పరీక్షలు రద్దు చేయండి! గవర్నర్ కు లోకేష్ లేఖ
posted on Apr 26, 2021 @ 1:36PM
దేశమంతా కరోనాతో అల్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. కరోనా పంజాతో కేంద్రం తన పరిధిలో ఉన్న అన్ని పరీక్షలను వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేసింది. కరోనా తీవ్రత ఎక్కువున్న రాష్ట్రాలన్ని పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఇంటర్ పరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేశాయి. అయితే తెలంగాణ, ఒడిశాతో పోలిస్తే భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పరీక్షలపై పంతానికి పోతోంది. ఏది ఏమైనా పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది. విపక్షాలు వద్దని మొత్తుకుంటున్నా.. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నా... తమ ప్రాణాలు రక్షించాలని టీచర్లు వేడుకుంటున్నా సర్కార్ మాత్రం తన మొండి వైఖరి వీడటం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పదో తరగతి పరీక్షలపై జగన్ రెడ్డి సర్కార్ పంతం వీడకపోవడంతో గవర్నర్ ను ఆశ్రయించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా రెండో దశ తీవ్రతలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతుందన్నారు. దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని... ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా వైరస్‌ను మరింత వ్యాప్తి చేయటమే అని లేఖలో తెలిపారు.
లక్షలాది మందికి సురక్షితమైన వాతావరణం కల్పించటం అసాధ్యమన్నారు నారా లోకేష్. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుందని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను గవర్నర్ ముందు ఉంచారు. 2 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ వద్దంటూ తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించారని అన్నారు. కరోనాను అదుపు చేసే చర్యలు తీసుకోకపోగా విస్తృతికి మరింత అవకాశం కల్పించే నిర్ణయాలు ఎంతమాత్రం తగదని సూచించారు. తమకున్న విశేష అధికారాలతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1778 పేజీలను లేఖకు జత చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు.