కరోనా భారతానికి బాసట! పలు దేశాల నుంచి లిక్విడ్ ఆక్సిజన్
posted on Apr 26, 2021 @ 11:34AM
కరోనా మహమ్మారి భారత్ లో ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ భయంకరంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఊహకు అందని విధంగా ఉంటున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందక రోగులు విలవిలలాడుతున్నారు. డాక్టర్లు, నర్సుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
కరోనా కల్లోలంతో అల్లాడుతున్న భారత్ కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఆదుకునేందుకు ముందుకొస్తున్నాయి. కరోనాతో పోరాడుతున్న ఇండియాకు అవసరమైన అన్ని రకాల సహాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ స్పష్టం చేశారు. కష్ట సమయాల్లో ఇండియా తమకు అండగా నిలిచిందని, ఇప్పుడు తాము కూడా అదే పని చేస్తామని బైడెన్, కమలా ట్వీట్టర్ వేదికగా స్పందించారు.ఇండియాకు అత్యవసరమైన మందులు, పరికరాలు పంపిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి తొలినాళ్లలో మా హాస్పిటల్స్ కొవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోయి ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇండియా మాకు సాయం చేసింది. ఇప్పుడు మేము కూడా ఇండియాకు అవసరమైన సాయం చేస్తాం అని బైడెన్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.
భారత్‌కు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను పంపిస్తోంది సౌదీ అరేబియా. అదానీ గ్రూపు, లిండే కంపెనీ సహకారంతో ఈ ఆక్సిజన్ పంపుతున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు చెప్పారు .ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే మిషన్‌లో నిమగ్నమయ్యామని అన్నారు. 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌తో నాలుగు క్రయోజనిక్ ట్యాంకులు సముద్ర మార్గం ద్వారా దమ్మామ్ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయని అదానీ వివరించారు.
అమెరికాతో పాటు ఇంగ్లాండ్, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా దేశాలు.. భారత్ అవసరాల మేరకు సాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, భారతీయులు త్వరలోనే మహమ్మారిని ఓడిస్తారని విశ్వసిస్తున్నామని ప్రకటించాయి. భారత్‌లో కరోనా పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తెలిపారు. కరోనా వేళ భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన అమెరికాకు సత్యనాదెళ్ల థ్యాంక్స్ చెప్పారు. ఆక్సిజన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు వీలుగా భారత్‌కు ఈ సమయంలో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. భారత్ కు సాయం చేసేందుకు తమ కంపెనీ కూడా తమ వనరులను ఉపయోగిస్తుందని చెప్పారు.