on Apr 26, 2021 @ 10:59AM
భార్యతో గొడవ. ఆమె వదిలేసి వెళ్లిపోయింది. అతను మాత్రం వదలటం లేదు. మళ్లీ ఆమె వెంటపడుతున్నాడు. ఆమె వద్దు పొమ్మంటోంది. కాపురానికి వచ్చేదే లేదంటోంది. ఇంట్లో వాళ్లతో చెప్పించాలనుకున్నాడు. కానీ, అతని గురించి తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెకే మద్దతుగా నిలిచారు. ఇతనికి సహకరించేది లేదన్నారు. కొంత కాలంగా వాళ్లింట్లో ఇదే గొడవ. ఈసారి అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భార్యతో వివాదంలో తనకు మద్దతుగా నిలవడం లేదంటూ.. మృగంలా మారాడు. ఉన్మాదిలా ప్రవర్తించాడు. తన తల్లిని, చెల్లిని, తమ్ముడికి రోకలి బండతో కొట్టి..కొట్టి.. చంపాడు. దారుణంగా వారిని హతమార్చాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ ఘోరం స్థానికంగా కలకలం రేపింది.
తెల్లవారుజామున తల్లి ఇంటికి వచ్చిన కరీముల్లా.. నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లెలు కరీమున్నీసాలను రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. ముగ్గురు కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా చంపి.. ఆ తర్వాత తీరిగ్గా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని హైదర్‌ఖాన్ వీధిలో జరిగింది ఈ ఘటన. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.