ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి! విజయనగరంలో ఘోరం
posted on Apr 26, 2021 @ 10:22AM
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. రోజు రోజుకు కేసులతో పాటు మరణాలు పెరిగిపోతున్నాయి. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా దారుణ దృశ్యాలే కనిపిస్తున్నాయి. హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరతతో చూస్తుండగానే కరోనా రోగులు ప్రాణాలు విడుస్తున్నారు.
ఏపీలోని విజయనగరం జిల్లా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా పేషెంట్లు మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని స్థానిక వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ప్రాంగణంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు తీవ్రభయాందోళన చెందుతున్నారు.
విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .. సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే.. సీఎం జగన్ ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు పేరాసిట్మాల్, బ్లీచింగ్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని లోకేష్ సూచించారు.
‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతుంటే తాడేపల్లి నివాసంలో జగన్ రెడ్డి గారు ఐపీఎల్ మ్యాచ్లు మిస్ అవ్వకుండా చూస్తున్నారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ప్రతిపక్షంగా ప్రతి రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరిస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోయింది. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారని నారా లోకేష్ ట్వీట్ చేశారు.